కనెక్టివిటీకి ఇంకెంతకాలమో..

నగర రవాణాలో మెట్రోరైలు వ్యవస్థ అత్యంత కీలకంగా మారింది. మెట్రో రైళ్లలో ప్రతిరోజూ సగటున 4.70 లక్షల మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రత్యేక రోజుల్లో వీరి సంఖ్య ఐదు లక్షలకు పైమాటే.

నగర రవాణాలో మెట్రోరైలు వ్యవస్థ అత్యంత కీలకంగా మారింది. మెట్రో రైళ్లలో ప్రతిరోజూ సగటున 4.70 లక్షల మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రత్యేక రోజుల్లో వీరి సంఖ్య ఐదు లక్షలకు పైమాటే. అయితే మెట్రో స్టేషన్ల నుంచి తమ ప్రాంతాలకు రవాణా కనెక్టివిటీ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధిక చార్జీలు వెచ్చించి బైక్‌లు, ఆటోలు, క్యాబ్‌లు(Bikes, autos, cabs) బుక్‌ చేసుకుని వెళ్తున్నారు. మెట్రోకు అనుసంధానంగా ఫస్ట్‌ మైల్‌, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని మెరుగుపరుస్తామని, స్టేషన్ల నుంచి తక్కువ చార్జీతోనే రవాణా సౌకర్యం కల్పిస్తామని మెట్రో రైలు అధికారులు చెబుతున్నప్పటికీ ఆచరణలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.

నగర ప్రజలకు మెట్రో ప్రయాణాన్ని మరింత చేరువ చేసేందుకు నాలుగేళ్ల క్రితం అధికారులు ఫస్ట్‌ మైల్‌, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఈ మేరకు ఉదయం ఇంటి సమీపంలోని మెట్రో స్టేషన్‌కు సులువుగా వెళ్లడం, తిరిగి రాత్రి సమయంలో తక్కువ చార్జీతో ఇంటికి చేరుకునే విధంగా ఆటోలు, బైక్‌లను అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. దీంతోపాటు లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ కింద రాత్రి 9 లోపు ప్రధాన స్టేషన్లలో మెట్రో దిగిన ప్యాసింజర్ల కోసం ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందులో భాగంగా ఫస్ట్‌ మైల్‌, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ కోసం తొలుత ప్రైవేట్‌ సంస్థలను ఆహ్వానించారు.

అయితే స్టేషన్ల నుంచి కేవలం 5 కిలోమీటర్ల పరిధిలోనే రవాణా సేవలందించాల్సి ఉండడంతో.. రేటు గిట్టుబాటు కాదని అప్పట్లో ఎవరూ ముందుకు రాలేదు. రెండేళ్ల క్రితం మెట్రో రైడ్‌ సంస్థ ముందుకొచ్చినప్పటికీ కేవలం ఐటీ సంస్థలు అధికంగా ఉండే హైటెక్‌సిటీ, రాయదుర్గం స్టేషన్ల వద్దనే ఎలక్ర్టిక్‌ ఆటోలు, బైక్‌లను అందుబాటులో ఉంచింది. మిగతా చోట్ల ఈ కనెక్టివిటీ లేకపోవడంతో ఆయా స్టేషన్లలో రైలు దిగిన ప్రయాణికులు వందలాది రూపాయలతో ఆటోలు, క్యాబ్‌లు బుక్‌చేసుకుని ఇళ్లు, ఆఫీసులకు వెళ్లాల్సి వస్తోంది. అదే ఫస్ట్‌ మైల్‌, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ ఉంటే నాలుగు కిలోమీటర్ల లోపు దూరానికి రూ.25 చెల్లిస్తే సరిపోతుంది.

మూడు మెట్రో కారిడార్ల పరిధిలో మొత్తం 57 స్టేషన్లు ఉండగా.. ప్రస్తుతం 15 చోట్ల మాత్రమే ఫీడర్‌ బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఫీడర్‌ సర్వీసుల సేవలను గుర్తించిన మెట్రో రైలు అధికారులు గతంలో ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించినా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. వాస్తవానికి మెట్రో స్టేషన్‌కు 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలనీలను ఫీడర్‌ సేవల ద్వారా అనుసంధానం చేయొచ్చు. అయితే చిన్న బస్సులు అందుబాటులో లేవంటూ ఈ దిశగా చర్యలు చేపట్టడం లేదు. బోరబండ, మోతీనగర్‌, ఎర్రగడ్డ, పంజాగుట్ట, శ్రీనగర్‌కాలనీ, వెంగళరావునగర్‌ కాలనీలను ఫీడర్‌ సర్వీసుల ద్వారా యూసుఫ్‏గూడ మెట్రోస్టేషన్‌కు.. గచ్చిబౌలి, కొండాపూర్‌, జేఎన్‌టీయూ, హఫీజ్‌పేట ప్రాంతాలను హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌తో అనుసంధానం చేస్తే ఆయా ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది.

