Andrapradesh

Aug 08 2019, 14:00

బిల్లు ఉపసంహరించుకోకపోతే ఉద్యమం ఉధృతం :జూడాలు

వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగుల పడిగాపులు
విజయవాడ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదించిన నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లును వ్యతిరేకిస్తూ విజయవాడ బిఆర్టీఎస్‌ రోడ్డులో జూనియర్‌ డాక్టర్లు భారీ ర్యాలీ చేపట్టారు.ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) పిలుపు మేరకు నగరంలోని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుప్రతుల్లో గురువారం వైద్య సేవలు నిలిపివేశారు. పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసేవిధంగా ఎన్‌ఎంసీ బిల్లు ఉందని తెలిపారు. మేనేజ్‌మెంట్‌ కోటాలో 50 శాతం సీట్ల కేటాయింపును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. బిల్లును ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
బిల్లులోని లోపాలను సవరించాలి: 
నెల్లూరు: నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లును వ్యతిరేకిస్తూ నగరంలోని కలెక్టరేట్‌ ముందు జూనియర్‌ డాక్టర్లు ధర్నానిర్వహించారు. కేంద్రం జోక్యం చేసుకుని ఎన్‌ఎంసీ బిల్లులోని లోపాలను సరిదిద్దాలని డిమాండ్‌ చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.
తిరుపతి రుయా ఆసుప్రతిలో రోగుల పడిగాపులు:
తిరుపతి: ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్‌ వైద్యులు సమ్మె చేపట్టడంతో తిరుపతి రుయా ఆసుప్రతిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. బిల్లును వెంటనే రద్దు చేయాలని జూడాలు డిమాండ్‌ చేశారు. గత ఏడు రోజులుగా దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లతో పాటు ప్రవేట్ వైద్యులు నిరసన వ్యక్తం చేస్తుండగా.. గురువారం వైద్య సేవలను నిలిపి వేశారు. జూడాలు సమ్మెకు దిగడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తుండగా.. ఆర్థిక స్తోమత లేనివారు ఆసుపత్రి వద్దే పడిగాపులు కాస్తున్నారు. మరో వైపు కేంద్రానికి వ్యతిరేకంగా జూడాలు తమ నిరసన కొనసాగిస్తున్నారు

Andrapradesh

Aug 08 2019, 13:59

శ్రీశైలం డ్యామ్ కు భారీగా చేరుతున్న వరద నీరు

నాగార్జున సాగర్‌ జలాశయాలకు నీరు విడుదల
కర్నూలు: శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుంచి 3,04,097 క్యూసెక్కుల వరద నీరు విడుదల కాగా, శ్రీశైలం డ్యామ్ కు 3,47,199 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. మొత్తం ఔట్‌ ఫ్లో 96,210 గా నమోదయింది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 875.30 అడుగులు కొనసాగుతోంది. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 165.1436 టీఎంసీలు ఉంది. శ్రీశైలం కుడి ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసిన అనంతరం 96,210 క్యూసెక్కుల వరద నీటిని నాగార్జునసాగర్ జలాశయాలకు విడుదల చేస్తున్నారు.

Andrapradesh

Aug 08 2019, 13:58

మనస్ఫూర్తిగా కియాను అభినందిస్తున్నా: చంద్రబాబు  

గుంటూరు: దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం కియ పరిశ్రమ మేడిన్‌ ఇండియా పేరుతో తయారు చేసిన తొలి కారును గురువారం ప్రారంభించనుంది. దీనిపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కియా మొదటి కార్ ఇవాళ రోడ్డుపైకి వస్తున్న సందర్భంగా మనస్ఫూర్తిగా కియాను అభినందిస్తున్నానని అన్నారు. ఆటో మొబైల్ రంగంలో కియా ఒక నూతన ట్రెండ్ తీసుకురావాలని ఆకాంక్షించారు. కియా కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కియా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని, కియా సంస్థ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చంద్రబాబు చెప్పారు.

