పేపర్ లీకేజీపై మంత్రులు ఎందుకు మాట్లాడరు?: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
కవితకు లిక్కర్ స్కాంపై ఈడీ నోటీసులు ఇస్తే.. మంత్రులంతా మాట్లాడిండ్రు.. మరి పేపర్ లీకేజీపై ఎందుకు మాట్లాడ్డం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) ప్రశ్నించారు.
పేపర్ లీకేజీపై కేసీఆర్ మాట్లాడాలని చెప్పారు. ఈ కేసును సిట్ తో కాకుండా..సీబీఐతో(CBI) విచారించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులు అంగట్లో అమ్మే సరుకులాగా మారాయన్నారు. రాష్ట్రమంతా యువత ఆందోళన చేస్తుంటే.. తెలంగాణ మంత్రులు, సీఎం స్పందించరా అని మండిపడ్డారు జీవన్ రెడ్డి. ప్రతి దాంట్లో ఇన్వాల్ అయ్యే కేటీఆర్, ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ ఎక్కడున్నారని నిలదీశారు.. లీకేజీపై ఎందుకు మాట్లాడాలన్నారు. పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోరా అని అడిగారు.
తెలంగాణ వాడు కానీ ప్రవీణ్ tspsc లోకి ఎట్లా వచ్చిండు..ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రవీణ్ ను సెక్రెటరీ పీఏగా ఎట్లా పెట్టుకుందని ప్రశ్నించారు. TSPSC చైర్మన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి.
పోయిన ఏడాది 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిండు.. కానీ ఇప్పటి వరకు ఒక్కరిని కూడా భర్తీ చేయలేదని వ్యాఖ్యానించారు జీవన్ రెడ్డి.
టీచర్ ఉద్యోగాల భర్తీ ఇప్పటివరకూ మొదలుపెట్టలే.. దానికోసం పెట్టిన టెట్ పరీక్ష జరిగి 6 నెలలు అవుతుందని గుర్తు చేశారు. రాబోయే విద్య సంవత్సరంలో కూడా అరకొర టీచర్లతోనే నెట్టుకొచ్చే అవకాశం ఉంది..
ఇందుకోసమేనా తెలంగాణ వచ్చింది అంటూ జీవన్ రెడ్డి మండపడ్డారు. అప్పుసప్పు చేసి కోచింగ్ సెంటర్లకు పోయి సదువుకుంటే ఉద్యోగాలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత మానసిక ఆందోళనలో ఉందన్నారు. యువతకు విశ్వాసం రావాలంటే కేంద్ర విచారణ రంగంలోకి దిగాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ జరిగి 48 గంటలు ఐనా ఇప్పటి వరకు కేసీఆర్ మాట్లాడలేదని విమర్శించారు జీవన్ రెడ్డి.
Mar 15 2023, 19:51