తొడలు కొట్టే రాజకీయం పవన్ కళ్యాణ్ దే.. పేర్ని నాని
జనసేనాని పవన్ కల్యాన్ మచిలీపట్నం సభపై మాజీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. తొడలు కొట్టే రాజకీయం పవన్ కళ్యాణ్ దే అంటూ వ్యాఖ్యానించారు. తొడలుకొట్టాల్సిన అవసరం తమకేం లేదన్నారు. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుళ్లు పవన్ పక్కనే ఉన్నారన్నారు. ఓ నాయకుడు పార్టీ పెట్టి మూసేశాడంటూ సొంత అన్ననే పవన్ హేళన చేశాడని విమర్శించారు. రాజకీయాల్లో వచ్చి పదేళ్ళు అవుతుందని అంటున్నారు.
2009లో యువరాజ్యం అధ్యక్షుడు కాదా? అది రాజకీయం కాదా? అని పేర్ని నాని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పెట్టిన తన అన్న చిరంజీవినీ పరోక్షంగా ఎత్తిపొడుస్తున్నాడని మండిపడ్డారు. డబ్బులు లేవు అంటూనే రోజుకు రెండు కోట్లు నా సంపాదన అని తనే అన్నారని ఎద్దేవా చేశారు. జనసేన స్థాపించిన సమయంలో చిరంజీవి ఏ హోదాలో ఉన్నారని పేర్ని నాని ప్రశ్నించారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే జనసేన ఆవిర్భావ వేడుక జరిపారని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి పదవి రాజకీయం కాదా? అని నిలదీశారు.
బందర్ లో బీసీ డిక్లరేషన్ అని బీసీలకు మాటిచ్చాడు 48 గంటలు కూడా అవ్వక ముందే బీసీ డిక్లరేషన్ మాట మర్చిపోయాడని సెటైర్లు వేశారు. నోరు తెరుస్తే కులం పేరుతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కు సంకల్పం, చిత్తశుద్ధి, నాయకత్వం ఉంటే తన లాంటి వాళ్లు ఆయన వెనుకే ఉండేవారమని, జగన్ వెంట ఎందుకు వెళ్తామంటూ ప్రశ్నించారు.
జగన్ తాను నమ్మిన సిద్ధాంతం కోసం, ఇచ్చిన మాట కోసం ఎంత త్యాగం చేయటానికి అయినా సిద్ధం పడతారని పేర్ని నాని చెప్పారు. జగన్ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వ పడుతున్నామన్నారు. 2014 నుంచి పవన్ పచ్చిగా కాపు కులస్తులను పోగేసి కమ్మాయనికి ఊడిగం చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాడని, అందుకే పవన్ తో కులాల గురించి మాట్లాడిస్తున్నారని చెప్పారు. 2019లో ఇదో దొంగ ప్రభుత్వం అని టీడీపీని విమర్శించారని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ సభ అర్థరాత్రి మద్దెల దరువు అంటూ వ్యాఖ్యానించారు. పవన్ దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఆపాలన్నారు. ముసుగులు వేసుకుని కాకుండా చెట్టాపట్టాలేసుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి రండి అంటూ సవాల్ చేవారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో, బంద్ లో ప్రభుత్వమే పాల్గొంటే మీకు కనిపించటం లేదా అంటూ పవన్ పై పేర్ని నాని నిప్పులు చెరిగారు.
కులరహిత రాజకీయాలంటూనే మళ్లీ కాపుల కోసం పనిచేస్తున్నానని మహానుభావుడు అంటున్నారని పేర్ని నాని విమర్శించారు. కాపులకు ఎవరేం చేశారనేది అందరికీ తెలుసని చెప్పారు. కాపులందరమూ కలిసి చంద్రబాబును ఆశ్రయిద్దామని అంటున్నారని.. కాపులు మాత్రం జగన్ వెంటే ఉన్నారని నాని అన్నారు. కాపుల్లో 60 శాతం మంది జగన్ వెంటే ఉన్నారని, ఉంటారని, ఇకపైనా ఉండబోతున్నారని స్పష్టం చేశారు.
కాగా, మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని జనసేనానికి కౌంటర్ ఇచ్చారు.
Mar 16 2023, 11:42