17 వేల మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన ‘బోయింగ్’

విమాన తయారీ దిగ్గజ సంస్థ బోయింగ్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మంది అంటే 17 వేల మంది ఉద్యోగులపై వేటుకు రెడీ అయింది. ఈ మేరకు సంస్థ సీఈవో కెల్లీ ఓర్ట్‌బెర్గ్ ఈమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. కంపెనీ తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

సియాటెల్ ప్రాంతంలో ఆ సంస్థకు చెందిన 33 వేల మంది కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో పలు విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె కారణంగా 2025లో డెలివరీ చేయాల్సిన 777 ఎక్స్ విమానాలను ఆ తర్వాతి ఏడాదికి అంటే 2026కు వాయిదా వేసింది.

ఇప్పటికే ఉన్న ఆర్డర్లు పూర్తయిన తర్వాత 2027 నుంచి 767 ఫ్రైటర్ విమానాల ఉత్పత్తిని కూడా నిలిపివేయాలని కంపెనీ యోచిస్తోంది. 

ఇక ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత కంపెనీ షేర్లు 1.7 శాతం పతనమయ్యాయి. కార్మికుల సమ్మె కారణంగా మూడో త్రైమాసికంలో సంస్థ 5 బిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకుంది.

ఈ నష్టాలను పూడ్చుకునేందుకు ఇప్పుడు 17 వేల మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైంది.

కూటమి ప్రభుత్వ ఇసుక విధానంపై జగన్ ఫైర్

రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం పేరుతో చంద్రబాబు దోపిడీ చేస్తున్నారంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రజలకు ఉచిత ఇసుక లభించడం లేదని అన్నారు. రాష్ట్రంలో అమలు అవుతున్న ఉచిత ఇసుక విధానంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట. ఇసుక దోపిడీ వ్యవహారంలో చంద్రబాబు తీరు కూడా అలాగే ఉందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు.  

గత ప్రభుత్వం మీద నిందలు వేసి, అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటి? అని జగన్ నిలదీశారు. అందుకే చంద్రబాబునే అడుగుతున్నా.. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? లభిస్తే ఎక్కడో చెప్పగలరా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అదికూడా లేదన్నారు. అసలు ఇసుక‌ కొందామంటేనే గతంలో కంటే రేటు రెండింతలు ఉందన్నారు. ఎన్నికల్లో ఉచితంగా ఇసుకను ఇస్తామంటూ ఊరూరా డప్పువేసిన విషయాన్ని మరిచిపోయారా? ఇది ప్రజలను పచ్చిగా మోసం చేయడం కాదా? అధికార దుర్వినియోగంతో ఇసుకచుట్టూ ఒక మాఫియాను మీరు ఏర్పాటు చేయలేదా? భరించలేని రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారా? లేదా? అంటూ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. 

ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి క్షణంలోనే టీడీపీ, కూటమి పార్టీలకు చెందిన నేతల చూపులు ఇసుక నిల్వలపై పడ్డాయన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా వైసీపీ ప్రభుత్వం స్టాక్‌ యార్డుల్లో ఉంచిన సుమారు 80 లక్షల టన్నుల్లో సగం ఇసుక మీ ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడవక ముందే ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే టీడీపీ, ఆ కూటమికి చెందిన పార్టీల నేతలు దోచేయలేదా? కొండల్లా ఉండే ఇసుక నిల్వలు కొన్నిరోజుల వ్యవధిలోనే మాయం అయిపోయాయన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. 

 

2014 - 19 మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానీయకుండా పక్కా అవినీతి పథక రచనతో ఇసుకను దోచేసిన వ్యవహారం మళ్లీ ఇప్పుడు పునరావృతం అయిందన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దీనికి సృష్టికర్త, మూలపురుషుడు మీరే కదా చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు. ఆ రోజుల్లో ఇసుక బాధ్యతలను మొదట ఏపీఎండీసీకి అప్పగించారు, ఆ తర్వాత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామన్నట్టు గా బిల్డప్‌ ఇచ్చారు, రెండు నెలలు కాకుండానే దాన్నీ రద్దుచేసి టెండర్లు నిర్వహిస్తామన్నారు, చివరకు ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉచిత ఇసుక పేరుతో ఒకే ఒక్క మెమో ఇచ్చి అప్పనంగా మీ మనుషులకు అప్పగించారని ఆరోపించారు. మొత్తంగా 19 జీవోలు ఆ ఐదేళ్లలో ఇచ్చారన్నారు. ఈ నది, ఆ నది అని లేకుండా ప్రతి చోటా ఇసుకను కొల్లగొట్టి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. 

