నవంబర్‌ నుంచివిద్యుత్తు చార్జీలు పెంచేందుకు కసరత్తు.

రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల ధరలు నవంబర్‌ నుంచి పెరగనున్నాయి. దాదాపు రూ. 1200 కోట్ల మేర ప్రజలపై భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హెచ్‌టీ క్యాటగిరీలో విద్యుత్తు చార్జీల పెంపు, ఎల్‌టీ క్యాటగిరీలో నెలకు 300 యూనిట్లకు పైగా వాడే వారికి ఫిక్స్‌డ్‌ చార్జీలను పెంచేందుకు అనుమతించాలని ఈఆర్సీ ముందు డిస్కంలు ప్రతిపాదించాయి.

రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల ధరలు నవంబర్‌ నుంచి పెరగనున్నాయి. దాదాపు రూ. 1200 కోట్ల మేర ప్రజలపై భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హెచ్‌టీ క్యాటగిరీలో విద్యుత్తు చార్జీల పెంపు, ఎల్‌టీ క్యాటగిరీలో నెలకు 300 యూనిట్లకు పైగా వాడే వారికి ఫిక్స్‌డ్‌ చార్జీలను పెంచేందుకు అనుమతించాలని ఈఆర్సీ ముందు డిస్కంలు ప్రతిపాదించాయి. ఎల్‌టీ క్యాటగిరీలో ప్రతి కిలోవాట్‌కు రూ. 10 ఫిక్స్‌డ్‌ చార్జీలుగా వసూలు చేస్తుండగా, ఇప్పుది కిలోవాట్‌కు 30 రూపాయలు పెరగనుంది. ఇలాంటి వినియోగదారులు 26 లక్షల మంది ఉన్నారు. ఈ పెంపుతో రూ. 400 కోట్లను డిస్కంలు రాబట్టుకోనున్నాయి. హెచ్‌టీలో 11కేవీ, 33కేవీ, 132 కేవీ కెపాసిటీ కనెక్షన్లకు వేర్వేరు చార్జీలుండేవి. 33 కేవీకి యూనిట్‌కు రూ. 7.15, 11 కేవీకి యూనిట్‌కు రూ. 7.65, 132 కేవీ ఆపైన యూనిట్‌కు రూ. 6.62 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇకపై అన్ని క్యాటగిరీల వారికి యూనిట్‌కు రూ. 7.65 చొప్పున వసూలు చేసేందుకు అనుమతించాలని డిస్కంలు కోరాయి. దీంతో ఆయా వినియోగదారులపై రూ. 800 కోట్ల భారం పడనుంది. ఈఆర్సీ చైర్మన్‌, సభ్యుల కాలపరిమితి ఈ నెల 29తో ముగియనుంది. ఈనేపథ్యంలో డిస్కం ప్రతిపాదనలకు ఈఆర్సీ అనుమతినివ్వడం లాంఛనంగానే కనిపిస్తున్నది. ఇదే జరిగితే నవంబర్‌ ఒకటి నుంచి పెంచిన చార్జీలు అమల్లోకి వస్తాయి.

విద్యుత్తు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) బహిరంగ విచారణలు చేపట్టింది. సోమవారం జెన్‌కో ఫిక్స్‌డ్‌ ఛార్జీలు, ట్రూప్‌ అప్‌ చార్జీలపై టీజీఈఆర్సీ బహిరంగ విచారణ జరిపింది. ఇంధన సర్దుబాటు చార్జీల కింద రూ. 963.18 కోట్లకు అనుమతించాలని జెన్‌కో కోరింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ట్రూ అప్‌ చార్జీలు, 2024-25 నుంచి 2028-29 కాలానికి (ఐదో నియంత్రణ కాలానికి) మల్టీ ఇయర్‌ టారిఫ్‌పై విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) సోమవారం బహిరంగ విచారణ జరిపింది. టీజీజెన్‌కో సమర్పించిన పిటిషన్‌పై తొలుత జెన్‌కో అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేయగా, ఆ తర్వాత పలు ఎఫ్‌టీసీసీఐ, తెలంగాణ స్పిన్నింగ్‌ మిల్స్‌ అసోసియేషన్‌, స్టీల్‌ రంగ నిపుణులు తమతమ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ట్రాన్స్‌కో దాఖలు చేసిన రూ. 16, 346 కోట్ల ఏఆర్‌ఆర్‌ పిటిషన్‌పై ఈఆర్సీ మంగళవారం విచారణ జరపనుంది. 23న టీజీఎస్పీడీసీఎల్‌ పిటిషన్‌పై హైదరాబాద్‌లో, 24న టీజీఎన్పీడీసీఎల్‌ పిటిషన్‌పై నిజామాబాద్‌లో, 25న సెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సిరిసిల్లలో ఈఆర్సీ బహిరంగ విచారణలు జరపనుంది.

