ప్రియాంక గాంధీ ఆస్తుల వివరాలు ఇవిగో.

కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక గాంధీ తన ఆస్తులను రూ.12 కోట్లుగా ప్రకటించారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కలిసి వచ్చిన ప్రియాంక నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను వెల్లడించారు.

తనకు ఉన్న రూ.12 కోట్ల విలువైన ఆస్తిలో రూ.4.24 కోట్ల విలువ చేసే చరాస్తులు, రూ.7.74 కోట్ల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్లుగా ప్రకటించారు. మూడు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. తన భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోడా సీఆర్వీ కారు, రూ.1.15 కోట్ల విలువైన 4 కిలోలకు పైగా బంగారు నగలు ఉన్నట్లు పేర్కొన్నారు. 

దేశ రాజధాని ఢిల్లీలోని మోహ్రాలీ ప్రాంతంలో వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి, ఫామ్ హౌస్‌లో సగం వాటా ఉన్నట్లు వెల్లడించారు. సిమ్లాలో తన పేరిట రూ.5.63 కోట్ల విలువైన ఓ నివాస భవనం ఉందన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం రూ.46.39 లక్షలుగా ఉందని పేర్కొన్నారు. భర్త రాబర్ట్ వాద్రా నికర ఆస్తులు రూ.65.54 కోట్లుగా ప్రియాంక గాంధీ వెల్లడించారు. ఇందులో రూ.37.9 కోట్ల చరాస్తులు, రూ.27.64 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు.

హైకోర్టులో విచారణ వాయిదా

మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్‌పై విచారణ హైకోర్టులో వాయిదా పడింది. శుక్రవారానికి కేసు విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం. సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అతనికి బెయిల్ ఇవ్వొదని పోలీసుల తరుపున న్యాయవాది వాదనలు వినిపించే అవకాశం ఉంది.

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ (Bapatla Former MP Nandigam Suresh) బెయిల్ పిటిషన్‌పై హైకోర్ట్‌లో (AP High Court) గురువారం విచారణ జరిగింది. సురేష్ తరపున వాదనలు ముగిశాయి. వాదనలు వినిపించేందుకు పోలీసుల తరపు న్యాయవాది కోర్టును సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం రేపటి (శుక్రవారం) కి వాయిదా వేసింది.

తుళ్లూరులోని వెలగపూడికి చెందిన మరియమ్మ హత్య కేసులో సురేష్ ఇప్పటికే అరెస్ట్ అయి గుంటూరు జిల్లా జైలులో (Guntur Jail) రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు సురేష్‌ను కస్టడీకి తీసుకుని తుళ్లూరు పోలీసులు విచారణ జరిపిన విషయం తెలిసిందే. అయితే విచారణలో మాజీ ఎంపీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, విచారణకు సహకరించని పరిస్థితి. ఈ క్రమంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ నందిగం సురేష్ హైకోర్టులో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు.

అయితే విచారణకు సహకరించనందున బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించే అవకాశం ఉంది. దీనికై కొంత సమయం కావాలని పోలీసు తరుపున న్యాయవాది కోర్టును కోరడంతో విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు. దీంతో రేపు మరోసారి నందిగం సురేష్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. ఆ తరువాత బెయిల్‌పై న్యాయమూర్తి తీర్పును వెలవరించే అవకాశం ఉంది.

నందిగం సురేష్ స్థానికుడు కావడంతో సాక్షులను బెదిరించి సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అతనికి బెయిల్ ఇవ్వొదని పోలీసుల తరుపున న్యాయవాది వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, కేసులో తన పేరు ఉందని కూడా తనకు తెలియదంటూ పోలీసు కస్టడీలో మాజీ ఎంపీ అబద్ధం చెప్పిన నేపథ్యంలో సాక్షాలను తారుమారు చేసి అవకాశం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని కోరడంతో పాటు బలమైన ఆధారాలను సమర్పించేందుకు పోలీసు తరుపున న్యాయవాదులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం కొంత సమయం కావాలని హైకోర్టును పోలీసు తరపు న్యాయవాది కోరినట్లు సమాచారం. అయితే మాజీ ఎంపీకి బెయిల్ వస్తుందా.. రాదా అనేది రేపటి విచారణలో తెలియనుంది.

రైల్వే లైన్‌కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

కేంద్ర మంత్రివర్గం మరో రైల్వే లైన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్‌ను కేంద్రం శ్రీకారం చుట్టింది.

