JP Nadda: రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారింది.. ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.. ఏపీ సర్కార్ అత్యంత అవినీతిలో కూరుకుపోయిందన్న ఆయన..
మైనింగ్, ఇసుక, లిక్కర్, ల్యాండ్, ఎడ్యుకేషన్ స్కామ్‌లతో ఈ ప్రభుత్వం మునిగిపోయిందని ఆరోపించారు. ఏ స్కామ్ లు ఉన్నాయో.. అన్నింటినీ చేస్తున్నారని దుయ్యబట్టారు.. ఏ ప్రభుత్వం చేయాని విధంగా వైసీపీ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు..
శ్రీకాళహస్తిలో జరిగిన బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ సభకు హాజరైన ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారు.. కానీ, ఇప్పటికీ అక్కడ ఏమీ జరగలేదని ఫైర్ అయ్యారు జేపీ నడ్డా.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిందన్న ఆయన.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయి.. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు.
రాయలసీమ అభివృద్ధిని వైసీపీ సర్కార్ గాలికి వదిలేసింది అని విమర్శించారు జేపీ నడ్డా.. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండని విజ్ఞప్తి చేశారు.. దేశంలో మోడీ ఓటు బ్యాంక్ రాజకీయాలను మార్చారు. ఓటు బ్యాంక్ రాజకీయాలను జవాబుదారీ రాజకీయాలుగా, ఫలితాలు చూపే పారదర్శక రాజకీయాలుగా మార్చిన ఘనత మోడీ దే అన్నారు.. 9 ఏళ్లుగా ఈ దేశానికి మోడీ సుపరిపాలన అందించారన్న ఆయన.. బలహీన, అణగారిన వర్గాల వారి కోసం పాటుపడిన పేదల ప్రభుత్వం ఇది.. కరోనా సమయంలో దేశంలోని పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేశామని గుర్తుచేశారు.
మోడీ వచ్చాక మన దేశంలో పేదరికం రేటు తగ్గిందన్న నడ్డా.. స్వాతంత్య్రం వచ్చాక జరిగిన అభివృద్ధితో పోల్చుకుంటే మోడీ వచ్చాక ఈ 9 ఏళ్లలోనే ఎన్నో రెట్లు ఎక్కువ అభివృద్ది జరిగిందన్నారు. ప్రపంచంలోనే మన దేశం వేగంగా ఆర్థిక వృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు జేపీ నడ్డా..
ఇక, బీజేపీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు. దేశమంతా అభివృద్ధి జరగాలన్నదే బీజేపీ విధానం అని స్పష్టం చేశారు నడ్డా.. ఓటు బ్యాంకు రాజకీయాలతో అభివృద్ధి జరగదు. ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. తొమ్మిదేళ్లలో బీజేపీ అనేక విజయాలు సాధించిందన్నారు.. ఎన్డీఏ పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతోంది. పేదల పక్షపాతిగా మోడీ పాలన అందిస్తున్నారు. అభివృద్ధి అజెండాగానే బీజేపీ తొమ్మిదేళ్ల పాలన సాగిందన్నారు..
Jun 10 2023, 21:27