 

'ఇప్పుడు కూడా జరుగుతున్నది సేమ్‌ టు సేమ్‌. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా ఇప్పటికీ స్పష్టమైన ఇసుక విధానం లేదు. పేరుకు ఉచితం అంటున్నారంటే.. మొత్తం వ్యవహారం అంతా చంద్రబాబు గారు, ఆయన ముఠా వల్ల, ముఠా కొరకు, ముఠా చేతుల మీదుగా నడుస్తోంది. పాలసీని ప్రకటించకుండా ప్రజలంతా దసరా పండుగలో ఉంటే, దొంగ చాటుగా టెండర్లు పిలవడం నిజంకాదా? దేశంలో ఎక్కడా చూడని విధంగా ఉద్దేశపూర్వకంగా కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఇచ్చింది మీ స్వార్థం కోసం కాదా? ఎవ్వరినీ టెండర్లలో పాల్గొన కుండా దౌర్జన్యాలకు పాల్పడిన మాట వాస్తవం కాదా?' అంటూ జగన్ ప్రశ్నించారు. 

 

అదే గతంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేసింది. దోపిడీలకు అడ్డుకట్ట వేసి ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, అటు వినియోగదారునికీ సరసమైన ధరకు అందించింది. అత్యంత పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ ఫ్లాట్‌ ఫాం మీద ఇ-టెండర్లు నిర్వహించింది. రీచ్‌ల వద్ద ఆపరేషన్‌ ఖర్చులతో కలిపి టన్ను ఇసుకను రూ.475కే సరఫరా చేసింది. ఇందులో రూ.375లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేలా చేసింది. రవాణా ఛార్జీలతో కలిపి ప్రతి నియోజకవర్గానికీ ఇసుక రేట్లను ప్రకటించిందన్నారు. 

'వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని నిరంతరం దుమ్మెత్తిపోసే పత్రికల్లో కూడా నియోజకవర్గాల వారీగా పారదర్శకంగా రేట్లపై ప్రకటనలు ఇచ్చింది. ప్రజలకు తక్కువ ధరకు ఒకవైపు ఇస్తూ మరోవైపు రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చేట్టుగా చేసింది. రేట్లపై సెబ్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేసి తప్పులకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకుంది. తద్వారా ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయాన్ని ఖజానాకు వచ్చేలా చేసింది. మరి మీ హయాంలో ప్రభుత్వానికి ఒక్క రూపాయి రావటంలేదన్నది వాస్తవం కాదా? ప్రజలకూ ఉచితంగా అందడం లేదన్నది నిజం కాదా? ఇసుక ఉచితమే అయితే వైసీపీ హయాంలో కన్నా రేట్లు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి? మరి ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది చంద్రబాబు గారూ' అంటూ జగన్ ప్రశ్నించారు.

హిందూ ధర్మాన్ని, ఆలయాల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది

రాబోయే తరాల వారికి హిందూ ధర్మాన్ని , హిందూ దేవాలయాల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన మహిళా అధ్యక్షురాలు పాలకూరి రమాదేవి కోరుతా ,తిరుమల వేంకటేశ్వర స్వామిని తమ కుటుంబసమేతంగా దర్శనం దర్శనం చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు..

ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ..

మన పూర్వీకులు పెద్దలు వందల సంవత్సరాల క్రితమే ఆలయాలను నెలకొల్పి, ఆలయాల పవిత్రతను, ఆలయాల సంబంధించినటువంటి స్థలాలను మనకు అందించడం జరిగిందని ఇట్టి పవిత్రతను హిందూ ధర్మాన్ని ఆలయాల సంపదను రాబోయే తరాలకు అందించడానికి హిందూ సమాజం సంఘటితంతో ముందుకు వెళ్లాలని రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన మహిళా జిల్లా అధ్యక్షురాలు పాలకూరి రమాదేవి తెలిపారు..