అమరావతి రైల్వే లైన్‌కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించింది. రూ. 2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణం చేస్తుంది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్‌ను కేంద్రం శ్రీకారం చుట్టింది. కొత్తగా కృష్ణ నదిపై 3 కిలో మీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం చేపట్టనుంది.

కాగా.. అమరావతి రైలు మార్గానికి తొలి అడుగుపడింది. గత ఐదేళ్లుగా వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని రైలు మార్గానికి కూటమి ప్రభుత్వంలో తొలి ఏడాదిలోనే నిధులు కేటాయింపు జరిగింది. తొలిసారిగా రూ.50.01 కోట్ల నిధులను కేటాయించడంతో సాధ్యమైనంత త్వరలోనే పనులు ప్రారంభమౌతాయని పలువురు భావిస్తున్నారు. అమరావతి రైలుతో పాటు గుంటూరు రైల్వే డివిజన్‌కి సంబంధించి కొత్త ప్రాజెక్టులు, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వాటిని మరింత ముందుకు తీసుకెళ్లేలా కేంద్రం నిధుల కేటాయింపు జరిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలోని ప్రాజెక్టులకు రూ.1100 కోట్లకు పైగా నిధులు కేటాయించడంపై రైల్వే వర్గాలతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నెల తర్వాత రైల్వే కేటాయింపులకు సంబంధించిన పింక్‌బుక్‌ ఎట్టకేలకు రైల్వేపోర్టల్‌లో అందుబాటులోకి రావడంతో ఈ అంశాలు వెలుగుచూశాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాలు(డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌) కావడంతో ఏపీకి బడ్జెట్‌ కేటాయింపుల్లో మరింత ప్రాధాన్యం ఇచ్చినట్లు తేలింది. సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎంపీల ప్రయత్నాలు ఫలించినట్లు అర్థమవుతోంది. ఇంచుమించు ఏడు, ఎనిమిదేళ్ల క్రితం అమరావతి రాజధాని నూతన రైలుమార్గానికి పింక్‌బుక్‌లో చోటు దక్కింది. ఆ తర్వాత తొలిగా ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించి కేంద్రం ఉదారతను చాటుకున్నది. మరికొన్ని ప్రాజెక్టులకు కూడా భారీగానే నిధులు కేటాయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతున్నది.

అమరావతి రాజధానికి రైలుమార్గం ఉంటే అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని 2014-19 మధ్యనే టీడీపీ ప్రభుత్వం ఆలోచన చేసింది. అప్పట్లో కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ-1 ప్రభుత్వంతో మాట్లాడి ప్రాజెక్టుని మంజూరు చేయించింది. ఈ రైలుమార్గం మొత్తం పొడవు 106 కిలోమీటర్లు. ఇందులో ఒక సెక్షన్‌ ఎర్రుపాలెం - నంబూరు మధ్య 55.8 కిలోమీటర్ల పొడవు, రెండోది అమరావతి - పెదకూరపాడు 24.5 కిలోమీటర్లు, మూడోది సత్తెనపల్లి - నరసరావుపేట 25 కిలోమీటర్ల పొడవునా డీపీఆర్‌ కూడా ఆమోదించారు. మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2679.59 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ రైలుమార్గానికి అవసరమయ్యే భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వాలి. అయితే ఎన్‌డీఏ-1 చివరలో బీజేపీ, టీడీపీకి మధ్య అభిప్రాయభేదాలతో ప్రాజెక్టు ముందుకు కదలలేదు. ఆ తర్వాత అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం అసలు ఈ ప్రాజెక్టు ప్రస్తావన అనేది ఐదేళ్లలో తీసుకురాలేదు. దాంతో ఏటా కేంద్ర బడ్జెట్‌లో మొక్కుబడిగా రూ.లక్ష మాత్రమే కేటాయిస్తూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఎన్‌డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడటం, అందులో టీడీపీ భాగస్వామ్యం కావడంతో అమరావతి రైలుమార్గానికి మళ్లీ మంచి రోజులొచ్చాయి.