కొత్త విద్యుత్తు ప్లాంట్లు 65 శాతమే పనిచేస్తే ఎలా అని ఎనర్జీ కన్సల్టెంట్‌ రణదీప్‌ ప్రశ్నించారు. ఇవి 85 శాతం పనిచేయాల్సి ఉండగా, కొన్ని 65 శాతమే పనిచేస్తున్నాయని, దీంతో నష్టాలొస్తున్నాయని పేర్కొన్నారు. తక్షణ విద్యుత్తు అవసరాలు తీర్చేందుకు బయట అధిక ధరలకు విద్యుత్తును కొనుగోలు చేయడం, స్వల్పకాలిక ఒప్పందాలు చేసుకోవాల్సి వస్తున్నదని తెలిపారు. పరిశ్రమలే డిస్కంలకు వెన్నెముకలాంటివని, కానీ డిస్కంల చర్యలు పరిశ్రమలను నిరుత్సాహపరిచేలా ఉన్నాయని విమర్శించారు. పిటిషన్ల దాఖలు తర్వాత అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు తక్కువ సమయం ఇస్తున్నారని, ఇది సరికాదని పేర్కొన్నారు. అధ్యయనం చేసి, అభ్యంతరాలు వ్యక్తం చేసేంత సమయం తమకు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

ట్రూ అప్‌ చార్జీల పెంపునకు విద్యుత్తు సంస్థలు పేర్కొన్న కారణాలు సహేతుకం కాదని సెంటర్‌ ఫర్‌ పవర్‌ స్టడీస్‌ ప్రతినిధి వేణుగోపాలరావు అభ్యంతరం వ్యక్తంచేశారు. విద్యుత్తు ప్లాంట్ల పీఎల్‌ఎఫ్‌ సామర్థ్యం పెరిగితే ఇన్సెంటివ్‌లు ఇస్తున్నట్టేనని, పీఎల్‌ఎఫ్‌ పడిపోతే జరిమానాలు ఎందుకు విధించడం లేదని ప్రశ్నించారు. విద్యుత్తు ప్లాంట్లల్లో సామర్థ్యానికంటే తక్కువగా విద్యుత్తును ఉత్పత్తి చేసి, ఓపెన్‌ మార్కెట్‌లో విద్యుత్తును కొనడంతో ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. తాము 25 ఏండ్లుగా సూచనలిస్తున్నా, వాటిని పరిగణిలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

వైఎస్‌ జగన్‌ రేపు గుంటూరు, కడప జిల్లాలో పర్యటన

శాంతిభద్రతలు క్షీణించడంతో ఆకతాయిల చేతుల్లో మోసపోయిన కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సిద్ధమయ్యారు. ఆయన షెడ్యూల్‌ ఇలా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని.. మహిళలకు రక్షణ కరువైందని చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రంగంలోకి దిగనున్నారు.

స్వయంగా బాధితులను కలిసి వారికి జీవితంపై భరోసా కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వైఎస్‌ జగన్‌ బుధవారం రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.

ఈ మేరకు జగన్‌ పర్యటన షెడ్యూల్‌ విడుదలైంది. అత్యాచార, హత్య సంఘటనలు జరిగిన గుంటూరు, కడప జిల్లాలో పర్యటన చేపట్టనున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి.

ఇంజనీరింగ్‌ కాలేజీలు సొంతంగా సీట్లు భర్తీ చేసుకోవచ్చు!

ఇంజనీరింగ్‌ కళాశాలలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఏఐసీటీఈ అనుమతించిన మేరకు కొత్త కోర్సులు, పెంచిన సీట్లు భర్తీ చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది.

ఇంజనీరింగ్‌ కళాశాలలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఏఐసీటీఈ అనుమతించిన మేరకు కొత్త కోర్సులు, పెంచిన సీట్లు భర్తీ చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో పెంచిన సీట్లకు, కోర్సులకు మాప్‌అప్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సెప్టెంబర్‌ 9న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.

