TS Sircilla Jilla : గిరిజన గురుకుల గర్ల్స్ స్కూల్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్... అస్వస్థతకు గురైన 50 మంది విద్యార్థినులు...
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని గిరిజన గురుకుల గర్ల్స్ స్కూల్ హాస్టల్ లో గురువారం ఉదయం ఫుడ్ పాయిజన్ అయ్యింది.
బుధవారం సాయంత్రం స్కూల్లో చేసిన పకోడి తినడంతో ఇలా జరిగిందని తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు గాఢనిద్రలో ఉన్న పిల్లలకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో 50 మంది అస్వస్థతకు గురయ్యారు.
స్థానిక ఏఎన్ఎంను పిలిపించడంతో అందరికీ ట్యాబ్లెట్లు ఇవ్వగా 25 మందికి తగ్గలేదు. దీంతో 25 మందిని సిరిసిల్ల ఏరియా దవాఖానకు తరలించారు. పరిస్థితి మెరుగుపడని ఆరుగురిని అడ్మిట్ చేసుకుని మిగతా వారికి ట్రీట్మెంట్ ఇచ్చి హాస్టల్‌కు పంపించారు. ఏమైందో ఏమోగాని గంటలోనే వారిని కూడా డిశ్చార్జి చేసి పంపించారు. హాస్టల్ లోనే విద్యార్థులకు ట్రీట్మెంట్ ఇస్తుండగా, ఇద్దరికి సీరియస్‌గా ఉండడంతో ఓ కారులో సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించినట్టు తెలుస్తోంది.
అయతే, ఈ విషయాన్ని మాత్రం ధ్రువీకరించడం లేదు. ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో గురువారం హాస్టల్లో మెడికల్క్యాంప్ ఏర్పాటు చేశారు. ఎవరికైనా బాగా లేకపోతే దవాఖానకు తీసుకెళ్లడానికి వీలుగా ఓ అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. కాగా, ప్రిన్సిపాల్ శకుంతల ఫుడ్ పాయిజన్ అయ్యిందని చెబుతుండగా, డీఎంహెచ్ఓ సుమన్‌మోహన్‌రావు మాత్రం వైరల్ ఫీవర్ కారణమని చెబుతున్నారు.
Mar 17 2023, 15:41