ఇక నిర్మాణంలో ఉన్న నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గం పనులను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది. ఎస్‌ ఫండ్‌ కింద రూ.250 కోట్లు, కేపిటల్‌ ఫండ్‌ కింద రూ.60 కోట్లు కలిపి మొత్తం రూ.310 కోట్లు కేటాయించింది. గుంటూరు - గుంతకల్లు డబ్లింగ్‌లో కీలకమైన నల్లమడ అటవీ ప్రాంతంలో పనులు చేపట్టాల్సి ఉన్నది. ఇందుకు ఖర్చు కూడా ఎక్కువ కానుండటంతో ఏకంగా ఈ బడ్జెట్‌లో రూ.480 కోట్లు కేటాయింపులు జరిపింది. రద్దీ మార్గాల్లో ఒకటిగా మారిన గుంటూరు - బీబీనగర్‌ డబ్లింగ్‌ కోసం ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకి రూ.220 కోట్లు కేటాయించింది. విష్ణుపురం బైపాసు రైలుమార్గానికి రూ.20 కోట్లు, మోటుమర్రి - విష్ణుపురం డబ్లింగ్‌ ప్రాజెక్టుకి రూ.50 కోట్లు కేటాయించింది. 88 కిలోమీటర్ల పొడవునా నిర్మించనున్న ఈ రైలుమార్గంలో మోటుమర్రి వద్ద రైల్‌ ఓవర్‌ రైలు బ్రిడ్జిని కూడా నిర్మిస్తారు. అలానే గుంటూరు యార్డులో మల్టీ ట్రాకింగ్‌ కనెక్టివిటీ పనుల నిమిత్తం మరో రూ.50 కోట్లు కేటాయించింది.

నేడు విజయనగరం జిల్లా పర్యటనకు జగన్

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురువారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గుర్ల వెళ్లి డయేరియా బాధితులను పరామర్శించనున్నారు. జగన్ రాక నేపథ్యంలో వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YCP Chief) జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) గురువారం విజయనగరం జిల్లా (Vizianagaram Dist.,)లో పర్యటించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి నెల్లిమర్ల సమీపంలోని దత్తా ఎస్టేట్స్‌కి చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుర్ల వెళ్లి డయేరియా బాధితులను (Diarrhea victims) పరామర్శించనున్నారు. జగన్ రాక నేపథ్యంలో వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా గుర్ల మండలంలో డయేరియా ప్రబలిన అంశాన్ని కొద్దిరోజులుగా వైసీపీ రాజకీయం చేస్తోంది. వేర్వేరు కారణాలతో మృతిచెందిన వారికి డయేరియాను ఆపాదిస్తోంది. 11 మంది మృత్యువాత పడ్డారని ఆరోపిస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్‌ కూడా అదే దారిలో వెళ్తున్నారు. ప్రభుత్వాన్ని అహేతుకంగా విమర్శించేందుకు ఏకంగా గుర్ల గ్రామానికి గురువారం వస్తున్నారు. కాగా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఒక్కరు మాత్రమే డయేరియాతో మృతిచెందినట్టు స్పష్టంచేసింది. వైసీపీ మాత్రం జిల్లాలో ఏదో జరిగిపోతోందని, అందుకు ప్రభుత్వమే కారణమని అదే పనిగా ఆరోపణలు చేస్తోంది. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ వైఫల్యం అంటూ ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు భూగర్భ జలాలు కలుషితమే డయేరియాకు కారణమని అధికారుల నివేదికలో తేలింది. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అవుతోంది. ఈ తక్కువ వ్యవధిలో అద్భుతాలు చేసేయగలదా అన్న విషయాన్ని వైసీపీ విస్మరిస్తోంది. ఐదేళ్లుగా వైసీపీ అధికారంలో ఉన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు మరిచిపోయి విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ బాధితులను పరామర్శించారు. ఇది గత ప్రభుత్వ వైఫల్యమేనని తేల్చేశారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు వంటి విషయాలను నిర్లక్ష్యంగా విడిచిపెట్టడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు. దీనిని ఖండించేందుకే జగన్‌ పనిగట్టుకుని జిల్లాకు వస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నాడు పాలనలో వైఫల్యం చెంది ఇప్పుడు బాధితులను ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని కూటమి పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఎన్నో రకాల విధ్వంసాలు, అపచారాలు, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడ్డాయి. అయినా నాడు సీఎం హోదాలో ఉన్న జగన్‌ జిల్లా వైపు కనీసం చూడలేదు. రాష్ట్రంలోనే ప్రముఖ దేవస్థానాల్లో ఒకటైన రామతీర్థంంలో బోడికొండపై ఉన్న కోదండరామాలయంలోని విగ్రహాలను 2020 డిసెంబరు 28న అగంతుకులు ధ్వంసం చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కుదిపేసింది. అప్పటి ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, బీజేపీలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఆలయాన్ని సందర్శించారు. వివిధ పీఠాధిపతులు సందర్శించి ఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. ధార్మిక సంఘాలు ఆందోళన చేశాయి. ఇంత పెద్ద ఘటన జరిగినా శాంతిభద్రతలు అదుపు తప్పే అవకాశం ఉన్నా సీఎం హోదాలో ఉన్న జగన్‌ ఇటువైపుగా చూడలేదు. కేవలం కేసును సీబీ సీఐడీకి అప్పగించి చేతులు దులుపుకున్నారు. కాగా గుర్ల డయేరియా అంశాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని జగన్‌ భావించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విజయనగరం జిల్లా ప్రజలను డయేరియా వణికిస్తోంది. అనేక గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. తాగునీరు కాలుష్యమవుతోంది. ఈ కారణాల వల్లే డయేరియా ప్రబలుతోందని వైద్యులు సైతం నిర్ధారించారు. ఐదేళ్ల కాలంలో గ్రామాల అభివృద్ధిని విస్మరించిన కారణంగానే ఈ దుస్థితి నెలకొందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గుర్లలో డయేరియా విజృభించడం జిల్లా, రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. గజపతినగరం మండలంలోని కెంగువ, దత్తిరాజేరు మండలంలోని దాసరిపేట, కన్నాం, గుచ్చిమి వంటి గ్రామాల్లోనూ డయేరియా కేసులు బయటపడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్ధితిలో జిల్లా వ్యాప్తంగా వైద్య సిబ్బందితోపాటు సచివాలయం ఉద్యోగులు ఇంటింటా వెళ్లి ఎవరికైనా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారా అంటూ అడిగి తెలుసుకుంటున్నారు. కాగా ఐదేళ్లూ వైసీపీ పాలనలో పంచాయతీలను పూర్తిగా గాలికి వదిలేశారు. గతంలో టీడీపీ హయంలో గ్రామాల్లో మంచి నీటి పరీక్షలు నిర్వహించేవారు. బోరు లేదా రక్షిత నీటి పథకాలకు చెందిన నీరు తాగవచ్చా? లేదా అనేది ప్రజలకు చెప్పేవారు. వైసీపీ హయంలో మంచినీటి పరీక్షలు ఎక్కడా నిర్వహించలేదు. ఆ కిట్లు కూడా మూలకు చేర్చారు. అలాగే చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను కూడా విస్మరించంతో గ్రామాల్లో పారిశుధ్యం తగ్గింది. ఆ ఫలితం నేడు కనిపిస్తోందనేది టీడీపీ నాయకుల మాట.

