ప్రధానితో చంద్రబాబు, పవన్ భేటీ - గేమ్ ఛేంజర్..!!

సీఎం చంద్రబాబు..డిప్యూటీ సీఎం పవన్ హర్యానా వెళ్తున్నారు. హర్యానా నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ఆ తరువాత ఎన్డీఏ సమావేశంలో ఈ ఇద్దరు పాల్గొంటారు. జమిలి ఎన్నికల వేళ కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలతో ఈ భేటీ కీలకం కానుంది. ప్రధాని మోదీతో చంద్రబాబు, పవన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీ పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధించిన బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం నేడు కొలువు తీరనుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు హాజరు కానున్నాయి. సీఎం చంద్రబాబు...డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక విమానంలో హర్యానాకు వెళ్తనున్నారు.

ప్రమాణ స్వీకారం తరువాత ఎన్డీయే పక్ష నేతల సమావేశంలో వారు పాల్గొంటారు. ఈ భేటీలో రానున్న రాష్ట్రాల్లో ఎన్నికలతో పాటుగా నాలుగు నెలల ఎన్డీఏ మూడో విడత పాలన గురించి చర్చించనున్నారు. జమిలి ఎన్నికల విషయంలో వ్యూహాల పైన ప్రధాని తమ భాగస్వామ్య పక్ష నేతలకు వివరించే అవకాశం ఉంది.

పవన్ కల్యాణ్ ఎన్డీఏ సమావేశానికి హాజరు కావటం ప్రత్యేకత సంతరించుకుంది. ప్రధానిగా మోదీ ఎన్నిక జరిగిన సమావేశంలో పవన్ ను ఉద్దేశించి ప్రధాని ప్రశంసించారు. ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది. చాలా కాలం తరువాత ప్రధానితో పవన్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వివరించనున్నారు.

అదే విధంగా మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. కేంద్ర మంత్రుల తో పాటుగా ఎన్డీఏ పక్షాల సీఎంలు..డిప్యూటీ సీఎంలు హర్యానా చేరుకుంటున్నారు. హర్యానాలో బీజేపీ వరుసగా మూడో సారి అధికారం చేపడుతోంది.

వాయు'గండం'గా మారిన అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 17వ తేదీన చెన్నై-పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఈ అల్పపడీనం నెల్లూరుకు 590 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి 500 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, ములుగు, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఆయా జిల్లాలకు పసుపు హెచ్చరిక జారీచేశారు. రెండు రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఈరోజు కూడా నగరంలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

కూకట్ పల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రామంతపూర్, ఉప్పల్, మూసాపేట, బోరబండ, పంజాగుట్ట ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రానికి మళ్లీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సూచించారు.

అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ తడిసి ముద్దవుతోంది. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు హైఅలర్ట్ జారీచేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.

మెదక్ జిల్లాలో కారు బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న కారు.. అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వారిలో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. పైగా వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.

మెదక్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.. ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు.. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం ధాటికి కారు మొత్తం నుజ్జునుజ్జయింది. చనిపోయిన ఏడుగురిలో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. శివంపేట మండలం ఉసిరికపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడే ప్రాణాలు విడిచారు. ఇక వారంతా పాముబండా తండా వాసులుగా పోలీసులు గుర్తించారు.

ఉసిరికపల్లి నుంచి వెల్దుర్తి వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా.. వేగంగా వచ్చిన ఆ కారు.. రహదారిపై ఉన్న గుంతలో పడటంతో అదుపు తప్పి ఆ తర్వాత ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న గుంతలో పడటంతో గాల్లోకి ఎగిరి రహదారి పక్కకు దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే రోడ్డు పక్కకు ఉన్న చెట్టును ఢీకొట్టింది. అనంతరం అదే వేగంతో కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్పాట్‌లోనే చనిపోయినట్లు స్థానికులు గుర్తించారు.

ఇక ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందించడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులోని మృతదేహాలను బయటికి తీసి.. పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక ఆ ఏడుగురు మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని గుర్తించిన పోలీసులు.. వారిది పాముబండ తండా అని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాద ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

సీఎం చెప్పినా వినరా?

