ప్రసిద్ధ క్షేత్రంగా భెల్ అయ్యప్ప ఆలయం
హిందువులంతా పవిత్రమైన మాసంగా భావించే కార్తీకమాసంలో దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఉత్సవం అయ్యప్పస్వామి మాలధారణ. కార్తీకమాసంలో అయ్యప్ప స్వామి(Ayyappa Swami) భక్తులు మాలలు ధరించి అయ్యప్పస్వామి దేవాలయాన్ని, మకర జ్యోతిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు.
హిందువులంతా పవిత్రమైన మాసంగా భావించే కార్తీకమాసంలో దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఉత్సవం అయ్యప్పస్వామి మాలధారణ. కార్తీకమాసంలో అయ్యప్ప స్వామి(Ayyappa Swami) భక్తులు మాలలు ధరించి అయ్యప్పస్వామి దేవాలయాన్ని, మకర జ్యోతిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, 41 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్పస్వామికి పూజలు చేసి స్వామి దీక్షలో ఉండి శబరిమళ యాత్రచేసి, జ్యోతిసర్వరూపుడైన అయ్యప్పను దర్శించు కోవడంతో దీక్షలు పూర్తవుతాయి.
అయ్యప్పస్వామి భక్తులు, మాలధారణ చేసే స్వాములకు ఆధ్యాత్మిక క్షేత్రంగా, శబరిమల తరహాలో పూజా కార్యక్రమాలకు వేదికగా మారింది భెల్ టౌన్‌షి్‌పలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయం. కేవలం కార్తీక మాసంలో అయ్యప్పస్వామికి నిర్వహించే ప్రత్యేక మాలధారణలు, మండల పూజలు సమయంలోనే కాకుండా నిత్యం అయ్య ప్ప భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తూ నేడు జిల్లాలోనే ప్రసిద్ధ పుణ్య క్షేతంగా మారింది.
వివిధ భాషాలకు, విభిన్న ప్రాంతాలవారి కలయికలతో మమేకమైన బీహెచ్‌ఈఎల్ పరిశ్రమలో పనిచేస్తున్న కొందరు కేరళకు చెందిన కార్మికులు, భక్తులు మండల పూజల రోజుల్లో అయ్యప్పస్వామి మాలలు వేసుకుని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలోని స్వామివారి పాత కల్యాణ మండపంలో అయ్యప్ప మండపాన్ని ఏర్పాటు చేసి పూజలు చేసేవారు. 55 ఏళ్లుగా ఇదే విధంగా పూజలు నిర్వహించడంతో అనవాయితీగా వచ్చింది. ప్రతీ ఏటా అయ్యప్పస్వామి భక్తుల సంఖ్య పెరగడం, వేలాది మంది మాలధారణలు ధరించడం, పూజలు నిర్వహిస్తుండడంతో అయ్యప్పకు ప్రత్యేక దేవాలయాన్ని నిర్మించాలనే సంకల్పం కలిగింది.
అయ్యప్పకు ప్రత్యేక దేవాలయాన్ని నిర్మించాలని భక్తులు, కాలనీవాసులు, కార్మికులు నిర్ణయించి స్థలాన్ని కేటాయించాలని భెల్ యాజమాన్యాన్ని కోరారు. వారి కోరికను గౌరవిస్తూ భెల్ యాజమాన్యం నాలుగు ఎకరాల స్థలం కేయించింది. దేవాలయ నిర్మాణానికి యాజమాన్యం పరోక్షంగా సహకరించగా భక్తులు, కార్మికులు విరాళాలు అందచేయడంతో దేవాలయ నిర్మాణానికి పునాది పడింది.
దీంతో చిన్నపాటి నిర్మాణంతో ప్రారంభమైన అయ్యప్ప దేవాలయాన్ని దినదినాభివృద్ధి చేస్తూ దాదాపు కోటి రూపాయల వ్యయంతో పూర్తి స్థాయిలో ఆధునీకరించి జిల్లాలోనే అతిపెద్ద దేవాలయంగా మారింది. పంచలోహాలతో అయ్యప్ప స్వామి మూల విగ్రహాన్ని తయారుచేయించి, కేరళ సంప్రదా యం ప్రకారం ప్రతిష్ఠించారు. అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, భగవతి అమ్మవారు, నాగదేవతల ఆలయాలను సైతం నిర్మించారు.
ప్రతీ ఏటా నవంబరు నెలలో ప్రారంభమైయ్యే మండల పూజల సమయంలో వేసుకునే అయ్యప్ప మాలలు ఇప్పటికే ప్రారంభమవగా మండల పూజలకు దేవాల యం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. డిసెంబరు 26 వరకూ జరిగే మండల పూజలు, అయ్యప్ప ఊరేగింపు తో ముగుస్తాయి. ఇప్పటికే దాదాపు 3 వేల మంది యువకులు, వృద్ధులు, పిల్లలు అయ్యప్ప దీక్షను తీసుకున్నారు.
స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప భక్తుల శరణుఘోషలు, శభరిగిరీశుని నామస్మరణలతో భెల్ టౌన్‌షి్‌పలోని అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం మండల పూజలు వైభవంగా ప్రారంభమైయ్యాయి. కేరళ సంప్రదాయ బద్దంగా, ఆలయ తంత్రీల ఆధ్వర్యంలో విశేష పూజల నడుమ మండల పూజలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం నాలుగు గంటలకు మహాగణపతి హోమం, అయ్యప్పస్వామికి ప్రీతిప్రదమైన నెయ్యి అభిషేకం, మూల విగ్రహానికి పంచామృతాభిషేకం తదితర విశేషపూజ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం దేవాలయ ప్రధాన గురుస్వామి ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులు మాలలు ధరించి దీక్షలకు శ్రీకారం చుట్టారు. కేరళ నుంచి వచ్చిన కళాకారులు రెండు గంటల పాటు పంచవాద్యాన్ని నిర్వహించారు. ఆలయంలో ప్రతీరోజు ఉదయం 4.30 నుంచి 8.30 వరకు సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు భజనలు, ప్రత్యేక పూజలు జరుతాయని నిర్వాహకులు తెలిపారు.
అయ్యప్ప దీక్షలను చేపట్టిన స్వాములు 41 రోజుల పాటు భక్తి శద్ధ్రలతో అయ్యప్పస్వామికి పూజలు నిర్వహిస్తుండడంతో వారి సౌకర్యార్థం దేవాలయ ప్రాంగణంలో అన్నపూర్ణదేవి కల్యాణ మండపంలో నిత్యాన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి డిసెంబరు 26 వరకు మండల పూజలు జరిగే ప్రతీరోజు ఉదయం, సాయంత్రం స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు.
Nov 17 2024, 18:29