రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తిన కొడంగల్

రైతు భరోసా ఎగ్గొట్టేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. రైతు భరోసాపై కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట మార్చడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెట్‌ కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఆదివారం ఆందోళనకు దిగాయి.

రైతు భరోసా ఎగ్గొట్టేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి.

రైతు భరోసాపై కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట మార్చడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెట్‌ కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఆదివారం ఆందోళనకు దిగాయి. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించాయి. సీఎం రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌ పరిధిలోని దౌల్తాబాద్‌ మండలం కేంద్రంలోనూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.

దౌల్తాబాద్‌ మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో రైతులతో కలిసి బీఆర్‌ఎస్‌ నాయకులు నిరసనలు చేపట్టారు. రేవంత్‌ రెడ్డి డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

డిసెంబర్ లోగా రుణ మాఫీ పూర్తి.. గిదైనా ఫైనలా సారూ..!

తెలంగాణలో గతంలో రైతు బంధు ఉండేది. ఈ పథకంలో భాగంగా ఎకరాకు సంవత్సరానికి రూ.10 వేలు అందించేవారు. అయితే ఎన్ని ఎకరాలు ఉన్నా సంబంధం లేకుండా

డబ్బులు ఇచ్చే వారు. ఇలా కోటిశ్వరులకు కూడా రైతు బంధు ఇచ్చారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దాన్ని రైతు భరోసాగా మార్చి ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించింది. అయితే అందరికి కాకుండా అర్హులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా రైతుల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది.

అయితే వాన కాలం సీజన్ ముగుస్తున్నా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పందించారు.

రాష్ట్ర మంత్రివర్గ సబ్కమిటీ రిపోర్ట్ఇచ్చాకే రైతు భరోసా అమలు చేస్తామన్నారు. అయితే కమిటీ రిపోర్ట్ ఇప్పుడు ఇస్తారో చెప్పలేదు. సీజన్ కు ఎకరాకు రూ.7500 ఇస్తామన్నారు. మరోవైపు రైతు రుణ మాఫీ కాకుండా చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రుణ మాఫీ అవుతుందో కాదో అని ఆందోళనలో ఉన్నారు.

దీనిపై కూడా తుమ్మల మాట్లాడారు. రూ.2 లక్షల వరకు రుణాలు ఉండి, నిర్ధారణ కాని రైతు కుటుంబాలను గుర్తించి వారికి డిసెంబర్ లోగా రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. రూ.2 లక్షలకుపైగా రుణాలున్న వారి కోసం త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. అయితే ఇదే మంత్రి దీపావళిలోకా రుణ మాఫీ పూర్తి చేస్తామని చెప్పారు. తాజాగా డిసెంబర్ లోగా చేస్తామని చెబుతున్నారు. దీంతో రైతులు అయోమయంలో పడ్డారు. ఏది ఏమైనా రుణ మాఫీ చేసి తీరుతామని మాత్రం చెబుతున్నారు.

42 బ్యాంకుల నుంచి వచ్చిన సమాచారం మేరకు 25 లక్షల కుటుంబాల్లోని 42 లక్షల మంది లబ్ధిదారులకు రుణమాఫీకి అవసరమైన నిధులు రూ.31 వేల కోట్లని మంత్రి చెప్పారు. ఆగస్టు 15 నాటికి రూ.18 వేల కోట్లు మాఫీ చేశామని తెలిపారు. ఇంకా 20 లక్షల మందికి రుణ మాఫీ కాలేదని.. తెల్ల రేషన్‌కార్డు లేని 3 లక్షల మందికి డిసెంబరులో కుటుంబ నిర్ధారణ చేసి రుణమాఫీ చేస్తామన్నారు. అయితే రేషన్ కార్డు ఉన్నా రుణ మాఫీ కాలేదని లక్షలాది మంది అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురికి నోటీసులు

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి తిరుమల పోటీసులు జారీ చేశారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. ఇటీవల తిరుమల కొండపై రీల్స్ చేసిన వివాదంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్, మాధురి విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. తిరుమల మాఢ వీధుల్లో పబ్లి్క్ న్యూసెన్స్ చేశారని వారిపై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 292, 296, 300 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.

కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. దివ్వల మాధురితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం వారిద్దరు కలిసి మాఢ వీధుల్లో హల్‌చల్ చేశారు. ఫోటోలకు ఫోజులివ్వడంతో పాటు తమ మధ్య ఉన్న సంబంధం గురించి వివరించారు. తాము ఇంకా పెళ్లి చేసుకోలేదని.. కోర్టుల్లో కేసులు కొలిక్కివచ్చాక పెళ్లి చేసుకుంటామని వెల్లడించారు.

అయితే తిరుమలలో ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో.. దివ్వల మాధురిపై కేసు నమోదైంది. అయితే తిరుమలలో తాము రీల్స్ చేశామనే ఆరోపణల్లో నిజం లేదని దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలు తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.

అయినప్పటికీ టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి విచారణలో భాగంగా నోటీసులు జారీ చేశారు.

యాదాద్రికి రైల్వే లైన్.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

యాదాద్రి ఆలయానికి భక్తుల రద్దీ నానాటికీ పెరిగిపోతోంది. వీకెండ్ డేస్, సెలవు దినాలు, ప్రత్యేక రోజుల్లో వేల సంఖ్యల్లో భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్తుంటారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి సమీపంలోనే ఆలయం ఉండటంతో నగరం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వెళ్తున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశ్యంతో నగరం నుంచి యాదాద్రికి MMTS ట్రైన్లు నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే సిద్ధమైంది. ఈ రైల్వే లైనుపై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు.

ప్రతి రోజూ వేల మంది భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని మెుక్కులు తీర్చుకుంటున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి నగరం నుంచి రోజు పది వేల మంది భక్తులు వెళ్తారని అంచనా. ప్రస్తుతం రోడ్డు మార్గంలోనే భక్తులు యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు. నగరంలో విపరీతమైన ట్రాఫిక్‌ సమస్య కారణంగా గంటన్నర పాటు నగరం దాటేందుకు సమయం పడుతోంది. నగరం దాటిన తర్వాత మరో రెండు రెండు గంటలు. మెుత్తంగా నాలుగైదు గంటలు ప్రయాణానికే పోతుంది. ఇక బస్సుల్లో, ప్రైవేట్‌ వాహనాల్లో అధిక మొత్తం ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దాంతో పాటు సమయం కూడా ఎక్కువగా పడుతోంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి యాదాద్రి వెళ్లేవారికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీపి కబురు చెప్పారు. యాదాద్రి వరకు ప్రత్యేక రైల్వే లైన్ నిర్మించి ఎంఎంటీఎస్‌ను పొడిగిస్తామని చెప్పారు. అందుకు సంబంధించిన టెండర్లు పూర్తి అయ్యాయని అన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. అమృత్ పథకం కింద రూ.450 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను నేడు కిషన్ రెడ్డి సందర్శించారు.

చర్లపల్లి టెర్మినల్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని.. తర్వలోనే ప్రధాని మోదీ స్టేషన్‌ను ప్రజలకు అంకితం చేస్తారని చెప్పారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు సైతం వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. యాదాద్రితో పాటుగా కొమురవెల్లి మల్లన్న ఆలయానికి సమీపంలో నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుందన్నారు. అది కూడా పూర్తి అయితే యాదాద్రికి, కొమురవెల్లికి ప్రత్యేక ట్రైన్లు నడుస్తాయని కిషన్ రెడ్డి వెల్లడించారు.

కాగా, యాదాద్రికి MMTS ట్రైన్లు నడపాలని భక్తులు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రెండోదశ పనులు కొనసాగుతున్నాయి. MMTS ట్రైన్లు యాదాద్రి సమీపంలోని రాయగిరి స్టేషన్‌ వరకు పొడగించాలని గత ఏడేళ్ల క్రితమే నిర్ణయించారు. ప్రస్తుతం మౌలాలి నుంచి ఘట్‌కేసర్‌ వరకు ఎంఎంటీఎస్ ట్రైన్లు ఉండగా.. అక్కడి నుంచి యాదాద్రికి కొత్తగా మూడో లైను వేయాల్సి ఉంది. ఆయితే టెండర్ ప్రక్రియ ఆలస్యం కావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.

