మట్టే బంగారమాయెనే..

అబ్దుల్లాపూర్‌మెట్‌, యాచారం, మంచాల్‌, ఇబ్రహీంపట్నం మండలాలలో ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలను నిలిపివేయాలని రంగారెడ్డి జిల్లా మైన్‌ అండ్‌ జియాలజీ డిపార్టుమెంట్‌ అసిస్టెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం. నర్సిరెడ్డి రెండు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మట్టికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది.

అబ్దుల్లాపూర్‌మెట్‌, యాచారం, మంచాల్‌, ఇబ్రహీంపట్నం మండలాలలో ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలను నిలిపివేయాలని రంగారెడ్డి జిల్లా మైన్‌ అండ్‌ జియాలజీ డిపార్టుమెంట్‌ అసిస్టెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం. నర్సిరెడ్డి రెండు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మట్టికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పరిధి కోహెడ గ్రామంలో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయంటూ పలువురు ఆగస్టులో జిల్లా మైనింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమ మైనింగ్‌ ఆపాలని సెప్టెంబర్‌ 9వ తేదీన అసిస్టెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎక్కడ అక్రమంగా మట్టి తవ్వకాలు జరిగినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మట్టి తరలిస్తున్న వాహనాలను సీజ్‌ చేయాలని అబ్దుల్లాపూర్‌మెట్‌, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాల తహసీల్దార్‌లను ఆదేశించారు.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మట్టి తవ్వకాలు నిలిపి వేయడంతో లారీల యజమానులు ఇతర ప్రాంతాల నుంచి మట్టిని నగరానికి తరలిస్తున్నారు. అయితే దాదాపు రెట్టింపు ధర తీసుకుంటున్నారు. ప్రధానంగా మహేశ్వరం నియోజకవర్గం, యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి, తూఫ్రాన్‌పేట్‌, సరళ మైసమ్మ, రాచకొండ గుట్టలు, మల్కాపురం, మునుగోడు, దేవరకొండ ప్రాంతాల నుంచి మట్టిని తీసుకొస్తున్నారు.

మైనింగ్‌ శాఖ మట్టి తవ్వకాలను ఆపివేయడంతో కొరత ఏర్పడడంతో ధర పెరిగింది. గతంలో 300 ఫీట్ల లారీ మట్టికి రూ. 3,500 తీసుకునే వారు, ప్రస్తుతం రూ. 6,500 వరకు తీసుకుంటున్నారు. 600 ఫీట్ల లారీకి రూ. 6,500 తీసుకుంటుండగా ఇప్పుడు రూ. 10 వేలు తీసుకుంటున్నారు. 12 టైర్ల లారీ మట్టికి రూ. 10 వేలకుగాను ప్రస్తుతం రూ. 15 వేలు తీసుకుంటున్నారు.

వివిధ ప్రాంతాల నుంచి నగరానికి మట్టి తరలిస్తున్న లారీలను పోలీసులు టార్గెట్‌గా చేసుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు లారీల యజమానులు ఆరోపిస్తున్నారు. లారీకి సుమారు రూ. 5 వేలు వసూలు చేస్తున్నారని అంటున్నారు. ప్రశ్నిస్తే.. వే బిల్లు చూపించమంటున్నారని వాపోయారు. కంకర లారీలను వే బిల్లులు అడగడం లేదంటున్నారు. తమకు వచ్చే లాభం పోలీసుల పరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రేవంత్‌ తెచ్చిన అప్పు 10 నెలల్లో రూ.80,500 కోట్లు

రేవంత్‌ రెడ్డి గద్దె నెక్కిన రోజు నుంచి పది నెలల్లో రూ.80,500 కోట్ల అప్పు తెచ్చారని, రికార్డు స్థాయిలో అప్పులు తెచ్చి దేనికి ఖర్చు చేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 'ఎక్స్‌' వేదికగా ప్రశ్నించారు.

అప్పు చేయడమే తప్పు అన్నోళ్లను ఇప్పుడు దేనితో కొట్టాలని ప్రశ్నించారు. కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టలేదని.. ఎన్నికల హామీలు నెరవేర్చలేదని.. అలాంటప్పుడు అప్పు తెచ్చిన రూ.80 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు.

బడా కాంట్రాక్టర్ల బిల్లులకు ఆ మొత్తం ధారాదత్తం చేశారా? కమీషన్లకు కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులతో ప్రాజెక్టులు నిర్మించామని, ప్రతి పైసా మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేశామన్నారు. తెచ్చిన అప్పులతో దశాబ్దాల కష్టాలు తీర్చామన్నారు.

రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా ఇవ్వకుండా.. ఒక్క ప్రాజెక్టు కట్టకుండా.. నెలల పాటు జీతాలు ఇవ్వకుండా ఇన్ని వేల కోట్లు ఏం చేశారని నిలదీశారు.

రాష్ట్రంలో సంపద సృష్టించే ప్రయత్నం చేయకుండా సొంత ఆస్తులు పెంచుకోవడానికి అప్పులు చేయడం క్షమించరాని నేరమన్నారు. ఈ అప్పులు రాష్ట్ర భవిష్యత్‌ కే పెను ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు.

11 మంది ఐఏఎస్, ఐపీఎస్ లకు షాకిచ్చిన తెలంగాణ ప్రభుత్వం..!

తెలంగాణలో పని చేస్తున్న ఏపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ లకు రేవంత్ రెడ్డి సర్కార్ షాక్ ఇచ్చింది. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం 11 మంది ఐఏఎస్,ఐపీఎస్ అధికారులను రిలీవ్ చేసింది. నాలుగు రోజుల క్రితమే అందరినీ రిలీవ్ చేసినట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది. డీఓపీటీ ఆదేశాల ప్రకారమే రిలీవ్ చేసినట్లు పేర్కొంది. రిలీవ్ అయిన వారితో తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేదని స్పష్టం చేసింది. తెలంగాణ రిలీవ్ చేసిన వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి, సృజనలు ఉన్నారు.

ఏపీ కేడర్ కు చెందిన 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ లో తెలంగాణలో పని చేస్తున్నారు. వీరంతా తమను తెలంగాణలోనే కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్రం ప్రభుత్వం వీరి విజ్ఞప్తిని తిరస్కరించింది. వీరంతా ఏపీలో రిపోర్ట్ చేయాల్సిందిగా స్పష్టం చేసింది. అయినప్పటికీ వీరిలో కొంత మంది క్యాట్ ను ఆశ్రయించారు.మంగళవారం విచారణ చేపట్టిన క్యాట్ ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. డీవోపీటీ ప్రకారం ఎక్కడి వారు అక్కడే రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది.

బుధవారం యథావిధిగా రిపోర్ట్ చేయాలని క్యాట్ ఆదేశించింది. ఏపీలో ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారని.. వారికి సేవ చేయాలని మీకు లేదా అని ప్రశ్నించింది.దీంతో ఈ 11 మంది IAS, IPS అధికారులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమకు తెలంగాణ క్యాడరే కావాలని పిటిషన్ లో కోరారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో పని చేస్తున్న తెలంగాణ కేడర్ కు చెందిన అనంతరాము, ఎస్ఎస్ రావత్, హరికిరణ్, సృజన, శివశంకర్ ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ లను రిలీవ్ చేయడంతో వీరంతా ఏపీలో రిపోర్ట్ చేస్తారా.. హైకోర్టు ఏం చెబుతుందో చూడాలి. గతంలో తెలంగాణలో పని చేసిన సోమేశ్ కుమార్ ను కూడా ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఆయన ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేసి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.

మంత్రివర్గ భేటీ - వాలంటీర్లు, అమ్మకు వందనంపై కీలక నిర్ణయం..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల అమలుకు సిద్దం అవుతోంది. అభివృద్ధి - సంక్షేమ రంగాలకు సంబంధించి నేటి మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ఏపీ ప్రభుత్వం కొత్త పాలసీలను ఈ సమావేశంలో ఆమోదించనుంది. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నూతన విధానాలను ఖరారు చేయనుంది. వాలంటీర్ల అంశంతో పాటుగా అమ్మకు వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాల అమలు పైన మంత్రివర్గం చర్చించనుంది.

ఏపీ మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకానికి ఆమోదం తెలపనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏటా ప్రతీ ఇంటికీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ విధి విధానాలను ఈ రోజు సమావేశంలో ఖరారు చేయనున్నారు. దీపావళి నాడు ఈ పథకం అమలు ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇక..వాలంటీర్ల అంశం పైన ఈ రోజు చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాలంటీర్లకు స్కిల్ శిక్షణ.. వేతనాల చెల్లింపు .. ఎంత సంఖ్య మేర వాలంటీర్ల సేవలు కొనసాగించాలనే అంశాల పైన మంత్రివర్గం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టబడులు..ఉపాధి కల్పన కోసం కొత్త పాలసీలను నేటి మంత్రివర్గంలో ఆమోదం తెలపనుంది. చెత్త పన్ను రద్దు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ అంశం పైన చర్చించనున్నారు. బాధితుల పైన భారం లేకుండా వారికి రుణాల రీ షెడ్యూల్ వేళ స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనుంది. దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది.