డైవర్షన్‌ రాజకీయాలు

 

రాష్ట్రంలో నెలకొన్న సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికి చంద్రబాబు ప్రభుత్వం మా తల్లి, చెల్లి ఫొటోలు పెట్టి డైవర్ట్‌ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆరోపించారు.

రాష్ట్రంలో నెలకొన్న సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికి చంద్రబాబు ప్రభుత్వం మా తల్లి, చెల్లి ఫొటోలు పెట్టి డైవర్ట్‌ రాజకీయాలు (Diversion politics ) చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌(YS Jagan) ఆరోపించారు. విజయనగరం జిల్లా గుర్లలో డయోరియోతో బాధ పడుతున్న బాధితులను గురువారం పరామర్శించారు. డయేరియాతో మరణించిన బాధితుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు .

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో సమస్యలుంటాయని, మా కుటుంబ సమస్యలపై ప్రచారం ఆపి ప్రజల మీద దృష్టి పెట్టాలని సూచించారు. వాస్తవాలను దాచిపెట్టేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ఆరోపించారు. సూపర్‌ సిక్స్‌ అంటూ హామీలిచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయకపోవడంతో వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి సమస్యలను డైవర్ట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టేందుకు దృష్టిసారించాలన్నారు.

డయేరియాతో ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని, బాధితులకు సాయం అందించదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం నిద్ర మత్తులో ఉందని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. వైసీపీ హయాంలో గ్రామాలను సస్యశ్యామలం చేశామని, గ్రామ సచివాలయాల ద్వారా సేవలు అందించమన్నారు.

ఏఐసీసీ చీఫ్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన లేఖ..