వాటి ప్రకారం కౌన్సెలింగ్‌ నిర్వహించనందుకు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఉత్తర్వులను అమలు చేసే ఉద్దేశం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. ‘‘కోర్టు ధిక్కరణ చర్యల కింద శిక్ష విధిస్తే దానిపై సుప్రీంకు వెళ్లడం ద్వారా కాలయాపన చేద్దామని అనుకుంటున్నారు. టెక్నికల్‌ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియకు అక్టోబర్‌ 23వ తేదీ దాటిపోతే గడువు తీరిపోతుంది కాబట్టి చేతులెత్తేద్దామనుకుంటున్నారు’’ అని పేర్కొంది.

కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు దాఖలు చేసిన కాలేజీలకు సీట్లు భర్తీ చేసుకునేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఈ తీర్పును సుప్రీంలో సవాల్‌ చేయాలని సర్కారు నిర్ణయించింది. సీట్ల పెంపుకు ఏఐసీటీఈ అనుమతినిచ్చినా, జేఎన్టీయూ అనుమతిలేనిదే కోర్సులకు గుర్తింపు ఉండదు. ఇప్పటికే కౌన్సెలింగ్‌ పూర్తయిన వాటిలో మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

మళ్లీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే గతంలో వేరే కోర్సుల్లో చేరిన వారు, దూరం కాలేజీలో చేరినవారు మళ్లీ హాజరయ్యేందుకు ప్రయత్నిస్తారు. కాలేజీలు భర్తీ చేసుకున్నా ప్రభుత్వ అనుమతి లేనందున విద్యార్థులకు సర్టిఫికేట్స్‌ వచ్చే అవకాశం లేదు. ఇంకోవైపు, సింగిల్‌ జడ్జి బెంచ్‌ నుంచి వెలువడే పూర్తిస్థాయి ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని డివిజన్‌ పేర్కొంది. ఒకవేళ ఆ తీర్పుకు దీనికి వ్యతిరేకంగా వస్తే విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోతారు.

నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి సంచారం

నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో గతంలో అంటే.. 2018లో 68 పులులు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం.. వాటి సంఖ్య 90 నుంచి 95కు పెరిగింది. 2025 నాటికి ఈ పులుల సంఖ్య 100 దాటుతుందని అధికారులు అటవీశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి సంచరిస్తుంది. నాగార్జున సాగర్ డ్యామ్ ‌సమీపంలోని నాగులేటి రేంజ్ వద్ద ఈ పులి సంచరిస్తుంది. దీనిని అటవీ శాఖ సిబ్బంది వీడియోలో చిత్రీకరించింది. ఈ పులికి ఐదేళ్లు ఉంటాయని వారు తెలిపారు. గత వారం అటవీ శాఖ సిబ్బంది ఎప్పటిలాగా గస్తీ నిర్వహిస్తుంది. ఆ సమయంలో రహదారి పక్కనే ఉన్న పోదల్లో నుంచి పులి బయటకు వచ్చింది. కాసేపు పులి అక్కడే ఉండి.. అనంతరం మళ్లీ చెట్ల పోదల్లోకి వెళ్లిపోయింది.

శివాలయం, వీఆర్ఎస్‌పీ ఆనకట్ట సమీపంలోని నాగులుటి రేంజ్ వరకు శాశ్వత నీటి వనరులు ఉన్నాయి. ఆయా ప్రాంతంలో జింకలు, మొసళ్లతో సహా వన్యప్రాణులు సమృద్ధిగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణుల అధికారి ఈ సందర్భంగా ధృవీకరించారు. ఇది పులులకు ఆవాసమైన ప్రాంతమని తెలిపారు. ఈ ప్రాంతం మూడు పులులకు నిలయంగా మారింది. అందులో చిన్న మగ, రెండు ఆడ పులులున్నాయని అటవీ శాఖ అధికారి వివరించారు.