స్టేడియాలను ఇకపై బహిరంగ సభలు, సమావేశాలు, క్రీడేతర కార్యక్రమాలకు వినియోగించబోమని సాక్షాత్తూ సీఎం రేవంత్‌ రెడ్డి రెండునెలల కిందట ఎల్బీ స్టేడియం వేదికగా చెప్పిన మాటలను స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ (శాట్‌) యంత్రాంగం బేఖాతరు చేస్తోంది.

వచ్చే శనివారం గచ్చిబౌలి ప్రధాన స్టేడియంలో దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత విభావరి నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.16 కోట్లకు పైగా వెచ్చించి, స్టేడియంలోని సీట్లు, ఫుట్‌బాల్‌ మైదానాన్ని ఆధునికీకరించింది. అథ్లెటిక్‌ ట్రాక్‌ను కూడా మరమ్మతు చేసే ఆలోచనలో ఉన్న సమయంలో ఈ సంగీత విభావరికి స్టేడియంను ‘శాట్‌’ ఎలా కేటాయించిందని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఇళయరాజా సంగీత విభావరికి స్టేడియాన్ని ఇచ్చినప్పుడు ఫుట్‌బాల్‌ మైదానంలో గుంతలు తవ్వడం, ఆహార పదార్థాల వ్యర్థాలు, ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లు పడేసి చిందరవందరగా తయారు చేశారు.

ఇప్పటికే సంగీత విభావరి నిర్వాహకులు అథ్లెటిక్‌ సింథటిక్‌ ట్రాక్‌పైన స్టేజ్‌ కూడా వేయడంతో ‘శాట్‌’ అధికారుల తీరుపై క్రీడాకారులు, క్రీడాభిమానులు మండిపడుతున్నారు.

వైసీపీ నేత సజ్జలకు బిగ్ షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు దూకుడు పెంచారు. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు. 2021లో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

గురువారం ఉదయం 10:30గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. విచారణ నిమిత్తం మంగిళగిరి పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసులో తెలిపారు. 2021 అక్టోబర్ 19న అప్పటి వైసీపీ ప్రభుత్వంలో రెచ్చిపోయిన ఆ పార్టీకి చెందిన మూకలు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. ఫర్మిచర్, కార్లు, అద్దాలు ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. ఈ ఘటనపై ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను విచారించగా.. తాజాగా సజ్జలకు నోటీసులు ఇచ్చారు.

మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడు వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, ఆ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సన్నిహితుడు చైతన్య సోమవారం రోజున మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం విజయం సాధించిన నాటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. అయితే తాజాగా అతను కోర్టులో లొంగిపోయారు.

అలాగే సోమవారం నాడు వైసీపీ నేతలు అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలసిల రఘురామ్‌ను మంగళగిరి పోలీసులు స్టేషన్‌కు పిలిచి విచారణ జరిపారు. దాడి సమయంలో తీసిన ఫొటోలను చూపించి పలు ప్రశ్నలు సంధించారు. అయితే ఈ కేసును సీఐడీకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది. కేసు విచారణ పూర్తిగా సీఐడీ చేతికి వెళ్లే వరకూ మంగిళగిరి పోలీసులు దర్యాప్తు చేస్తారు.

మట్టే బంగారమాయెనే..

అబ్దుల్లాపూర్‌మెట్‌, యాచారం, మంచాల్‌, ఇబ్రహీంపట్నం మండలాలలో ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలను నిలిపివేయాలని రంగారెడ్డి జిల్లా మైన్‌ అండ్‌ జియాలజీ డిపార్టుమెంట్‌ అసిస్టెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం. నర్సిరెడ్డి రెండు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మట్టికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది.

