ఏఐసీసీ చీఫ్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన లేఖ..
ఏఐసీసీ చీఫ్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన లేఖ రాశారు. కాంగ్రెస్‌లో తనకు జరుగుతున్న అన్యాయం, పరిణామాలను వివరిస్తూ లేఖ రాశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
ముఖ్య అనుచరుడి హత్యతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) తీవ్ర మనోవేదనకు గురైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన అసహానాన్ని వ్యక్తం చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా పార్టీలో కొనసాగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేక తీవ్ర మానసిక వ్యధతో ఏఐసీసీ చీఫ్‌కు (AICC Chief) జీవన్ రెడ్డి లేఖ రాశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ గురించి లేఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ నన్ను అగౌరవంగా, అవమానంగా చూస్తోంది. నా భవిష్యత్తు కార్యాచరణ పార్టీనే మార్గదర్శకం చేయాలి. కేసీఆర్‌లాగే కాంగ్రెస్.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం పట్ల ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు’’ అంటూ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి , పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లకు ఎమ్మెల్సీ లేఖ రాశారు.
కాంగ్రెస్‌లో తనకు జరుగుతున్న అన్యాయం, పరిణామాలను వివరిస్తూ ఎమ్మెల్సీ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంజయ్ అనుచరుడిగా భావించే సంతోష్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని హత్య చేశాడని వెల్లడించారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు భిన్నంగా పార్టీ నడుస్తోందని తెలిపారు. పార్టీ ఫిరాయించిన వారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వబడుతుందనే అభిప్రాయాన్ని కల్గించే విధంగా పార్టీ వ్యవహారం ఉన్నట్లు పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పోచారం ఇంట్లో సమావేశం నిర్వహించడాన్ని ఎమ్మెల్సీ తీవ్రంగా తప్పుబట్టారు. పదేండ్లు అనేక దౌర్జన్యాలను ఎదుర్కున్నామని.. కాంగ్రెస్ ముసుగు కప్పుకొని మళ్ళీ దౌర్జన్యాలు చేస్తామంటే ఎలా భరించాలని అడిగారు. పార్టీని కన్నతల్లి అనుకున్నానని.. పార్టీ తనకు అనేక అవకాశాలు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌పై పోటీ చేయమంటే చేశానన్నారు.
నన్ను ప్రతిపక్షాలు ఏకాకిని చేసి హేళన చేసినా తట్టుకొని నిలబడ్డాను. పార్టీ అధిష్ఠానం నా గౌరవాన్ని కాపాడతానని నోటిమాటగా చెప్పింది. పార్టీ ఫిరాయింపులకు ముఠా నాయకుడు ఉన్నాడు. పార్టీ ఫిరాయింపులకు ముఠా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి. పది మంది ఎమ్మెల్యేలు లేకపోతే ప్రభుత్వం కొనసాగాదా.. రాహుల్ ఏం చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం. మా పార్టీ నాయకుడు గంగారెడ్డిని చంపిన వ్యక్తి బీఆర్ఎస్ తరపున ఎన్నికల్లో డబ్బులు పంచారు. గంగారెడ్డిని చంపిన సంతోష్‌పై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. గంగారెడ్డిని మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నేను ప్రపోజ్ చేశారు. ఎవరి అండదండలు చూసుకొని సంతోష్ మా నాయకుడిని చంపాడు’’ అంటూ ఆయన ప్రశ్నలు కురిపించారు.
అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై కూడా జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ పుట్టిందే మా ఇంట్లో అంటున్నాడు. మీ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ పుడితే పరాయి ఇంటికి ఎందుకు వెళ్ళాడు. సంజయ్ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేశాడా.. నేను రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. సంజయ్ చొక్కారావు మనవడిని అని చెప్పుకుంటున్నారు. ఇందిరా గాంధీ కష్టకాలంలో ఉన్నప్పుడు చొక్కారావు జనతా పార్టీలో చేరాడు. సంజయ్ టీఆర్ఎస్‌లో ఎన్నడూ లేడు. అక్కడి ఉద్యమ నాయకుల మధ్య సమన్వయ లోపం వల్ల సంజయ్ తెరపైకి వచ్చాడు. అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీలో చేరతామంటే ప్రజాస్వామ్యం ఉంటుందా. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్ పరిస్థితి ఏమయింది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు
అలాగే పోచారం శ్రీనివాస్‌రెడ్డిపైనా ఎమ్మెల్సీ విరుచుకుపడ్డారు. భట్టికి ప్రతిపక్ష నేత హోదా పోవడానికి కారణం పోచారమన్నారు. ‘‘పోచారం లాంటి వాడిని పార్టీలో చేర్చుకోవడం ఏంటి? పోచారం సలహాదారుడు ఏంటి. పార్టీ ఫిరాయింపుల క్రమబద్ధీకరణ విషయంలో పోచారం సలహాలు ఇవ్వగలడు’’ అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
నేను నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. పార్టీని వదిలి వెళ్ళాలనే ఆలోచన చేయలేకపోతున్న. అవమానాలు భరించుకుంటూ ఉండాలా? రేవంత్ మా నాయకుడు. ఆయన్ని తప్పకుండా కలుస్తాను. కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన మా వ్యక్తిగతం అని పీసీసీ చీఫ్ భావిస్తే నేనేం చేయగలను. పార్టీ పట్ల గౌరవం లేకనే నేను ఇక్కడి దాకా వచ్చానా.. ఇప్పటికీ నాకు పార్టీపై గౌరవం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ నాయకత్వంలో ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తోంది. నేను రాజకీయం చేయడం లేదు. సంజయ్ భుజాలు తడుముకుంటున్నాడు. మా పార్టీ నాయకుడిని చంపిన నిందితుడు సంజయ్ అనుచరుడు కాదని చెప్పగలరా.. సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకి క్లారిటీ లేదా.. దానం నాగేందర్‌కు ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని సమర్ధించడం లేదు. నేను ఎప్పుడూ పార్టీ ఫిరాయించలేదు. నాకు నేనుగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. పదేండ్లలో నేను పార్టీని నిలబెట్టాను. రాహుల్ ప్రధాని కావాల్సిందే. నామినేటెడ్ పదవులు మాకు ఇవ్వాలి. పార్టీలో మాదే ఆధిపత్యం ఉండాలి అంటే ఎలా. పార్టీ ఫిరాయించి ముసుగేసుకొని దౌర్జన్యం చేయడం బ్లాక్ మెయిల్ కాదా. నా మానసిక పరిస్థితి అర్థం చేసుకోండి. పార్టీ ఫిరాయింపులు జరిగాయో లేదో క్లారిటీ లేకుండా పోతుంది. నేను పార్టీకి అంతర్గతంగా లేఖ రాశాను. ఆవేదన భరించలేక బయటకి చెప్పుకుంటున్నా’’ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
Oct 24 2024, 15:17