వ్యాపారం ఎలా చేస్తారో చూస్తాం

ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానం అమలులోకి వచ్చింది. లిక్కర్ షాప్ ల లైసెన్స్ లు దక్కించుకున్న వ్యాపారులు అనేక ప్రాంతాలలో మద్యం దుకాణాలు ప్రారంభించారు.

అనేక జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో మద్యం వ్యాపారులను ఎమ్మెల్యేల అనుచరులు బెదిరిస్తున్నారని, అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా లిక్కర్ వ్యాపారులను బెదిరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

మద్యం వ్యాపారం విషయంలో అధికార పార్టీ నాయకులు ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించినా కొంతమంది నాయకులు ఆయన మాటలను పెడచెవిన పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తు సీఎం చెప్పినా కూడా అధికార పార్టీ నాయకులు మారకపోవడంతో మద్యం వ్యాపారులు భయపడిపోతున్నారని తెలిసింది.

కొన్ని ప్రాంతాల్లో మద్యం షాపుల లైసెన్సులు దక్కించుకున్న మద్యం వ్యాపారులు వాళ్లు అక్కడ లిక్కర్ షాపులు పెట్టడానికి అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని నయోజకవర్గాలలో అధికార పార్టీ నాయకులకు భయపడిపోయిన మద్యం వ్యాపారులు లిక్కర్ షాప్ ల లైసెన్సులు ఆ నాయకులకు ఇచ్చేసే వెళ్లిపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నాయకుల అనుచరులు మద్యం వ్యాపారులను బెదిరించి 30 శాతం నుంచి 50 శాతం వరకు వాటాలు అడుగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

అనేక నియోజకవర్గాలలో మద్యం షాపులు ప్రారంభించిన వ్యాపారులను బెదిరించి ఇష్టం వచ్చినట్లు వాటాలు అడుగుతున్నారని, మామాట వినకుంటే మీరు ఎలా వ్యాపారం చేస్తారో మేము చూస్తామని నాయకుల అనుచరులు బెదిరిస్తున్నారని తెలిసింది. ఇప్పుడు అనేక నియోజకవర్గాలలో ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు కూడా లిక్కర్ షాప్ లలో వాటాలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. చాలామంది మద్యం వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదులు చేయలేక, నాయకులకు వాటాలు ఇవ్వడానికి రాజీకాలేక సతమతం అవుతున్నారని సమాచారం.

రేవంత్ చేసేది మూసీ లూటిఫికేషనే: పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో కేటీఆర్

మూసీ ప్రక్షాళనపై గురువారం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అంటూ ఎద్దేవా చేశారు. మూసీని మురికి కూపంగా తాము మార్చలేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం ఏం చేసింది, ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసిందనేదానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

మూసీని మురికి కూపంగా మార్చిన పాపం కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలదేనని కేటీఆర్ అన్నారు. తాము ముసీని కరకట్టలతో కాపాడాలనుకున్నామని చెప్పారు. తాము రూ. 16,634 కోట్లతోనే మూసీ ప్రక్షాళనకు డీపీఆర్ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం రూ. లక్ష కోట్లంటూ ఢిల్లీకి మూటలు పంపేందుకే మూసీ ప్రాజెక్టుని తీసుకొచ్చిందని కేటీఆర్ ఆరోపించారు.

నిన్న సీఎం రేవంత్ రెడ్డి దాదాపు రెండున్న‌ర గంట‌ల పాటు తాను ఏదో విజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నాన‌ని అనుకుని త‌న సంపూర్ణ‌మైన అజ్ఞానాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చేయ‌ని స‌ర్వేలను చేసిన‌ట్టు.. అబ‌ద్ధాలు, అర్ధ స‌త్యాల‌ను అర్థంప‌ర్థం లేని అసంబద్ద వాద‌న‌ల‌ను సంపూర్ణంగా బ‌య‌ప‌టెట్టి త‌న ప‌రువు తానే తీసుకున్నారని కేటీఆర్ విమ‌ర్శించారు.

మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో ఎలాంటి స‌ర్వే జ‌ర‌గ‌లేదు. మా ఇంటికి ఎవ‌రు రాలేదు.. స‌ర్వే జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌జ‌లే చెబుతున్నారు. ఈయ‌నేమో(రేవంత్ రెడ్డి) రెండు నెల‌ల నుంచి స‌ర్వే చేస్తున్నామ‌ని అబ‌ద్ధాలు ఆడుతున్నారు. ఇక‌ జేసీబీల‌తో, కూలీల‌ను పెట్టి ఇళ్లు కూల‌గొడుతున్నారు. ఇందుకు సాక్ష్యంగా సోష‌ల్ మీడియాలో కూడా వీడియోలు వ‌చ్చాయి. మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో ఇళ్లను కూలగొట్టేందుకు వ‌చ్చిన ఓ కూలీ కూడా బాధ‌ప‌డ్డ‌ట్టు సోష‌ల్ మీడియాలో వీడియోలు వ‌చ్చాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

సీఎం రేవంత్ త‌న త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక‌త వ‌స్తున్న క్ర‌మంలో గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారని మండిపడ్డారు. ల‌క్ష‌న్న‌ర కోట్ల కుంభ‌ణానికి కాంగ్రెస్ నేత‌లు ప్లాన్ చేస్తున్నారు.. దాన్ని స‌మాజం గ‌మ‌నిస్తుందన్నారు.

మీరు ఆరు గ్యారెంటీల‌ను అట‌కెక్కించారు. 420 హామీల‌తో ప్ర‌జ‌ల గొంతు కోశారు. ముఖ్య‌మంత్రి మూసీ ప్రేమంతా.. ఢిల్లీకి పంపే మూట‌ల కోస‌మే అని తేలిపోయింది' అని రేవంత్ సర్కారుపై కేటీఆర్ విమర్శించారు. మూసీ ప్రక్షాళనపై నల్గొండ మంత్రులు జ్ఞానం పెంచుకోవాలంటూ హితవు పలికారు.

అదానీ గొప్ప మనసు.. స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తోన్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ భారీ విరాళం ప్రకటించింది. స్కిల్ యూనివర్సిటీకి ఏకంగా రూ.100 కోట్ల విరాళం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు గౌతమ్ అదానీ, అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు.

దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తోన్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి భారీ విరాళం ప్రకటించారు. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఫౌండేషన్ ద్వారా రూ.100 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూ.100 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును శుక్రవారం హైదరాబాద్‌లో అందజేశారు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అందుకు సంబంధించిన ఫోటోలను పంచుకుంది.

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లో శుక్రవారం కలిశారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ప్రకటించిన రూ.100 కోట్ల చెక్కును అందజేశారు. యువతలో నైపుణ్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఈ గొప్ప ప్రయత్నానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా అదానీ హామీ ఇచ్చారు.' అని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతకుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఆయన ఈ పదవిలో ఏడాది పాటు కొనసాగుతారని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర యువతకు నైపుణ్యాలు నేర్పించేలా రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్ల, బేగరికంచె ప్రాంతంలో ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం చేపడుతోంది ప్రభుత్వం. మొత్తం 17 రకాల కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ప్రతి ఏడాది లక్ష మందికిపైగా శిక్షణ ఇచ్చేలా రానున్న రోజుల్లో ఈ స్కిల్ యూనివర్సిటీని విస్తరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. బేగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా భవంతిలో ఈ స్కిల్ యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.

సేవింగ్స్ అకౌంట్స్‌లో నగదుకు లిమిట్.. లేకుంటే ఐటీ నోటీసులు తప్పదు

సేవింగ్స్ అకౌంట్స్‌లో నగదు పరిమితికి మించి జమ అయితే మాత్రం బ్యాంకులు.. ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకు వెళ్తాయి. దీంతో ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285 బీఏ నిబంధనల ప్రకారం.. మీ ఖాతాలో జమ అయిన నగదు వివరాలను ఆ శాఖ పరిశీలిస్తుంది.