అబ్దుల్లాపూర్‌మెట్‌, యాచారం, మంచాల్‌, ఇబ్రహీంపట్నం మండలాలలో ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలను నిలిపివేయాలని రంగారెడ్డి జిల్లా మైన్‌ అండ్‌ జియాలజీ డిపార్టుమెంట్‌ అసిస్టెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం. నర్సిరెడ్డి రెండు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మట్టికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పరిధి కోహెడ గ్రామంలో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయంటూ పలువురు ఆగస్టులో జిల్లా మైనింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమ మైనింగ్‌ ఆపాలని సెప్టెంబర్‌ 9వ తేదీన అసిస్టెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎక్కడ అక్రమంగా మట్టి తవ్వకాలు జరిగినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మట్టి తరలిస్తున్న వాహనాలను సీజ్‌ చేయాలని అబ్దుల్లాపూర్‌మెట్‌, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాల తహసీల్దార్‌లను ఆదేశించారు.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మట్టి తవ్వకాలు నిలిపి వేయడంతో లారీల యజమానులు ఇతర ప్రాంతాల నుంచి మట్టిని నగరానికి తరలిస్తున్నారు. అయితే దాదాపు రెట్టింపు ధర తీసుకుంటున్నారు. ప్రధానంగా మహేశ్వరం నియోజకవర్గం, యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి, తూఫ్రాన్‌పేట్‌, సరళ మైసమ్మ, రాచకొండ గుట్టలు, మల్కాపురం, మునుగోడు, దేవరకొండ ప్రాంతాల నుంచి మట్టిని తీసుకొస్తున్నారు.

మైనింగ్‌ శాఖ మట్టి తవ్వకాలను ఆపివేయడంతో కొరత ఏర్పడడంతో ధర పెరిగింది. గతంలో 300 ఫీట్ల లారీ మట్టికి రూ. 3,500 తీసుకునే వారు, ప్రస్తుతం రూ. 6,500 వరకు తీసుకుంటున్నారు. 600 ఫీట్ల లారీకి రూ. 6,500 తీసుకుంటుండగా ఇప్పుడు రూ. 10 వేలు తీసుకుంటున్నారు. 12 టైర్ల లారీ మట్టికి రూ. 10 వేలకుగాను ప్రస్తుతం రూ. 15 వేలు తీసుకుంటున్నారు.

వివిధ ప్రాంతాల నుంచి నగరానికి మట్టి తరలిస్తున్న లారీలను పోలీసులు టార్గెట్‌గా చేసుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు లారీల యజమానులు ఆరోపిస్తున్నారు. లారీకి సుమారు రూ. 5 వేలు వసూలు చేస్తున్నారని అంటున్నారు. ప్రశ్నిస్తే.. వే బిల్లు చూపించమంటున్నారని వాపోయారు. కంకర లారీలను వే బిల్లులు అడగడం లేదంటున్నారు. తమకు వచ్చే లాభం పోలీసుల పరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రేవంత్‌ తెచ్చిన అప్పు 10 నెలల్లో రూ.80,500 కోట్లు

రేవంత్‌ రెడ్డి గద్దె నెక్కిన రోజు నుంచి పది నెలల్లో రూ.80,500 కోట్ల అప్పు తెచ్చారని, రికార్డు స్థాయిలో అప్పులు తెచ్చి దేనికి ఖర్చు చేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 'ఎక్స్‌' వేదికగా ప్రశ్నించారు.

అప్పు చేయడమే తప్పు అన్నోళ్లను ఇప్పుడు దేనితో కొట్టాలని ప్రశ్నించారు. కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టలేదని.. ఎన్నికల హామీలు నెరవేర్చలేదని.. అలాంటప్పుడు అప్పు తెచ్చిన రూ.80 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు.

బడా కాంట్రాక్టర్ల బిల్లులకు ఆ మొత్తం ధారాదత్తం చేశారా? కమీషన్లకు కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులతో ప్రాజెక్టులు నిర్మించామని, ప్రతి పైసా మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేశామన్నారు. తెచ్చిన అప్పులతో దశాబ్దాల కష్టాలు తీర్చామన్నారు.

రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా ఇవ్వకుండా.. ఒక్క ప్రాజెక్టు కట్టకుండా.. నెలల పాటు జీతాలు ఇవ్వకుండా ఇన్ని వేల కోట్లు ఏం చేశారని నిలదీశారు.

రాష్ట్రంలో సంపద సృష్టించే ప్రయత్నం చేయకుండా సొంత ఆస్తులు పెంచుకోవడానికి అప్పులు చేయడం క్షమించరాని నేరమన్నారు. ఈ అప్పులు రాష్ట్ర భవిష్యత్‌ కే పెను ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు.

