ఇవే చంద్రబాబుకు ఆఖరి విజయోత్సవాలు.. 2024 ఎన్నికలే టీడీపీకి చివరివి..! - మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీలో కొత్త జోష్ వచ్చింది.. ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.. ఎన్నికల ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇక 2024 ఎన్నికల్లోనూ ఈ ఫలితాలు రిపీట్ అవుతాయని చెబుతున్నారు.. అయితే, ఇవే చంద్రబాబుకు ఆఖరి విజయోత్సవాలు అంటూ హాట్ కామెంట్లు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవగానే పార్టీ గెలిచినట్లు చంద్రబాబు ఫీలవుతున్నారన్న ఆయన.. తనకు తానే తిరుగులేదని చెప్పుకోవటం హాస్యాస్పదమని సెటైర్లు చేశారు.. ఇవే చంద్రబాబుకు ఆఖరి విజయోత్సవాలు.. 2024 సాధారణ ఎన్నికలు టీడీపీకి చివరి ఎన్నికలు అవుతాయని జోస్యం చెప్పారు.
ఇక, కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు ఉంది సభలో టీడీపీ సభ్యుల తీరు అని ఫైర్ అయ్యారు మంత్రి కాకాణి.. చంద్రబాబు పగటి కలలు కంటున్నాడు.. మోసాలు చేయటంలో చంద్రబాబుకు గజకర్ణ, గోకర్ణ విద్యలు తెలుసు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. వర్షాలు ఆగిన వెంటనే పంట నష్టం అంచనా వేస్తామని ప్రకటించారు. దిగుబడి ఆధారిత, పంట నష్టం ఆధారంగా వేసే పంటలకు అంచనా వేస్తున్నాం.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం అని ఇప్పటికే నిరూపించాం అన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన వాటిని జగన్ ప్రభుత్వమే చెల్లించిందని.. దీంతో.. చంద్రబాబు, టీడీపీ నేతలు ఫ్రస్టేషన్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
మరోవైపు.. ప్రజల ప్రాణాలు కాపాడటానికే జీవో నంబర్ వన్ తీసుకొచ్చామని తెలిపారు కాకాణి.. చంద్రబాబు గొంతు పెద్దది చేసుకుని అరుస్తూనే ఉన్నాడుగా.. గొంతు నొక్కితే అలా మాట్లాడలేడుగా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు అంటే లెక్క ఉండదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. వామపక్షాలవి అస్థిత్వం కోసం ఆందోళన, చంద్రబాబుది ఓటమి ఆవేదన అని సెటైర్లు వేశారు. ఇక, అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుదని.. అంగన్వాడీల సమస్యల పై ప్రభుత్వం తగిన విధంగా స్పందిస్తుందని ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
Mar 20 2023, 16:15