ఇటీవలి సంతానోత్పత్తి కాలం అనంతరం ఈ ప్రాంతంలో ఆడ పులులు త్వరలో జన్మనిస్తాయని అధికారి పేర్కొన్నారు. మగ పులి సుమారు నెలన్నర పాటు ఆడ పులితో గడుపుతున్న దృశ్యాన్ని అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లో బంధించారు. అయితే నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో గతంలో అంటే.. 2018లో 68 పులులు ఉన్నాయి. కానీ తాజా లెక్కల ప్రకారం.. వాటి సంఖ్య 90 నుంచి 95కు పెరిగింది. 2025 నాటికి ఈ పులుల సంఖ్య 100 దాటుతుందని అధికారులు ఈ సందర్బంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇక బెంగాల్ టైగర్లు తమ భూభాగాన్ని గుర్తిస్తాయి. ఇవి సరిహద్దులను ఏర్పాటు చేయడానికి, ఆహారం, నీరు వనరులతోపాటు సహచరులను ఆకర్షించడానికి వీలు కల్పిస్తుంటాయి. 2-ఎసిటైల్-1-పైరోలిన్ (బాసుమతి బియ్యానికి ఉండే విలక్షణమైన సువాసనను అందించే సమ్మేళనం) అనే అణువు ఉండే మూత్రాన్ని స్ప్రే చేయడం ద్వారా పులులు తమ ఉనికిని మరియు ఆధిపత్యాన్ని ఆ ప్రాంతంలోని ఇతర పులులకు తెలియజేస్తాయి.

సువాసన గుర్తుతో పాటు, పులులు తమ ప్రాదేశిక వాదాలను మరింత నొక్కి చెప్పడానికి చెట్లకు పంజా వేసి ఈ పులులు గర్జిస్తాయి. అనేక ముఖ్యమైన కారణాల వల్ల పులులు తమ భూభాగాన్ని గుర్తించుకుంటాయి. అడవిలో జీవించడంతోపాటు వృద్ధి చెందడానికి వాటికి ఇవి సహాయపడతాయి.

సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

జనాభా నియంత్రణపై ఆందోళన వ్యక్తం చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసిక్తకర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ 16 మంది పిల్లలను కనాలనే ఆలోచనతో ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించారు.

తిరువాన్మియూర్లోని మరుంధీశ్వరార్ ఆలయం కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన 31 జంటల కల్యాణోత్సవానికి సీఎం స్టాలిన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ విధానాలు పకడ్బందీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గిపోయి, నిధుల కేటాయింపులో కోత పడొచ్చన్న విశ్లేషణల నేపథ్యంలో స్టాలిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

'కొత్తగా పెళ్లయిన జంటలకు 16 రకాల ఆస్తులను పొందాలని పూర్వం పెద్దలు ఆశీర్వాదించేవారు. ఇప్పుడు ఆస్తికి బదులుగా 16 మంది పిల్లలను కనాలని, వారు ఆనందంగా జీవించాలని దీవించండి. జనాభా నియంత్రణ కారణంగా పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతోంది. పరిస్థితులు తగ్గట్టుగా మారాలి. ప్రతి ఒక్కరూ 16 మంది పిల్లలను కనాలనే ఆలోచనతో ఎందుకు ఉండకూడదు?' అని స్టాలిన్ ప్రశ్నించారు.

మరోవైపు కుటుంబ నియంత్రణలో విజయం సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పేర్కొంది. లోక్సభలో సీట్ల కేటాయింపు కోసం జనాభా లెక్కలను ఉపయోగించాలా అని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ప్రశ్నించారు. 'కుటుంబ నియంత్రణను అమలు చేయడంలో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. 1988లో కేరళ, 1993లో తమిళనాడు, 2001లో ఆంధ్రప్రదేశ్, 2005లో కర్ణాటక- జనాభా పెరుగుదల నియంత్రణలో మొదటి స్థానంలో నిలిచాయి.

అయితే ఈ విజయాలు పార్లమెంట్లో ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందని గత కొంత కాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2001లో వాజ్‌పేయీ ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్‌సభ సభ్యుల సంఖ్యను 2026 వరకు మార్పు చేయకూడదని నిర్దేశించింది. అంటే 2031 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణ ఉంటుంది. ఇంతవరకు 2021 జనాభా లెక్కలను నిర్వహించలేదు. త్వరలో ప్రారంభిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఒకవేళ లెక్కిస్తే వాటిని లోక్సభ సీట్ల కోసం ఉపయోగిస్తారా లేదో చూడాలి' అని జైరాం రమేశ్ అన్నారు.

బాలకృష్ణ కోసం మోదీకి చంద్రబాబు కీలక సిఫార్సు..!!

ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. నందమూరి, మెగా హీరోల కేంద్రంగా ఏపీలో రాజకీయ నిర్ణయాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయంగా ఈ రెండు కుటుంబాలకు ప్రాధాన్యత పెరిగింది. తాజాగా సీఎం చంద్రబాబు నందమూరి హీరో బాలకృష్ణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి కీలక సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆమోదం లభిస్తే ఇక బాలయ్య అభిమానుల ఆనందం అన్ స్టాపబుల్ గా మారనుంది.