ఎంతటి దుర్మాగం.. హెచ్చరించనా లెక్క చేయక.. 50 ఏళ్ల చెట్టును

తమ వ్యాపారానికి అడ్డు వస్తుందనే కారణంగా లగ్జరీ సికారా క్లినిక్స్, ఫెమినా ఫ్లాంట్ స్టూడియో సెలూన్ నిర్వాహకులు ఈ మహా వృక్షాన్ని తొలగించారు. రోడ్డు మీద వెళ్లేవారికి చెట్టు, దాని కొమ్మలు కనిపించకుండా అడ్డువస్తున్నాయంటూ ఏకంగా సుమారు 50 ఏళ్ల చెట్టును నిర్ధాక్షణ్యంగా నరికివేశారు.

వృక్షో రక్షితి రక్షిత వృక్షాలను రక్షిస్తే.. అవి మనల్ని రక్షిస్తాయనేది దీని అర్థం. మనుషులు వదిలిన కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకొని, మనకు ఆక్సిజన్‌ను అందిస్తాయి వృక్షాలు. అంతేకాక వృక్షాల వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. చెట్లు మనకు నీడని ఇవ్వడంతో పాటు.. పండ్లు, పూలు, వేర్లు, ఆకులు ఇలా అనేక రకాలుగా చెట్లు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ప్రకృతిలో లభించే ప్రతి మొక్క మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. కానీ మారుతున్న కాలంలో చెట్లను నరికివేయడం అనేది పరిపాటిగా మారిపోయింది. ఇళ్ల కోసం, రోడ్ల కోసం ఇలా అనేక విధాలుగా చెట్లు అడ్డుగా ఉన్నాయంటూ వాటిని నరికివేస్తున్నారు. ఒకచోట నరికివేసిన చెట్లను మరోచోట నాటితే బాగుంటుంది.. కానీ అలా జరగడం లేదు. అభివృద్ధి పేరుతో పచ్చని చెట్లను కొట్టివేడయంతో వర్షపు నీరు భూమికి చేరదు. దాని ఫలితంగా త్రాగు నీరు, జీవాధారమైన తిండి , పీల్చేందుకు స్వచ్చమైన గాలి కరువై మానవుడే కాదు.. ప్రతీ జీవి మనుగడ కష్టతరంగా మారిపోతుంది. ఇప్పటికే అడవులను నరికివేడయంతో మన దేశంలో చాలా అడవులు తరిగిపోతున్నాయి కూడా. ఇక పట్టణాల్లో అయితే చెట్ల పెంపకం చాలా తక్కువ అనే చెప్పుకోవచ్చు. భవనాలు, రోడ్లు, వ్యాపార సముదాయాల కోసం ఎక్కడికక్కడ చెట్లను నరికివేస్తూ వస్తున్నారు. దీంతో చాలా చోట్ల చెట్లు కనిపించకుండా పోతున్నాయి. తాజాగా వ్యాపారానికి అడ్డువస్తుందనే కారణంగా ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న మహా వృక్షాన్నే నరికివేసిన వైనం హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. 50 ఏండ్లు ఉన్న చెట్టును నరికివేయడం పట్ల పర్యవరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ మహావృక్షం ఎక్కడ ఉంది.. ఎవరు నరికి వేశారో ఇప్పుడు చూద్దాం.

నగరంలోని కేబీఆర్‌ పార్క్ (KBR Park) ఎదురుగా జీహెచ్ఎంసీ (GHMC) ఫుట్ పాత్ మీదున్న చెట్టును (Big Tree) రాత్రికి రాత్రే నరికేశారు. తమ వ్యాపారానికి అడ్డు వస్తుందనే కారణంగా లగ్జరీ సికారా క్లినిక్స్, ఫెమినా ఫ్లాంట్ స్టూడియో సెలూన్ నిర్వాహకులు ఈ మహా వృక్షాన్ని తొలగించారు. రోడ్డు మీద వెళ్లేవారికి చెట్టు, దాని కొమ్మలు కనిపించకుండా అడ్డువస్తున్నాయంటూ ఏకంగా సుమారు 50 ఏళ్ల చెట్టును నిర్ధాక్షణ్యంగా నరికివేశారు. ఈ చెట్టును నాటి సుమారు 50 సంవత్సరాలు పూర్తయ్యింది. అయితే రాత్రి సమయంలో సెలూన్, క్లినిక్‌కు చెందిన నిర్వాహకులు రాఘవేంద్ర రెడ్డి, శిరీష్ ఆలపాటి అనే వ్యక్తులు మెషిన్లతో ఈ భారీ వృక్షాలను కూల్చినట్లు స్థానికులు తెలిపారు.

