తెలంగాణ గడ్డపై మరాఠా కల్చర్.. ఓటు బ్యాంకుగా శివాజీ.. పోటీపడుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్..
ఛత్రపతి శివాజీకి కూడా రాజకీయ రంగు పులిమారా. పొలిటికల్ మైలేజీ కోసం మరాఠా వీరుడిని వదలడం లేదా. తెలంగాణలో మరాఠా కల్చర్ దేనికి సంకేతం? ఎన్నికల టైమ్‌లో శివాజీ విగ్రహాల ఏర్పాటు ఎవరికి ప్లస్ పాయింట్. శివాజీ కేంద్రంగా మాటల తూటాలు పేలుతున్నాయి. వివాదాలు ముసురుకుంటున్నాయి. బీజేపీ వర్సెస్ బీఆర్‌ఎస్‌కు బీజమేసిన శివాజీ భజన కార్యక్రమం చివరకు ఎటు దారి తీయనుంది.
పొలిటికల్ ఫ్రేమ్‌లో దేవుళ్లు, వీరులు..
పొలిటికల్ ఫ్రేమ్‌లో దేవుళ్లు.. వీరాధి వీరులను సైతం వదలని పార్టీలు.. నిన్నా మొన్నటి దాక టిప్పు సుల్తాన్ పే రచ్చ.. లేటెస్ట్‌గా ఛత్రపతి శివాజీ వైపు మళ్లింది. నెక్ట్స్ ఎవరో. తెలంగాణ గడ్డపై కొత్తగా ఈ మరాఠా కల్చర్ ఏంటి.. దీని వెనుక మర్మమేంటి.. ఊరూరా శివాజీ విగ్రహాలు పెట్టడమేంటి.. హోరాహోరీగా ర్యాలీలు తీయడమేంటి..అంతా ఎన్నికల స్టంటా. పొలిటికల్ మైలేజీ కోసమేనా. నిజంగానే శివాజీ అంటే వీర భక్తా..అల్రెడీ జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో పొలిటికల్ అజెండా తెరపైకి రానే వచ్చింది. లేటెస్ట్‌గా జై శివాజీ.. కేంద్రంగా బీజేపీ వర్సెస్ బీఆర్‌ఎస్ మాటల యుద్ధం హీటెక్కిస్తోంది. గతేడాది బోధన్‌లో శివాజీ విగ్రహావిష్కరణ వివాదం రీసెంట్‌గా శివాజీ ర్యాలీపై రచ్చ.. ఇవే ఇప్పుడు హాట్ హాట్ తెలంగాణ పాలిటిక్స్.
పొలిటికల్ సీన్‌ను తలపిస్తున్న శివాజీ జయంతి ఉత్సవాలు..
శివాజీ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం తెలంగాణలో పరిపాటే. కానీ ఈసారి సీన్ పొలిటికల్ ఫైటింగ్‌ను తలపిస్తోంది. చరిత్ర నీడలో ఎవరికి వారు వాజీ వాజీ అంటూ శివాజీ జపం చేస్తున్నారు. శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించడం ఎంత నిజమో.. తెలుగు రాష్ట్రాలతో ఆయనకున్న అనుబంధం కూడా అంతే నిజం. అందుకు నిదర్శనమే చారిత్రక ఆనవాళ్లు.
ఒక యోధుడు.. స్వాభిమాన ధీరుడు.. స్వరాజ్య స్థాపకుడు.. మరాఠా సామ్రాజ్యాధీశుడు.. హిందుత్వ అస్తిత్వానికి ప్రతీక.. ఆత్మగౌరవ పతాక.. అందుకే శివాజీ జయంతి అంటే వేడుక..అసేతు హిమాచలం వేదిక అని నేటి మరాఠాలు కూడా పొగుడుతూ ఉంటారు. ఉగ్గుపాలతోనే వీరత్వాన్ని.. విప్లవ భావాలను పుణికిపుచ్చుకున్న వీరాధి వీరుడు ఛత్రపతి శివాజీ. మొగల్ చక్రవర్తులను గడగడ లాడించిన హిందుత్వ పరిరక్షకుడు. ప్రజలను కన్నబిడ్డలుగా భావించి పాలించిన మనసున్న మారాజు. ప్రతీ అమ్మ తన బిడ్డలకు చెప్పే సజీవ చరిత్ర శివాజీ.
అమ్మ జిజియాబాయ్ మలిచిన ఉక్కు ఖడ్గం శివాజీ. అంతేకాదు భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడాలనే శివాజీ సత్య సంకల్పానికి సాక్షాత్ అమ్మలగన్న అమ్మే మురిసిపోయింది. వీరఖడ్గంతో అనుగ్రహించింది. కుల, మతం బేధం లేకుండా అన్ని వర్గాలను ఆదరించిన గొప్ప రాజు శివాజీ. మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించిన శివాజీకి మన తెలుగు నేలతో ఎంతో అనుబంధం వుంది. శివాజీ తన తపోదీక్షతో భ్రమారాంబిక మాతను ప్రసన్నం చేసుకుంది మన శ్రీశైలంలోనే. అలనాటి ఘట్టాలను కళ్లకు కడుతుంది శ్రీశైలంలోని శివాజీస్మారకం.