కేంద్రం ప్రతీ ఏటా జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తుంది. ఇందు కోసం అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పలు కేటగిరీల్లో విశిష్ట వ్యక్తుల పేర్లను సిఫార్సు చేయటం ఆనవాయితీ. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తాజాగా నందమూరి బాలకృష్ణ పేరును పద్మవిభూషణ్ అవార్డుకు సిఫార్సు చేసినట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. బాలకృష్ణ సినీ రంగంలో తన 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. దీంతో.. సినీ రంగంతో పాటుగా సేవా రంగంలోనూ బాలకృష్ణ కు ప్రత్యేకత ఉంది.

బాలకృష్ణ సినిమాలతో పాటుగా బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. ఎంతో మంది పేదలకు క్యాన్సర్ వైద్యం అందిస్తున్నారు. దీంతో..బాలకృష్ణ పద్మభూషణ్ కు అర్హుడిగా పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ తో పాటుగా మరో సినీ ప్రముఖుడు మురళీ మోహన్ పేరును జత చేసినట్లు సమాచారం. అదే విధంగా వైద్యం, విద్య, సామాజిక రంగాల నుంచి మరి కొందరి పేర్లను ప్రభుత్వం సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ అవార్డు ప్రధానం చేసింది.

ప్రస్తుతం బాలయ్య సినీ, సేవా రంగాలతో పాటుగా ఓటీటీ లోనూ దూసుకుపోతున్నారు. ఎన్‌బీకే అన్ స్టాపబుల్ వరుస సీజన్లతో హంగామా చేస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుతో ఇందు కోసం షూటింగ్ పూర్తి చేసారు. సహా చిరంజీవి - పవన్ కల్యాణ్ కాంబోలో ఇదే షో లో ఒక ఎపిసోడ్ బాలయ్య ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, కేంద్రంలోనూ టీడీపీ ప్రధాన భాగస్వామిగా ఉంది. అటు కేంద్రం..ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటంతో .. ఏపీ ప్రభుత్వం సిఫార్సులకు ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పుడు బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు కోసం సిఫార్సు చేయటంతో కేంద్రం నిర్ణయం కీలకం కానుంది.

ఏపీ డిప్యూటీ సీఎంకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీచేసింది. తిరుమల లడ్డూపై పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నోటీసులు జారీచేసింది. వచ్చేనెల 22వ తేదీన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది.

తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే కల్తీ నెయ్యి అంశం ఇంకా కాకరేపుతూనే ఉంది. పంది కొవ్వు ఉపయోగించారని తెలిసి శ్రీవారి భక్తులు ఆందోళనకు గురయ్యారు. తిరుపతి లడ్డూపై రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. గత పాలక మండలి కల్తీ నెయ్యి ఉపయోగించిందని ఆరోపించారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో చాలా మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇదే అంశంపై హైదరాబాద్‌కు చెందిన అడ్వకేట్ ఇమ్మనేని రామారావు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

భక్తులకే కాదు.. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కూడా తిరుపతి లడ్డూ పంపించారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ చేసిన కామెంట్లతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. తిరుమల లడ్డూ తయారీ కోసం జంతువులు కొవ్వు కలిపారని అనడం దారుణం. ఆ ఆరోపణలకు సంబంధించి ఫొటోలు, వీడియోలను కోర్టు ముందు ఉంచాం. లడ్డూ గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసిన యూట్యూబ్ చానెళ్ల నుంచి ఆ కామెంట్లను తొలగించాలి అని’ పిటిషనర్ సిటీ సివిల్ కోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

తిరుమల లడ్డూకు సంబంధించి ఇమ్మనేని రామారావు వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి వై రేణుకతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. వచ్చే నెల 22వ తేదీన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు జారీచేసింది. ఈ అంశంపై పవన్ కల్యాణ్ స్పందించాల్సి ఉంది. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాలతో రాజకీయ దుమారం నెలకొంది. ఆ అంశంపై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేయడంతో.. న్యాయస్థానం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సమన్లు జారీ చేసింది.

గుర్లలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన - మృతుల కుటుంబాలకు వ్యక్తిగత పరిహారం

విజయనగరం జిల్లాలో గుర్లలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ పర్యటించారు. నెల్లిమర్ల మండలం ఎస్.ఎస్.ఆర్.పేట వద్ద గుర్ల తాగునీటి పథకాన్ని పరిశీలించారు. అనంతరం గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయేరియా బాధితులను పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు.