అంతకుముందు రోజు కేబీఆర్ పార్క్ అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఈ భారీ వృక్షాలను నరకవద్దని వాళ్లను హెచ్చరించారు. సాయంత్రం పచ్చగా ఉన్న చెట్టు ఉదయాన్నే నేలమట్టం కావడం చూసి స్థానికులు సెంటిమెంటుతో రగిలిపోతున్నారు. ఈ దుర్మార్గానికి ఒడి గట్టిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కేబీఆర్ పార్కులోని అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేందుకు అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. సమాచారం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు నేలకూల్చిన భారీ వృక్షాలను పరిశీలించారు.

స్టాలిన్ పై గురిపెట్టిన పవన్ కు మోడీ మార్క్ షాక్..!!

ఢిల్లీ టు అమరావతి రాజకీయం మారుతోంది. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. మిత్రపక్షాల మద్దతులో ముందుకెళ్తున్న కేంద్రంలోని మోదీ సర్కార్ రాజకీయంగా బలం పెంచుకునే వ్యూహాలను అమలు చేస్తోంది. సంచలన నిర్ణయాల అమలుకు ముందే సంఖ్యా పరంగా తమ కూటమిని బలోపేతం చేసుకునేందుకు అడుగులు వేస్తోంది. కొత్త మిత్రులకు ఆహ్వానం పలుకుంది. సనాతన హిందు ధర్మం పరిరక్షణ పేరుతో దయానిధి స్టాలిన్ ను టార్గెట్ చేసిన పవన్ కు తాజాగా బీజేపీ నాయకత్వ నిర్ణయం షాక్ గా మారుతోంది.

కేంద్రంలో మోదీ సర్కార్ జమిలి ఎన్నికలతో పాటుగా కీలక అంశాలకు ఆమోదం పొందేందుకు సంఖ్య పరంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్డీఏలో ప్రస్తుతం ఉన్న మిత్రులతో పాటుగా కొత్త వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇండియా కూటమిలో ఉన్న కీలక పార్టీలను తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇండియా కూటమి లో డీఎంకే, సమాజ్ వాదీ పార్టీలు కాంగ్రెస్ తరువాత సంఖ్య పరంగా బలమైన పార్టీలుగా ఉన్నాయి. కొద్ది రోజులుగా ఈ రెండు పార్టీలతో బీజేపీ అధినాయకత్వం తీరులో మార్పు కనిపిస్తోంది. ఎన్డీఏలోని ప్రస్తుతం ఉన్న మిత్రుల్లో ఎవరైనా హ్యాండ్ ఇచ్చినా తమకు నష్టం లేకుండా బీజేపీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.

తాజాగా డీఎంకే తో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు కొత్త చర్చకు కారణమైంది. రానున్న రోజుల్లో మిత్రులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నడపటం మోదీ సమర్థతకు పరీక్షగా మారనుంది. పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ఫలితాలు మిత్రపక్షాల వైఖరి పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో, డీఎంకేతో సన్నిహితంగా బీజేపీ అధినాయకత్వం వ్యవహరిస్తోంది. సీఎం స్టాలిన్ తో ప్రధాని మోదీ గతం కంటే భిన్నంగా ఆత్మీయ పలకరింపు తో పాటుగా ఆ పార్టీ నేతలతో బీజేపీ ముఖ్యుల సన్నిహిత సంబంధాలు పెరగటం కూడా ఈ చర్చకు ఊతమిస్తున్నాయి. ఇక, చెన్నై మెట్రో -2 కు వెంటనే అనుమతులు లభించాయి. దీంతో..ప్రధాని మోదీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఇక, ఇటు ఏపీలో తిరుమల లడ్డూ వివాదం మొదలైన సమయం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన హిందూ ధర్మం గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. తిరుపతిలో జరిగిన సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పైన పరోక్ష వ్యాఖ్యలు చేసారు. వీటి పైన ఉదయనిధి సైతం వేచి చూద్దామంటూ స్పందించారు. పవన్ వ్యాఖ్యల పైన డీఎంకే సైతం స్పందించింది.

ఇక తాజాగా అన్ని డీఎంకేకు అనుకూలంగా పవన్ ట్వీట్లు చేసారు. ఇలా..డీఎంకే పైన ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పవన్ దూకుడుగా వ్యవహరిస్తున్న సమయంలోనే బీజేపీ కేంద్ర నాయకత్వం ఆ పార్టీతో వేస్తున్న తాజా అడుగులు పవన్ కు బ్రేకులు వేసేలా ఉన్నాయనే విశ్లేషణ లు మొదలయ్యాయి. దీంతో, ఇప్పుడు పవన్ ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

విశాఖ రైల్వే జోన్‌కు డిసెంబర్‌లో భూమిపూజ !

ఉత్తరాంధ్ర ప్రజల కల రైల్వేజోన్ సాకారం కోబోతోంది. డిసెంబర్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రైల్వేజోన్ కు అవసరమైన స్థలాన్ని వైసీపీ ప్రభుత్వం చివరి రోజు వరకూ ఇవ్వలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు నెలల్లోనే స్థలం రెడీ చేసింది. . వివాదాలు లేకుండా ముడిసర్లోవలో 52 ఎకరాలను రైల్వేకు అప్పగించడానికి ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కేంద్ర మంద్రి పీయూష్ గోయల్ త్వరలో రైల్వేజోన్ ఏర్పాటవుతుందని ప్రకటించారు.