ఆ కంపెనీలో వాటా కొనుగోలుకు రిలయన్స్ ఇండస్ట్రీస్.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే డిస్నీ హాట్ స్టార్ కొనుగోలుకు అనుమతులు పొందిన వేళ స్టీమింగ్ రంగంపై అంబానీ దృష్టి మరింతగా పెరిగింది. ఈ క్రమంలోనే మరో పెద్ద కొనుగోలుకు చూస్తున్నట్లు తెలుస్తోంది

అవును ముఖేష్ అంబానీ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ కంపెనీలో కీలక వాటాదారుగా మారాలని చూస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. స్టేక్ కొనుగోలుకు ఇప్పటికే చర్చలు మెుదలయ్యాయని తెలుస్తోంది. దర్శకుడు కరణ్ జోహార్ సంస్థ పూర్ & సన్స్, యే జవానీ హై దీవానీ, కల్ హో నా హో, కభీ ఖుషీ కభీ ఘమ్ వంటి సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ కంటెంట్ ప్రొడక్షన్ వ్యాపారంలో ముందుకు వెళ్లేందుకు ఈ వాటాల కొనుగోలుకు దిగుతోందని తెలుస్తోంది. అయితే డీల్ పరిమాణం ఎంత అనే వివరాలు ఇప్పటి వరకు వెల్లడికాలేదు.

ధర్మా ప్రొడక్షన్స్ లో కరణ్ జోహార్ ప్రస్తుతం 90 శాతానికి పైగా వాటాలను హోల్డ్ చేస్తున్నారు. మిగిలిన 9.24 శాతం వాటాను ఆమె తల్లి హిరూ జోహార్ కలిగి ఉన్నారు. అయితే గత కొంత కాలంగా ఆయన తన వాటాలను లిక్విడేట్ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. వ్యాల్యుయేషన్ విభేదాలతో గతంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మైనారిటీ వాటా విక్రయానికి సంజీవ్ గోయెంకా మద్దతు ఉన్న సరేగామాతో ధర్మా ముందుగా చర్చలు జరిపింది. హిందీ చిత్ర పరిశ్రమలో హిట్స్ సంఖ్య తగ్గటంతో అనుకున్న స్థాయిలో విలువ లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రజలు ఎక్కువగా ఓటీటీలకు మారిపోవటంతో థియేటర్‌లలో ఫుట్‌ఫాల్స్ దెబ్బతినడంతో సినిమా నిర్మాణ ఖర్చులు కూడా పెరిగాయి.

అయితే రిలయన్స్ కంటెంట్ ప్రొడక్షన్ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం జియో స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్, కొలోస్సియం మీడియా అండ్ బాలాజీలో మైనారిటీ వాటాలు ఉన్నాయి. అంబానీ నేతృత్వంలో కొనసాగుతున్న జియో స్టూడియోస్ ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోలలో ఒకటిగా ఉన్న సంగతి తెలిసిందే. FY23లో ధర్మ ప్రొడక్షన్స్ ఆదాయం రూ.1,040 కోట్లుగా ఉంది. ఇది దాదాపు నాలుగు రెట్లు పెరుగుదల. అంతకు ముందు ఏడాది ఆదాయం కేవలం రూ.276 కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో నికర లాభం 59 శాతం పడిపోయింది. సినిమా నిర్మాణంలో ఉన్న ఇబ్బందులపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జోహార్ తన బాల్యంలో కొన్నిసార్లు నష్టాల నుంచి కోలుకోవడానికి, ఫైనాన్షియర్‌లకు తిరిగి డబ్బు చెల్లించడానికి వారు ఆస్తులు, ఆభరణాలను అమ్మేసిన సందర్భాలను సైతం గుర్తుచేసుకున్నారు.

హర్యానాలో ఓటమి తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ కీలక సమావేశం..

మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధతపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ సమీక్షా సమావేశానికి పిలుపునిచ్చారు. హర్యానాలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దశాబ్ద కాలంగా అధికార వ్యతిరేకతను సొమ్ము చేసుకోలేకపోయిన కాంగ్రెస్‌కు ఈ మీటింగ్ లో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

కావునా, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్‌తో పాటు విజయ్ వాడెట్టివార్, పృథ్వీరాజ్ చవాన్, బాలాసాహెబ్ థోరట్, వర్షా గైక్వాడ్, రమేష్ చెన్నితలతో సహా ఇతర పార్టీ నేతలు ఈ సమావేశానికి రానున్నారు. అయితే, ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో నేటి (సోమవారం) ఉదయం 10 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే హాజరు కానున్నారు.

అయితే, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన 90 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ కేవలం 37 స్థానాలను గెలుచుకుంది. కాగా, అనేక మంది ఇండియా కూటమిలోని పలు పార్టీలకు చెందిన నేతలు ఉత్తరాది రాష్ట్రంలో కాంగ్రెస్ రచించిన వ్యూహాన్ని ప్రశ్నించారు. హస్తం పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు.

మహా వికాస్ అఘాడి (MVA)కి చెందిన పలువురు సభ్యులు మహారాష్ట్రలో పోటీ చేసేందుకు మరిన్ని సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నందున కాంగ్రెస్ యొక్క ఎన్నికల సంసిద్ధతపై నేటి సమావేశానికి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎంవీఎస్ లో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి — కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన(యూబీటీ) వర్గం, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) ఉన్నాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో వచ్చే నెల లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం.. సికింద్రాబాద్‌ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత

సికింద్రాబాద్‌ (Secunderabad) మోండా మార్కెట్‌ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.

సికింద్రాబాద్‌ (Secunderabad) మోండా మార్కెట్‌ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. రాత్రి ఆలయంలో శబ్దం రావడంతో మేల్కొన్న స్థానికులు.. ముగ్గురిలో ఒకరిని పట్టుకుని దేహశుద్ధిచేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసిన పోలీసులు పరారైన వారి కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

కాగా, విషయం తెలుసుకున్న బీజేపీ, హిందూ సంఘాల కార్యకర్తలు ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. గుడిపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని ధర్నాకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కేంద్ర కిషన్‌ రెడ్డి ఆలయాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. మత విద్వేషాలను ప్రేరిపించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. నిన్నటివరకు ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గామత నవరాత్రులు, బతుకమ్మ వేడుకులు జరుపుకున్నారని చెప్పారు. విగ్రహం ధ్యంసం చేయడం ఒక వర్గం మనోభావాలను దెబ్బతీయడమేనని చెప్పారు. దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలన్నారు.

మత కలహాలు జరుగకుండా అడ్డుకోవాలని కేంద్ర కిషన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి గేట్లు విరగొట్టారని చెప్పారు. హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారని తెలిపారు. ఆలయాలపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దేవాలయాలకు పటిష్ట భద్రత కల్పించాలన్నారు.

తిరుమలలో కన్నుల పండుగగా భాగ్‌ సవారి - హుండీ కానుక‌లు రూ.26 కోట్లు..!!

తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ ⁠సౌక‌ర్య‌వంతంగా శ్రీవారి మూల‌మూర్తి, వాహ‌న సేవ‌ల‌ ద‌ర్శ‌నం కల్పించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు "భాగ్‌సవారి" ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవం ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది.

శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన భాగ్‌సవారి ఉత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రేవేశించి మాయమైపోతారు.

అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేనని విషయం గ్రహించి పశ్చాత్తాపపడుతాడు. వెంటనే అమ్మవారిని బంధీనుండి విముక్తురాలుని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు.

తన భక్తునియొక్క భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు.ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ "భాగ్‌సవారి" ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

స్వామివారు సాయంత్రం 4 గంటలకు వైభ‌వోత్స‌వ మండ‌పం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకొని తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. అంత‌కుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్‌సవారి ఉత్స‌వం సంద‌ర్భంగా నాళాయరా దివ్య ప్రబంధం నిర్వ‌హించారు.

బ్రహ్మోత్సవాల వేళ 6 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకోగా..15 ల‌క్ష‌ల మంది భ‌క్తులు శ్రీ‌వారి వాహ‌న సేవ‌లు విక్షించారు. ⁠గరుడసేవనాడు 82,043 మంది దర్శించుకున్నారు. కాగా, గరుడసేవ‌లో దాదాపు 3.5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు.

