ఈడీ విచారణకు హాజరుకాని కవిత
ఢిల్లీలోనే ఉన్న ఎమ్మెల్సీ కవిత.. మార్చి 16వ తేదీన విచారణకు హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో హాజరుకాలేకపోతున్నానని.. మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానం ఇదే అంటూ తన ప్రతినిధితో ఈడీ అధికారులకు లేఖ పంపారు. సుప్రీంకోర్టులో పిటీషన్ పెండింగ్ లో ఉందని.. కోర్టు నిర్ణయం తర్వాత హాజరవుతానని లేఖలో స్పష్టం చేసినట్లు సమాచారం.
షెడ్యూల్ ప్రకారం అయితే ఉదయం 11 గంటలకే ఈడీ అధికారుల ఎదుట హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలోనే తన న్యాయవాదులతో సుదీర్ఘంగా ఇంట్లోనే చర్చించారు కవిత. ఈడీ ప్రశ్నలకు సమాధానాలను లేఖ ద్వారా పంపించటం ద్వారా.. విచారణకు హాజరుకాకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కవితకు మద్దతుగా ఢిల్లీలో ఐదుగురు బీఆర్ఎస్ మంత్రులు ఉన్నారు. ఎప్పటికప్పుడు లాయర్లతో వారు చర్చలు జరుపుతున్నారు. కవిత పంపిన లేఖపై.. ఈడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి. వాస్తవంగా అయితే ప్రస్తుతం ఢిల్లీలో కవిత ఉన్న ఇంటి నుంచి కేవలం ఐదు, 10 నిమిషాల్లోనే ఈడీ ఆఫీసుకు చేరుకోవచ్చు. అయినా కవిత హాజరుకాలేదు. ఈడీ అధికారుల విచారణ తీరును ప్రశ్నిస్తూ.. సుప్రీంకోర్టులో మార్చి 15వ తేదీన ఆమె పిటీషన్ దాఖలు చేశారు. ఆ విచారణను వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం.
Mar 16 2023, 17:35