పేపర్ లీకేజీలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది - రేవంత్ రెడ్డి
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కోట్ల రూపాయల కుంభకోణం, మనీలాండరింగ్ జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ప్రశ్నించినందుకు తమకు నోటీసులు ఇచ్చారని, కానీ దోపిడీ దొంగతనం చేసిన కేటీఆర్‌కు మాత్రం సమాచారం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఈ విషయంలో హవావాతో పాటు విదేశాల్లో లావాదేవీలు కూడా జరిగాయంటూ ఆరోపించారు. ఈ పేపర్ లీక్ స్కామ్‌లో పాలకులు, ప్రభుత్వాధికారుల పాత్ర కూడా ఉందన్నారు. ఈ కేసుని అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ చట్టాలు వర్తిస్తాయన్నారు. కానీ.. అవినీతి నిరోధక చట్టంలోని ఒక్క సెక్షన్ కింద కూడా సిట్ అధికారి కేసు పెట్టలేదని పేర్కొన్నారు. తద్వారా.. ముఖ్యమైన వ్యక్తుల్ని కాపాడేందుకు సిట్ అధికారి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ కేసులో నిజానిజాలు వెలుగులోకి రావాలంటే.. సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఈ పేపర్ లీక్‌పై ఫిర్యాదు చేసేందుకు తాము సీబీఐ, ఈడీ డైరెక్టర్ల అపాయింట్ మెంట్ అడుగుతున్నా ఇవ్వడం లేదని.. వెంటనే అపాయింట్ ఇవ్వాల్సిందిగా మీడియా ద్వారా కోరుతున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి మంత్రి కేటీఆర్ ఎదురుదాడులకు దిగుతూ.. విచారణ అధికారులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. పేపర్ లీకేజీ విషయాన్ని తామే పసిగట్టామని కేటీఆర్ చెప్పడం అబద్దమని, డబ్బు పంపకాల్లో వచ్చిన తేడాల కారణంగా నిందితుల ద్వారా ఈ లీకేజీ బయటపడిందని అన్నారు.
దీన్ని కప్పిపుచ్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఏదైనా సంచలన సంఘటనలో ప్రభుత్వ పెద్దల పాత్ర కనిపిస్తే.. వారిని కాపాడేందుకు, కేసుని పక్కదాని పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను రంగంలోకి దింపుతుందని వెల్లడించారు. ఇప్పటివరకూ సిట్ వివిధ కేసుల్లో ఒక్క నివేదికను కూడా ఇవ్వలేదని, నిందితులపైనా చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ కుంభకోణంలో ఉన్న పాత్రధారులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని.. తనకు సంబంధం లేదంటూ కేటీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
నిబంధనలను ఉల్లంఘించి, అర్హత లేని వాళ్లను టీఎస్‌పీఎస్‌సీ కమిషన్ సభ్యులుగా నియమించారని.. ఆ కమిషన్ చైర్మన్‌తో పాటు ఏడు మంది సభ్యుల నియామకంతోనే అవకతవకలకు పునాది వేశారని రేవంత్ రెడ్డి చెప్పారు. కస్టడీలోకి తీసుకోకముందే.. ఈ లీకేజీ విషయం కేవలం ఇద్దరు వ్యక్తులకు సంబంధించినదని మంత్రి కేటీఆర్ ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. ఒకవేళ ఈ లీకేజీ వ్యవహారంతో కేటీఆర్‌కు సంబంధం లేకుంటే.. సిట్ విచారణ జరుగుతున్న సమయంలో, ఇంకా నివేదిక పూర్తి కాకముందే ఆయనకు పూర్తి సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీశారు. కేటీఆర్ వద్ద నిర్ధిష్టమైన సమాచారం ఉందని, ఆయనకు కూడా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Mar 28 2023, 17:51