అమల్లోకి కొత్త రూల్స్
హైదరాబాద్ నగరంలోని వాహనదారులకు షాకింగ్ న్యూస్ వినిపించారు ట్రాఫిక్ పోలీసులు. మంగళవారం (నవంబర్ 05) రోజు నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టారు. అయితే.. హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తున్న వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ట్రాఫిక్ పోలీసులు.. జరిమానాలు భారీగా పెంచేయటమే కాకుండా చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇక నుంచి హెల్మెట్ పెట్టుకోకపోయినా, రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపినా వాహనదారులకు జేబులు గుల్ల కావటం గ్యారెంటీ.
హైదరాబాద్‌లోని వాహనదారులకు బిగ్ అలెర్ట్. ఇక నుంచి హెల్మెట్ లేకుండా వాహనం నడిపినా.. అర్జెంట్ పనుందనో, ఇక్కడే కదా అనో రాంగ్ రూట్‌లో వెళ్లినా.. మీ జేబుకు చిల్లు పడ్డట్టే. హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్‌లో డ్రైవింగ్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం (నవంబర్ 05) నుంచి నగరంలో భారీ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించనున్నారు. హెల్మెట్ లేకుండా, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల నగరాల్లో గత 3 రోజుల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఒక మహిళతో సహా ముగ్గురు మృత్యువాత పడ్డట్టుగా అడిషినల్ పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) పి విశ్వ ప్రసాద్ వివరించారు. ఈ ప్రమాదాల్లోని మూడింటిలో.. బాధితులు ఐఎస్‌ఐ స్టాండర్డ్ హెల్మెట్ ధరించలేదని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్‌లో ఇక నుంచి హెల్మెట్ తప్పనిసరి చేస్తూ పోలీసులు కఠిన నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేటి నుంచే హెల్మెట్ తప్పనిసరి చేస్తూ నిబంధనలు అమలు చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ.200లకు వాహన జరిమానాను పెంచుతున్నట్టు పోలీసులు తెలిపారు. రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపితే రూ.2 వేలకు వాహన జరిమానా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలపై ఇప్పటికే హైకోర్ట్ సీరియస్ అయిన నేపథ్యంలో.. ట్రాఫిక్ పోలీసులు ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది ఇప్పటివరకు 215 ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయని.. అందులో 100 మంది బాధితులు ద్విచక్ర వాహనదారులేనని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇది మొత్తం మరణాల్లో 46 శాతమని పోలీసులు పేర్కొన్నారు. అందులోనూ వారు హెల్మెట్ ధరించకపోవడం వల్లే మరణించినట్టుగా తేలినట్టు వివరించారు. హెల్మెట్ ధరించడం వల్ల తలకు గాయమయ్యే ప్రమాదాన్ని 70 శాతం, మరణాల ప్రమాదాన్ని 40 శాతం తగ్గిస్తుందని విశ్వప్రసాద్ తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాపాయ ప్రమాదాలు 3 రెట్లు పెరుగుతాయని వివరించారు.
మోటార్ వాహన చట్టం 1988 ప్రకారం హెల్మెట్ ధరించని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉల్లంఘనలకు సెక్షన్లు, జరిమానాలు ఇవే..:
హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం MV చట్టంలోని సెక్షన్ 129/177 ప్రకారం ఉల్లంఘన
హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినవారికి రూ.200 జరిమానా
MV చట్టంలోని సెక్షన్ 119/177 , 184 ప్రకారం రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయడం శిక్షార్హం
రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసినవారికి రూ.2000 జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్
Nov 06 2024, 11:30