అమిత్ "షా రొస్తున్నారు!!
హైదరాబాద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా
చూద్దాం సై.. చేద్దాం సై
బీజేపీ శ్రేణుల్లో హుషారు నింపే యత్నం
రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో రేపు సమావేశం
భద్రాచలం క్షేత్రంలో సీతారాముల దర్శనం
ఖమ్మంలో బహిరంగసభ.. ఎన్టీఆర్‌కు నివాళి
తెలంగాణలో అధికారం దిశగా పార్టీని నడిపేలా.. బీజేపీ కార్యకర్తలు, శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిస్తూ అమిత్ షా పర్యటన సాగుతుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
బుధవారం అర్ధరాత్రి సమయానికి హైదరాబాద్‌కు చేరుకోనున్న షా.. గురువారం రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమై పలు అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారని, శ్రేణులను వార్ మోడ్‌లో పెడతారని భావిస్తున్నారు. ముఖ్యంగా.. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో మిగిలింది ఐదారు నెలల స్వల్ప సమయమేనని, ఈ సమయంలోగా పార్టీ పుంజుకుని మళ్లీ మునుపటిలాగా బీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం తామేనన్న అభిప్రాయం ప్రజల్లో తేవాలంటే ఎలా దూకుడుగా వ్యవహరించాలి? సూక్ష్మస్థాయిలో ఏయే వ్యూహాలను రచించి పాటించాలి? వంటి అంశాలపై పార్టీ నేతలకు ఆయన సూచిస్తారని సమాచారం. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మార్పు అంశం పార్టీలో కలకలం రేపుతున్న నేపథ్యంలో.. అమిత్ షా ఆ అంశంపై కూడా పార్టీ శ్రేణులకు ఒక స్పష్టతనిస్తారని భావిస్తున్నారు. ఒకవేళ పార్టీ నాయకత్వాన్ని మార్చాలని భావిస్తే.. దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో కూడా వివరించి, ఒప్పిస్తారని అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జుల మధ్య సమన్వయలోపం కూడా తెలంగాణలో పార్టీ ఎదుగుదలకు శాపంగా మారిందన్న అభిప్రాయం ఉంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న సునీల్ బన్సల్, తరుణ్‌ఛుగ్‌తో పాటు.. సంస్థాగత పార్టీ అగ్రనేత శివప్రకాశ్, మరో సీనియర్ నేత అర్వింద్ మీనన్ రాష్ట్ర బీజేపీకి ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నారు. వీరి మధ్య సమన్వయం లేదన్న ప్రచారంపార్టీవర్గాల్లో జరుగుతోంది. దీంతోపాటు పలువురు సీనియర్ నేతల మధ్య కొరవడిన సఖ్యత... కొత్త, పాత నేతల మధ్య అపోహలు.. కొంతమంది అసమ్మతి నేతల రహస్య భేటీలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇతరపార్టీల నుంచి వచ్చిన నేతల నడుమ విభేదాలు.. ఒకరికి ప్రాధాన్యమిస్తే మరొకరు ఆగ్రహం చెందడం.. ఒకరికి పార్టీ పదవి ఇస్తే మరొకరు వ్యతిరేకించడం వంటి చర్యలు పార్టీ దూకుడును ఒక అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కి వేసినట్లుగా మారుస్తున్నాయన్న వాదన ఉంది. ఫలితంగా జాతీయ నాయకత్వం నిర్దేశిస్తున్న కార్యక్రమాలను పలుచోట్ల తూతూమంత్రంగా కొనసాగిస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి పార్టీ దూకుడు పెంచడానికి ఆట్టే సమయం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ భవితవ్యం అమిత్ షా పర్యటనపైనే ఆధారపడి ఉందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతోపాటు.. పార్టీకి పట్టులేని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అమిత్‌షా తొలిసారిగా బహిరంగసభలో పాల్గొంటున్న దృష్ట్యా, ఆ జిల్లాలో ఎలాంటి సమీకరణాలకు తెరలేవబోతోందన్నది కూడా రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
వరుస భేటీలు
అమిత్‌షా బుధవారం రాత్రి 11.55 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రికి శంషాబాద్ నొవాటెల్‌లో బస చేస్తారు. గురువారం ఉదయం రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. అనంతరం ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణతో, ఆ తర్వాత ప్రముఖ సినీ దర్శకులు రాజమౌళితో మణికొండలో సమావేశమవుతారు. 12.45 గంటలకు శంషాబాద్‌లోని జేడీ కన్వెన్షన్‌లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ నాయకులతో, కేడర్‌తో గంటంబావు పాటు విందు సమావేశంలో గడుపుతారు. 2.25 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి భద్రాచలం చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు రాములవారిని దర్శించుకున్న తర్వాత.. 5 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా.. 5.40 గంటలకు ఖమ్మంలోని ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తారు. 6 గంటలకు పార్టీ బహిరంగసభలో పాల్గొన్న అనంతరం.. 7.10కి గెస్ట్‌హౌ్‌సలో విశ్రాంతి తీసుకుంటారు. 7.40 గంటలకు బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కణ్నుంచీ 8.15 గంటలకు ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ వెళతారు...
Jun 14 2023, 10:44