మహిళా బిల్లుపై మోడీ సర్కార్ ఫెయిల్ : ఎమ్మెల్సీ కవిత
మహిళా బిల్లుపై మోడీ సర్కార్ ఫెయిల్ అయిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిరాహార దీక్ష చేపట్టారు. దానికి కొనసాగింపుగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కవిత స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్లో ఒత్తిడి తెస్తామని తేల్చి చెప్పారు. రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే దాకా పోరాటం చేస్తామన్న ఆమె.. కేంద్రంలోనూ బీజేపీ ఫెయిలైందన్నారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ కూడా కలిసిరావాలని కోరినట్టు కవిత తెలిపారు. ప్రధాని మోడీని ఎవరు ప్రశ్నించినా ఇదే తరహా దాడులు జరుగుతాయన్నారు. మొదటగా వ్యాపార సంస్థలపై టార్గెట్ చేశారని, ఆ తర్వాత వాటిని నియంత్రించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.
అంతకుముందుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత ఎదురుదెబ్బ తగిలింది. విచారణపై తాత్కాలిక స్టే ఇవ్వాలని ఆమె పిటిషన్ వేయగా.. కోర్టు ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆమె మార్చి 16న విచారణకు హాజరుకానున్నారు. ఇక కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు ఈడీ విచారణకు హాజరు కాగా.. రామచంద్ర పిళ్లై కస్టడీ రేపటితో (మార్చి16తో) ముగియనుంది.
Mar 15 2023, 14:14