నేడే లాటరీ

3396 మద్యం షాపులు... వాటి కోసం 89,882 దరఖాస్తులు! ఇదీ తుది లెక్క! అంటే సగటున ఒక్కో షాప్‌ కోసం 26.46 మంది పోటీ పడుతున్నారు. మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగిసింది. ఒక్కో దరఖాస్తుకు ఫీజు రూ.2 లక్షల చొప్పున... 89,882 అప్లికేషన్లకు రూ.1797.64 కోట్ల ఆదాయం సమకూరింది.

ఎన్టీఆర్‌ జిల్లాలో అత్యధికంగా ఒక్కో షాపునకు సగటున 52 మంది పోటీలో ఉన్నారు. ఆ తర్వాత ఏలూరు, తూర్పు గోదావరి, గుంటూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ పోటీ నెలకొంది. ఎన్టీఆర్‌ జిల్లాలో ఒక షాప్‌ కోసం 132, మరో షాప్‌ కోసం 120దరఖాస్తులు అందాయి. ఇదో రికార్డు! పలు జిల్లాల్లో అనేక షాపులకు 70కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇక స్వయంగా సీఎం హెచ్చరించినా తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో రాజకీయ జోక్యం ఆగలేదు.

ఫలితంగా ఈ జిల్లాల్లో ఆశించిన దానికంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ ఒక్కో షాపునకు 17 మంది మాత్రమే పోటీలో ఉన్నారు. సిండికేట్లుగా ఏర్పడి తక్కువ దరఖాస్తులు వేసి... పోటీని తగ్గించుకున్నారు. బాపట్ల, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లోనూ అనేక షాపులకు సింగిల్‌ డిజిట్‌ దరఖాస్తులే వచ్చాయి.

మద్యం షాపులకు సోమవారం జిల్లాల్లో లాటరీ నిర్వహిస్తారు. కలెక్టర్ల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి దుకాణానికి వేర్వేరుగా లాటరీ తీసి, ఎంపికైన వారికి లైసెన్స్‌ పత్రాలు అందజేస్తారు. ఉదయం నుంచే లాటరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, నూతన మద్యం పాలసీతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చిపడింది. ఒక్క దరఖాస్తుల రూపంలోనే రూ.1797.64 కోట్ల ఆదాయం వచ్చింది.

సోమవారం లాటరీలో షాప్‌ దక్కించుకున్న 24గంటల్లోపు మొదటి విడత లైసెన్స్‌ రుసుము చెల్లించాలి. తద్వారా సుమారు రూ.300 కోట్లు వస్తాయి. వీరు బుధవారం (ఈ నెల 16) నుంచి షాపులు ప్రారంభించుకోవచ్చు. ఆ సమయంలో లైసెన్సీలు కనీసం వారం రోజుల సరుకు కొనుగోలు చేస్తారు. ఆ రూపంలో మరో రూ.300 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. మొత్తంగా నూతన పాలసీ ప్రారంభ దశలోనే ప్రభుత్వానికి రూ.2400 కోట్ల ఆదాయం సమకూరుతుంది.

కేబీఆర్‌ పార్కు వద్ద అతిపెద్ద అండర్‌పాస్‌

గ్రేటర్‌లో అతి పెద్ద అండర్‌పాస్‌ కేబీఆర్‌ పార్క్‌ వద్ద అందుబాటులోకి రానుంది. సిగ్నల్‌ చిక్కులు లేకుండా వాహనదారులు నిరాటంకంగా ప్రయాణించేలా బహుళ మార్గాలకు రూపకల్పన చేస్తున్నారు. కేబీఆర్‌ పార్కు చుట్టూ ఉన్న పలు జంక్షన్లలో సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణం చేసేలా వీటిని రూపొందించారు.

