భూమిని పోలిన గ్రహం నుంచి రేడియో సిగ్నల్స్..
ఈ అనంత విశ్వంలో భూమిని పోలిన గ్రహాన్ని కొన్ని ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు. భూమిలా జీవానికి అవసరం అయ్యే పరిస్థితుల ఏ గ్రహానికైనా ఉన్నాయా అని మన పాలపుంతలో శాస్త్రవేత్తలు గాలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కొన్ని వందల ఎక్సో ప్లానెట్స్ గుర్తించినప్పటికీ భూమిని పోలిన గ్రహాల్లో జీవాలు ఉండే అవకాశం మాత్రం దాదాపుగా తక్కువే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా భూమి పరిమాణం ఉన్న ఓ ఎక్సో ప్లానెట్ ను గుర్తించారు. ఈ గ్రహం నుంచి వస్తున్న రేడియో సిగ్నల్స్ ను కనుగొన్నారు. భూమి లాంటి అయస్కాంత క్షేత్రాన్ని కలిగి, వాతావరణం కలిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ అయస్కాంత క్షేత్ర ప్రభావంతో తన మాతృనక్షత్రం నుంచి విడుదలయ్యే హైఎనర్జీ పార్టికల్స్ ను తిప్పికొడుతూ తన వాతావరణాన్ని కాపాడుకుంటుందని, నక్షత్రం నుంచి వెలువడే విస్పోటనాలు ఈ అయస్కాంత క్షేత్రం గ్రహాన్ని కాపాడుతున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నక్షత్రం, గ్రహం మధ్య జరిగే చర్యల వల్ల రేడియో సిగ్నల్స్ ఉత్పన్నం అవుతున్నాయి.
ఈ గ్రహం భూమి నుంచి 12 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ మరుగుజ్జు నక్షత్రం ‘వైజెడ్ సెటి’ నక్షత్రం చుట్టూ ఈ గ్రహం ‘వైజెడ్ సెటీ బి’ పరిభ్రమిస్తోంది. కొలరాడో యూనివర్సిటీ, బక్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సెబాస్టియన్ పినెడ, జాకీ విల్లాడ్ సెన్, కార్ల్. జి జాన్స్కీ వేరి లార్జ్ అర్రే అనే రేడియో టెలిస్కోప్ ద్వారా వైజెడ్ సెటీ నుంచి వెలువడుతున్న సిగ్నల్స్ ను రికార్డ్ చేశారు. ఒక గ్రహం వాతావరణాన్ని కలిగి ఉందా లేదా..? అనేది దాని అయస్కాంత క్షేత్రం బలంపై ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వైజెడ్ సెటీ బీ గ్రహం తన మాతృ నక్షత్రం చుట్టూ 2 రోజుల్లోనే పరిభ్రమణం పూర్తి చేస్తుంది. అంటే దాదాపుగా మన సౌర కుటుంబంలోని బుధుడి కక్ష్యకు సమానంగా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు గురుగ్రహాల వంటి భారీ గ్రహాల అయస్కాంత క్షేత్రాలను కనిపెట్టారు. అయితే భూమి వంటి చిన్న గ్రహాల అయస్కాంత క్షేత్రాలను కనిపెట్టేందుకు ఓ నమూనాను తయారు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.
Apr 10 2023, 15:40