ఇది ఇద్దరు దుర్మార్గులు చేసిన తప్పిదం.. పేపర్ లీకేజ్‌పై కేటీఆర్ స్పష్టత
పేపర్ లీకేజ్ టీఎస్‌పీఎస్‌సీ వ్యవస్థ తప్పు కాదని.. ఇద్దరు దుర్మార్గులు (ప్రవీణ్, రాజశేఖర్) చేసిన తప్పు అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పేపర్ లీకేజ్ అంశం చాలా దురదృష్టకరం అన్నారు. ఈ వ్యవహారంపై తామంతా చర్చించామని, సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇచ్చామని అన్నారు. 155 నోటిఫికేషన్‌ల ద్వారా 37 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని.. గత 8 ఏళ్లలో ఇండియాలోనే ఎక్కువగా ఉద్యోగాలు భర్తీ చేసింది ఒక్క టీఎస్‌పీఎస్‌సీ మాత్రమేనని పేర్కొన్నారు. 7 భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బోర్డ్‌పై ఎన్నో ఆరోపణలు వచ్చాయని గుర్తు చేసిన ఆయన.. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు చెసిన తప్పు వల్ల వ్యవస్థకే చెడ్డు పేరు వచ్చిందని మండిపడ్డారు. ఆ ఇద్దరు వ్యక్తులే కాదు.. వారి వెనకాల ఎవరున్నా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. వ్యక్తుల వల్ల వచ్చిన పొరపాటు మళ్ళీ జరక్కుండా తప్పకుండా చర్యలు తీసుకుంటాం హామీ ఇచ్చారు. ఈ లీకేజ్ కారణంగా నాలుగు పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చిందని.. త్వరలోనే ఆ పరీక్షలను నిర్వహిస్తామని కేటీఆర్ వెల్లడించారు.
విద్యార్థుల బాధను తాము అర్థం చేసుకోగలమని, కానీ తప్పని పరిస్థితుల్లో పరీక్షల్ని రద్దు చేయక తప్పలేదని క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ జరగబోయే పరీక్షల కోసం అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు.. కోచింగ్ మెటీరియల్ ఉచితంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో పెడతామని, స్టడీ సెంటర్‌లో 24 గంటలు రీడింగ్ రూమ్ అందుబాటులో ఉంచుతాం, అక్కడే భోజన వసతి కూడా కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వ్యవస్థ పటిష్టంగానే ఉందని భరోసా కల్పించారు. రాజకీయ నిరుద్యోగులు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు ఏమాత్రం పట్టించుకోవద్దని సూచించారు.
కమిషన్‌లో పాదర్శకత తీసుకురావడం కోసం అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందన్నారు. వన్ టైం రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించామన్నారు. యూపీఎస్‌సీ ఛైర్మన్ రెండుసార్లు తెలంగాణకు వచ్చి, రెండుసార్లు మన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ని విజిట్ చేసి, ఇక్కడి విధానాలపై అధ్యయనం చేశారన్నారు. 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషనర్లు వచ్చి కూడా పరిశీలించారన్నారు. ఇన్నేళ్లలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. 95 శాతం రిజర్వేషన్లు స్థానికులకే ఇచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం చట్టసవరణ చేసిందన్నారు.
ఇక ఈ పేపర్ లీక్‌లో ఉన్న ప్రధాన నిందితుడు రాజశేఖర్ ఒక బీజేపీ క్రియాశీలక కార్యకర్త అని, సామాజిక మాధ్యమాల్లో అతడు బీజేపీకి ప్రచారం చేస్తున్నాడని ఆధారాలతో సహా కేటీఆర్ వెల్లడించారు. నోటిఫికేషన్లు ఇవ్వడమే కుట్ర అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గతంలో చెప్పారని, విద్యార్థులను బిజీగా పెడుతున్నారని వ్యాఖ్యానించారని, ఇప్పుడు పేపర్ లీకేజ్‌లో ఆ పార్టీ కార్యకర్తే ఏ2గా ఉండటం అనుమానాలకు తావిస్తోందని కేటీఆర్ అన్నారు. దీనిపై లోతుగా విచారణ చేయాలని తాము డీజేపీని కోరామన్నారు.
దీని వెనుక ఏ పార్టీ వాళ్ళున్నా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కేంద్రంలో 16 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, కానీ వాటిని భర్తీ చేయట్లేదని విమర్శించారు. టీఎస్‌పీఎస్‌సీ తమ అధీనంలో ఉండదని.. ఐటీ శాఖతో ఆ వ్యవస్థకు సంబంధం ఉండదని.. అలాంటప్పుడు ఐటీ మంత్రిని రాజీనామా చేయమనడం హాస్యాస్పదమని చెప్పారు. గతంలో గుజరాత్‌లో 13 లీక్‌లు జరిగాయని.. మరి అప్పుడు ఎవరినైనా బర్తరఫ్ చేశారా? అని ప్రశ్నించారు. వ్యాపం స్కామ్‌లో మధ్యప్రదేశ్ సీఎం పేరొస్తే రాజీనామా చేశారా? అని నిలదీశారు.
Mar 18 2023, 19:02