కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి భారీగా అప్పులు పెరిగాయి. ముఖ్యంగా గత పదేళ్లలో అప్పులు భారీగా పెరిగాయి. ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కూడా అప్పులు చేయక తప్పడం లేదు. అప్పులతో పాటు ఆదాయం పెంచుకునే పనిలో రాష్ట్ర సర్కార్ ఉంది.
ఇందులో భాగంగా మద్యం ధరలు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. అందుకే ఎక్సైజ్శాఖ ధరల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. లిక్కర్ ధరలు పెంచ్చొద్దన భావించినప్పటికీ సరిహద్దు రాష్ట్రాల్లో ధరలు పెరగడంతో ఇక్కడ కూడా ధరలు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
హార్డ్ మద్యంపై రూ.10 నుంచి రూ.90, బీరుపై రూ.15-20 పెంచేందుకు ఎక్సైజ్ శాఖ ప్లాన్ చేస్తోంది. చీప్ లిక్కర్ బ్రాండ్లపై తక్కువ.. ప్రీమియం బ్రాండ్లపై ఎక్కువ రేట్లు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మద్యం ధరలు పెంచితే రాష్ట్ర ఖజానాకు నెలకు రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ నుంచి రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తుంది. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ఈ డబ్బు వస్తుంది.
ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో ఆబ్కారీ శాఖకు రూ.17 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. మిగిలిన 6 నెలల్లో కూడా ఇంతే స్థాయిలో ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. తెలంగాణలో రోజుకు సరాసరిగా రూ.90 కోట్ల విలువైన మద్యం విక్రయిస్తున్నారు. దీన్ని బట్టి నెలకు రూ.2700 కోట్ల నుంచి రూ.3000 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఎక్సైజ్ ఆదాయం తోపాటు రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలో ఆగస్ట్ లో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని భావించారు. కానీ ఇంకా పెంచలేదు. భూముల విలువలకు సంబంధించి అధికారులు ఇప్పటికే నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. త్వరలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచే అవకాశం ఉంది.
Nov 06 2024, 11:35