ఇటీవల కాలంలో పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ అయిపోయింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే.. ఖాతాదారుడికి ఖచ్చితంగా ఆధార్, పాన్ కార్డు ఉండి తీరాలి. అలా అయితేనే బ్యాంక్‌లో ఖాతా తెరుస్తున్నారు. అయితే బ్యాంక్ ఖాతాల్లో వివిధ రకాలు ఉన్నాయి. సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్ తదితర రకాలున్నాయి. కానీ చాలా మంది సేవింగ్ అకౌంట్‌లనే ఒపెన్ చేస్తారు.

అత్యధిక శాతం ఖాతాదారులు.. తాము సంపాదించిన నగదును ఈ ఖాతాల్లోనే పొదుపు చేస్తుంటారు. ఈ సేవింగ్ అకౌంట్లలో నగదు భద్రపరచడమే కాకుండా.. దీనిపై వడ్డీని సైతం పొందవచ్చు. మరికొన్ని సమయాల్లో.. ఇతరుల నగదును తమ ఖాతాల ద్వారా ఖాతాదారుడు లావాదేవీలు జరుపుతుంటాడు. అలాంటి వేళ సేవింగ్ అకౌంట్ పరిమితి దాటుతుంది. అసలు సేవింగ్ అకౌంట్‌లో లిమిట్ ఎంత ఉండాలి.

ఈ అకౌంట్‌లో ఎంత నగదు జమ చేసుకోవచ్చు. ఓ వేళ ఆ పరిమితి దాటితే ఖాతాదారుడికి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? అంటే.. ఎదురయ్యే అవకాశాలున్నాయి. సేవింగ్ అకౌంట్లలో దాచుకునే సొమ్ము పరమితి దాటితే మాత్రం ఖాతాదారుడికి ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశముంది.

మరి అలా కాకూడదంటే.. సేవింగ్ అకౌంట్‌లో ఎంత నగదు ఉంచవచ్చు. అంటే.. సేవింగ్ అకౌంట్‌లో ఎంత నగదు అయినా జమ చేసుకోవచ్చు. అందుకు పరిమితి లేదు. కానీ ఆదాయపు పన్ను శాఖ.. ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్‌లో నగదు జమ చేసేందుకు రూ.10 లక్షల వరకు పరిమితి విధించింది.

అంటే ఒక ఏడాదిలో బ్యాంక్ సేవింగ్ అకౌంట్‌లో రూ.10 లక్షల వరకు నగదు జమ చేయవచ్చు. ఆపై నగదు జమ చేస్తే మాత్రం ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చేస్తారు. దాంతో జమ అయిన నగదుపై పన్ను చెల్లించవలసి ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్స్‌లో నగదు పరిమితికి మించి జమ అయితే మాత్రం బ్యాంకులు.. ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకు వెళ్తాయి. దీంతో ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285 బీఏ నిబంధనల ప్రకారం.. మీ ఖాతాలో జమ అయిన నగదు వివరాలను ఆ శాఖ పరిశీలిస్తుంది.

దీంతో సేవింగ్ అకౌంట్‌లో జమ అయిన నగదుకు.. రిటర్న్ ఫైల్ చేసే సమయంలో చూపిన వివరాలు కచ్చితంగా ఉండాలి. ఏ మాత్రం పొంతన లేకుంటే మాత్రం ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేస్తుంది. దీంతో ఖాతాదారుడు.. ఆ నగదుకు సంబంధించిన కచ్చితమైన వివరాలు ఆదాయపు పన్ను శాఖ వారికి సమర్పించాల్సి ఉంటుంది.

ఆ క్రమంలో నగదు రాబడి అంశంలో ఏ మాత్రం తప్పు జరిగినట్లు భావించినా.. ఆదాయపు పన్ను శాఖ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశముంటుంది. దీంతో జరిమానాతోపాటు చట్టపరమైన చర్యలకు సైతం ఆ శాఖ ఉపక్రమించే అవకాశముంది. ఈ నేపథ్యంలోల సేవింగ్స్ అకౌంట్‌లో నగదు ఎంత ఉండాలనే విషయాన్ని ఖాతాదారుడు ముందే తెలుసుకుని మసులుకుంటే మంచిది.