గుర్లలో గ్రామస్థులతో డిప్యూటీ సీఎం పవన్‌ ముఖాముఖి నిర్వహించారు.మృతుల కుటుంబాలకు వ్యక్తిగత పరిహారం: గ్రామస్థులు 3 ప్రధాన సమస్యలను పవన్‌ దృష్టికి తీసుకెళ్లారు. మంచినీటి ట్యాంకులు ఎక్కువ రోజులు శుభ్రపరచడంలేదని, ఒకే ఒక్క ట్యాంకు వల్ల తాగునీటి సమస్య తలెత్తుతోందని గ్రామస్థులు ఆరోపించారు.

సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు వినతి పత్రాలు అందజేశారు. అదే విధంగా విజయనగరం జిల్లా కలెక్టరేట్‌లో సమీక్షను నిర్వహించారు. అతిసారం వ్యాప్తి, కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తన తరఫున మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.

విచారణకు సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్ విజయానంద్‌: ఘటనపై నివేదిక వచ్చాక ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని పవన్‌ భరోసానిచ్చారు.

గత ప్రభుత్వ తప్పిదాలు వారసత్వంగా వచ్చాయని, గుర్లకు వెళ్లే చంపావతి నీరే కలుషితమైందని అన్నారు. గత ప్రభుత్వం కనీసం మంచినీరు అందించలేకపోయిందన్న పవన్, విచారణకు సీనియర్‌ ఐఏఎస్‌ విజయానంద్‌ను నియమించారు. విచారణ తర్వాత ప్రభుత్వం నుంచి పరిహారం ప్రకటిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.

విమానాలకు బాంబు బెదిరింపులు.. రామ్మోహన్ నాయుడు సీరియస్

దేశీయ, అంతర్జాతీయ విమానాలకు గత కొన్ని రోజులుగా బాంబు బెదిరింపులు వస్తుండటం తీవ్ర ఆందోళనకరంగా మారిన వేళ.. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. విమానాలకు బెదిరింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతోంది. అవసరమైన చట్టాలు మార్చేందుకు సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇక వారం రోజుల్లో దాదాపు 100 విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు వెల్లడించారు.

గత కొన్ని రోజులుగా నిత్యం పదుల సంఖ్యలో విమానాలకు బాంబు హెచ్చరికలు వస్తుండటం అటు ప్రయాణికులు, ఎయిర్‌లైన్ సంస్థలతోపాటు ఇటు ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. అసలు ఈ బెదిరింపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. అవి ఎవరు చేస్తున్నారు.. అందులో ఎంతవరకు నిజం ఉంది అని కనుక్కోవడం ప్రస్తుతం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఇప్పటివరకు వచ్చిన బెదిరింపులు అన్నీ నకిలీవి అని గుర్తించినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇక ఇలాంటి బాంబు బెదిరింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా విమానాలకు బెదిరింపులపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు సీరియస్‌ అయ్యారు.

విమాన ప్రయాణికులకు భద్రత కల్పించడమే తమ ప్రభుత్యానికి మొదటి ప్రాధాన్యత అని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఇక విమానాలకు బెదిరింపులు చేసేవారిని నో ఫ్లై లిస్ట్‌లో చేర్చేలా ఇప్పటివరకు ఉన్న విమానయాన చట్టాలను సవరిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు వచ్చిన విమాన బెదిరింపులు అన్నీ ఫేక్ అని తేలిందని చెప్పారు. పౌర విమానయాన శాఖకు కఠినమైన ప్రొటోకాల్‌ ఉందని.. దాన్నే అనుసరిస్తున్నట్లు పేర్కొ్న్నారు. అయితే విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చినపుడు పరిస్థితి చాలా సున్నితంగా ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ విధివిధానాలను కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంటుందని వెల్లడించారు.