Andrapradesh

Aug 08 2019, 09:23

పోలవరంపై ఏపీకి కేంద్రం షోకాజ్‌ నోటీసులుజారి 

 

 
ఢిల్లీ: పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేంద్రం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై కూడా కేంద్రం వివరణ కోరింది. 2005లో పర్యావరణ అనుమతుల్ని ఉల్లంఘించినట్లు కేంద్రం నిర్థారించింది. అలాగే పోలవరం, అనుబంధ ప్రాజెక్ట్‌లపై కేంద్ర పర్యావరణశాఖ తనిఖీలు నిర్వహించింది. పోలవరం ప్రాజెక్ట్‌లో పర్యావరణ అనుమతుల్ని ఉల్లంఘించారంటూ చెన్నై పర్యావరణశాఖ అధికారులు కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఇటీవలే స్టాప్‌వర్క్ ఆర్డర్లపై స్టేను కేంద్రం రెండేళ్లు పొడిగించింది. కానీ మళ్లీ అనూహ్యంగా షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

Andrapradesh

Aug 07 2019, 19:25

ముగిసిన సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు  

విదేశాంగ శాఖ మాజీ మంత్రి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్ర నాయకురాలు సుష్మాస్వరాజ్ పార్ధివదేహానికి అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీ .. లోధి రోడ్డులోని స్మశాన వాటికలో సుష్మాస్వరాజ్ అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. ఆమె భర్త స్వరాజ్ కౌశల్ సమక్షంలో…  ఆమె కూతురు బన్సూరీ అంజలి .. సుష్మాస్వరాజ్ అంతిమ సంస్కారాలను నిర్వహించారు.

వెంకయ్య భావోద్వేగం

లోథి స్మశాన వాటికలో సుష్మా స్వరాజ్ కు ప్రధాని మోడీ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య, అగ్రనేత అద్వానీ, హోంశాఖ మంత్రి అద్వానీ, రాజ్ నాథ్ సింగ్ సహా.. కేంద్రమంత్రులు చివరిసారి నివాళులు అర్పించారు. సుష్మ పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచిన వెంకయ్య.. మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు.

ఢిల్లీ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. పోలీసుల గౌరవ వందనం తర్వాత సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు నిర్వహించారు. ఎలక్ట్రిక్ క్రీమేషన్ పద్ధతిలో సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు పూర్తిచేశారు.

Andrapradesh

Aug 07 2019, 19:24

ఏపీని ఆదుకోవాల్సింది మీరే: నిర్మలాసీతారామన్ తో సీఎం జగన్ భేటీ
 
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హస్తినలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలనే అజెండాతో కేంద్రంలోని పెద్దలను కలుస్తున్నారు. 

రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం వైయస్ జగన్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ కోరారు.  

రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన నిధులు, విభజన చట్టాన్ని అనుసరించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలుపై నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ చర్చించారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ సర్వం కోల్పోయిందని కేంద్రమే ఆదుకోవాలంటూ జగన్ కోరారు. 

ఇకపోతే రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం జగన్ మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం కేంద్ర ఉపరితల, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యారు. 

అంతకు ముందు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కూడా కలిశారు. అంతకు ముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యా నాయుడుతో జగన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలవాల్సి ఉన్నా సమయం కుదరకపోవడంతో కలవలేకపోయారు సీఎం జగన్.

