ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్‌కు చెక్
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రిజిస్ట్రేషన్ల శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రిజిస్ట్రేషన్ల శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎటువంటి ప్రభుత్వ భూమి అయినా సరే, గతంలో వాటిపై ఎన్ని లావాదేవీలు జరిగినా సరే...ఇప్పుడు మళ్లీ వాటిని విక్రయించాలంటే తప్పనిసరిగా జిల్లా రిజిస్ట్రార్ ఆమోదం తీసుకునేలా నిబంధనలు మార్చింది. ఈ మేరకు ఆ శాఖ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు కూడా చేసింది.
జిల్లాల అధికారులు గతంలో అందించిన ప్రభుత్వ భూముల జాబితాలు 22-ఏ, 22-ఏ-1-సి (దేవదాయ శాఖ) ప్రకారం సిస్టమ్‌లో అప్‌లోడ్ చేసింది. వాటికి సంబంధించి ఇప్పుడు ఎవరైనా రిజిస్ట్రేషన్‌కు వెళితే...దానిని సిస్టమ్ తిరస్కరిస్తోంది. ‘జిల్లా రిజిస్ట్రార్ అనుమతి అవసరం’ అని సూచిస్తోంది. దాంతో కక్షిదారులు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ తంతు గత నాలుగు రోజులుగా నడుస్తోంది. అయితే ఇటువంటి వాటి విషయంలో ఎలా వ్యవహరించాలో రాష్ట్ర కార్యాలయం నుంచి ఇంకా మార్గదర్శకాలు రాలేదు.
జనవరి ఒకటో తేదీ నుంచి భూముల విలువలు పెరుగుతున్నాయి. ఈ నాలుగు రోజుల్లో రిజిస్ట్రేషన్లు జరగకపోతే ఆ తరువాత స్టాంపు డ్యూటీ కింద ఎక్కువ మొత్తం కట్టాల్సి వస్తుంది. అందుకని కక్షిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకుముందు ఇలాంటి డాక్యుమెంట్లు వస్తే స్థానిక సబ్ రిజిస్ట్రార్ కక్షిదారులు సమర్పించిన ప్రభుత్వ ఉత్తర్వులు, పత్రాలు చూసి సంతృప్తి చెందితే రిజిస్ట్రేషన్ చేసేవారు. ఇప్పుడు ఆ అధికారం జిల్లా రిజిస్ట్రార్‌కు మాత్రమే ఇచ్చారు.
విశాఖ జిల్లా వరకు చూసుకుంటే వీఎంఆర్‌డీఏ ఇంటి స్థలాలు, ఫ్లాట్లు విక్రయిస్తోంది. ఈ భూములన్నీ 22-ఏలోనే ఉంటాయి. వీఎంఆర్‌డీఏ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌కు పెడితే సబ్ రిజిస్ట్రార్లు అభ్యంతరాలు చెప్పేవారు కాదు. అలా అప్పట్లో వీఎంఆర్‌డీఏ వద్ద కొనుక్కొని ఇప్పుడు ఎవరైనా వాటిని తిరిగి అమ్మాలనుకుంటే...అవి కూడా 22-ఏలో కనిపిస్తున్నాయి. వాటికి కూడా జిల్లా రిజిస్ట్రార్ అనుమతి అవసరం అని చూపిస్తోంది. అదేవిధంగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములు కూడా 22-ఏలో ఉన్నాయి. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి వాటిని తిరిగి కొనుక్కున్న వారికి కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్లు జరగడం లేదు.
అయితే గత వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో పేదలకు ‘సెంటు భూమి’ ఇచ్చింది. వారి ఆర్థిక అవసరాలకు ఆ భూమిని ఎప్పుడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. దానిని ఆసరాగా చేసుకొని వైసీపీ నేతలు చాలామంది లబ్ధిదారుల పేరిట రిజిస్టర్ అయిన భూములను నెల రోజులకే, కొందరైతే మరుసటిరోజే తమ బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిపై ఆరా తీస్తుండడంతో వాటిని ఏదో ఒక రేటుకు అమ్మేసి బయటపడాలని యత్నిస్తున్నారు. ఇలాంటి తప్పుడు రిజిస్ట్రేషన్లు ఆపడానికే ప్రభుత్వం ‘జిల్లా రిజిస్ట్రార్ అనుమతి’ అవసరం అనే నిబంధన విధించింది. జగనన్న కాలనీలు కూడా 22-ఏలోనే ఉన్నాయి. వాటిని పరిశీలించి, నిజమైన లబ్ధిదారులు అమ్ముతున్నారా?, బినామీలు అమ్ముతున్నారా?...అనేది పరిశీలించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ క్రమంలో ప్రభుత్వ సంస్థల నుంచి భారీగా డబ్బులు పెట్టి ప్లాట్లు కొన్నవారు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై వెంటనే రాష్ట్ర అధికారులు మార్గదర్శకాలు జారీచేయాల్సి ఉంది.
Dec 27 2024, 11:50