తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ను ఖండించిన బీసీ యువజన సంఘం.
బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై ముందుకొచ్చి తన గళమెత్తి పోరాడుతున్న కారణంగా బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించడాన్ని బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా కట్టెకోలు దీపేందర్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్నను పార్టీ నుండి బహిష్కరించడమంటే అంటే యావత్ బీసీలను పార్టీ నుండి బహిష్కరించడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీలో అగ్రకులాలకో న్యాయం బీసీ ఎస్సీ ఎస్టీలకో న్యాయమా అని ప్రశ్నించారు.
మొదటినుండి పార్టీ కోసం అహర్నిశలు తన మాన ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నో కేసులను సైతం లెక్కచేయకుండా ఆనాటి ప్రభుత్వానికి ఎదురోడ్డి పోరాడి నాటి ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి నిరంతరం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి మల్లన్న ఆని తెలిపారు.
అలాంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడుతుంటే సహించలేని అగ్రకుల పార్టీ పెద్దలు ఈరోజు పార్టీ నుండి గెంటేయడం దుర్మార్గమైన చర్యన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మొన్నటి వరకు పార్టీని ప్రభుత్వాన్ని విమర్శించిన అగ్రకుల నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం మల్లన్న పై చర్యలు తీసుకోవడం అంటే బీసీలపై కాంగ్రెస్ పెద్దలకు ఉన్న సవతి తల్లి ప్రేమ ఏందో తేటతెల్లమైందన్నారు. రానున్న రోజుల్లో యావత్ బీసీ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Mar 08 2025, 20:49