అక్టోబర్‌ 14వ తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు 100 విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ బెదిరింపులపై సంబంధిత వర్గాలతో సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. విమానయాన భద్రతా నిబంధనలను సవరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. 1982 సేఫ్టీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ చట్టం సవరణకు వివిధ శాఖలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. విమానాలకు బెదిరింపులు రావడంతో వాటిని దారి మళ్లించినట్లు తెలిపారు. ప్రతి బెదిరింపును క్షుణ్ణంగా విశ్లేషించి వేగంగా, అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

అయితే ఇవి తప్పుడు బెదిరింపు కాల్స్‌ అయినా.. ప్రయాణికుల భద్రత, సురక్షిత విషయంలో రాజీ పడటం లేదని.. ప్రయాణికుల ప్రాణాలే తమకు ముఖ్యమని తేల్చి చెప్పారు. కేంద్ర హోంశాఖ, ఇతర ఏజెన్సీలతో కలిసి ఈ విమానాలకు బెదిరింపు కాల్స్‌పై దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శనివారం రోజున 30కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు రాగా.. ఆదివారం మరో 24 విమానాలకు అలాంటి బెదిరింపులు వచ్చాయి.

ఇక ఎయిరిండియా, ఇండిగో, విస్తారా, ఆకాశ ఎయిర్‌ సహా దాదాపు అన్ని విమానయాన సంస్థలకు చెందిన విమానాలతోపాటు పలు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌ కూడా ఈ బెదిరింపులు వచ్చిన విమానాల జాబితాలో ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇండిగో, విస్తారా, ఎయిరిండియాకు చెందిన ఆరు చొప్పున విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ బాంబు హెచ్చరికల గురించి అధికారులకు తెలిపామని.. వారి ఆదేశాల మేరకు భద్రతా విధానాలను పాటిస్తున్నామని ఎయిర్‌లైన్స్ సిబ్బంది తెలిపారు. ఈ వారంలో 90కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు రాగా.. అవన్నీ ఫేక్‌ అని అధికారులు గుర్తించారు.

తిరుమలలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

తిరుపతిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చెలరేగిన దుమారం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది. అలాంటి వేళ తెలంగాణలోని జెడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెంకన్న దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలు అనుమతించక పోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల వ్యవహారశైలిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

తిరుపతిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చెలరేగిన దుమారం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది. అలాంటి వేళ తెలంగాణలోని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెంకన్నదర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలు అనుమతించక పోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల వ్యవహారశైలిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఏడుకొండలవాడిని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దర్శించుకున్నారు.

అనంతరం తిరుమాడ వీధుల్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ...తిరుమలలో స్వామి వారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల జారీ చేసే సిఫార్స్ లేఖలు అనుమతించకపోవడం బాధాకరమన్నారు. డయిల్ యువర్ ఈవో కార్యక్రమంలో సైతం టీటీడీ ఈవో సైతం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్స్ లేఖను అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గుర్తు చేశారు.

అయితే తమ తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు యాదాద్రి, భద్రాచలంలో దేవుడు దర్శనానికి వచ్చే ఆంధ్ర ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలను తమ ప్రభుత్వం అనుమతి ఇస్తుందని తెలిపారు. కానీ తమ తెలంగాణ విషయంలో ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని టీటీడీ అధికారులను ఈ సందర్బంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. తమ సొంత మనుషులు, పార్టీ కార్యకర్తలు తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్తాం.. రూమ్ ఇప్పించండి అంటే.. ఇప్పించలేని దుస్థితి నేడు నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్లు హైదరాబాద్‌లో ఆశ్రయం పొందుతారని పేర్కొన్నారు. అలాగే టీడీపీ ప్రభుత్వం కొలువు తీరితే.. వైసీపీ వాళ్లు హైదరాబాద్‌ వచ్చి ఉంటారన్నారు. ఏపీ వాళ్లు హైదరాబాద్‌లో బిజినెస్ చేసుకున్నా.. తెలంగాణ వాళ్లు ఏనాడు ఒక్క మాట కూడా వాళ్లని అనలేదన్నారు.

తెలంగాణ ఎమ్మెల్యే అంతా ఏపీ వాళ్లను తమ రాష్ట్రానికి రావొద్దని ఓ తీర్మానం చేసుకుంటే.. ఆ బాధేమిటో మీకు తెలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలు టీటీడీ అనుమతించక పోతే.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాము తీసుకునే నిర్ణయంతో బాధ పడాల్సి వస్తుందని ఈ సందర్భంగా తిరుమలలో ఎమ్మెల్యే అనిరుధ్ హెచ్చరించారు. ఇరు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ములన్నారు. అలాగే ఉందాం. కేవలం వ్యాపారం కోసం హైదరాబాద్‌కు రాకండీ.. నిజమైన అన్నదమ్ముల వలే ఉందమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన సూచించారు.