అయ్యా నాది ఏ రాష్ట్రం
తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కొన్నాళ్లపాటు ఆంధ్ర ప్రాంతంలో చదువుకున్నాడు. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలలో చదివాడు.
తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కొన్నాళ్లపాటు ఆంధ్ర ప్రాంతంలో చదువుకున్నాడు. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలలో చదివాడు. ఆ విద్యార్థి ఇప్పుడు ఏ రాష్ట్రానికి చెందినవాడవుతాడు? వైద్య విద్యార్థి ధూరెడ్డి పృథ్వీరెడ్డికి ఇప్పుడు ఇదే సమస్య ఎదురైంది. పీజీ వైద్య విద్యకు అర్హత పరీక్షలో సీటు సాధించి కౌన్సెలింగ్‌కు సిద్ధమైన పృథ్వీరెడ్డిని తెలంగాణ అధికారులు ఏపీకి వెళ్లమంటున్నారు. ఏపీకి వెళితే.. అక్కడి అధికారులు తెలంగాణకు వెళ్లమంటున్నారు. దీంతో రెంటికీ చెడ్డ రేవడిలా మారి.. ఎంతో కష్టపడి సాధించిన పీజీ సీటుకు దూరమయ్యే ప్రమాదంలో ఉన్నాడు. మెడికల్ పీజీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరులో జారీ చేసిన 148 జీవోనే ఇందుకు కారణమైంది.
ఈ జీవో ప్రకారం.. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవడంతోపాటు ఎంబీబీఎస్ కూడా ఇక్కడే పూర్తి చేసినవారికి ఇక్కడి స్థానికత కల్పిస్తారు. అయితే పృథ్వీరెడ్డి.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందినవాడు. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న విజయనగరం జిల్లా పరిధిలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో 6వ తరగతిలో సీటు రావడంతో 12వ తరగతి వరకు అదే పాఠశాల, కళాశాలలో విద్యనభ్యసించాడు. అనంతరం నీట్ పరీక్షలో 1830 ర్యాంకు సాధించి గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎ్‌సలో చేరి వైద్య విద్యను పూర్తి చేశారు.
ఇటీవల జరిగిన నీట్ మెడికల్ పీజీ ఎంట్రెన్స్‌లో పృథ్వీరెడ్డి 11,362 ర్యాంకు సాధించి కౌన్సెలింగ్‌కు సిద్ధమయ్యాడు. ఈ నెల 7 నుంచి జరగనున్న కౌన్సెలింగ్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించగా.. ఆయన దరఖాస్తును ఆన్‌లైన్ స్వీకరించలేదు. దీంతో ఆందోళనకు గురైన పృథ్వీరెడ్డి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి వెళ్లి సంప్రదించా రు. వైస్ చాన్స్‌లర్ ఈయన సర్టిఫికెట్లను పరిశీలించి.. 12వ తరగతి వరకు విద్యాభ్యాసం ఏపీలో ఉన్నందున జీవో 148 ప్రకారం తెలంగాణ స్థానికత లేదని తెలిపారు. దీనిపై వైద్య ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖలో విచారించగా.. అక్కడా ఇదే విషయం చెప్పారు.
తాను తెలంగాణలో పుట్టానని, ప్రాథమిక విద్యను ఇక్కడే చదివానని, ఎంబీబీఎస్ కూడా ఇక్కడే పూర్తి చేశానని, ఏపీలోని సైనిక్ స్కూల్లో చదివింది కూడా ఉమ్మడి రాష్ట్రంలోనేనని, తన తండ్రి తెలంగాణలో పోలీస్ శాఖలో పని చేస్తున్నారని పృథ్వీరెడ్డి చెప్పినా కుదరదన్నారు. తనకు న్యాయం చేయాలం టూ రాష్ట్రఉన్నతాధికారులతోపాటు, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టియానాను కలిసినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఏపీకి వెళితే.. ఎంబీబీఎస్ తెలంగాణలో చదివినందున పీజీకి తమ రాష్ట్ర స్థానికత ఇవ్వలేమని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన 2014కు ముందు తాను ఏపీలో చదివానని, తనలాంటి వారంతా తెలంగాణ స్థానికత కోల్పోవాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు. కౌన్సెలింగ్‌కు మరోరోజు మాత్రమే గడువు ఉన్నందున ప్రభుత్వమే తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
Nov 06 2024, 12:27