కర్మాన్ ఘాట్‌ను శివాజీ సందర్శించినట్లు శాసనాలు..
హైదరాబాద్ గోల్కొండ కోట సహా కర్మాన్ ఘాట్‌ను శివాజీ సందర్శించినట్టు చారిత్రక శాసనాలున్నాయి. అయితే అంతకన్నా ముందే ఆయన పాలమూరులోని నారాయణ్ పేట్‌లో తన సైన్యంతో బస చేశారనే ఆధారాలున్నాయి. గోల్కొండ కోటను ఆక్రమించాలని కుట్ర పన్నిన ఔరంగజేబు.. అక్కడ శివాజీ ఉన్నాడని తెలిసి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడంటారు. నారాయణపేట కేంద్రంగానే శివాజీ సైనిక కార్యకలాపాలను నిర్వహించాడనటానికి ఇప్పటికీ అక్కడ ఆనవాళ్లున్నాయి. అంతేకాదు ఇప్పటికీ నారాయణపేట పరిసర ప్రాంతాల్లో మహారాష్ట్రీయులు అధిక సంఖ్యలో ఉండడం మరో నిదర్శనం. శివాజీ జయంతి సందర్భంగా నేటికీ నారాయణపేటలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
మహారాష్ట్రలో మరాఠాల్లో శివాజీ ఒక ఉత్ర్పేరకం..
శివాజీ ప్రస్థానం.. యావత్ దేశానికి ఓ ప్రేరణ. మహారాష్ట్రలో మరాఠాల్లో శివాజీ ఒక ఉత్ర్పేరకం. అందుకే ప్రతియేటా శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో శివాజీ పాత్ర ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకవైపు బీజేపీ మరోవైపు బీఆర్‌ఎస్.. రెండు పార్టీలు పోటాపోటీగా శివాజీ విగ్రహావిష్కరణలు, ర్యాలీలు చేపట్టడం సంచలనం రేపింది. ఎన్నికల టైమ్‌లో ఇరు పార్టీలు వాజీ వాజీ అంటున్నారు.
శివాజీని ఓన్ చేసుకునే ప్రయత్నంలో బీజేపీ, బీఆర్ఎస్..
స్వాతంత్ర్య సంగ్రామంలో హిందువులను ఐక్యం చేసేందుకు తిలక్ గణేష్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అదే బాటలో హిందూత్వ భావజాలంలో భాగంగా ఇప్పుడు శివాజీని తెరపైకి తెస్తున్నారని పొలిటికల్ టాక్. తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టినప్పటి నుంచి శివాజీ పేరు మార్మోగుతోంది. శివాజీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం మొదలు మూడేళ్లుగా ఊరూర శివాజీ విగ్రహాల ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు బీజేపీకి ధీటుగా బీఆర్‌ఎస్ కూడా శివాజీని ఓన్ చేసుకునే దిశగా విగ్రహావిష్కరణలు చేస్తోంది. లేటెస్ట్‌గా మంత్రి హరీష్‌రావు మెదక్ జిల్లాలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గతేడాది బోధన్‌లో శివాజీ విగ్రహావిష్కరణ సందర్భంగా వివాదం చెలరేగింది. శివాజీ పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని అప్పట్లో సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీని అందరికంటే తామే ఎక్కువగా గౌరవిస్తున్నామన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీలు..
ఇక, శివాజీ జయంతి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఇటు బీఆర్‌ఎస్ అటు బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. అయితే కర్మాన్ ఘాట్‌లో తమ ర్యాలీని కావాలనే అడ్డుకున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తే.. శివాజీ అందరివాడు. కానీ బీజేపీ శివాజీ తమవాడని క్లెయిమ్ చేసుకోవడం తప్పన్నారు బీఆర్‌ఎస్ నేతలు.
శివాజీ కూడా ఓటు బ్యాంకే..
ఎన్నికలొస్తున్నాయి. శివాజీ డంప్‌లో కూడా చాలా ఓట్లున్నాయి. అవన్నీ కొల్లగొట్టే ప్లానే బీజేపీ, బీఆర్‌ఎస్‌ది. మొత్తానికి ఢిల్లీ జేఎన్ యూలో ఏబీవీపీ ఏర్పాటు చేసిన శివాజీ చిత్రపటం ధ్వంసం కావడం పై వివాదం చెలరేగింది. వామపక్ష విద్యార్థి సంఘం నేతలే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపించింది ఏబీవీపీ. దీంతో, ఇరు వర్గాల మధ్య గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. ఢిల్లీలో అలా.. తెలంగాణలో ఇలా..శివాజీయం..రాజకీయం..భగ్గుమంటోంది.. మున్ముందు ఇంకేం జరుగుతుందో చూడాలి మరి. - TV9
Feb 22 2023, 10:42