భారత్‌తో సంబంధాలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేసిన నవాజ్ షరీఫ్,

భారత విదేశాంగ మంత్రి డాక్టర్. ఎస్. జైశంకర్ పర్యటన తర్వాత, పాకిస్థాన్ "మర్యాద"లో ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి అక్టోబర్ 16న పాకిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. ఆ తర్వాత భారత్‌తో సంబంధాలపై పాకిస్థాన్‌కు కొత్త ఆశలు చిగురించాయి, పాకిస్థాన్‌ అధికార పార్టీ పీఎంఎల్‌ఎన్‌ అధినేత, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ భారత్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవాలని బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. జైశంకర్ పాకిస్థాన్ పర్యటన నాంది అని నవాజ్ షరీఫ్ అన్నారు. ఇక్కడి నుంచి భారత్, పాకిస్థాన్ తమ చరిత్రను వదిలిపెట్టి ముందుకు సాగాలి.

పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధ్యక్షుడు షరీఫ్, భారతీయ పాత్రికేయులతో మాట్లాడుతూ, జైశంకర్ పాకిస్తాన్ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలకు ముఖ్యమైనదని అన్నారు. దీని కారణంగా ఇంధన సంక్షోభం మరియు వాతావరణ మార్పుల వంటి వాటి సమస్యలపై దృష్టి సారించే అవకాశాన్ని భారతదేశం మరియు పాకిస్తాన్ రెండూ పొందవచ్చు. ఇరు దేశాలు శాంతి ప్రక్రియను పునఃప్రారంభించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

75 ఏళ్లు కోల్పోయాం: షరీఫ్

ఈ వ్యవహారం ఇలాగే సాగుతుందని షరీఫ్ అన్నారు. ఇది ముగియకూడదు. మోడీ సాహెబ్ స్వయంగా ఇక్కడికి వచ్చి అడ్రస్ సమర్పించి ఉంటే బాగుండేది, జైశంకర్ కూడా రావడం విశేషం. ఇప్పుడు మనం ఎక్కడ వదిలేశామో అక్కడి నుండి తీయాలి. 75 ఏళ్లు కోల్పోయాం, ఇప్పుడు రాబోయే 75 ఏళ్ల గురించి ఆలోచించాలి.

ప్రధాని మోదీ లాహోర్‌ పర్యటనను ప్రశంసించారు

2015 డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ లాహోర్‌లో చేసిన ఆకస్మిక పర్యటనను ప్రశంసించిన షరీఫ్, రెండు దేశాల మధ్య సంబంధాలలో "సుదీర్ఘంగా ఉన్న స్తబ్దత"తో తాను సంతోషంగా లేనని, ఇరుపక్షాలు సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మన పొరుగు దేశాలను మార్చలేమని, పాకిస్థాన్‌ను లేదా భారత్‌ను మార్చలేమని నవాజ్ అన్నారు. మనం మంచి పొరుగువారిలా జీవించాలి.

రిలేషన్స్‌లో సుదీర్ఘ విరామంతో నవాజ్ సంతోషంగా లేడు

మా నాన్న పాస్‌పోర్ట్‌లో ఆయన జన్మస్థలం అమృత్‌సర్ అని రాసి ఉందని నవాజ్ షరీఫ్ అన్నారు. మనం ఒకే సంస్కృతి, సంప్రదాయం, భాష, ఆహారం పంచుకుంటాం. మా రిలేషన్‌షిప్‌లో సుదీర్ఘ విరామం ఉన్నందుకు నేను సంతోషంగా లేను. నాయకుల మధ్య సత్ప్రవర్తన లేకపోవచ్చు కానీ, ప్రజల మధ్య అనుబంధం చాలా బాగుంటుంది. భారతదేశ ప్రజల కోసం ఆలోచించే పాకిస్థాన్ ప్రజల తరపున నేను మాట్లాడగలను మరియు భారతీయ ప్రజల కోసం నేను అదే చెబుతాను.