ఆలయ పాలకవర్గాల్లో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కొత్తగా కూటమి ప్రభుత్వం బాధ్యతల స్వీకరణ తరువాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టలేదు. ఓట్ ఆన్ ఎకౌంట్ ద్వారా నెట్టుకొస్తున్నారు. దీంతో, బడ్జెట్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సంక్రాంతి నుంచి సంక్రాంతి నుంచి పీ-4 విధానం అమలుపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమయంలో మరో ఎన్నికల హామీ అమ్మకు వందనం పైన అధికారులు నివేదిక సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలు వచ్చే ఆర్దిక సంవత్సరంలో అమలు చేయాలని తొలుత భావించినా... అంతకు ముందే అమలు పైన నేటి సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం.

అమ్రపాలీకి ఏపీలో కీలక బాధ్యతలు

ఐఏఎస్ ల వ్యవహారంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. డీఓపీటీ ఆదేశాల పై క్యాట్ కు వెళ్లినా అధికారులకు రిలీఫ్ దక్కలేదు. దీంతో, హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఇదే సమయంలో నేటితో డీఓపీటీ డెడ్ లైన్ ముగుస్తుండటంతో ఏపీ ప్రభుత్వం ముందు రిపోర్ట్ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ సమయంలోనే రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక పరిణామాలు తెర మీదకు వచ్చాయి.

ఏపీకి కేటాయించిన అధికారులు ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందు రిపోర్ట్ చేయాలని క్యాట్ ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ కు వాయిదా వేసింది. క్యాట్ ఆదేశాల పైన హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే, డీఓపీటీ ఏపీలో రిపోర్టు చేయాలంటూ ఇచ్చిన డెడ్ లైన్ నేటితో ముగుస్తోంది. దీంతో..ఏపీ ప్రభుత్వం ముందు రిపోర్ట్ చేయటానికి అమ్రపాలీ సహా ఇతర అధికారులు సిద్దమయ్యారు. కీలక స్థానాల్లో ఉన్న అధికారులను రిలీవ్ చేయటం పైన తెలంగాణ సీఎస్ తో సీఎంఓతో చర్చించారు. రిలీవ్ చేయకుండా ప్రత్యామ్నాయాల పైన అన్వేషణ ప్రారంభించారు. అయితే, క్యాట్ ఆదేశాలతో అధికారులు ఏపీలో రిపోర్ట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

క్యాట్ ఆదేశాలతో ముందుగా కేటాయించిన రాష్ట్రాల్లో అధికారులు రిపోర్ట్ చేయనున్నారు. దీంతో, అమ్రపాలి స్థానంలో జీమెచ్ఎంసీ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అమ్రపాలీ తన వ్యక్తిగత వివరాల్లో విశాఖపట్టణం శాశ్వత చిరునామాగా పేర్కొన్న నేపథ్యంలో ఆమెను ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌గా గుర్తించారు. జూన్‌ 26వ తేదీన ఆమె బల్దియా కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆగస్టు 20న ఆమెను రెగ్యులర్‌ కమిషనర్‌గా ప్రభుత్వం నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో అమ్రపాలీకి కీలక బాధ్యతలు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని కార్యాలయంలోనూ పని చేసి ఉండటం ఇప్పుడు అమ్రపాలీకి కలిసొచ్చే అంశం.

ఇక్కడే కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. డీఓపీటీ ఉత్తర్వులతో ఏపీలో ఆమ్రపాలి రిపోర్ట్‌ చేసినా.. తిరిగి తెలంగాణకు వచ్చే అవకాశం ఉందనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర అవగాహనకు వస్తే ఈ అధికారులను యధాతధంగా కొనసాగించే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఆమ్రపాలి ఏపీలో రిపోర్ట్‌ చేసిన అనంతరం.. అక్కడి సర్కారు అంగీకరిస్తే తిరిగి తెలంగాణలో విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. అయితే, ఈ విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. డీఓపీటీ అదేశాల మేరకు అధికారులు రిపోర్ట్ చేస్తూనే.. అటు న్యాయ పరంగా.. ఇటు ప్రభుత్వాల పరంగా తమ ప్రయత్నాలు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎస్కార్ట్‌గా వచ్చిన సింగపూర్ యుద్ధ విమానాలు

భారత విమానయాన సంస్థలకు చెందిన విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. తాజాగా మధురై నుంచి సింగపూర్ వెళ్లిన ఎయిరిండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ ఐఎక్స్ 684కి ఈ బాంబు బెదిరింపు వచ్చింది. ఈ సమాచారం తెలిసి సింగపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలోని చాంగీ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ముందు విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా మళ్లించడానికి సింగపూర్‌ భద్రతా దళాలకు చెందిన రెండు ఫైటర్ జెట్‌లు రంగంలోకి దిగాయి. ఎయిరిండియా విమానానికి ఎస్కార్ట్‌గా వ్యవహరించి విమానాన్ని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లాయి.

