తెలంగాణ గురుకుల పోస్టుల్లో 80% మహిళలకే..*
2,876 ఉద్యోగాలకుగాను 2,301 వారికే..
లెక్చరర్, ఇతర పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
డెమో తరగతులకు 25 మార్కులు..
రాష్ట్రంలో గురుకుల డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు దాఖలు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. జూనియర్ కళాశాలల్లో 2,008 పోస్టులు, డిగ్రీ కళాశాలల్లో 868 పోస్టులకు సమగ్ర ఉద్యోగ ప్రకటనలను గురుకుల బోర్డు వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఆన్‌లైన్ దరఖాస్తుకు మే 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువుగా పేర్కొంది. మొత్తం 2,876 పోస్టుల భర్తీకి వెలువరించిన ఈ ప్రకటనల్లో 2,301 పోస్టులు మహిళలకు రిజర్వు అయ్యాయి. అంటే దాదాపు 80 శాతం వారికి దఖలుపడ్డాయి. అలానే జనరల్ కింద పేర్కొన్న మిగిలిన పోస్టులకు పురుషులతో పాటు మహిళలూ పోటీపడవచ్చు. గురుకులాల నిబంధనల మేరకు మహిళా విద్యాసంస్థల్లోని పోస్టులకు మహిళలే అర్హులు కావడంతో వారికి అదనపు ప్రయోజనం లభిస్తోంది. ఎస్సీ గురుకుల సొసైటీలో డిగ్రీ కళాశాలలన్నీ మహిళలవే కావడం గమనార్హం. ఈ విద్యాసంస్థల్లో పోస్టుల భర్తీకి ప్రత్యేక రోస్టర్‌ను అమలు చేయనున్నారు.
పరీక్షల షెడ్యూలును త్వరలో వెబ్‌సైట్లో పొందుపరుస్తామని గురుకుల బోర్డు వెల్లడించింది. పరీక్షలను ఓఎంఆర్ పద్ధతిలో లేదా కంప్యూటర్ ఆధారితంగా (సీబీఆర్‌టీ) ఆన్‌లైన్లో నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. హాల్‌టికెట్లను పరీక్ష తేదీకి వారం రోజుల ముందు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని సూచించింది.
జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులకు పేపర్-1 అందరికీ ఒకటే(కామన్) ఉంటుందని, ఈ పరీక్ష తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉంటుందని బోర్డు తెలిపింది. పేపర్-2, 3 ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి.
ఈడబ్ల్యూఎస్ కోటా కింద రిజర్వేషన్లు పొందాలని భావిస్తున్న అభ్యర్థులు 2023 జనవరి 1 తరువాత తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని గురుకుల బోర్డు తెలిపింది.
గురుకుల డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పోస్టులకు డెమో మార్కుల విధానాన్ని బోర్డు యథాతథంగా కొనసాగిస్తోంది. వీటికి 25 మార్కులు ఉంటాయని తెలిపింది.
పరీక్ష ఫీజు రూ.1,200
ఈ పోస్టులకు పరీక్ష ఫీజు సాధారణ అభ్యర్థులకు రూ.1,200, రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు రూ.600గా బోర్డు నిర్ణయించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన రిజర్వుడు అభ్యర్థులకు ఫీజు రాయితీ లేదు. పరీక్షలను అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు.
Apr 18 2023, 11:21