ఏఐసీసీ చీఫ్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన లేఖ రాశారు. కాంగ్రెస్‌లో తనకు జరుగుతున్న అన్యాయం, పరిణామాలను వివరిస్తూ లేఖ రాశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌‌ పార్టీ, ఎమ్మెల్యే సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

ముఖ్య అనుచరుడి హత్యతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) తీవ్ర మనోవేదనకు గురైన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీపై కూడా ఆయన అసహానాన్ని వ్యక్తం చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా పార్టీలో కొనసాగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేక తీవ్ర మానసిక వ్యధతో ఏఐసీసీ చీఫ్‌కు (AICC Chief) జీవన్ రెడ్డి లేఖ రాశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ గురించి లేఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ నన్ను అగౌరవంగా, అవమానంగా చూస్తోంది. నా భవిష్యత్తు కార్యాచరణ పార్టీనే మార్గదర్శకం చేయాలి. కేసీఆర్‌లాగే కాంగ్రెస్.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం పట్ల ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు’’ అంటూ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి , పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లకు ఎమ్మెల్సీ లేఖ రాశారు.

కాంగ్రెస్‌లో తనకు జరుగుతున్న అన్యాయం, పరిణామాలను వివరిస్తూ ఎమ్మెల్సీ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంజయ్ అనుచరుడిగా భావించే సంతోష్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని హత్య చేశాడని వెల్లడించారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు భిన్నంగా పార్టీ నడుస్తోందని తెలిపారు. పార్టీ ఫిరాయించిన వారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వబడుతుందనే అభిప్రాయాన్ని కల్గించే విధంగా పార్టీ వ్యవహారం ఉన్నట్లు పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పోచారం ఇంట్లో సమావేశం నిర్వహించడాన్ని ఎమ్మెల్సీ తీవ్రంగా తప్పుబట్టారు. పదేండ్లు అనేక దౌర్జన్యాలను ఎదుర్కున్నామని.. కాంగ్రెస్ ముసుగు కప్పుకొని మళ్ళీ దౌర్జన్యాలు చేస్తామంటే ఎలా భరించాలని అడిగారు. పార్టీని కన్నతల్లి అనుకున్నానని.. పార్టీ తనకు అనేక అవకాశాలు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌పై పోటీ చేయమంటే చేశానన్నారు.

నన్ను ప్రతిపక్షాలు ఏకాకిని చేసి హేళన చేసినా తట్టుకొని నిలబడ్డాను. పార్టీ అధిష్ఠానం నా గౌరవాన్ని కాపాడతానని నోటిమాటగా చెప్పింది. పార్టీ ఫిరాయింపులకు ముఠా నాయకుడు ఉన్నాడు. పార్టీ ఫిరాయింపులకు ముఠా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి. పది మంది ఎమ్మెల్యేలు లేకపోతే ప్రభుత్వం కొనసాగాదా.. రాహుల్ ఏం చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం. మా పార్టీ నాయకుడు గంగారెడ్డిని చంపిన వ్యక్తి బీఆర్ఎస్ తరపున ఎన్నికల్లో డబ్బులు పంచారు. గంగారెడ్డిని చంపిన సంతోష్‌పై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. గంగారెడ్డిని మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నేను ప్రపోజ్ చేశారు. ఎవరి అండదండలు చూసుకొని సంతోష్ మా నాయకుడిని చంపాడు’’ అంటూ ఆయన ప్రశ్నలు కురిపించారు.

అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై కూడా జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ పుట్టిందే మా ఇంట్లో అంటున్నాడు. మీ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ పుడితే పరాయి ఇంటికి ఎందుకు వెళ్ళాడు. సంజయ్ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేశాడా.. నేను రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. సంజయ్ చొక్కారావు మనవడిని అని చెప్పుకుంటున్నారు. ఇందిరా గాంధీ కష్టకాలంలో ఉన్నప్పుడు చొక్కారావు జనతా పార్టీలో చేరాడు. సంజయ్ టీఆర్ఎస్‌లో ఎన్నడూ లేడు. అక్కడి ఉద్యమ నాయకుల మధ్య సమన్వయ లోపం వల్ల సంజయ్ తెరపైకి వచ్చాడు. అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీలో చేరతామంటే ప్రజాస్వామ్యం ఉంటుందా. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్ పరిస్థితి ఏమయింది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు

అలాగే పోచారం శ్రీనివాస్‌రెడ్డిపైనా ఎమ్మెల్సీ విరుచుకుపడ్డారు. భట్టికి ప్రతిపక్ష నేత హోదా పోవడానికి కారణం పోచారమన్నారు. ‘‘పోచారం లాంటి వాడిని పార్టీలో చేర్చుకోవడం ఏంటి? పోచారం సలహాదారుడు ఏంటి. పార్టీ ఫిరాయింపుల క్రమబద్ధీకరణ విషయంలో పోచారం సలహాలు ఇవ్వగలడు’’ అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

నేను నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. పార్టీని వదిలి వెళ్ళాలనే ఆలోచన చేయలేకపోతున్న. అవమానాలు భరించుకుంటూ ఉండాలా? రేవంత్ మా నాయకుడు. ఆయన్ని తప్పకుండా కలుస్తాను. కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన మా వ్యక్తిగతం అని పీసీసీ చీఫ్ భావిస్తే నేనేం చేయగలను. పార్టీ పట్ల గౌరవం లేకనే నేను ఇక్కడి దాకా వచ్చానా.. ఇప్పటికీ నాకు పార్టీపై గౌరవం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ నాయకత్వంలో ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తోంది. నేను రాజకీయం చేయడం లేదు. సంజయ్ భుజాలు తడుముకుంటున్నాడు. మా పార్టీ నాయకుడిని చంపిన నిందితుడు సంజయ్ అనుచరుడు కాదని చెప్పగలరా.. సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకి క్లారిటీ లేదా.. దానం నాగేందర్‌కు ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని సమర్ధించడం లేదు. నేను ఎప్పుడూ పార్టీ ఫిరాయించలేదు. నాకు నేనుగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. పదేండ్లలో నేను పార్టీని నిలబెట్టాను. రాహుల్ ప్రధాని కావాల్సిందే. నామినేటెడ్ పదవులు మాకు ఇవ్వాలి. పార్టీలో మాదే ఆధిపత్యం ఉండాలి అంటే ఎలా. పార్టీ ఫిరాయించి ముసుగేసుకొని దౌర్జన్యం చేయడం బ్లాక్ మెయిల్ కాదా. నా మానసిక పరిస్థితి అర్థం చేసుకోండి. పార్టీ ఫిరాయింపులు జరిగాయో లేదో క్లారిటీ లేకుండా పోతుంది. నేను పార్టీకి అంతర్గతంగా లేఖ రాశాను. ఆవేదన భరించలేక బయటకి చెప్పుకుంటున్నా’’ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

ఆందోళనలో రేవంత్ రెడ్డి సర్కార్..

ఓవైపు ప్రభుత్వ ప్రాధాన్యాలు పెరిగిపోతుండగా అందుకు తగ్గట్లుగా రాబడి రాకపోవడం రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఇబ్బందికరంగా మారుతోంది. మూడో దశ రుణమాఫీ, కరీఫ్ సీజన్ రైతు భరోసా, సమగ్ర గురుకుల విద్యా భవనాల నిర్మాణం వంటి వాటికి నిధులు అవసరమైన వేళ రాబడి తగ్గుతుండడం ఆందోళనకరం.

ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయినా.. తెలంగాణ ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. సర్కార్ అంచనాలకు.. వస్తున్న రాబడులకు పొంతన ఉండడంలేదు. బడ్జెట్‌లో అంచనా వేసిన దానికంటే చాలా తక్కువ రాబడి వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు ప్రభుత్వ ప్రాధాన్యాలు పెరిగిపోతుండగా అందుకు తగ్గట్లుగా రాబడి రాకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. మూడో దశ రుణమాఫీ, కరీఫ్ సీజన్ రైతు భరోసా, సమగ్ర గురుకుల విద్యా భవనాల నిర్మాణం వంటి వాటికి నిధులు అవసరమైన వేళ రాబడి తగ్గుతుండడం ఆందోళనకరం.

ఆదాయం కోసం భూములను విక్రయించడం.. తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం.. భూముల మార్కెట్ విలువలు.. మద్యం ధరల పెంపువంటి మార్గాలు తప్ప ఇతర మార్గాలేవీ కనిపించడంలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అంచనా వేసిన బడ్జెట్ రాబడులు కూడా తగ్గుతుండడం ప్రభుత్బాన్ని కలవరపెడుతోంది. సెప్టెంబర్ నెల రాష్ట్ర ఆదాయ వ్యయాలకు సంబంధించి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిన్న (బుధవారం) నివేదిక విడుదల చేసింది.