2018లో కేంద్ర కేబినెట్ రైల్వేజోన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. 2019లో వైసీపీ గెలిచింది. ఒక్కటంటే ఒక్క సారి కూడా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని వైసీపీ కేంద్రాన్ని అడగలేదు. ఐదేళ్ల పాటు స్థలం కూడా రైల్వేకు అప్పగించకుండా తాత్సారం చేశారు.

అడిగి మరీ రైల్వేజోన్ పెట్టాల్సిన అవసరం ఏముందిలే అని కేంద్రం కూడా లైట్ తీసుకుంది. రైల్వే జోన్ కు కావాల్సిన స్థలంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించేందుకు రెడీ కావడంతో కేంద్రానికి జోన్ ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడు ప్రభుత్వం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రైల్వే జోన్ అంశాన్ని సీరియస్ గా తీసుకుని ఫాలో అప్ చేశారు. మరో ఏడాదిలో రైల్వేజోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకటి, రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసుకుని రైల్వే జోన్ అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే వాల్తేరు డివిజన్ ను కూడా విశాఖ రైల్వే జోన్ లో నే కొనసాగించడం.

ఇప్పటి వరకూ విశాఖ కేంద్రంగా జోన్‌ ఉంటుందికానీ, డివిజన్‌ ఉండదని ప్లాన్ రెడీ చేశారు . శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఉన్న రైల్వే స్టేషన్లు ఖుర్దా డివిజన్‌లో ఉన్నాయి. వాటితో కొత్త డివిజన్ కూడా అలాగే ఉంచనున్నారు. మొత్తం జోన్‌ పై మరో నెలలో స్పష్టత వస్తుంది. డిసెంబర్‌లో భూమిపూజ జరగడం ఖాయం అనుకోవచ్చు.

ధర్మవరం సీఐ తల్లి కిడ్నాప్.. 10 రోజుల తర్వాత మృతదేహం లభ్యం

ఏపీలోని ధర్మవరం వన్‌ టౌన్‌ సీఐ నాగేంద్ర ప్రసాద్‌ తల్లి స్వర్ణ కుమారి (62) కిడ్నాప్‌ కథ విషాదాంతమైంది. గత నెల 29వ తేదీన కిడ్నాప్‌నకు గురైన ఆమె మృతదేహం తాజాగా బయటపడింది. ఎదురింట్లో ఉండే వెంకటేశ్‌ అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్‌ చేసి హత్య చేశాడని.. అనంతరం మృతదేహాన్ని పాతిపెట్టినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనతో ఏపీలోని శాంతి భద్రతలపై ఆందోళన మొదలైంది.

ధర్మవరం వన్‌ టౌన్‌ సీఐ నాగేంద్ర ప్రసాద్‌ తల్లి స్వర్ణకుమారి మదనపల్లె శివారులోని వైఎస్‌ జగన్‌ కాలనీలో ఒంటరిగా నివసిస్తోంది. ఈ నెల 29న ఉదయం 10 గంటలకు తన ఎదురింట్లో ఉంటున్న వెంకటేశ్‌తో కలిసి బైక్‌పై పుంగనూరు రోడ్డులో ఉన్న స్వామి వద్దకు మంత్రించుకోవడానికి వెళ్లింది. ఇదే అదనుగా స్వర్ణకుమారిని వెంకటేశ్‌ కిడ్నాప్‌ చేసి.. ఆ తర్వాత హత్య చేశాడు. మదనపల్లి టూటౌన్‌ పరిధిలో ఆమె మృతదేహాన్ని పాతిపెట్టాడు. అయితే అదే సమయంలో స్వర్ణకుమారి స్నేహితురాలు ఫోన్‌ చేసింది. కానీ కాల్‌ ఫార్వర్డ్‌ అనే వాయిస్‌ వినిపించింది. ఆ రోజు సాయంత్రం కూడా ఇంటికి రాలేదు. దీంతో దైవభక్తి ఎక్కువగా ఉండటంతో ఏదైనా దూర ప్రాంతంలోని గుడికి వెళ్లి ఉంటుందని భావించింది.

కానీ అక్టోబర్‌ 1వ తేదీన పింఛన్‌ తీసుకునేందుకు కూడా రాకపోవడంతో స్థానికులు ఈ విషయాన్ని సీఐ నాగేంద్ర ప్రసాద్‌కు తెలిపారు. దీంతో మదనపల్లెకు వచ్చిన సీఐ.. తన తల్లి ఆచూకీ కోసం చుట్టుపక్కల మొత్తం విచారించాడు. ఎక్కడ ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో మదనపల్లె టూ టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు విచారణ మొదలుపెట్టిన పోలీసులు నిందితుడు వెంకటేశ్‌ను బెంగళూరులో సోమవారం నాడు అదుపులోకి తీసుకున్నారు.