విమానం సింగపూర్‌కు బయలుదేరిన తర్వాత విమానంలో బాంబు ఉందంటూ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు ఈ-మెయిల్ వచ్చింది. ఎయిరిండియా విమానానికి సింగపూర్ యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా రావడంపై సింగపూర్ రక్షణ మంత్రి ఎన్‌జీ ఎంగ్ హెన్ స్పందించారు. ఎయిరిండియా విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లడానికి రెండు ఆర్ఎస్ఏఎఫ్ ఎఫ్-15ఎస్‌జీలు రంగంలోకి దిగాయని తెలిపారు. విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లాయని, చివరకు విమానం చాంగీ విమానాశ్రయంలో రాత్రి (మంగళవారం) 10:04 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎక్స్ వేదికగా ప్రకటించారు.

కాగా బాంబు బెదిరింపు నేపథ్యంలో సింగపూర్ అధికారులు గ్రౌండ్ బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌, ఎక్స్‌ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్‌ను యాక్టివేట్ చేశారు. ల్యాండ్ అయిన వెంటనే విమానాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

మరో విమానం కెనడాకు మళ్లింపు..

మరోవైపు ఢిల్లీ నుంచి షికాగో వెళ్లాల్సిన ఎయిరిండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని కెనడాకు దారి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేయించారు. విమానం మంగళవారం తెల్లవారుజామున బయలుదేరిన తర్వాత బెదిరింపు వచ్చింది. దీంతో కెనడాలోని ఇకాలిట్ విమానాశ్రయానికి మళ్లించామని ఎయిరిండియా తెలిపింది. భద్రతా ప్రోటోకాల్ ప్రకారం ప్రయాణికులు అందరినీ కిందికి దించి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్టు ఎయిరిండియా అధికారికంగా ప్రకటించింది.

ముంబై నటి జత్వానీ కేసులో కీలక మలుపు..

ముంబై నటి జత్వానీ కేసులో పోలీస్ అధికారులు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

కేసును సీఐడీకి అప్పగించారని, కౌంటర్లు దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యర్థించారు.

ముంబై నటి జత్వానీ(Jatwani) కేసులో పోలీస్ అధికారులు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు (AP High Court)లో విచారణ జరిగింది. కేసును సీఐడీకి అప్పగించారని, కౌంటర్లు దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యర్థించారు.

కేసు డిస్పోజ్ అయ్యే వరకూ పోలీస్ అధికారులకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలయ్యే విధంగా చూడాలని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు అభ్యర్థించారు. ఈ అంశాలను నోట్ చేసుకున్న న్యాయస్థానం కేసు విచారణ ఈనెల 23కి వాయిదా వేసింది.

ఎక్కువ డిమాండ్ ఉన్న వైన్ షాపులను దక్కించుకున్న తెలంగాణ వాసులు

ఆంధ్రప్రదేశ్‌లో నోటిఫై చేసిన మద్యం దుకాణాలకు టెండర్లు వేసేందుకు.. ఈసారి ఇతర రాష్ట్రాల వారికి కూడా అవకాశం ఇచ్చారు. దీంతో తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల వారు కూడా భారీగా టెండర్లు వేశారు. వారికి కొన్ని వైన్ షాపులు దక్కాయి. ఏపీలోనే ఎక్కువ డిమాండ్ ఉన్న మద్యం దుకాణాలు తెలంగాణ వ్యాపారులకు దక్కడం ఇప్పడు టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది.

ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయిలోని 96వ నంబరు దుకాణానికి 132, 97వ నంబరు దుకాణానికి 120, పెనుగంచిప్రోలులోని 81వ నంబరు దుకాణానికి 110 దరఖాస్తులు వచ్చాయి. ఈ మద్యం దుకాణాలకు రాష్ట్రంలోనే అత్యధికంగా డిమాండ్ ఉంది. అయితే.. ఈ మూడు షాపుల లైసెన్సులు లాటరీలో తెలంగాణ రాష్ట్రం వారినే వరించాయి.