తప్పిన తుఫాను ముప్పు

రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనించి బుధవారం ఉదయానికి తుఫాన్‌గా బలపడింది. తరువాత వాయవ్యంగా గంటకు 12 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ రాత్రి 10గంటలకు

రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనించి బుధవారం ఉదయానికి తుఫాన్‌గా బలపడింది. తరువాత వాయవ్యంగా గంటకు 12 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ రాత్రి 10గంటలకు ఒడిసాలోని పారాదీ్‌పకు 420 కి.మీ, ధామ్రాకు 450 కి.మీ, సాగర్‌ ద్వీపానికి(పశ్చిమ బెంగాల్‌) 500కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీనికి ఒమన్‌ దేశం సూచించిన ‘దానా’ అని పేరు పెట్టారు. తుఫాను వాయవ్యంగా పయనించే క్రమంలో తీవ్ర తుఫాన్‌గా బలపడి గురువారం ఉదయానికి వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఆ తరువాత అదే దిశలో పయనించి గురువారం రాత్రి లేదా శుక్రవారం

తెల్లవారుజామున ఉత్తర ఒడిసాలోని భిటార్కనికా, ధామ్రా సమీపంలో తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కి.మీ. వేగంతో అప్పుడప్పుడు 120 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, తీరంలో అలలు రెండు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడతాయని పేర్కొంది. ఒడిసా తీర ప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని, పల్లపు ప్రాంతాలు నీట మునగడంతోపాటు రవాణా, కమ్యూనికేషన్లు, విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో తూర్పుకోస్తా, ఆగ్నేయ రైల్వేలు అనేక రైళ్లను రద్దు చేశాయి. తూర్పు మధ్య, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య, ఈశాన్య బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారడంతో చేపల వేటను నిషేధించారు.

ఉత్తరాంధ్ర తీరం వెం బడి బలమైన గాలులు వీస్తున్నందున ఈనెల 26వ తేదీ వర కు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవులలో రెండో నంబరు హెచ్చరిక ఎగురవేశారు. కళింగపట్నం, భీమునిపట్నం ఓడరేవులకు సమాచారం అందించారు. తీవ్ర తుఫాను ఒడిసాలో తీరం దాటుతున్నందున ఏపీకి ప్రత్యేకించి ఉత్తరాంధ్రకు ముప్పు తప్పింది. తీరం దాటే సమయంలో ఉత్తరాంధ్రలో పలుచోట్ల చెదురుమదురు వర్షాలు మాత్రమే కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

ఒడిసాలోని కేంద్రపారా జిల్లా భిటార్కినికా, ధామ్రా సమీపాన తీవ్ర తుఫాన్‌ తీరం దాటుతున్నందున భిటార్కినికా నేషనల్‌ పార్కులోని అరుదైన ఉప్పునీటి మొసళ్లు, చుక్కల జింకలు, కొండచిలువలు, పలు రకాల పక్షులు, అడవి పందులకు ముప్పు వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు. ఇది సుమారు 200 చ.కి.మీ విస్తీర్ణంతో దేశంలో రెండో అతి పెద్ద మడ అడవిగా ప్రసిద్ధి చెందింది. బ్రాహ్మణి, బైతరణి నదులు బంగాళాఖాతంలో కలిసిన ప్రాంతంలో ఈ పార్కు ఏర్పాటుచేశారు. తీవ్ర తుఫాను ప్రభావంతో సముద్ర అలలు ఎగిసిపడి పార్కులోకి నీరు చొచ్చుకువచ్చే అవకాశం ఉన్నందున మొసళ్లు, ఇతర జంతువులు, పక్షుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే 200 చ.కి.మీ విస్తరించిన మడ అడవులు తుఫాన్‌ గాలులను కొంత వరకు నిలువరిస్తాయని రిటైర్డు అటవీ అధికారి ఒకరు చెప్పారు.

రైతు తెలివి మామూలుగా లేదుగా..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది రైతులు తమ పంట పొలాలను జంతువుల బారి నుంచి రక్షించుకునేందుకు లక్షలు ఖర్చు చేస్తుంటారు. అయితే కొందరు రైతులు మాత్రం రూపాయి ఖర్చు చేయకుండా అందుబాటులో ఉన్న వస్తువులతోనే వినూత్న ప్రయోగాలు చేస్తుంటారు.

