పవన్ ఆ విషయం ఎందుకు చెప్పలేకపోతున్నారు..? ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ జగనే సీఎం.. - మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం వేదికగా పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆవిర్భావసభలో కులాల ప్రస్తావన గురించే పవన్ మాట్లాడారు.. కానీ, ఆ పార్టీకి దిశ.. దశ ఏమైనా ఉందా ? అని ప్రశ్నించారు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడటమే పవన్ పని.. పార్టీ పొత్తులేదంటారు..
అన్ని సీట్లకు పోటీచేయనంటారు.. పార్టీ పొత్తులు లేకుండా.. అన్ని చోట్లా పోటీచేయకుండానే.. సీఎం అయిపోతానంటారు? అంటూ సెటైర్లు వేశారు. అసలు, పవన్ 175 సీట్లలో పోటీచేస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారు..? అని ప్రశ్నించిన ఆయన.. 175 సీట్లలో పోటీచేస్తా.. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఇన్ని సీట్లు ఇస్తాను అని ఎందుకు చెప్పరు అని ఫైర్ అయ్యారు.
ఇక, చంద్రబాబు చేసిన వాగ్ధానాల గురించి పవన్ ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు మంత్రి కారుమూరి.. ముద్రగడను చంద్రబాబు నానా ఇబ్బందులకు గురుచేసినా పల్లెత్తు మాట అనని వ్యక్తి పవన్ అని మండిపడ్డ ఆయన.. వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబే అని హరిరామజోగయ్య తన పుస్తకంలో రాశారు.. ఆ విషయం మీకు తెలియదా ? అని నిలదీశారు. కాపు జాతి రంగాను ఎందుకు కాపాడుకోలేకపోయారని ప్రశ్నిస్తున్నారు..? మరోవైపు రంగాను చంపిన వ్యక్తిని సమర్ధిస్తున్నారు .. పవన్ కళ్యాణ్ కు ఓ ప్లానింగ్ లేదు.. అతని మాటలకు అర్ధం లేదని ఎద్దేవా చేశారు.. మరోవైపు.. చంద్రబాబు తన హయాంలో ఒక్క ఆర్ అండ్ బీ రోడ్డైనా వేశారా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం చంద్రబాబు 2లక్షల71422 కోట్లు అప్పుచేశాడు.. దాచుకో దోచుకో అన్న చందంగా పాలన సాగిందని ఆరోపించారు.
సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్షా 25 వేల కోట్లను ప్రజల ఖాతాల్లో వేశారని తెలిపారు మంత్రి కారుమూరి.. పార్టీలకు అతీతంగా సంక్షేమం అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్.జగన్ అని పేర్కొన్న ఆయన.. అన్ని వర్గాల వారికి మంచి చేస్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి.. కాయలు లేని చెట్టు చంద్రబాబు అయితే.. కాయలున్న చెట్టు జగన్ మోహన్ రెడ్డి.. అందుకే జగన్ మోహన్ రెడ్డి మీద రాళ్లేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక, హత్యచేసిన వ్యక్తిని కౌగలించుకోమని కార్యకర్తలకు పవన్ చెబుతున్నాడు.. జగన్ మోహన్‌రెడ్డి మీద ధ్వేషంతో పవన్ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైజాగ్ సమ్మిట్ విజయవంతమైతే ఒక్కరైనా అభినందించారా..? అని ప్రశ్నించారు.. ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగనే అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
Mar 15 2023, 15:41