నగరంలోని కేబీఆర్‌ (కాసు బ్రహ్మానందరెడ్డి)పార్క్‌ చుట్టూరా సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణాలు సాగేలా అండర్‌పాస్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తున్నది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ –45 వైపు నుంచి కేబీఆర్‌ పార్కు ప్రధాన గేటు(ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌) వైపు 740 మీటర్ల మేర అతిపెద్ద భూగర్భ మార్గం నిర్మించనున్నారు. దీంతో ఐటీ కారిడార్‌, ఫిల్మ్‌నగర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు జూబ్లీ చెక్‌పోస్ట్‌ కంటే ముందు ఉండే అండర్‌పాస్‌ నుంచి సిగ్నల్‌ చిక్కులు లేకుండా రాకపోకలు సాగించే వెసులుబాటు కలగనుంది.

మూడు లేన్లుగా అండర్‌పాస్‌ నిర్మాణానికి రూపకల్పన చేశారు. గతంలో నిర్మించిన అండర్‌పాస్‌లలో మెజార్టీ 200–300 మీటర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో కేబీఆర్‌ పార్కు వద్ద నిర్మించే అండర్‌పాస్‌ అతిపెద్దది కానుంది. హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటీవ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేటీవ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(హెచ్‌– సిటీ)లో భాగంగా కేబీఆర్‌ పార్కు చుట్టూ ఏడు అండర్‌పాస్‌లు నిర్మిస్తుండగా, మెజార్టీ 300 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్నాయి. ఇవి నగర ప్రయాణంలో వాహనదారులకు వినూత్న అనుభూతి కలిగిస్తాయని అధికారులు చెబుతున్నారు.

సిగ్నల్‌ చిక్కులు లేకుండా జంక్షన్ల వారీగా బహుళ మార్గాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. జూబ్లీ చెక్‌పోస్ట్‌ వద్ద మాత్రం రెండో లెవల్‌లో ఓ వంతెన ప్రతిపాదించారు.

కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌ గేట్‌ చౌరస్తా వద్ద రూ.192 కోట్లతో రెండు అండర్‌పాస్‌లు, (ముగ్ద జంక్షన్‌తో కలిపి) ఓ వంతెన ప్రతిపాదించారు. యూసుఫ్‌గూడ వైపు నుంచి వచ్చే వాహనాలు మూడు లేన్ల వంతెన నుంచి జూబ్లీచెక్‌పోస్ట్‌ వైపు వెళ్లనున్నాయి. జూబ్లీచెక్‌పోస్ట్‌ నుంచి వచ్చే వాహనాలు ఫ్రీ లెఫ్ట్‌ ద్వారా యూసుఫ్‌గూడ వైపు, కేన్సర్‌ ఆస్పత్రి వైపు వెళ్లాల్సిన వాహనాలు అండర్‌పాస్‌ వినియోగించాల్సి ఉంటుంది.

జూబ్లీచెక్‌పోస్ట్‌ వద్ద రెండు వంతెనలు, ఓ అండర్‌పాస్‌ నిర్మించనున్నారు. ఇందుకు రూ.229 కోట్లు అవసరమని అంచనా వేశారు. కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌ గేట్‌ వైపు నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ –36 (పెద్దమ్మ గుడి వైపు) మూడు లేన్ల చొప్పున రెండు వైపులా వాహనాలు రాకపోకలు సాగించేందుకు ఆరు లేన్ల వంతెన అందుబాటులోకి రానుంది. రోడ్‌ నెంబర్‌–45 వైపు నుంచి కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌ గేట్‌ వైపు వెళ్లేందుకు మూడు లేన్ల అండర్‌పాస్‌, యూసుఫ్‌గూడ వైపు వాహనాల కోసం మరో అండర్‌పాస్‌ ప్రతిపాదించారు. యూసుఫ్‌గూడ వైపు నుంచి రోడ్‌ నంబర్‌–45 వైపు వెళ్లే వాహనాల కోసం సెకండ్‌ లెవల్‌లో రెండు లేన్ల వంతెన నిర్మించనున్నారు.

కేన్సర్‌ ఆస్పత్రి చౌరస్తా వద్ద ఓ అండర్‌పాస్‌, ఓ వంతెనను రూ.83 కోట్లతో ప్రతిపాదించారు. కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌ గేట్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు అండర్‌పాస్‌ నుంచి మహారాజ అగ్రసేన్‌ చౌరస్తా (తెలంగాణ భవన్‌) వైపు వెళ్తాయి. తెలంగాణ భవన్‌ నుంచి వెళ్లే వాహనాలు వంతెన మీదుగా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–10, రోడ్‌ నంబర్‌–1 వైపు వెళ్లొచ్చు.