కొన్ని నెలల క్రితం ఘట్‌కేసర్- రాయగిరి రైల్వేలైన్ పూర్తి చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం మౌలాలి నుంచి ఘట్‌కేసర్‌ వరకు 21 కిలోమీటర్ల మేర కొత్తగా రెండు ఎంఎంటీఎస్ లైన్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఘట్‌కేసర్ నుంచి మరో 35 కిలోమీటర్ల మేర కొత్త లైను వేస్తే హైదరాబాద్ నగరం నుంచి కేవలం రూ.20 టిక్కెట్‌తో యాదాద్రి ఆలయానికి చేరుకునే అవకాశం ఉంటుంది. అది కూడా గంటలోపే ప్రయాణం చేయవచ్చు.

నడిరోడ్డుపై వదిలేశారు.. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాకం..

మార్గ మధ్యల్లో ప్యాసింజర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ తమ ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తుండటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ బయలుదేరిన నవీన్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు విశాఖలో ప్రయాణీకులను ఎక్కించుకుని హైదరాబాద్ వస్తుండగా బస్సులో ఏసీ పనిచేయకపోవడంతో ..

విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌కు కొందరు ప్రయాణీకులు నవీన్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో ఏసీ టికెట్లు బుక్ చేసుకున్నారు. విశాఖ నుంచి బయలుదేరిన బస్సులో ఏసీ పనిచేయడం మానేసింది. అలాగే బస్సులో కుర్చీలు విరిగిపోయి ఉండటంతో ప్రయాణీకులు కూర్చోవడానికి ఇబ్బంది పడ్డారు. ప్రయాణీకులు బస్సు డ్రైవర్‌ను ప్రశ్నించడంతో మధ్యమధ్యలో బస్సు ఆపి మరమ్మతులు చేస్తూ తీసుకువచ్చారు. చివరకు విసుగుచెందిన ప్రయాణీకులు హనుమాన్ జంక్షన్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో విజయవాడలో మరో బస్సు ఏర్పాటు చేస్తామని ప్రయాణీకులకు హామీ ఇచ్చారు.

విజయవాడ బెంజ్ సర్కిల్ చేరుకున్న తర్వాత ప్రయాణీకులను బస్సు నుంచి దించివేసి, మరో బస్సు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని బస్సు యాజమాని చెప్పడంతో ప్రయాణీకులంతా మరోసారి ఆందోళనకు దిగారు. వేల రూపాయిలు తీసుకుని తమను నడిరోడ్డుపై వదిలేశారని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను మోసం చేసిన బస్సు యాజమాన్యంపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని అధికారులను ప్రయాణీకులు వేడుకుంటున్నారు.

ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణీకులను ఇబ్బందులు పెడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి.

టికెట్ కొన్న తర్వాత బస్సులో ఏదైనా సమస్య వస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, ప్రత్యామ్నాయంగా బస్సు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణీకులు సకాలంలో గమ్య స్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఘటనలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు కోరుతున్నారు.

ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

ఏపీలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

ఏపీలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ(TDP Candidates) అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కాకినాడ ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరబత్తుల రాజశేఖర్‌(Rajashekar)

కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటిరాజేంద్రప్రసాద్‌(Rajendra Prasad) పేర్లను ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

ఖరీఫ్ రైతులకు ప్రభుత్వం చేదువార్త

పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

ఖరీఫ్ రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేదు వార్త వినిపించింది. ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వబోమని తెలిపింది. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. రైతు భరోసాకు బదులుగా ప్రతీ సన్న ధాన్యం పండించిన రైతుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని తుమ్మల ప్రకటించారు. పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ఆయన తెలిపారు. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

’ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేము. మార్పులకు అనుగుణంగా రైతులను మారుస్తాం. ఆర్థిక వెసులుబాటు లేకపోయినా ముఖ్యమంత్రి రుణమాఫీ అంశాన్ని తన భుజాన వేసుకున్నారు. గతంలో వైఎస్సార్ హయాంలో 70 వేల కోట్ల రుణమాఫీ చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం. 42 బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకుని రుణమాఫీ చేసాం. రాష్ట్రంలో 42 లక్షల లబ్ధిదారులకు, 25 లక్షల కుటుంబాలకు 31 వేల కోట్లు అవసరం. 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15నే చేశాం. 20 లక్షల మందికి ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉంది. 2 లక్షల పైన ఉన్న డబ్బులు కడితే రుణమాఫీ అవుతుంది. తెల్ల రేషన్ కార్డు లేని 3 లక్షల మందికి డిసెంబర్ లో కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా రుణమాఫీ చేస్తాం. 2500కోట్ల రూపాయలు వేస్తాం. రుణ విముక్తి కావాలంటే కొత్త రుణాలు రావు‘‘ అని తుమ్మల వ్యాఖ్యానించారు.