అడవి జంతువుల కారణంగా పంట సాగు చేసే రైతులు కొన్నిసార్లు తీవ్రంగా నష్టపోతుంటారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో ఏ మూల నుంచి ఏ పందులో, ఏనుగులో వచ్చి నాశనం చేస్తుంటాయి. దీంతో వారు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. దీంతో చాలా మంది అడవి జంతువులు తమ పొలాల్లోకి రాకుండా ఉండేందుకు ఏవేవో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటుంటారు. ఈ క్రమంలో అయితే కొందరు రైతులు తెలివితేటలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ రైతు తన పంట పొలాన్ని జంతువుల బారి నుంచి రక్షించుకునేందుకు చేసిన ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది రైతులు (Farmers) తమ పంట పొలాలను జంతువుల బారి నుంచి రక్షించుకునేందుకు లక్షలు ఖర్చు చేస్తుంటారు. అయితే కొందరు రైతులు మాత్రం రూపాయి ఖర్చు చేయకుండా అందుబాటులో ఉన్న వస్తువులతోనే వినూత్న ప్రయోగాలు చేస్తుంటారు. తద్వారా తమ పంటకు రక్షణ కల్పిస్తుంటారు.

తాజాగా, ఓ రైతు చేసిన ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు. అతను తన పంట పొలంలోకి జంతువులు రాకుండా ఉండేందుకు పెద్ద పెద్ద శబ్ధాలు వచ్చేలా చేశాడు. ఇందుకోసం మనుషుల అవసరం లేకుండా.. తన తెలివిని ఉపయోగించి అద్భుతమైన ఏర్పాట్లు చేశాడు. ముందుగా రెండు వైపులా పొడవాటి కర్రలను పాతాడు. దానికి మధ్యలో ఇనుప రేకును ఉంచాడు. అలాగే దానికి పైన ఓ కర్రను కట్టి, అది పైకి కిందకు కదిలేలా చివర్లో ఓ ప్లాస్టిక్ డబ్బాను కట్టి ఉంచాడు. అందులో నీళ్లు పడగానే కర్ర పైకి, కిందకు కదులుతూ రేకును తాకుతుంది.

దీనివల్ల పెద్ద పెద్ద శబ్ధాలు వస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న అడవి జంతువులు భయంతో పారిపోతున్నాయి. ఇలా రూపాయి ఖర్చు చేయకుండా తన తెలివితేటలతో ఈ రైతు చేసిన ఏర్పాట్లు చూసి అంతా షాక్ అవుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘ఈ రైతు ఆలోచన మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఐడియా బాగానే ఉంది కానీ.. ఇలా చేయడం వల్ల నీళ్లన్నీ వృథా అయిపోతాయిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 70 వేలకు పైగా లైక్‌లు, 7.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

మరో 17 రైళ్లు రద్దు

ఒడిశా తీరప్రాంతంలో ‘దానా’ తుఫాన్‌ కారణంగా దక్షిణమధ్య రైల్వే(South Central Railway) పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేసింది. మంగళవారం 41 రైళ్లను రద్దు చేయగా.. తాజాగా మరో 17 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. కొత్తగా రద్దయిన రైళ్లు గురువారం నుంచి ఈనెల 29 వరకు నిలిపివేస్తున్నట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్‌(CPRO Sridhar) తెలిపారు.

ఒడిశా తీరప్రాంతంలో ‘దానా’ తుఫాన్‌ కారణంగా దక్షిణమధ్య రైల్వే(South Central Railway) పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేసింది. మంగళవారం 41 రైళ్లను రద్దు చేయగా.. తాజాగా మరో 17 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. కొత్తగా రద్దయిన రైళ్లు గురువారం నుంచి ఈనెల 29 వరకు నిలిపివేస్తున్నట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్‌(CPRO Sridhar) తెలిపారు.

రద్దయిన రైళ్ల సమాచారం కోసం దక్షిణమధ్యరైల్వే(South Central Railway) పరిధిలోని 17 ముఖ్యమైన స్టేషన్లలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, ఖాజీపేట్‌, ఖమ్మం(Hyderabad, Secunderabad, Khajipet, Khammam), సామర్లకోట, వరంగల్‌, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, అనకాపల్లి, ఏలూరు, గూడూరు, నిడదవోలు, ఒంగోలు, తిరుపతి, రేణిగుంట, డోన్‌ స్టేషన్ల(Guduru, Nidadavolu, Ongolu, Tirupati, Renigunta, Don stations)లోని హెల్ప్‌లైన్‌ సెంటర్లు 24 గంటలపాటు ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తాయని వెల్లడించారు.