మహారాజ అగ్రసేన్‌ చౌరస్తా వద్ద రూ.110 కోట్లతో ఓ అండర్‌పాస్‌, వంతెన ప్రతిపాదించారు. కేన్సర్‌ ఆస్పత్రి వైపు నుంచి వచ్చే వాహనాలు అండర్‌పాస్‌ మీదుగా ఫిల్మ్‌నగర్‌ చౌరస్తా వైపు వెళ్లాలి. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ –12 నుంచి వచ్చే వాహనాలు వంతెన మీదుగా ఫిల్మ్‌నగర్‌ చౌరస్తాకు వెళ్లొచ్చు.

ఫిల్మ్‌నగర్‌ చౌరస్తా వద్ద అండర్‌పాస్‌, ఓ వంతెనను రూ.115 కోట్లతో నిర్మించనున్నారు. మహారాజ అగ్రసేన్‌ చౌరస్తా వైపు నుంచి వచ్చే వాహనాలు అండర్‌పాస్‌ నుంచి జర్నలిస్ట్‌ కాలనీ చౌరస్తా వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఫిల్మ్‌నగర్‌ వైపు నుంచి వచ్చే వాహనదారులు వంతెన మీదుగా మహారాజ అగ్రసేన్‌ జంక్షన్‌ వైపు వెళ్లే అవకాశం కలుగుతుంది.

రోడ్‌ నంబర్‌ –45 జంక్షన్‌ వద్ద రూ.97 కోట్లతో ఓ అండర్‌పాస్‌, వంతెన నిర్మాణం ప్రతిపాదించారు. జర్నలిస్ట్‌ కాలనీ చౌరస్తా వైపు నుంచి అండర్‌పాస్‌ ద్వారా జూబ్లీ చెక్‌పోస్ట్‌కు వెళ్లొచ్చు. జూబ్లీ చెక్‌పోస్ట్‌ నుంచి వచ్చే వాహనదారులు వంతెన మీదుగా కేబుల్‌ బ్రిడ్జి వైపు వెళ్లాల్సి ఉంటుంది. కేబుల్‌ బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనదారులు ఫ్రీ లెఫ్ట్‌ను వినియోగించుకుంటే జూబ్లీ చెక్‌పోస్ట్‌ వైపు వెళ్లొచ్చు.

అండర్‌పాస్‌ల వివరాలు..

రోడ్‌ నంబర్‌–45 వైపు నుంచి కేబీఆర్‌ పార్కు మెయిన్‌ గేటు వైపు మూడు లేన్ల అండర్‌పాస్‌– 740 మీటర్లు

జూబ్లీ చెక్‌పోస్ట్‌ వైపు నుంచి కేబీఆర్‌ పార్కు మెయిన్‌ గేట్‌ చౌరస్తా మీదుగా క్యాన్సర్‌ ఆస్పత్రి వైపు రెండు లేన్ల అండర్‌పాస్‌– 330 మీటర్లు

కేబీఆర్‌ పార్కు మెయిన్‌ గేట్‌ జంక్షన్‌ వైపు నుంచి పంజాగుట్ట వైపు (ముద్ర చౌరస్తా వద్ద) మూడు లేన్ల అండర్‌పాస్‌ – 260 మీటర్లు

కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌ గేట్‌ జంక్షన్‌ వైపు నుంచి క్యాన్సర్‌ ఆస్పత్రి జంక్షన్‌ మీదుగా మహరాజ్‌ అగ్రసేన్‌ చౌరస్తా వైపు రెండు లేన్ల అండర్‌పాస్‌– 330 మీటర్లు

క్యాన్సర్‌ ఆస్పత్రి చౌరస్తా వైపు నుంచి మహారాజ్‌ అగ్రసేన్‌ జంక్షన్‌ మీదుగా ఫిల్మ్‌నగర్‌ జంక్షన్‌ వరకు రెండు లేన్ల అండర్‌పాస్‌– 410 మీటర్లు

