ఎమ్మెల్యే కోటా 3, గవర్నర్ కోటా 2 సీట్లకు వారంలో షెడ్యూల్
కేసీఆర్ హామీ ఇచ్చినోళ్లే 20 మందికిపైన
కేటీఆర్ మాటిచ్చినోళ్లు అంతకన్నా ఎక్కువే
తమకు చాన్స్ ఇవ్వాలని కోరుతున్న ఆశావహులు
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి షురువైంది. హైదరాబాద్ లోకల్ బాడీస్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగియనుంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయ్యే 3, గవర్నర్ కోటాలో ఇంకో 2 సీట్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈ వారంలోనే ఈసీ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
తమకు చాన్స్ ఇవ్వాలని ఆశావహులు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర ముఖ్య నేతల ద్వారా సీఎం కేసీఆర్‌కు పేర్లు చెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వలేకపోయిన పలువురు నేతలకు ఎమ్మెల్సీలుగా చాన్స్ ఇస్తామని కేసీఆర్ స్వయంగా మాటిచ్చిన నేతలు 20 మందికిపైనే ఉండగా, మంత్రి కేటీఆర్హామీ ఇచ్చినోళ్ల సంఖ్య అంతకన్నా ఎక్కువే ఉంది. వారిలో కొందరికి కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇవ్వగా ఇంకా పదవుల కోసం ఆశపడుతున్న వాళ్ల సంఖ్య భారీగానే ఉంది. వీరిలో ఎవరిని అదృష్టం వరిస్తుందో ఇంకొన్ని రోజుల్లో తేలనుంది.
ఆశావహుల లిస్ట్ పెద్దదే..
తెలంగాణ ఏర్పాటు నుంచి కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌కు మండలి బెర్త్ఖాయమని ప్రచారం జరగడం, చివరి నిమిషంలో ఇంకొకరికి చాన్స్ ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈసారి తనకు చాన్స్ దక్కొచ్చని ఆయన ఆశిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్లో చేరిన ఆలంపూర్ నియోజకవర్గానికి చెందిన చల్లా వెంకట్‌రెడ్డికి అవకాశం ఇవ్వొచ్చని ప్రచారంలో ఉంది. ఆయన ప్రభావం గద్వాల జిల్లాతోపాటు ఏపీలోని కర్నూల్ జిల్లాపై ఉంటుందని అందుకే చాన్స్ ఇవ్వొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ ఏడాదే అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
ఎమ్మెల్యేలుగా గతంలో అవకాశం ఇవ్వలేకపోయిన, సిట్టింగులకు టికెట్లు ఇస్తే మళ్లీ చాన్స్ రాదని భావిస్తున్న పలువురు నేతలు తమకు చాన్స్ వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పదవి ఆశిస్తున్నారు. పొంగులేటి వెంట వెళ్తున్న లీడర్లలో ఒకరిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోతే ఎమ్మెల్సీగా చాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
మునుగోడు ఉప ఎన్నికకు ముందు పార్టీలో చేరిన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, మాజీ ఎంపీ రాపోల్ ఆనందభాస్కర్, మరో నేత పల్లె రవి కుమార్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, ఇనుగాల పెద్దిరెడ్డి తమకూ పదవి వస్తుందని ఆశ పడుతున్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ వెంట ఉన్న ఎంబీసీ కార్పొరేషన్‌చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కోదాడ మాజీ ఇన్చార్జ్ శశిధర్‌రెడ్డి, మధిరకు చెందిన బొమ్మెర రామ్మూర్తి, పార్టీ జనరల్ సెక్రటరీ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, బీఆర్ఎస్ఎల్పీ సెక్రటరీ రమేశ్‌రెడ్డి, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నాయినేని రాజేశ్వర్‌రావు(రాజేశ్), శాట్స్ మాజీ చైర్మన్వెంకటేశ్వర్రెడ్డి తదితరులు ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారు.
ముగ్గురు లేదా నలుగురికే చాన్స్!
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న రాజేశ్వర్ రావు, ఫారూఖ్ హుస్సేన్ పదవీకాలం మే 27న, ఎమ్మెల్యే కోటాలో ప్రాతినిథ్యం వహిస్తున్న కూర్మయ్యగారి నవీన్‌కుమార్, వొల్లాల గంగాధర్‌గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి కాల పరిమితి మార్చి 29న ముగియనుంది. ఈ ఐదు సీట్లు అధికార బీఆర్ఎస్కే దక్కనున్నాయి. మేడ్చల్లోక్సభ సీటు ఇవ్వలేకపోవడంతో నవీన్‌కుమార్‌కు 2019లో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. నిత్యం ప్రగతి భవన్ పెద్దలతో టచ్‌లో ఉండటంతో ఆయనకు మళ్లీ చాన్స్ దక్కవచ్చని బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆయనతో పాటు మరొకరికి కూడా రెన్యువల్ కావొచ్చని చెప్తున్నారు.
ఈ లెక్కన రెండు స్థానాలను పక్కన పెడితే మూడు సీట్లు మాత్రమే వేరేవారికి ఇవ్వడానికి అవకాశం ఉంది. నవీన్ ఒక్కరికే చాన్స్ఇస్తే మరొకరికి అదనంగా చాన్స్ దక్కుతుంది. ఈ ఐదు సీట్లకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
Feb 22 2023, 10:50