చెడిపోయిన సంబంధాలకు ఇమ్రాన్ ఖాన్‌ను బాధ్యులను చేశాడు

ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించడానికి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కారణమని షరీఫ్ పేర్కొన్నాడు మరియు ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావించారు. షరీఫ్ వాడిన భాష భారత్ తో సంబంధాలను దెబ్బతీసిందని అన్నారు. ఇలాంటి భాష మాట్లాడటం వదిలేయండి, నాయకులు ఆలోచించకూడదు.

హమాస్_చీఫ్_సిన్వార్_చివరి_క్షణాలు

యాహ్యా సిన్వార్ చివరి క్షణాలు డ్రోన్‌లో బంధించబడ్డాయి, అతని మరణానికి ముందు 'బచర్ ఆఫ్ ఖాన్ యూనిస్' పరిస్థితి ఇలా ఉంది

అక్టోబరు 7న జరిగిన దాడికి ప్రధాన సూత్రధారి, గాజాకు చెందిన బిన్ లాడెన్‌గా పేరొందిన హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. గురువారం జరిగిన ఆపరేషన్‌లో సిన్వార్‌ మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ సైనిక దళాల ప్రతినిధి ధృవీకరించారు. సైనికుల నుంచి తప్పించుకోవడానికి హమాస్ చీఫ్ దాక్కోవడానికి వెళ్లిన భవనాన్ని ఇజ్రాయెల్ దళాలు కూల్చివేయడంతో యాహ్యా సిన్వార్ చనిపోయాడు. సిన్వార్ హత్యకు ముందు ఇజ్రాయెల్ సైన్యం కెమెరాలో బంధించింది, ఇది అతని చివరి క్షణాలను వెల్లడిస్తుంది. యాహ్యా సిన్వార్ చివరి క్షణాల వీడియోను ఇజ్రాయెల్ ఆర్మీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇజ్రాయెల్ ఆర్మీ డ్రోన్ ఫుటేజీని విడుదల చేసింది మరియు అందులో కనిపిస్తున్న వ్యక్తి యాహ్యా సిన్వార్ అని పేర్కొంది. మృత్యువు సోఫాలో కూర్చున్న యాహ్యా సిన్వార్, మరణిస్తున్నప్పుడు నెతన్యాహు పట్ల తన వైఖరిని ప్రదర్శిస్తూ కనిపించాడు. ఇందులో హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ మరణానికి ముందు ఆయన చివరి క్షణాలు కనిపిస్తున్నాయి.

ఇజ్రాయెల్‌లోని 450వ బెటాలియన్‌కు చెందిన ఒక సైనికుడు అనుమానితుడు ఒక భవనంలోకి ప్రవేశించి బయటకు వెళ్లడం చూశాడు. సైనికుడు తన కమాండర్‌కు సమాచారం అందించాడు, ఆ తర్వాత కాల్పులు జరపమని ఆర్డర్ ఇవ్వబడింది. మధ్యాహ్నం 3 గంటలకు, ముగ్గురు వ్యక్తులు ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మారడానికి ప్రయత్నిస్తున్నారని ఐడిఎఫ్ డ్రోన్ ద్వారా గమనించింది. ఇద్దరు వ్యక్తులు దుప్పట్లు కప్పుకుని ముందుకు నడుస్తుండగా, మూడో వ్యక్తి వెనుక ఉన్నాడు.

450వ బెటాలియన్ కమాండర్ ముగ్గురిపై కాల్పులు జరిపాడు, దీనివల్ల వారు విడిపోయారు. ఇద్దరు ఉగ్రవాదులు ఓ భవనంలోకి పారిపోగా, మూడో వ్యక్తి ప్రత్యేక భవనంలోకి ప్రవేశించాడు. ఈ మూడో వ్యక్తి సిన్వార్. అయితే, ఆ సమయంలో ఇజ్రాయెల్ సైనికులు సిన్వార్‌ను చుట్టుముట్టినట్లు తెలియదు. ఇంతలో సిన్వార్ బిల్డింగ్ రెండో అంతస్తులోకి వెళ్లాడు. IDF అతనిపై ట్యాంకులతో కాల్పులు జరిపింది.