Andrapradesh

Aug 07 2019, 17:24

ఎక్కడ దాడులు చేస్తే ఆ గ్రామంలోనే బస చేస్తా,బాధితులకు అండగా ఉంటా..చంద్రబాబు 

వేమూరు నియోజకవర్గ కార్యకర్తలు, రైతులతో సమావేశంలో చంద్రబాబు
గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి బుధవారం వేమూరు నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, మహిళలు, రైతులు భారీగా తరలివచ్చారు.
 ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ,‘‘ఎక్కడ వైసిపి నేతలు దాడులు చేస్తే ఆ గ్రామంలోనే బస చేస్తా..కార్యకర్తల్లో భరోసా నింపుతా..బాధితులకు అండగా ఉంటా..ప్రజల కోసమే ఎన్ని నిందలైనా భరిస్తా..తుది శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా, పేదల సంక్షేమానికే పాటుబడతా..
ఓటేయలేదని తాగునీటి సరఫరా నిలిపేస్తారా..? ఓటేయలేదని రోడ్డుకు అడ్డంగా గోడలు కడతారా.? పంట భూములను సాగు చేసుకోనివ్వరా..? ఊరొదిలి వెళ్లిపొమ్మంటారా..? ఇదేమైనా మీ ఇష్టారాజ్యమా..? 
రేపు టిడిపి గెలిస్తే వైసిపి వాళ్లు ఊళ్లు వదిలిపెట్టి పోవాలా..? 22ఏళ్ల టిడిపి పాలనలో ఈ దౌర్జన్యాలు, దాడులు ఉన్నాయా..?
 శాంతి భద్రతల పర్యవేక్షణ బాధ్యత పోలీసులది కాదా..? బాధితులపైనే నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయడం అన్యాయం కాదా..? అధికారంలో ఏ పార్టీ ఉన్నా సమర్ధ పోలీసింగ్ జరగాలి.
అసెంబ్లీలో ఛోటామోటా నేతలతో నన్ను బెదిరిస్తారా..? మీరు బెదిరిస్తే నేను బెదిరిపోతానా.? 
చివరికి నా భద్రతపై కూడా ఆటలు ఆడటమే కాదు, అన్నివర్గాల ప్రజల భద్రతతో చెలగాటం ఆడతారా..?
నా కష్టాన్ని ప్రజలు గుర్తించలేదనే బాధ ఉంది... అయినా ప్రజలు బాధపడుతుంటే చూడలేక పోతున్నా.నా కష్టానికి 23సీట్లు మాత్రమే గెలిపించారంటే ఎంతో బాధ వేస్తుంది.
నాయకులంతా గెలుపోటముల చింత వదిలేయాలి, ప్రజల కోసమే పాటుబడాలి. 
అన్నివర్గాల ప్రజలు సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోరా...?
ఇసుక ధర 10రెట్లు పెరగడానికి బాధ్యత వైసిపి నేతలది కాదా..? ఎంపిలు,ఎమ్మెల్యేలు లారీలు పంచుకుని ఇసుక దోచేస్తారా.? టిడిపి ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుక ఈ రోజు ట్రాక్టర్ రూ.10వేలకు అమ్ముతారా..? వైసిపి నేతల నిర్వాకాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 32వృత్తులకు చెందిన 20లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ప్రతి నెలా మొదటి తేదీన పించన్ రాకుండా టిడిపి ప్రభుత్వంలో ఉందా..? ప్రతినెలా రూ.3వేల పించన్ లో మోసం,45ఏళ్లకే పించన్ ఇస్తానని మోసం.పెన్షన్ల కోసం ప్రతి నెలా 2వ వారం దాకా వృద్దుల పడిగాపులు గతంలో చూశామా..?

 • Andrapradesh
   @Andrapradesh రేషన్ కార్డులు, బీమా, పెళ్లి కానుక,అన్నా కేంటిన్లు రద్దు చేశారు. కానుకల సంగతి సరే పెళ్లిళ్లు ఆగిపోయే పరిస్థితి కల్పించారు. ఎం బుక్ లో రాశాక, చేసిన పనులు రికార్డు అయ్యాక కూడా నీరు-చెట్టు బిల్లులు చేయరా..?
  ఆగస్టు రెండవ వారం వచ్చినా పట్టిసీమ నీళ్లు అందకపోవడం, నాట్లు పడకపోవడం గత 3ఏళ్లలో కృష్ణా డెల్టాలో ఉందా..?
  
  ప్రభుత్వం ఇచ్చిన ప్రాంసరీ నోటీసులు చెల్లదా..? వ్యక్తిగతంగా చంద్రబాబు ఇచ్చిన కాగితాలు కావవి, ప్రభుత్వం తరఫున ఇచ్చిన ప్రాంసరీ నోట్లు చెల్లవని రైతులను వేధిస్తారా..? పన్ను బకాయిలు, కరెంటు బకాయిలు గత ప్రభుత్వంలోవి కూడా ప్రజలు చెల్లించాలా..? మరి ప్రభుత్వం చెల్లించాల్సిన రుణమాఫీ 4వ,5వ కిస్తీల చెల్లింపులు రైతులకు చేయరా..? 
  నాకన్నా మంచోడు కెసిఆర్ అట..అందుకే గోదావరి నీళ్లు తెలంగాణ గుండా శ్రీశైలంలో కలుపుతాడంట..మీ ఇద్దరు బాగుంటే నాకే బాధ లేదు. నా బాధ అంతా ఏపి ప్రజల గురించే. తెలంగాణను అభివృద్ది చేసింది నేనే. 
  ఉద్యోగాల కోసం ఇక్కడి యువత చెన్నై,బెంగళూరు,హైదరాబాద్ లకు, విదేశాలకు వెళ్లాలా..? నాపై కక్షతో అమరావతిని చంపేస్తారా..? తక్కువ వడ్డీతో వచ్చే వరల్డ్ బ్యాంకు రుణం పోగొడ్తారా..? నా కోసం హైదరాబాద్ ను అభివృద్ది చేయలేదు. యువత ఉపాధి కోసం సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్టు, అవుటర్ రింగ్ రోడ్డు అభివృద్ది చేశాం.
  అలాంటి కలలే అమరావతి అభివృద్దిపై కన్నాను. ప్రణాళికలు, డిజైన్లు సిద్ధం చేశాను. అలాంటిది అన్నింటినీ కల్లలు చేశారు. విద్యుత్, కేబుల్, డ్రెయినేజి అన్నీ అండర్ గ్రవుండ్ లోనే ఉండేలా భవిష్యత్తులో రోడ్లు పగులకొట్టే పనే రాకుండా అన్నింటినీ సిద్ధం చేశాం. 
Andrapradesh