11 మంది ఐఏఎస్, ఐపీఎస్ లకు షాకిచ్చిన తెలంగాణ ప్రభుత్వం..!

తెలంగాణలో పని చేస్తున్న ఏపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ లకు రేవంత్ రెడ్డి సర్కార్ షాక్ ఇచ్చింది. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం 11 మంది ఐఏఎస్,ఐపీఎస్ అధికారులను రిలీవ్ చేసింది. నాలుగు రోజుల క్రితమే అందరినీ రిలీవ్ చేసినట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది. డీఓపీటీ ఆదేశాల ప్రకారమే రిలీవ్ చేసినట్లు పేర్కొంది. రిలీవ్ అయిన వారితో తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేదని స్పష్టం చేసింది. తెలంగాణ రిలీవ్ చేసిన వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి, సృజనలు ఉన్నారు.

ఏపీ కేడర్ కు చెందిన 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ లో తెలంగాణలో పని చేస్తున్నారు. వీరంతా తమను తెలంగాణలోనే కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్రం ప్రభుత్వం వీరి విజ్ఞప్తిని తిరస్కరించింది. వీరంతా ఏపీలో రిపోర్ట్ చేయాల్సిందిగా స్పష్టం చేసింది. అయినప్పటికీ వీరిలో కొంత మంది క్యాట్ ను ఆశ్రయించారు.మంగళవారం విచారణ చేపట్టిన క్యాట్ ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. డీవోపీటీ ప్రకారం ఎక్కడి వారు అక్కడే రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది.

బుధవారం యథావిధిగా రిపోర్ట్ చేయాలని క్యాట్ ఆదేశించింది. ఏపీలో ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారని.. వారికి సేవ చేయాలని మీకు లేదా అని ప్రశ్నించింది.దీంతో ఈ 11 మంది IAS, IPS అధికారులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమకు తెలంగాణ క్యాడరే కావాలని పిటిషన్ లో కోరారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో పని చేస్తున్న తెలంగాణ కేడర్ కు చెందిన అనంతరాము, ఎస్ఎస్ రావత్, హరికిరణ్, సృజన, శివశంకర్ ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ లను రిలీవ్ చేయడంతో వీరంతా ఏపీలో రిపోర్ట్ చేస్తారా.. హైకోర్టు ఏం చెబుతుందో చూడాలి. గతంలో తెలంగాణలో పని చేసిన సోమేశ్ కుమార్ ను కూడా ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఆయన ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేసి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.

మంత్రివర్గ భేటీ - వాలంటీర్లు, అమ్మకు వందనంపై కీలక నిర్ణయం..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల అమలుకు సిద్దం అవుతోంది. అభివృద్ధి - సంక్షేమ రంగాలకు సంబంధించి నేటి మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ఏపీ ప్రభుత్వం కొత్త పాలసీలను ఈ సమావేశంలో ఆమోదించనుంది. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నూతన విధానాలను ఖరారు చేయనుంది. వాలంటీర్ల అంశంతో పాటుగా అమ్మకు వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాల అమలు పైన మంత్రివర్గం చర్చించనుంది.

ఏపీ మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకానికి ఆమోదం తెలపనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏటా ప్రతీ ఇంటికీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ విధి విధానాలను ఈ రోజు సమావేశంలో ఖరారు చేయనున్నారు. దీపావళి నాడు ఈ పథకం అమలు ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇక..వాలంటీర్ల అంశం పైన ఈ రోజు చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాలంటీర్లకు స్కిల్ శిక్షణ.. వేతనాల చెల్లింపు .. ఎంత సంఖ్య మేర వాలంటీర్ల సేవలు కొనసాగించాలనే అంశాల పైన మంత్రివర్గం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టబడులు..ఉపాధి కల్పన కోసం కొత్త పాలసీలను నేటి మంత్రివర్గంలో ఆమోదం తెలపనుంది. చెత్త పన్ను రద్దు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ అంశం పైన చర్చించనున్నారు. బాధితుల పైన భారం లేకుండా వారికి రుణాల రీ షెడ్యూల్ వేళ స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనుంది. దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది.

