కార్తీక మాసములో చేయకూడని పనులు
ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు. ఇతరుల యెంగిలి ముట్టకూడదు, తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు.
పౌర్ణమి, అమావాస్య, సోమవారములనాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు. కార్తీకమాసమున నెలరోజులూ కూడా రాత్రులు భుజించరాదు, విధవ వండినది తినరాదు. ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను.
ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీకమాసమున వేడినీటితో స్నానము కూడదు, చేసిన కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను.
కావున, వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యము వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవాడు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.
ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. అటుల చేయనియెడల మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున బడి కృశింతురు.
ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని, చెరువునందుగాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ |
నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు ||
అని పఠించుచు స్నానము చేయవలయును. కార్తీకమాస వ్రతము చేయువారు పగలు పురాణపఠన శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలము గడుపవలెను.
Nov 06 2024, 08:53