ఈ ఆలయంలో మహిళా వేషధారణలో పురుషులు పూజలు చేస్తారు.. ఎందుకో తెలుసా?
కేరళ కొల్లాంలోని చవరాలో ఉన్న ప్రసిద్ధ కొట్టన్‌కులంగర దేవి ఆలయంలో చమయవిళక్కు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో సాంప్రదాయ ఆచారాలలో భాగంగా చివరి రెండు రోజులలో వేలాది మంది పురుషులు స్త్రీల వేషధారణలో పూజలు చేస్తారు. 19 రోజుల పాటు జరిగే వార్షిక ఆలయ ఉత్సవాల్లో చివరి రెండు రోజులలో పురుషులు స్త్రీల వేషధారణ చేస్తే, స్థానిక దేవుడు సంతోషించి వారి కోరికలను తీరుస్తాడని దీని వెనుక ఉన్న నమ్మకం.
కొన్నేళ్లుగా బంధువులు, స్నేహితులతో వచ్చే మగవారి సంఖ్య పెరిగి 10000 దాటింది. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని కొట్టంకులంగర చమయవిళక్కు అంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా వందలాది మంది పురుషులు మహిళ వేషధారణలో శ్రీ కొట్టంకులంగర దుర్గ భగవతి ఆలయంలో దీపార్చన చేశారు. పురుషులు మహిళల వేషధారణలో వచ్చి ఇక్కడ పూజలు చేయడం సంప్రదాయంగా భావిస్తారు. రెండు రోజుల పాటు జరిగే చమయవిళక్కు ఉత్సవాల్లో ట్రాన్స్‌జెండర్లు కూడా భారీగా పాల్గొన్నారు. వారు కూడా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా మలయాళి నెల ‘మీనం’ 10 ,11వ తేదీల్లో ఘనంగా జరుపుకుంటారు.
ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పురుషులు మహిళల వేషధారణలో వచ్చి.. ఐదు ఒత్తులు కలిగిన ప్రత్యేక దీపాలు వెలిగించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో.. ప్రతిరోజు అర్ధరాత్రి వరకు పూజలు నిర్వహిస్తారు.
అది ఎలా మొదలైంది..
అత్యంత ప్రాచుర్యం పొందిన కథనం ప్రకారం, ఆవులను మేపుతూ అమ్మాయిల వేషధారణలో ఉన్న అబ్బాయిల బృందం ఈ సంప్రదాయాన్ని ప్రారంభించింది. పూలు, ‘కోటాన్’ (కొబ్బరితో చేసిన వంటకం) సమర్పించారు. ఒకరోజు దేవత ఒక బాలుడి ముందు ప్రత్యక్షమైంది. ఆ తర్వాత, పురుషులు స్త్రీల వేషధారణతో అమ్మవారిని ఆరాధించే ఆచారం ప్రారంభమైంది. రాయిని దేవతగా భావిస్తారు. ఏళ్ల తరబడి రాయి పరిమాణం పెరుగుతోందనే నమ్మకం కూడా ఉంది. ఇప్పుడు ఈ ఆచారం అత్యంత ప్రాచుర్యం పొందింది, ఈ పండుగ వివిధ మతాల ప్రజలను ఆకర్షిస్తుంది. వారిలో పెద్ద సంఖ్యలో కేరళ నుంచి మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు.
మరో కథ కూడా ఉంది.
ఓ రోజు కొందరు పిల్లలు ఆవులు మేపడానికి అడవి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వారికి ఒక కొబ్బరికాయ కనిపించింది. వెంటనే దాన్ని తీసుకుని.. బండ రాయితో పగలగొట్టే ప్రయత్నం చేశారు. అకస్మాత్తుగా రాయిలోంచి రక్తం కారింది. దీంతో ఆ పిల్లలు భయపడి.. వాళ్ల తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారు. అనంతరం వారు జ్యోతిషులను సంప్రదించారు. ఆ రాయిలో వనదుర్గ శక్తి దాగుందని వెంటనే అక్కడ ఆలయం నిర్మించాలని జ్యోతిషులు చెప్పారు. దీంతో స్థానికులు గుడి కట్టి.. ప్రతీఏటా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
తమిళనాడుకు చెందిన షెల్డన్ అనే యువకుడు మాట్లాడుతూ.. “నేను ఈ ఆచారం గురించి కొన్నేళ్లుగా వింటున్నాను. నేను రావాలనుకున్నాను. చివరకు ఈ సంవత్సరం వచ్చాను.” స్త్రీ వేషధారణ తర్వాత, నేను కొంతకాలంగా అనుకున్నది సాధించినట్లు అనిపించిందని తెలిపాడు. ఆచారంలో పాల్గొనడానికి అత్యంత అనుకూలమైన సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. సంప్రదాయ చీరలు ధరించిన పురుషులు సాయంత్రం దీపాలు మోసుకుంటూ పెద్ద సంఖ్యలో కనిపిస్తారు.
మగవాళ్ళు ఆడవాళ్ళు లేదా అమ్మాయిల వేషం వేసుకోవడానికి దీపాలను తీసుకువెళ్లాలి. అద్దెకు దొరుకుతుంది, కానీ వారు తమ సొంత దుస్తులను తీసుకురావాలి. ఎవరికైనా సహాయం కావాలంటే, బ్యూటీషియన్లు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నారు. ఆదివారంతో పండుగ ముగియడంతో వేలాది మంది ప్రజలు ఆశలు, ఆనందంతో తిరిగి వెళ్తారు.
Apr 10 2023, 15:14