సీఐ తల్లి కిడ్నాప్‌, హత్య నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ తీవ్రంగా మండిపడింది. రాష్ట్రంలో ఈ అరాచకం ఏంటి చంద్రబాబూ అని ప్రశ్నించింది. కూటమి ప్రభుత్వంలో పోలీసు కుటుంబాలకే రక్షణ లేకపోతే.. సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీసింది. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటూ గప్పాలు కొట్టడం కాదు.. శాంతి భద్రతలను ఎలా రక్షించాలో ఫస్ట్‌ తెలుసుకో అని హితవు పలికింది.

ఏపీలో సీఐ ఫ్యామిలీకే రక్షణ లేదంటే ఇది మీ చేతగానితనం కాదా అని ఏపీ సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ను ప్రశ్నించింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్, బీజేపీలకు అగ్ని పరీక్ష

జమ్మూ కశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకుంది. దేశంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత మొదటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు ఆప్, బీఎస్పీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ 90 చొప్పున సీట్లు ఉన్నాయి. సాధారణ మెజార్టీ 46. ఈ మ్యాజిక్ ఫిగర్‌ను ఎవరు అందుకుంటారో కొద్ది గంటల్లో తేలిపోనుంది.

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం మూడు దశల్లో పోలింగ్ నిర్వహించగా.. ఫలితాలు మంగళవారం ఉదయం వెలువడనున్నాయి. పదేళ్ల తర్వాత అక్కడ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 2014లో చివరిసారిగా జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు జరగ్గా.. ఐదేళ్ల తర్వాత 2019లో జరగాల్సి ఉండగా ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం తదితర పరిణామాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. చివరకు సుప్రీంకోర్టు సెప్టెంబరు 30 లోగా ఎన్నికలు జరిపించాల్సిందేనని ఆదేశించింది.

దీంతో నియోజకవర్గా పునర్‌విభజన పూర్తిచేసి ఎన్నికలను నిర్వహించారు. మొత్తం 873 మంది అభ్యర్థులు పోటీపడగా.. ప్రధాన పోటీ కాంగ్రెస్-ఎన్సీ కూటమి, పీడీపీ, బీజేపీల మధ్యే సాగింది. పునర్‌విభజనతో జమ్మూ ప్రాంతంలో సీట్లు పెరగడం బీజేపీకి లాభిస్తుందనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో బీజేపీకి అనుకూలంగా ఉంది.

ఢిల్లీకి సరిహద్దు రాష్ట్రమైన హరియాణాలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. అక్టోబరు 5 ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ గత పదేళ్లుగా బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని కమలం పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అయితే, తమదే గెలుపని, బీజేపీని హరియాణా ప్రజలు ఇంటికి సాగనంపుతారని కాంగ్రెస్ చెబుతోంది. ఇక, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఆ పార్టీకే మొగ్గు ఉందని అంటున్నాయి. దీంతో హస్తం పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది.

పదేళ్ల నుంచి అధికారంలో ఉండటంలో సాధారణంగా అధికార బీజేపీపట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి మరోసారి మూడోసారి అధికారం చేపట్టాలని ఆ పార్టీ అహర్నిశలు శ్రమించింది. గ్రామీణ ప్రాంతంలోని ఓటర్లను ఆకర్షించడంతోపాటు, జాట్‌యేతర, దళిత ఓటర్లను సంఘటితం చేసేందుకు ప్రయత్నాలు చేసింది. మరి ఆ ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాన్నిచ్చాయే కాసేపట్లో తేలిపోనుంది. హరియాణాలో కుల సమీకరణాలు, పార్టీల విభేదాలు ప్రధానాంశంగా మారాయి. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మొత్తం 10 స్థానాలకు గానూ ఐదింటితోనే సరిపెట్టుకుంది.

నాగార్జున, సమంతలపై ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కొండా సురేఖ, అక్కినేని నాగార్జున ఫ్యామిలీపైన, సమంత నాగచైతన్య విడాకులపైన చేసిన సంచలన వ్యాఖ్యల దుమారం ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది. అక్కినేని నాగార్జున, నాగ చైతన్యపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ సమంత విడాకుల విషయాన్ని ప్రస్తావించారు. మాజీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్న క్రమంలో కొండా సురేఖ చేసిన సంచలన ఆరోపణలు అక్కినేని ఫ్యామిలీకి ఆగ్రహాన్ని తెప్పించాయి .