ఆలయ పాలకవర్గాల్లో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కొత్తగా కూటమి ప్రభుత్వం బాధ్యతల స్వీకరణ తరువాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టలేదు. ఓట్ ఆన్ ఎకౌంట్ ద్వారా నెట్టుకొస్తున్నారు. దీంతో, బడ్జెట్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సంక్రాంతి నుంచి సంక్రాంతి నుంచి పీ-4 విధానం అమలుపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమయంలో మరో ఎన్నికల హామీ అమ్మకు వందనం పైన అధికారులు నివేదిక సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలు వచ్చే ఆర్దిక సంవత్సరంలో అమలు చేయాలని తొలుత భావించినా... అంతకు ముందే అమలు పైన నేటి సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం.

అమ్రపాలీకి ఏపీలో కీలక బాధ్యతలు

ఐఏఎస్ ల వ్యవహారంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. డీఓపీటీ ఆదేశాల పై క్యాట్ కు వెళ్లినా అధికారులకు రిలీఫ్ దక్కలేదు. దీంతో, హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఇదే సమయంలో నేటితో డీఓపీటీ డెడ్ లైన్ ముగుస్తుండటంతో ఏపీ ప్రభుత్వం ముందు రిపోర్ట్ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ సమయంలోనే రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక పరిణామాలు తెర మీదకు వచ్చాయి.

ఏపీకి కేటాయించిన అధికారులు ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందు రిపోర్ట్ చేయాలని క్యాట్ ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ కు వాయిదా వేసింది. క్యాట్ ఆదేశాల పైన హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే, డీఓపీటీ ఏపీలో రిపోర్టు చేయాలంటూ ఇచ్చిన డెడ్ లైన్ నేటితో ముగుస్తోంది. దీంతో..ఏపీ ప్రభుత్వం ముందు రిపోర్ట్ చేయటానికి అమ్రపాలీ సహా ఇతర అధికారులు సిద్దమయ్యారు. కీలక స్థానాల్లో ఉన్న అధికారులను రిలీవ్ చేయటం పైన తెలంగాణ సీఎస్ తో సీఎంఓతో చర్చించారు. రిలీవ్ చేయకుండా ప్రత్యామ్నాయాల పైన అన్వేషణ ప్రారంభించారు. అయితే, క్యాట్ ఆదేశాలతో అధికారులు ఏపీలో రిపోర్ట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

క్యాట్ ఆదేశాలతో ముందుగా కేటాయించిన రాష్ట్రాల్లో అధికారులు రిపోర్ట్ చేయనున్నారు. దీంతో, అమ్రపాలి స్థానంలో జీమెచ్ఎంసీ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అమ్రపాలీ తన వ్యక్తిగత వివరాల్లో విశాఖపట్టణం శాశ్వత చిరునామాగా పేర్కొన్న నేపథ్యంలో ఆమెను ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌గా గుర్తించారు. జూన్‌ 26వ తేదీన ఆమె బల్దియా కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆగస్టు 20న ఆమెను రెగ్యులర్‌ కమిషనర్‌గా ప్రభుత్వం నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో అమ్రపాలీకి కీలక బాధ్యతలు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని కార్యాలయంలోనూ పని చేసి ఉండటం ఇప్పుడు అమ్రపాలీకి కలిసొచ్చే అంశం.

ఇక్కడే కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. డీఓపీటీ ఉత్తర్వులతో ఏపీలో ఆమ్రపాలి రిపోర్ట్‌ చేసినా.. తిరిగి తెలంగాణకు వచ్చే అవకాశం ఉందనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర అవగాహనకు వస్తే ఈ అధికారులను యధాతధంగా కొనసాగించే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఆమ్రపాలి ఏపీలో రిపోర్ట్‌ చేసిన అనంతరం.. అక్కడి సర్కారు అంగీకరిస్తే తిరిగి తెలంగాణలో విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. అయితే, ఈ విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. డీఓపీటీ అదేశాల మేరకు అధికారులు రిపోర్ట్ చేస్తూనే.. అటు న్యాయ పరంగా.. ఇటు ప్రభుత్వాల పరంగా తమ ప్రయత్నాలు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.