96వ నంబరు వైన్ షాపు ఖమ్మం జిల్లా ఖానాపురం గ్రామానికి చెందిన చెరుకుపల్లి సత్యనారాయణకు దక్కింది. 97వ నంబరు మద్యం దుకాణాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బండి అనూష దక్కించుకున్నారు. 81వ నంబరు దుకాణం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన తల్లపల్లి రాజుకు దక్కింది. ఎక్కువ డిమాండ్ ఉన్న షాపులు తమకు దక్కడంతో వీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వ్యాపారులు కూడా టెండర్ ప్రక్రియలో పాల్గొన్నారు. విజయవాడలోని 14, 18వ నంబరు వైన్ షాపులు మధ్యప్రదేశ్‌‌కు చెందిన రాహుల్‌ శివ్‌హరే, అర్పిత్‌ శివ్‌హరేకు దక్కాయి. మచిలీపట్నంలో ఓ దుకాణాన్ని కర్ణాటకకు చెందిన మహేష్‌ బాతే, మరో దుకాణాన్ని ఢిల్లీ వాసి లోకేశ్‌ చంద్‌ దక్కించుకున్నారు.

ఒడిశా రాష్ట్రానికి చెందిన లిక్కర్ వ్యాపారులకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో రెండేసి దుకాణాలు వచ్చాయి. కర్నూలు జిల్లాలో 10 మద్యం దుకాణాలు కర్ణాటక, తెలంగాణలకు చెందిన వ్యాపారులు దక్కించుకున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులోని 80వ నంబరు దుకాణం పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తికి దక్కింది. ఎన్‌.రామకృష్ణ పదేళ్లుగా పెట్రోల్‌ బంకులో పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన కొంతమందితో కలిసి దరఖాస్తు చేయగా.. లిక్కర్ లక్కు వరించింది.

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, పూర్తి తేదీలివే

దేశంలో ఇటీవలే హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇప్పుడు మరో రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. రెండు రాష్ట్రాల ఎన్నికలు నవంబర్ నెలలో ముగియనున్నాయి. 

కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26న, జార్ఘండ్ అసెంబ్లీ గడువు జనవరి 5న ముగియనుంది. మహారాష్ట్రంలో మొత్తం 285 అసెంబ్లీ స్థానాలు, జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 9 కోట్ల 63 లక్షలమంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 186 పోలింగ్ బూత్‌లు, 29 వేల 562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. 

మహారాష్ట్రలో అక్టోబర్ 22న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. అక్టోబర్ 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 30వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 4 నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 285 అసెంబ్లీ స్థానాలను సింగిల్ ఫేజ్‌లో జరగనున్నాయి. 

ఇక 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో మొత్తం 2.86 కోట్ల ఓటర్లున్నారు. జార్ఖండ్‌లో మాత్రం రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 18న వెలువడనుంది. అక్టోబర్ 25 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 28 నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 30వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది. నవంబర్ 13న పోలింగ్ ఉంటుంది. ఫలితాలు నవంబర్ 23న వెలువడనున్నాయి.

ఇక రెండో దశ నోటిఫికేషన్ అక్టోబర్ 22న వెలువడనుండగా నామినేషన్లు అక్టోబర్ 29 వరకూ స్వీకరిస్తారు. అక్టోర్ 30 నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 1 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. నవంబర్ 20 పోలింగ్, నవంబర్ 23న ఫలితాలు వెలుడనున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 48 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా ఇదే సమయంలో జరగనున్నాయి.

ఏపీలో ఈ రోజుతో మూతపడనున్న ప్రభుత్వ మద్యం దుకాణాలు

ఏపీలో గత ఐదేళ్లుగా కొనసాగుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాలు ఈరోజుతో మూతపడనున్నాయి. రేపటి నుంచి ప్రైవేట్ వైన్ షాపులు తెరుచుకోనున్నాయి.

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా... మొత్తం 3,396 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించారు. లాటరీ పద్ధతి ద్వారా నిన్న మద్యం దుకాణాలను కేటాయించారు.

మద్యం దుకాణాలను సొంతం చేసుకున్నవారు రేపటి నుంచి షాపులను తెరుచుకోవచ్చు. రేపు ఉదయం 10 గంటలకు కొత్త వైన్స్ తెరుచుకోనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్స్ తెరిచి ఉంటాయి.

మద్యం షాపుల కోసం ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా ఆన్ లైన్లో దరఖాస్తులు వచ్చాయి. అమెరికాతో పాటు మరి కొన్ని దేశాల నుంచి కూడా అప్లికేషన్లను వేశారు.