ఒక్క నాగార్జున ఫ్యామిలీ మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీ మొత్తం కొండ సురేఖ వ్యాఖ్యల పైన భగ్గుమంది. అయితే ఆ విషయంలో తను తప్పు చేశానని ఒప్పుకొని సమంతకు క్షమాపణలు చెప్పిన కొండా సురేఖ కేటీఆర్ గురించి మాట్లాడే క్రమంలో భావోద్వేగానికి లోనై తాను వ్యాఖ్యలు చేసినట్టు తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే క్షమించమని కోరి తాను తను వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

అయినప్పటికీ కొండా సురేఖ వ్యాఖ్యల పైన అక్కినేని ఫ్యామిలీ మాత్రం వెనక్కు తగ్గలేదు. నాగార్జున ఏకంగా కొండా సురేఖ పైన పరువు నష్టం దావా సివిల్, క్రిమినల్ కేసులను వేసి ఆమెపై సమర శంఖాన్ని పూరించారు. ఇక ఇదే సమయంలో తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అక్కినేని నాగార్జున, సమంతల పైన కీలక వ్యాఖ్యలు చేశారు.

నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై రఘునందన్ రావు వ్యాఖ్యలు

ఇటీవల ఒక మీడియా ఛానల్ కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్కినేని నాగార్జున పైన, సమంత పైన రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని పేర్కొన్న ఆయన 2016 లోనే హెచ్ఎండిఏ దీనిపై రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. అది అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకు కూల్చలేదు అనేది నేటికీ పెద్ద ప్రశ్న అంటూ మాట్లాడారు.

ఇదే సమయంలో నాగర్జున కోడలుగా ఉన్న సమంత పైన కూడా ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో నాగార్జున కోడలుగా ఉన్న సమంత ఒక్కసారిగా చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. అసలు సమంతకు చేనేత రంగం గురించి ఏం తెలుసు అని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు.

రంగుల లోకంతో ఉన్న రక్తసంబంధం ఏంటో చెప్పాలి?

అప్పటి ప్రభుత్వానికి రంగుల లోకంతో ఉన్న రక్తసంబంధం ఏంటో చెప్పాలి అంటూ రఘునందన్ రావు షాకింగ్ డిమాండ్ పెట్టారు. అప్పట్లో ప్రభుత్వానికి అక్కినేని ఫ్యామిలీకి ఉన్న సంబంధాలు ఏమిటో వాళ్లే చెప్పాలంటూ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా నాగార్జున, సమంతల పైన జరుగుతున్న రగడకు రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్టుగా తెలుస్తుంది.

పవన్ కల్యాణ్ కాలి గోటికి.. ప్రకాష్ రాజ్ సరిపోడు

టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ ప్ర‌కాశ్ రాజ్‌పై ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం‌ మాట్లాడుతుంటే.. ప్రకాష్ రాజ్ ఇష్టం వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నాడని.. అత‌నో స్వార్దపరుడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ (NattiKumar) ప్ర‌కాశ్ రాజ్ (Prakash Raj)పై ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం‌ మాట్లాడుతుంటే.. అప్పటి నుంచే ఆయనంటే కొందరికి పడటం లేదని ప్రకాష్ రాజ్ ఇష్టం వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నాడని.. ప్రకాష్ రాజ్ స్వార్దపరుడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎనాడన్నా ఇండస్ట్రీ కోసం , ప్రజల కోసం ఎమన్నా చేశావా ప్రకాష్ రాజ్.. ప్రజ్వల్ రేవన్న ఇన్సిడెంట్ పై ఎందుకు స్పందించలేదు, రజనీకాంత్‌ను అన్నప్పుడు ఏమి స్పందించలేదు.. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ పేరు చెప్పి దేవుడిని అవమానిస్తున్నాడని దుయ్య‌బ‌ట్టారు. పవన్ కల్యాణ్ కాలి గోటికి ప్రకాష్ రాజ్ సరిపోడని.. ఇదంతా డైవర్షన్ కోసం చేస్తున్నట్టుందని అన్నారు. ప్రకాష్‌రాజ్.. జగన్, కేటీఆర్‌ల ఏజెంట్.. కొండా సురేఖపై ఇండస్ట్రీ ట్వీట్స్ వెనుక కూడా ప్రకాష్ రాజే ఉన్నాడని అనుమానంగా ఉంద‌న్నారు. కేటీఆర్ కోసమే ఇదంతా చేసి ఉంటాడ‌న్నారు.

