NLG: మూసి సుందరీకరణ పేరుతో పేదల బ్రతుకులను ఆగం చేయొద్దు: సిపిఎం
నల్లగొండ జిల్లా:
మూసి సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదల బతుకులు ఆగం చేయొద్దని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య కోరారు. గురువారం మునుగోడు లో మండల కమిటీ సమావేశం స్థానిక సిపిఎం కార్యాలయంలో వేముల లింగ స్వామి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నారి ఐలయ్య మాట్లాడుతూ.. మూసి సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పేద, మధ్య తరగతి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయని.. మూసి రివర్ ప్రాంతంలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న ప్రజలపై పోలీసులు అధికారులు దౌర్జన్యం ప్రదర్శిస్తున్నారని  విమర్శించారు. బుల్డోజర్లు వచ్చి ఇల్లు కూలగొడతాయేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా నిర్ణయాలు తీసుకునే ముందు అఖిలపక్ష పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల మేధావులతో చర్చించాలని.. చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ ప్రజల భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని, పర్యాటక కేంద్రంగా మార్చినంత మాత్రాన ప్రభుత్వ ప్రయోజనాలు నెరవేరవని అన్నారు. పైగా  సాధారణ ప్రజల ఆవాసాలకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

మూసి ప్రధాన సమస్య కాలుష్యమని, మందులు రసాయన పరిశ్రమలకు సంబంధించిన వ్యర్ధాలు, మురికి నీరు మూసి లో కలవడం వల్ల కాలుష్యం పెరుగుతుందని, ఫలితంగా
మూసి పరిసరాల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, ఉప్పల్ నుండి సూర్యాపేట వరకు కలుషిత మూసి జలాల వలన వ్యవసాయ ఉత్పత్తులు, పాలు, చేపలు ఉపయోగించిన ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్ణయాల వల్ల వీధిన పడుతున్న మూసి నిర్వాసితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని, మూసి సుందరీకరణ పేరుతో పేదలను నగరం బయటికి పంపి బడా కార్పొరేట్ సంస్థలకు షాపింగ్ మాల్స్, గార్డెన్స్, స్టార్ హోటల్  యజమానులకు ప్రభుత్వ భూములు కట్టబెట్టే ప్రయత్నం  మానుకోవాలని పేదలకు వెంటనే పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం మూసి ప్రాంత పేదల ఇళ్లను తొలగిస్తారని తెలియడంతో కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారని, మరి కొంతమంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని బాధిత కుటుంబాలను నష్ట పరిహారం ఇవ్వాలని ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని, వారిపై ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం, మండల కార్యదర్శి మిర్యాల భగత్, మండల కమిటీ సభ్యులు వరికుప్పుల ముత్యాలు, యాతరాణి శ్రీను, సాగర్ల మల్లేశం, శివర్ల వీరమల్లు, వడ్లమూడి హన్మయ్య, యాట యాదయ్య, కొంక రాజయ్య, బోల్ల ఎట్టయ్య, ఒంటెపాక అయోధ్య, తదితరులు పాల్గొన్నారు.

NLG: సేఫ్టీ మోకులు ప్రతి గీత కార్మికుడు వినియోగించుకోవాలి: ఎక్సైజ్ ఎస్ఐ స్వాతి
నల్లగొండ జిల్లా:
సేఫ్టీ మోకులు ప్రతి గీత కార్మికుడు వినియోగించుకోవాలని చండూరు ఎక్సైజ్ ఎస్సైస్వాతి, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో సేఫ్టీ మోకులపై గురువారం గీత కార్మికులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సేఫ్టీ మోకులు వినియోగించడం వలన తాటి చెట్టు ఎక్కేటప్పుడు ప్రమాదం నుండి రక్షణ పొందవచ్చని తెలిపారు.

గీత కార్మిక వృత్తి చాలా ప్రమాదకరమైనది. గీత కార్మికుడికి కాటమయ్య రక్షణకవచం చాలా అవసరమని ప్రతి గీత కార్మికుడు వినియోగించుకోవాలనివారు తెలిపారు. సేఫ్టీ మోకులు లేకపోవడం వలన చాలామంది గీత కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల కోసం సేఫ్టీ మోకులపై తీసుకున్న నిర్ణయాన్ని గీత కార్మికులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ అధికారులు సైదులు, శ్రీను కుమార్, నల్లగొండ టీం ట్రైనర్స్ కాసాని సత్తయ్య, సైదులు, శంకరయ్య, గీత పనివారల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లె శంకరయ్య,  ఎక్సైజ్ అధికారి ప్రభాకర్, గీత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: గట్టుప్పల్ లో పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి: బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా:
గట్టుప్పల్ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. బుధవారం గట్టుప్పల మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  మండల కేంద్రంలో ఎంపీడీవో ఆఫీసు, ఆరోగ్యశాఖ, వ్యవసాయ కార్యాలయం, విద్యుత్ కార్యాలయం, మండల పశు వైద్యశాల కార్యాలయం, తదితర సమస్యలతో మండల కేంద్రం పూర్తిస్థాయిలో నడవడం లేదని, ప్రభుత్వం వెంటనే చొరవ చూపి మౌలిక వసతులు కల్పించాలని  ఆయన అన్నారు.

గట్టుప్పల్ పోలీస్ స్టేషన్ కు పూర్తిస్థాయి అధికారులు ఇవ్వాలని, అదేవిధంగా  సిబ్బందిని నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మండల వ్యాప్తంగా లింకు రోడ్ల సమస్యలు కూడా త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని కోరారు.