Aug 07 2019, 17:19

300 రూపాయల ఫీజు చెల్లించ లేదని విద్యార్థిని నిలబెట్టిన వైనం 

స్కూల్ ఫీజు కట్టినా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థిని తలిదండ్రులు.....

ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయలేని వైనం.....

కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామానికి చెందిన ఏడుకొండలు అనే రైతు తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటూ ఉన్నాడు. గత సంవత్సరం 38 వేల రూపాయల ఫీజు లు మాట్లాడుకోగా మొత్తం చెల్లించిన గాని గత సంవత్సరం 300 రూపాయలు ఇంకా బాకీ ఉందంటూ స్కూలు విద్యార్ధుల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఏడుకొండల వాపోయాడు. గత సంవత్సరం 300 రూపాయలు కట్టినా నమోదు చేసుకోకుండా మా పిల్లలు బయట నిలబెట్టడం ఏంటిని స్కూల్ యాజమాన్యం పట్ల అసహనం వక్తం చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు కనీసం పట్టించుకోకపోవటం దారుణంగా ఉందని, ప్రైవేటు పాఠశాలల వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం వెంటనే ఇటువంటి వారి పైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.....

Andrapradesh

Aug 07 2019, 12:12

ఏపీలో రేపు వైద్యసేవల బంద్‌:

                                                                                9 నుంచి 15 వరకు శాంతియుత ఆందోళనలు
ఎన్‌ఎంసీ బిల్లుకు నిరసనగా ఐఎంఏ రాష్ట్ర శాఖ నిర్ణయం..                                                            నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) బిల్లుకు నిరసనగా ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) రాష్ట్రశాఖ ప్రకటించింది. ఐఎంఏ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీహరిరావు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఫణీంద్ర, జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ గంగాధరరావు వెల్లడించారు.అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జాతీయ సంఘం పిలుపు మేరకు 15వ తేదీ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Andrapradesh

Aug 07 2019, 12:10

గుంటూరులో విజిలెన్స్ దాడులు.. భారీగా ఎరువుల నిల్వలు స్వాధీనం! 

ఖరీఫ్ సీజన్ లో నెలకొన్న కొరత
1193 బస్తాల ఎరువులు జప్తు
అనధికారికంగా నిల్వ చేసిన షాపు యజమానుల

ఆంధ్రప్రదేశ్ లో ఖరీఫ్ సీజన్ పంటలకు సంబంధించి ఎరువుల కొరత నెలకొనడంపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. గుంటూరు జిల్లాలోని పలు ఎరువుల దుకాణాలపై ఈరోజు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 1,193 ఎరువుల బస్తాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఎరువుల బస్తాలను అక్రమంగా నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టించినందుకు షాపుల యజమానులపై కేసులు నమోదుచేశారు. 

కాగా, ఈ ఎరువుల విలువ బహిరంగ మార్కెట్ లో రూ.11.50 లక్షలు ఉంటుందని ఓ విజిలెన్స్ అధికారి తెలిపారు. ఈ ఎరువుల బస్తాలను అనధికారిక ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారనీ, రైతులకు బిల్లులు కూడా ఇవ్వడం లేదని తమ తనిఖీలో తేలినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రికార్డుల్లో ఉన్న ఎరువుల నిల్వలకు, వాస్తవ నిల్వలకు అసలు పొంతనే లేదన్నారు.