చిరంజీవి గారిని అవమానించినప్పుడు, ఐదు రూపాయల టికెట్ పెట్టినపుడు జ‌గ‌న్‌పై.. కేసీఆర్ ఇండస్ట్రీ అమ్మాయిలను డ్రగ్స్ పేరుతో నిలబెట్టినపుడు వారిపై ఎందుకు ట్వీట్ చేయలేదంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. అప్పుడు ఉంది మీ ప్రభుత్వాలే అనే చేయలేదా.. టీడీపీ, పవన్ కల్యాణ్ అధికారంలో ఉంటేనే మీరు ట్వీట్లు వేస్తారా అని అన్నారు. ఇంకా.. రేణు దేశాయ్ గారు ట్రోలింగ్ గురైనపుడు ఇండస్ట్రీ ఏమైంది, భువనేశ్వరి గారిపై అసభ్యంగా మాట్లాడినపుడు ఇండస్ట్రీ ఏమైంది, రజినీకాంత్‌పై నీచంగా మాట్లాడిన‌ప్పుడు, చిరంజీవి త‌ల్లి అంజ‌నా దేవిపై పోసాని అసభ్యంగా మాట్లాడితే ఖండన ఏది.. ప్రకాష్ రాజ్ ట్వీట్ ఎందుకు వేయలా.. జగన్ కేసీఆర్ అంటే మీకు భయమా అని నిల‌దీశారు. ప్రకాష్ రాజ్ ధైర్యం ఉంటూ పొలిటికల్‌గా వచ్చి పవన్ కల్యాణ్ ను ఎదుర్కోవాలి.. అంతేకానీ ఇండస్ట్రీ ముసుగులో ట్వీట్స్ కరెక్ట్ కాదని హిత‌వు ప‌లికారు.

కొండా సురేఖ ఓ నిర్మాత, బీసీ మహిళ.. ఆమెను ట్రోల్ చెస్తే.. ఇండస్ట్రీలో ఎవరు ఖండించలేదన్నారు. ఇటీవ‌ల మంత్రి మాట్లాడింది తప్పే‌‌.. కానీ ఆవిడ క్షమాపణ చెప్పారు.. కానీ నాడు వైసీపీ వారు, పోసాని మాట్లాడింది నీచాతినీచం. జానీ మాస్టర్ పై పొక్సో కేసు ఉందని ఇండస్ట్రీ వాళ్లే మెయిల్ పెట్టారు.. అందుకే అవార్డ్ రద్దైంది..దీని వెనుక కుట్ర కోణం ఉంది. నేషనల్ అవార్డ్ అనేది డాన్సర్స్ యూనియన్ కే గర్వకారణం. జానీ మాస్టర్ వ్యవహారంలో అసలు నిజాలు త్వ‌ర‌లోనే బయటకు వస్తాయి. అతనికి జరిగిన అన్యాయంపై డాన్సర్స్ యూనియన్ గట్టిగా మాట్లాడాలి.. జానీతో పాటు ఆ అమ్మాయి కార్డ్ కూడా క్యాన్సిల్ చేయాలి. జానీ అవకాశాలు అమ్మాయికి తరలించే ప్రయత్నం జరుగుతోంది. జానీ కుటుంబాన్ని రోడ్డున పడేయవద్దన్నారు. నేషనల్ కమిటీకి డాన్సర్స్ మెయిల్ పెట్టాల‌ని.. జానీ అవార్డ్ క్యాన్సిల్ అవ్వగానే.. బెయిల్ ను అతనే నిజాయితీగా క్యాన్సిల్ చేసుకున్నాడని జానీ విషయంలో సత్యమే గెలుస్తుందన్నారు. సినీ ఇండస్ట్రీని కాపాడండి..‌ అనవసరమైన అపార్దాలను ఇండస్ట్రీకి ఆపాందించవద్ద‌న్నారు.

తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు అన్నీ సాక్షాలతో ప్రెస్మీట్ పెట్టారు. గత ఐదు సంవత్సరాల్లో రెడ్డి గార్ల హాయంలో అన్యాయం జరిగిందనేది వాస్తవం. దర్శనం టికెట్లు బ్లాక్ లో అమ్మి డబ్బులు జగన్ ఎకౌంట్లో వేశారు. శేషాచలం అడవులను కొట్టేయటం వల్ల అడవి జంతువులు భక్తులపై దాడి చేశాయి. చంద్రబాబు గారు ఇంకా ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవటం లేదో తెలియ‌డం లేద‌న్నారు. జగన్ ను తిట్టండి.. ఏసు ప్రభును ఎందుకు తిడుతున్నారు.. త‌ప్పు చేసింది జగన్ మాత్రమేన‌ని అన్నారు.

పని చేసే వారికి.. నిజాయితీ పరులకు పదువులు ఇవ్వండి. కాకా పట్టే వారికే ఇంకా పదువులు ఇస్తున్నారు.. ‌గత ప్రభుత్వానికి మీకు తేడా ఏంటి.. మరలా ఇసుక దందాలు మొదలవుతాయని మంత్రి లోకేష్ దృష్టి పెట్టాల‌న్నారు. నారా లోకేష్ గారు ఫోన్ అందుబాటులో ఉన్నా.. కొందరు ఎంఎల్ఎలు ఫోన్లకు కూడా దొరకటం లేదన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం వెంటనే లొకేష్ రివ్యూలు చేస్తున్నారు. కానీ ఎంఎల్ఎ లు అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వీటిని చంద్రబాబు, లోకేష్, పవన్‌లు త్వ‌ర‌గా రెక్టిఫై చేయాలి. 2029లో లోకేష్ సీఎం కావాలని వ్యక్తిగతంగా అశిస్తున్నా అన్నారు.