మహరాజ అగ్రసేన్‌ చౌరస్తా వైపు నుంచి ఫిల్మ్‌నగర్‌ చౌరస్తా మీదుగా జర్నలిస్టు కాలనీ చౌరస్తా వరకు రెండు లేన్ల అండర్‌పాస్‌ – 340 మీటర్లు

జర్నలిస్ట్‌ కాలనీ చౌరస్తా వైపు నుంచి రోడ్‌ నంబర్‌–45 జంక్షన్‌ మీదుగా జూబ్లీచెక్‌పోస్ట్‌ వరకు రెండు లేన్ల అండర్‌పాస్‌ – 290 మీటర్ల

కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌ గేట్‌ వైపు నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ – 36 వరకు ఒక్కోవైపు రెండు లేన్ల చొప్పున ఫస్ట్‌ లెవల్‌ వంతెన – 745 మీటర్లు

యూసుఫ్‌గూడ వైపు నుంచి రోడ్‌ నంబర్‌ –45 జంక్షన్‌ వైపు సెకండ్‌ లెవల్‌లో రెండు లేన్ల వంతెన – 770 మీటర్లు

పంజాగుట్ట వైపు నుంచి కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌గేట్‌ జంక్షన్‌ మీదుగా జూబ్లీచెక్‌పోస్ట్‌ వైపు మూడు లేన్ల వంతెన – 900 మీటర్లు

మహరాజ అగ్రసేన్‌ జంక్షన్‌ వైపు నుంచి క్యాన్సర్‌ ఆస్పత్రి చౌరస్తా మీదుగా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–10 వైపు రెండు లేన్ల వంతెన –540 మీటర్లు

ఫిల్మ్‌నగర్‌ జంక్షన్‌ వైపు నుంచి మహరాజ అగ్రసేన్‌ చౌరస్తా మీదుగా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–12 వైపు రెండు లేన్ల వంతెన – 590 మీటర్లు

ఫిల్మ్‌నగర్‌ వైపు నుంచి మహరాజ అగ్రసేన్‌ చౌరస్తా వైపు రెండు లేన్ల వంతెన – 600 మీటర్లు

జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వైపు నుంచి రోడ్‌ నంబర్‌–45 చౌరస్తా మీదుగా కేబుల్‌ బ్రిడ్జి వైపు రెండు లేన్ల వంతెన – 500 మీటర్లు

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ను కాల్చిచంపిన దుండగులు

ముంబైలో శనివారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన కీలక నేత బాబా సిద్ధిక్ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రాలో ఆయనను దండగులు కాల్చిచంపారు. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో షూటర్లు ఆయనపైకి ఆరు బుల్లెట్లు కాల్చారు. బాబా సిద్దిక్‌కు 4 బుల్లెట్లు తగిలాయి. అతడి సహాయకులలో ఒకరికి గాయాలయ్యాయి. కాగా తన కొడుకు, బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యే జీషాన్ కార్యాలయానికి సమీపంలోనే బాబా సిద్దిక్‌పై కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన వెంటనే ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

బాబా సిద్దిక్ బాంద్రా వెస్ట్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 -2008 మధ్య రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, కార్మిక శాఖల మంత్రిగా పనిచేశారు. 48 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలోనే హస్తం పార్టీని వీడి అజిత్ పవార్ ఎన్‌సీపీ వర్గంలో చేరారు. మరోవైపు ఆయన కొడుకు జీషాన్ సిద్ధిక్‌ను ఈ ఏడాది ఆగస్టులో పార్టీ నుంచి కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరించింది.

బాబా సిద్దిక్ హత్యపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ‘‘ ఈ ఘటన చాలా దురదృష్టకరం. సిద్ధిక్ చనిపోయారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు, మరొకరు హర్యానాకు చెందినవారు. మరొకరు పరారీలో ఉన్నారు. ఈ ఘటన విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను నేను కోరాను. ముంబయిలో శాంతిభద్రతలను ఎవరూ వారి చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదు’’ అని ఆయన అన్నారు.

మరోవైపు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమాచారం తెలిసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. సిద్దిక్ హత్య విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎక్స్ వేదికగా స్పందించారు. సహచరుడిని, స్నేహితుడిని కోల్పోయానని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది చివరిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని కొన్ని నెలల ముందు నుంచే అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. బాబా సిద్దిక్ హత్యపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.