గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని మోసపోయిన ఇంటర్ స్టూడెంట్
గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని ఓ ఇంటర్ విద్యార్థి మోసపోయాడు. ఖమ్మం జిల్లా కొండాపురం గ్రామానికి చెందిన వినయ్ అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి గూగుల్ మ్యాప్ సహాయంతో ఎగ్జామ్ సెంటర్ కు చేరుకున్నాడు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించబోతున్న వినయ్ హాల్ టికెట్ ను పరిశీలించిన అధికారులు.. అతనిది వేరే ఎగ్జామ్ సెంటర్ అని చెప్పడంతో అవాక్కయ్యాడు. తనకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి కాకుండా వేరే సెంటర్ కు వెళ్లిన ఆ విద్యార్థి అసలు ఎగ్జామ్ సెంటర్ కు పరిగెత్తాడు. కానీ అప్పటికే 27 నిమిషాలు ఆలస్యం కావడంతో పరీక్షా హాలులోకి సిబ్బంది అనుమతించలేదు. దీంతో వినయ్ కన్నీళ్లతో వెనుదిరిగాడు.
ఈ ఘటన ఎన్.ఎస్.పి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షా కేంద్రంలో జరిగింది. ముందు రోజే వెళ్ళి పరీక్షా కేంద్రం తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి నష్టాలే జరుగుతాయని పలువురు హెచ్చరిస్తున్నారు.
ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీయట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో పలు ప్రాంతాల్లో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అధికారులు అనుమతి నిరాకరించారు.
Mar 15 2023, 15:31