2 లక్షల పైన ఉన్న రుణాల వారి అంశం క్యాబినెట్ లో చర్చిస్తామని తెలిపారు. పంటల బీమా గతంలో లేకపోయినప్పటికీ ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రతీ రైతు పంటకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని, రాష్ట్రంలో పండే అన్ని పంటలను ఎంఎస్పీ ప్రకారమే కొనుగోలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన అన్ని పంటలను కేంద్రం కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు 20% కేంద్రం కొనుగోలు చేస్తుందని తుమ్మల అన్నారు.

ఈ సందర్భంగా రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటి వరకు 2 లక్షల రైతు రుణమాఫీ ఎక్కడా చేయలేదని ఆ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. వ్యవసాయ రంగం, రైతుల విషయంలో కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు అమలు చేసితీరుతామన్నారు. రాష్ట్రంలో కొత్త శకం స్టార్టైంది. రాబోయే రెండేళ్లలో అనేక మార్పులు తీసుకు వస్తామని కోదండరెడ్డి తెలిపారు.

ప్రధాని నివాసం లక్ష్యంగా డ్రోన్ దాడి

ఇజ్రాయెల్‌లోని సిజేరియా టౌన్‌లో ఉన్న నేతన్యాహు నివాసం వైపు డ్రోన్ దూసుసువచ్చినట్టు నెతహన్యూహు ప్రతినిధి ఒకరు శనివారంనాడు తెలిపారు.

ఉగ్రవాద సంస్థ హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తుదముట్టడించిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ఇంటిని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగింది. ఇజ్రాయెల్‌లోని సిజేరియా టౌన్‌లో ఉన్న నేతన్యాహు నివాసం వైపు డ్రోన్ దూసుసువచ్చినట్టు నెతహన్యూహు ప్రతినిధి ఒకరు శనివారంనాడు తెలిపారు. ఆ సమయంలో ప్రధాని ఆ చుట్టుపక్కల లేరని, ఆయన నివాసంపై దాడిలో ఎవరూ గాయపడలేదని చెప్పారు.

ప్రధాని నివాసంపై యూఏవీని ప్రయోగించారు. ఆ సమయంలో ప్రధాని, ఆయన భార్య అక్కడ లేకపోవడంతో ఎవరూ గాయపడలేదు" అని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి ముందు, ఇజ్రాయెల్ మిలటరీ దీనిపై మాట్లాడుతూ, లెబనాన్ నుంచి మూడు డ్రోన్లు దూసుకువచ్చాయని తెలిపింది. రెండు డ్రోన్‌లను మధ్యలోనే అడ్డుకోగా, ఒక డ్రోన్ సిజేరియాలోని భవవాన్ని ఢీకొన్నట్టు చెప్పింది. కాగా, డ్రోన్ దాడులకు తామే కారణమని హెజ్‌బొల్లా ఇంకా ప్రకటించ లేదు.

సిన్వర్‌ను మట్టుబెట్టడాన్ని కీలక విజయంగా ప్రకటించిన ఇజ్రాయెల్ శుక్రవారం రాత్రి సైతం గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడింది.

ఈ దాడిలో 33 మంది పాలస్తీనా వాసులు మరణించడంతో ఇప్పటివరకూ ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 42 వేలకు చేరిందని గాజా అధికారులు ప్రకటించారు. ఆయుధాలు విడిచిపెట్టి, బందీలను విడిచిపెట్టేంత వరకూ యుద్ధం ఆపేది లేదని నెతన్యాహూ ప్రకటించారు.

బస్సు లైఫ్‌.. తగ్గుతోంది బాసూ

సిటీ బస్సుల్లో(City buses) రోజూ 19 లక్షల మంది ప్రయాణిస్తుండగా, వీరిలో 9 నుంచి 10 లక్షల మంది మహిళలే ఉంటున్నారు. రద్దీ ఎక్కువై ఆర్డినరీ బస్సులపై లోడ్‌ పెరుగుతోంది. దీంతో టైర్లు, ఇంజన్లపై ఒత్తిడి పెరుగుతుందని మెకానిక్‌లు చెబుతున్నారు.

సిటీ బస్సుల్లో(City buses) రోజూ 19 లక్షల మంది ప్రయాణిస్తుండగా, వీరిలో 9 నుంచి 10 లక్షల మంది మహిళలే ఉంటున్నారు. రద్దీ ఎక్కువై ఆర్డినరీ బస్సులపై లోడ్‌ పెరుగుతోంది. దీంతో టైర్లు, ఇంజన్లపై ఒత్తిడి పెరుగుతుందని మెకానిక్‌లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే సిటీ బస్సులు 13 లక్షల కిలోమీటర్లు తిరగకముందే స్ర్కాప్‌కు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంటు న్నారు. సాధారణంగా 45 నుంచి 55 మంది ప్రయాణించాల్సిన బస్సులో రద్దీ వేళల్లో వంద మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఈ ప్రభావం బస్సుల ఫిట్‌నెస్(Fitness)‏పై పడుతుందని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. గ్రేటర్‌ జోన్‌ పరిధిలో ఆర్టీసీ 2,800 సిటీబస్సులు నడుపుతుండగా 1,653 ఆర్డినరీ, 906 మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు.

మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టక ముందు గ్రేటర్‌జోన్‌లో రోజూ 5 లక్షల మంది మహిళలు సిటీ బస్సులో ప్రయాణించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపయింది. మహిళల రద్దీ పెరగడంతో టికెట్‌ తీసుకొని బస్సుల్లో ప్రయాణం చేసేకొంతమంది ఆర్టీసీ బస్సులను వదిలేసి ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. రద్దీ వేళల్లో బస్సుల్లో ఎక్కేందుకు స్థలం లేకపోవడంతో దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, మెహిదీపట్నం(Dilsukhnagar, Uppal, Miyapur, Kukatpally, Mehidipatnam), ఈసీఐఎల్‌, సికింద్రాబాద్‌, కోఠి ప్రాంతాల్లో ప్రైవేట్‌ ఆటోలకు డిమాండ్‌ పెరిగింది.

మహాలక్ష్మి ఉచిత ప్రయాణాలతో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 100 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతుండగా, ఏసీ బస్సుల్లో 65 శాతం మించడం లేదు. ఏసీ బస్సుల్లో చార్జీలు అధికంగా ఉండటం, కొన్ని రూట్లకే పరిమితం కావడంతో అనుకున్నస్థాయిలో ప్రయాణికులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఎయిర్‌పోర్ట్‌ రూట్‌లో నడుపుతున్న 40 పుష్పక్‌ బస్సుల్లో ఆక్యుపెన్సీ 60 శాతం మించకపోయినా బస్‌ రూట్లలో మార్పులు చేపట్టడం లేదనే విమర్శలున్నాయి.

ఎలక్ర్టిక్‌ ఆర్డినరీ బస్సులను పెద్దసంఖ్యలో తీసుకువస్తే కానీ ఆర్డినరీ సిటీ బస్సులపై ఓవర్‌లోడ్‌ తగ్గే పరిస్థితులు కన్పించడం లేదు. గ్రేటర్‌లో 2024 డిసెంబర్‌ నాటికి 500 ఎలక్ర్టిక్‌ బస్సులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. దేశవ్యాప్తంగా ఈ బస్సులకు పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలో బస్సుల రాక ఆలస్యం అవుతుందని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.

గ్రూప్‌-1 పరీక్షను వాయిదా వేయాలి

తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ పోగుల రాంబాబు అనే అభ్యర్థి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ పోగుల రాంబాబు అనే అభ్యర్థి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవోతో తాము నష్టపోతున్నామంటూ గురువారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. గ్రూప్‌ -1 నియామకాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వంతోపాటు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ప్రతివాదులుగా చేర్చారు.

ఈ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు పిటిషనర్‌ తరఫున న్యాయవాది మోహిత్‌ రావు శుక్రవారం ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనిని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని కోరారు. అయితే.. తక్షణమే విచారించలేమని, సోమవారం (ఈనెల 21న) విచారిస్తామని సీజేఐ స్పష్టం చేశారు.

రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 29ను రద్దు చేయాలని గ్రూప్‌ 1 అభ్యర్థులు శ్రీనివాస్‌, అర్జున్‌, ఇందిరా నాయక్‌, రామ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు.

గత ప్రభుత్వ హయాంలో గ్రూప్‌ 1 అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందని, మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా తమకు నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమకు న్యాయం దక్కుతుందన్న నమ్మకంతో సుప్రీం కోర్టును ఆశ్రయించామని, జీవో 29ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పారు.