ఈనెల 15న గట్టుప్పల సిపిఎం మండల మహాసభ జరుగుతుందని, ఈ మహాసభకు అందరూ హాజరుకావాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు,గట్టుప్పల మండల కార్యదర్శి కర్నాటి మల్లేశం, సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, సిపిఎం మండల కమిటీ సభ్యులు బొట్టు శివకుమార్,కర్నాటి సుధాకర్, అచ్చిన శ్రీనివాస్, వల్గూరి శ్రీశైలం,ఖమ్మం రాములు,కక్కునూరి నాగేష్,టేకుమెట్ల కృష్ణ,బండ లింగస్వామి,తదితరులు పాల్గొన్నారు.
NLG: దుర్గామాతకు అభిషేకం నిర్వహించిన కంజర శ్రీను జ్యోతి దంపతులు

నల్గొండ: పానగల్ రోడ్ శ్రీనగర్ కాలనీ గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో, రేపు జరగబోయే దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్బంగా.. ఈ రోజు దుర్గ మాత కు పంచామృతాలతో ప్రముఖ అయ్యప్ప పూజల గాయకుడు గురు స్వామి కంజర శ్రీను-జ్యోతి దంపతులు భక్తి శ్రద్ద లతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పూజలో పాల్గొన్న భవానీ లకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. రేపు జరగబోయే దేవి పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ పూజ కార్యక్రమంలో గురుభవాని వెంకన్న భవాని, మహేష్, మనోజ్, శివ, నవీన్, ప్రవీణ్, వెంకట్, చందు, జగదీష్, అర్జున్, ధత్తు లతో పాటు భవానీలు పాల్గొన్నారు.

TG: బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన పిపిఎల్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా, పిపిఎల్ రాష్ట్ర మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు నల్లగొండ జిల్లా ప్రజలకు ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా శరన్నవరాత్రి శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

మహిళలు పూలను పేర్చి బతుకమ్మలను తయారుచేసి భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ బతుకమ్మ పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం నింపాలని ఆకాంక్షించారు.
NLG: ప్రకృతి సమతుల్యతకు జీవసేంద్రియ వ్యవసాయమే శరణ్యం
నల్లగొండ జిల్లా:
అనుముల మండలం కట్టొరి అన్నారం గ్రామంలో కె.ఎన్.బయో సైన్సెస్ మరియు శ్రీ సత్యం వర్మీ బయో ఆర్గానిక్స్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో బుధవారం క్షేత్రస్థాయి ఆర్గానిక్ రైతు సదస్సును నిర్వహించారు.

ఈ సందర్భంగా పత్తి, మిర్చి, ఆయిల్ ఫామ్, బత్తాయి తోటల రైతులతో క్షేత్రస్థాయి సదస్సును నిర్వహించి రైతులకు ఆర్గానిక్ జీవ సంబంధిత ఎరువుల ప్రాముఖ్యతను కే.ఎన్. బయోసైన్సెస్ తెలంగాణ ఇన్చార్జ్
వై.రామానుజ సంపూర్ణంగా రైతులకు వివరిస్తూ అవగాహనను కల్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యం వర్మీ బయో ఆర్గానిక్ కన్సల్టెన్సీ  డైరెక్టర్స్ అక్కినపల్లి కిరణ్, వంగూరి భానుప్రసాద్, గ్రామ రైతులు జూలకంటి మాధవరెడ్డి, కట్ట నారాయణరెడ్డి, గోదల శ్రీనివాస్ రెడ్డి, బొమ్మపాల లింగయ్య, గార్లపాటి ఉషయ్య తదితరులు పాల్గొన్నారు.
NLG: ఆల్ ఇండియా బంజారా కార్మిక విభాగం ఆధ్వర్యంలో మహాత్ముడి జయంతి
నల్గొండ: ఈ రోజు జాతి పిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని రామగిరి సెంటర్ లో గల గాంధీ విగ్రహానికి, ఆల్ ఇండియా బంజారా కార్మిక విభాగం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కెలావత్ నగేష్ నాయక్ మాట్లాడుతూ..గాంధీ దేశం కోస ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తి  అన్నారు. వారు చూపిన మార్గంలో ముందుకు నడవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రాజశేఖర్, సాగర్ నాయక్, లక్ష్మయ్య, వినోద్ కుమార్, యాదయ్య పాల్గొన్నారు.
NLG: లెంకలపల్లి గాంధీ సెంటర్లో ఘనంగా గాంధీ జయంతి

అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి ని పురస్కరించుకొని మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో గాంధీ సెంటర్లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి గ్రామ ప్రజలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించడమే కాకుండా, స్వాతంత్య్ర సమరయోధులు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన నాయకుడు, అహింసా మార్గంలో భారతదేశ స్వాతంత్ర సాధనకు కీలక పాత్ర పోషించారని ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొన్న కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్
చౌటుప్పల్: మహిళలంతా ఐక్యతతో ప్రకృతిని పూజించే పూల పండుగ బతుకమ్మ అని ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి అన్నారు. మంగళవారం ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొని బతుకమ్మ ఆడారు.

NLG: పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి: కౌన్సిలర్ పూజిత వెంకటేశ్వర్లు
నల్గొండ: మున్సిపాలిటీ పరిధిలోని  34 వ వార్డులో వావ్ ప్రాజెక్ట్ వాలంటీర్ నాగుల జ్యోతి మంగళవారం ఇంటింటికి తిరుగుతూ చెత్తను వేరు చేయాలని చెత్తను వేసే బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వార్డు కౌన్సిలర్ ఆర్. పూజిత వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడుతూ.. తడి, పొడి చెత్త ను వేరు చేయాలని పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని వార్డ్ ప్రజలకు సూచించారు. అనంతరం బ్యాగుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పూజిత వెంకటేశ్వర్లు, వాలంటీర్ నాగుల జ్యోతి, స్థానిక ప్రజలు, పాల్గొన్నారు.