ఇజ్రాయెల్ సైనికులు భవనం వద్దకు చేరుకోగా, లోపల నుండి వారిపై రెండు గ్రెనేడ్లు విసిరారు. దీని తర్వాత సైనికులు వెనక్కి వెళ్లి డ్రోన్ పంపారు. డ్రోన్ భవనం లోపల గాయపడిన వ్యక్తిని గుర్తించింది, అతని ముఖం కప్పబడి ఉంది. గదిలోని చెత్తాచెదారం మధ్య సోఫాలో కూర్చుని చేతిలో కర్ర ఉంది. డ్రోన్ అతని దగ్గరికి రాగానే, అతను తన కర్రను విసిరి డ్రోన్ పడిపోయేలా ప్రయత్నించాడు. ఆ తర్వాత ఐడీఎఫ్ ట్యాంకులతో భవనంపై దాడి చేసింది.

ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ, డ్రోన్ నుండి ఈ ఫుటేజీని రికార్డ్ చేసినప్పుడు, ఇజ్రాయెల్ ఆర్మీ అతను సాధారణ హమాస్ ఫైటర్ అని భావించింది. అయితే, సిన్వార్ మరణానంతరం గుర్తించినప్పుడు, అతను సాధారణ పోరాట యోధుడు కాదని, హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ అని తేలింది. డీఎన్‌ఏ పరీక్ష ద్వారా యాహ్యా సిన్వార్ మృతిని ఆర్మీ ధృవీకరించింది.

భారత్‌ మాతా కీ జై అంటేనే బెయిల్‌.. నిందితుడికి తిక్క కుదిర్చిన హైకోర్టు

భారత వ్యతిరేక, పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేసిన ఓ నిందితుడికి మధ్యప్రదేశ్‌ హైకోర్టు తిక్క కుదిర్చింది. అతడికి బెయిలు మంజూరు చేస్తూ ఊహించని షరతులు విధించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది మే 17న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

భారత వ్యతిరేక, పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేసిన ఓ నిందితుడికి మధ్యప్రదేశ్‌ హైకోర్టు తిక్క కుదిర్చింది. అతడికి బెయిలు మంజూరు చేస్తూ ఊహించని షరతులు విధించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది మే 17న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

భోపాల్‌ సమీపంలోని మిస్రోద్‌లో ఓ పంక్చర్‌ షాప్‌ నిర్వహించే ఫైసల్‌ఖాన్‌ ఆ వీడియోలో ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌”, ‘భారత్‌ ముర్దాబాద్‌’ అని నినాదాలు చేయడం కనిపించింది. దీంతో అతడిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఫైసల్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేశారు.

ఈ కేసులో తాజాగా మధ్యప్రదేశ్‌ హైకోర్టు జస్టిస్‌ దినేశ్‌ కుమార్‌ పలివాల్‌ అతడికి బెయిలు మంజూరు చేస్తూ.. ఫైసల్‌ తన దేశభక్తిని బహిరంగంగా ప్రదర్శించాలని షరతు విధించారు. జాతీయ జెండాకు 21సార్లు వందనం చేయాలని, నెలకు రెండుసార్లు ‘భారత్‌ మాతా కీ జై’ అని నినదించాలని షరతులు పెట్టారు. కేసు ముగిసే వరకు ప్రతినెల మొదటి, నాలుగో మంగళవారం మిస్రోద్‌ పోలీస్‌ స్టేషన్‌లోని జెండా స్తంభం వద్ద ఇలా చేయాలని ఆదేశిస్తూ ఫైసల్‌కు బెయిలు మంజూరు చేశారు.

కేబినెట్‌ నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాల్సిందే..

కోయంబత్తూర్‌ కేసులో యావజ్జీవఖైదీగా పుళల్‌ కేంద్ర కారాగారంలో ఉన్న వీరభారతి, తనను ముందుగానే విడుదల చేసేలా ఉత్తర్వులు జారీచేయాలంటూ మద్రాసు హైకోర్టు(Madras High Court)లో పిటిషన్‌ వేశారు.

కోయంబత్తూర్‌ కేసులో యావజ్జీవఖైదీగా పుళల్‌ కేంద్ర కారాగారంలో ఉన్న వీరభారతి, తనను ముందుగానే విడుదల చేసేలా ఉత్తర్వులు జారీచేయాలంటూ మద్రాసు హైకోర్టు(Madras High Court)లో పిటిషన్‌ వేశారు.

తనను ముందుగానే విడుదల చేయాలన్న ప్రభుత్వ సిఫారసును గవర్నర్‌ నిరాకరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ కేసు విచారించిన న్యాయస్థానం, మంత్రివర్గ నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాల్సిందేనని, గవర్నర్‌(Governor) దానిని ఉల్లంఘించలేరన్న సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేస్తూ.. పిటిషనర్‌ దరఖాస్తును పునః పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది.

అనుమతి రెండుకు.. నిర్మిస్తోంది ఆరు

అక్రమ నిర్మాణాల నియంత్రణలో జీహెచ్‌ఎంసీ(GHMC) పూర్తిగా విఫలమైంది. ఎప్పటికప్పుడు కూల్చివేతలు చేపట్టాల్సిన సంస్థ.. పౌరులు ఫిర్యాదు చేసినా.. తుదకు కోర్టు ఆదేశించినా అనుమతి లేని భవనాల జోలికి వెళ్లడం లేదు.

అక్రమ నిర్మాణాల నియంత్రణలో జీహెచ్‌ఎంసీ(GHMC) పూర్తిగా విఫలమైంది. ఎప్పటికప్పుడు కూల్చివేతలు చేపట్టాల్సిన సంస్థ.. పౌరులు ఫిర్యాదు చేసినా.. తుదకు కోర్టు ఆదేశించినా అనుమతి లేని భవనాల జోలికి వెళ్లడం లేదు. అంతస్తుకు ఇంత అంటూ అక్రమ వసూళ్లకు అలవాటుపడిన కొందరు అధికారులు నిబంధనల అమలులో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి వస్తోన్న ఫిర్యాదుల్లో 50 శాతానికిపైగా పట్టణ ప్రణాళికా విభాగానికి చెందినవే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.

మూసాపేట్‌ సర్కిల్‌ పరిధిలో కేపీహెచ్‌బీ, బాలాజీనగర్‌, వసంతనగర్‌(KPHB, Balajinagar, Vasanthanagar), గోపాల్‌నగర్‌, కైత్లాపూర్‌, కేపీహెచ్‌బీ 15వ ఫేజ్‌లలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. స్టిల్ట్‌ ప్లస్‌ రెండు అంతస్తులకు అనుమతులు తీసుకొని ఐదు నుంచి ఏడంతస్తులు నిర్మిస్తోన్నా.. పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు కనీసం నోటీసులు ఇచ్చే సాహసం చేయడం లేదు. స్థానిక కాలనీ, యువజన, ఇతర సంఘాలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోవడం లేదు.

ఉన్నత స్థాయి ఆదేశాలతో అప్పుడప్పుడు నిర్మాణాల వద్దకు వస్తోన్న అధికారులు కొన్ని రోజులు ఆపి తిరిగి పనులు ప్రారంభించాలని ఉచిత సలహా ఇచ్చి వెళ్తున్నారు. కేపీహెచ్‌బీ రోడ్డు నంబర్‌-5లోని ఎల్‌ఐజీ 111 గజాల్లో స్టిల్ట్‌ ప్లస్‌ రెండు ఫ్లోర్లకు అనుమతి తీసుకొని.. పార్కింగ్‌ స్థలం కూడా వదలకుండా ఓ వ్యక్తి ఏకంగా ఆరంతస్తుల భవనం నిర్మించాడు. స్థానికులు పలుమార్లు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేసినా అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు.

వెంగళరావునగర్‌ ఎల్‌ఐజీహెచ్‌లోని ప్లాట్‌ నెంబర్‌ 48బీలో ఓ వ్యక్తి స్టిల్ట్‌ ప్లస్‌ మూడంతస్తులకు నివాస కేటగిరీలో అనుమతి తీసుకున్నాడు. అదనంగా ఓ అంతస్తు నిర్మించడంతోపాటు.. ఐదో అంతస్తు కోసం పిల్లర్లు వేశారు. నివాసం కోసం పర్మిషన్‌ తీసుకొని భవనాన్ని హాస్టల్‌ నిర్వహణకు అనువుగా నిర్మిస్తున్నారు. దీంతో స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు స్పందించకపోవడంతో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు గతంలో స్లాబ్‌కు స్వల్పంగా రంధ్రాలు చేసి వదిలారు. అనంతరం వాటిని ఫిల్‌ చేసిన నిర్మాణదారుడు గోడలకు ప్లాస్టింగ్‌, రంగులు, ఇతరత్రా పనులు ప్రారంభించారు.

ఈ విషయంపై స్థానికులు మరోసారి కోర్టును ఆశ్రయించడంతో పాక్షికంగా కాదు.. అక్రమంగా చేపట్టిన నిర్మాణం పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని గత నెల 16వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. నెల రోజులైనా.. జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు భవనం వద్దకు వెళ్లలేదు. ఓ డీఎస్పీ ఒత్తిడితోనే బల్దియా వర్గాలు భవనం జోలికి వెళ్లడం లేదని తెలుస్తోంది. కొందరు అధికారులకు భారీగా ముట్టచెప్పారనే ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. ఇలాంటి భవన నిర్మాణాలు నగరంలో కోకొల్లలుగా జరుగుతున్నా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.

భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు జలకళ

కాకినాడ నగరంలో కుండపోత వర్షం కురిసింది. రెండు గంటల నుంచి ఏకధాటిగా వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షం నేపథ్యంలో కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులకు బ్రేక్ పడింది. బార్జీల నుంచి నౌకలకు బియ్యం రవాణా నిలిపివేశారు అధికారులు.

రాష్ట్రంలో (Andhrapradesh) మరోసారి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, కాకినాడలో ఎడతెరపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. విశాఖ ఆర్కేబీచ్, కాకినాడ తీరాల్లో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కాకినాడ ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. ఈరోజు (శుక్రవారం) కూడా కాకినాడ నగరంలో కుండపోత వర్షం కురిసింది. రెండు గంటల నుంచి ఏకధాటిగా వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షం నేపథ్యంలో కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులకు బ్రేక్ పడింది. బార్జీల నుంచి నౌకలకు బియ్యం రవాణా నిలిపివేశారు అధికారులు.

అటు ప్రకాశం జిల్లా మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు మండలాల్లో వేకువజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. మార్కాపురం మండలం బొడిచర్ల వద్ద గుండ్లకమ్మ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. తర్లుపాడు - మార్కాపురం మధ్య కొండ వాగు ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మరోవైపు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. తుంగభద్ర జలాశయం, శ్రీశైలం జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి 10 గేట్ల ద్వారా నీటిని అధికారులు విడుదల చేశారు. పూర్తి స్థాయి నీటి మట్టం1633 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 1631.93 అడుగులకు చేరింది. అలాగే ఇన్ ఫ్లో 50,593 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 36,799 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం నీటి నిల్వ సామర్ధ్యం 101.500 టీఎంసీలుగా నమోదు అయ్యింది..

ఇటు నంద్యాలలోని శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 79,536 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 67,626 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.50 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 212.9198 టీఎంసీలుగా కొనసాగుతోంది. మరోవైపు కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.