ఆ విద్యార్థినికి లోకల్ కోటాలోనే సీటు ఇవ్వండి.. కాళోజీ యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశాలు

కాళోజీ యూనివర్సిటీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దుబాయ్‌లో పాఠశాల విద్యను అభ్యసించి.. హైదరాబాద్‌లోనే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఓ విద్యార్థినికి స్థానిక కోటాలో అడ్మిషన్‌ ఇచ్చేందుకు అభ్యంతరం తెలిపిన ఘటనలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేశింది. సదరు విద్యార్థినికి స్థానిక కోటాలోనే సీటు ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఓ విద్యార్థినికి ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ విషయంలో వచ్చిన ధర్మ సంకటంపై కాళోజీ విశ్వవిద్యాలయానికి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సదరు విద్యార్థినికి లోకల్ కోటాలోనే సీటు ఇవ్వాలని యూనివర్సిటీని ఆదేశించింది. దుబాయ్‌లో పాఠశాల విద్యను అభ్యసించి.. హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన.. హైదరాబాద్ కొండాపూర్‌కు చెందిన అనుమత ఫరూక్‌ను.. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు స్థానిక అభ్యర్థిగా పరిగణించకుండా తప్పించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ మీద విచారణ చేపట్టిన.. చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ ఆరాధే, జస్టిస్‌ శ్రీనివాస్‌రావుతో కూడిన ధర్మాసనం.. ఈ తీర్పును వెలువరించింది.

అయితే.. ఫరూక్ 1998 నుంచి 2008 వరకు (10వ తరగతి వరకు) దుబాయ్‌లో విద్యాభ్యాసం చేసింది. 2019 నుంచి తెలంగాణలోనే నివాసం ఉంటోంది. తెలంగాణలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి నీట్ పరీక్షకు హాజరయ్యారైనట్టు.. పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. జులైలో తెలంగాణ ప్రభుత్వం చేసిన చట్టానికి ఇటీవల చేసిన సవరణల ప్రకారం.. ఒక విద్యార్థి తెలంగాణలో వరుసగా 4 ఏళ్లు చదివినా.. లేదా అదే వ్యవధిలో రాష్ట్రంలో నివసించినా.. వారిని స్థానిక అభ్యర్థిగా పరిగణించాల్సి ఉంటుందని న్యాయవాది వివరించారు.

నివాస అవసరాన్ని పూర్తి చేసి.. అవసరమైన ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించినప్పటికీ.. పిటిషనర్‌ను స్థానిక అభ్యర్థిగా పరిగణించకపోవటం దారుణమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. విద్యార్థినిని ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు స్థానిక అభ్యర్థిగా గుర్తించాలని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌‌ను ఆదేశించింది. లోకల్ కేటగిరీ కింద అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఆ విద్యార్థినికి అనుమతి ఇవ్వాలని యూనివర్సిటీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

తెలంగాణ స్థానికతపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై సర్వత్రా వివాదం తలెత్తడంతో ఈ ఏడాది ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగింది. కోర్టు వివాదాలతో.. కౌన్సిలింగ్‌ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారిలో ఇంటర్మీడియట్‌కు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివితే మాత్రమే స్థానికులుగా గుర్తించేలా జారీ చేసిన జీవో 33పై కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. స్థానికతకు సంబంధించిన మార్గదర్శకాలను కొత్తగా రూపొందించాలని హైకోర్టు ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కౌన్సెలింగ్ ప్రక్రియకు అనుమతించింది.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.

.

ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో తీవ్రవాద నిరోధంపై అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ నిర్వహించిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. 2026 నాటికి వామపక్ష తీవ్రవాదం ఆనవాళ్లు లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్రం పని చేస్తోంది. మావోయిస్టుల ఏరివేత, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రులతో మాట్లాడారు. దేశంలో నక్సలిజం చివరి దశకు చేరుకుందని చెప్పారు.

మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రలతో భేటీ అవుతున్నారు. హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణకు వరద సాయం పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విభజన చట్టంలోని పెండింగ్లో ఉన్న అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. నమామీ గంగకు నిధులు కేటాయించినట్లుగానే రాష్ట్రంలోని మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య పలు రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఏపీకి రూ.1,036 కోట్ల సహాయం ప్రకటించగా.. తెలంగాణ మాత్రం రూ.416.80 కోట్లు మాత్రమే ఇచ్చారు. తెలంగాణలో వరదలతో చాలా నష్టపోయిందని రేవంత్ అమిత్ షాకు వివరించినట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు భారీ వర్షాలతో దెబ్బతిన్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రె అగ్రనేతలను కూడా కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణపై వార్తలు వస్తుండడంతో రేవంత్ పార్టీ పెద్దలతో ఇందుకు సంబంధించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి సోమవారం రాత్రికి లేదా.. మంగళవారం ఉదయం తిరిగి హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది.