తుంగభద్ర నీటి వ్యధ..
తుంగభద్ర నీటి వ్యధ Aug 16,2024 నీటి రంగ నిపుణులు వి. రాంభూపాల్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తుంగభద్ర జలాశయం 19వ గేటు ఆగస్టు 10వ తేదీ అర్ధరాత్రి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. సుమారు 60 టిఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి వదిలేయాల్సి వస్తుందని అధికారులు ప్రకటించడంతో…ఈ డ్యాంపై ఆధారపడిన కరువు పీడిత ప్రాంతాల రైతుల గుండెలు అవిసిపోతున్నాయి. ఈ ఖరీఫ్‌కు అవసరమైన వర్షాలు జులై నెలలో రాకపోవడంతో రాయలసీమ జిల్లాల్లో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయిందని అధికార లెక్కలు చెబుతున్న స్థితిలో. కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల తుంగభద్రకు వరద పోటెత్తడంతో ఎగువ, దిగువ కాలువల కింద వున్న రైతుల్లో చిగురించిన ఆశలు అడియాసలు అవుతున్నాయి. తెగిన గేటు చూసేందుకు కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల పాలక పార్టీల నాయకుల పర్యటనల హోరు ఉధృతంగా సాగుతున్నది. ఈ ఆపత్కాలాన్ని కూడా తమ రాజకీయాలకు ఉపయోగించుకుని రెండు రాష్ట్రాల మధ్య తగువు పెట్టడానికి బిజెపి ప్రయత్నిస్తున్నది. కొట్టం కాలి ఒకడు ఏడుస్తుంటే, మరొకడు చుట్ట అంటించుకోవడానికి నిప్పడిగినట్లు వుంది పరిస్థితి. మొన్నటి వరకు తమ ఏలుబడిలోనే కర్ణాటక వుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు తాము భాగస్వాములమని, తుంగభద్ర డ్యాం కేంద్ర జలవనరుల శాఖ కింద వుంటుందనే విషయాన్ని మరచి మాట్లాడుతున్నారు. వృధా అవుతున్న నీటిని అరికట్టడానికి స్టాప్ లాగ్‌ను అమర్చేందుకు నిపుణులు చేస్తున్న తక్షణ ప్రయత్నాలు త్వరగా ఫలవంతం కావాలని ఆశిద్దాం. శాశ్వతంగా చేపట్టాల్సిన చర్యల కోసం ప్రభుత్వాలను డిమాండ్ చేద్దాం. దప్పిక అయినప్పుడు బావి తవ్వితే ఎలా? ఎంతటి నిపుణతతో, సమర్థతతో నిర్మించిన ప్రాజెక్టు అయినా నిర్వహణ సక్రమంగా లేకపోతే కన్నీటి వ్యధగానే మిగులుతుంది. ప్రకృతిలోని సమస్త భౌతిక వస్తువులు మార్పు చెందడం సహజం. తుంగభద్ర జలాశయపు గేటు విరిగిపోవడం అసహజమేమీ కాదు. అయితే ప్రతి సంవత్సరం వర్షాలకు ముందుగానే జలాశయపు గేట్లు, లాకుల లాంటి వాటన్నింటి పనితీరును సక్రమంగా పరీక్షించాలి. గేటు కొట్టుకు పోయే పరిస్థితి వచ్చిందంటే పర్యవేక్షణ సరిగా లేదని అర్థం. కనీసం గ్రీజు కూడా సకాలంలో పూయకపోవడంతో షెట్టర్లు మొరాయించిన పరిస్థితిని చూస్తున్నాము. కాలువల్లో పెరిగిపోయిన కంప చెట్లు, తెగిపోయిన కల్వర్టులు, ప్రతి సంవత్సరం పడుతున్న గండ్లు పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనాలు. దప్పిక వేసినప్పుడు బావులు తవ్వడం మన ప్రభుత్వాలకు అలవాటయ్యింది. ఈ ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధులు ఇవ్వడంలో, సిబ్బందిని నియమించడంలో విఫలమైన ప్రభుత్వాలు, వీటి నిర్వహణను గాలికి వదలి ప్రభుత్వాధినేతల ప్రాపకం కోసం వెంపర్లాడే ఉన్నతాధికారులు ఈ పరిస్థితికి బాధ్యులు. గతంలో పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు విరిగిపడడం, రెండు సంవత్సరాలకు ముందు అన్నమయ్య ప్రాజక్టు, బి.టి (భైరవాని తిప్ప) ప్రాజెక్టు గేటు లీకేజి ద్వారా నీరు వృధా కావడం, ఇప్పుడు ఏకంగా గేటే ప్రవాహంలో కొట్టుకుపోవడం చూస్తున్నాము. ప్రభుత్వ నేతలు, సాగునీటి ఉన్నతాధికారులు వీటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం అలవాటుగా మారింది. వీటి బాధ్యతారాహిత్యం ఫలితంగా రైతాంగానికి జరిగిన ఘోరమైన అన్యాయాన్ని కప్పిపుచ్చుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో గత సంవత్సరం ఖరీఫ్‌లో మొత్తం 31 మండలాల్లో 28 మండలాలు, రబీలో 18 మండలాలను కరువు మండలాలుగా గత ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఖరీఫ్‌లో 4.5 లక్షల హెక్టార్లు సాగు కావలసి వుండగా జులై చివరి నాటికి కేవలం 80 వేల హెక్టార్లలో మాత్రమే సాగు అయ్యిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా వుందో అర్థమవుతుంది. రాయలసీమ వ్యాప్తంగా తరతమ తేడాలతో ఇదే పరిస్థితి వుంది. డ్రిప్ ద్వారా చుక్క చుక్క నీటితో పంటలు సాగు చేస్తున్న సీమ రైతుల కళ్ళ ముందు పదుల టియంసీల నీరు వృధాగా పోతుంటే వారు అనుభవించే మానసిక వ్యధను పాలకులు గుర్తించడంలేదు. ఎన్నికలకు ముందు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని, రాయలసీమను సశ్యశ్యామలం చేస్తామని పాలక, ప్రతిపక్షాలు పోటీలు పడి వాగ్దానాలు చేస్తున్నాయి. వున్న ప్రాజెక్టులను కూడా సక్రమంగా పర్యవేక్షించడం, నిర్వహించడం చేతకాని పాలకులు ప్రతి ఎకరాకు ఎలా, ఎక్కడి నుండి నీళ్ళు ఇస్తారని ప్రజలు నిలదీస్తారనే భయం, సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతూనే వున్నారు. తుంగభద్ర డ్యాం చరిత్ర తుంగభద్ర నది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. తుంగ-భద్ర నదులు కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ప్రారంభమై షిమోగా ‘కూడాలి’ వద్ద కలిసి అక్కడి నుండి తుంగభద్రగా మారుతుంది. అక్కడి నుండి 531 కిలోమీటర్లు ప్రవహించి మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. రాయలసీమ, పల్నాడు ప్రాంతాలలో 1867-1905 మధ్య తీవ్ర కరువులు వచ్చి లక్షల మంది చనిపోయారు. కరువుల నుండి ప్రజలను కాపాడలేకపోతే తమ పాలనకే ముప్పు వస్తుందని గ్రహించిన బ్రిటీష్ వలస పాలకులు ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణానికి అనేక ప్రయత్నాలు చేశారు. విజయనగర రాజుల కాలంనాడే తుంగభద్ర నదిపై నిర్మించిన 17 ఆనకట్టలను పరిశీలించిన బ్రిటీష్ చీఫ్ ఇంజనీర్ కల్నల్ స్మార్ట్ తుంగభద్ర డ్యాం నిర్మాణంపై 1902లో భారత ప్రభుత్వపు మొదటి నీటిపారుదల శాఖ కమిషన్‌కు రిపోర్టు పంపారు. ఆ తర్వాత 1906లో లార్డ్ మెకంజీ సమగ్ర నివేదికను పంపారు. అనేక మార్పులు, చేర్పుల తర్వాత 1930లో మద్రాసు-హైదరాబాద్ (నిజాం ప్రభుత్వం) ప్రభుత్వాలు జాయింట్ ప్రాజెక్టుగా తుంగభద్ర జలాశయ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించాయి. 1944 జూన్‌లో ఆ రెండు ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం మల్లాపురం (ప్రస్తుతం డ్యాం వున్న స్థలం) వద్ద ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 1945లో ప్రారంభించిన పనులు 1948లో హైదరాబాద్‌లో నైజాం ప్రభుత్వం పతనమైన తర్వాత, ప్రముఖ ఇంజనీర్ ఎం.విశ్వేశ్వరయ్య బోర్డు ఆఫ్ చీఫ్ ఇంజనీర్‌గా ఎన్నిక కావడంతో వేగవంత మయ్యాయి. 1958 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తయింది. ఈ జలాశయంలో 131.30 టియంసీల నీరు నిల్వ వుండేటట్లు నిర్మించారు. ఈ ప్రాజెక్టు నుండి సుమారు 230 టియంసీల నీరు ప్రవహిస్తుంది. 1953 జులై 1న కుడి, ఎడమ కాలువలకు మొదటిసారిగా నీరు వదిలారు. బిజెపి కపటత్వం అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు జీవనాడి తుంగభద్ర ప్రాజెక్టు. డ్యాం నుండి ఎగువ (హెచ్.ఎల్.సి) కాలువ కర్ణాటకలో 105.437 కి.మీ ప్రవహించి, 4200 క్యూసెక్కుల సామర్థ్యంతో అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ జిల్లాలో 84.243 కి.మీ ప్రవహించి మిడ్ పెన్నార్ ప్రాజెక్టులోకి చేరుతుంది. ఈ కాలువ ద్వారా కర్ణాటక 17.50 టియంసీలు, ఆంధ్రప్రదేశ్ 32.5 టియంసీలు వినియోగించుకోవాలి. దిగువ (ఎల్‌ఎల్‌సి) కాలువ కర్ణాటకలో 25.58 కి.మీ ప్రవహించి కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ కాలువ ద్వారా కర్ణాటక 22.5, ఆంధ్ర 29.50 టియంసీల నీరు వినియోగించుకోవాలి. 131 టియంసీల సామర్థ్యంతో నిర్మించిన తుంగభద్ర డ్యాం పూడిక వల్ల నేడు వంద టియంసీలకు మించి నిలువ పెట్టే పరిస్థితి లేదు. దీనికితోడు ఈ రెండు కాల్వలకు ఎగువ ప్రాంతంలో కర్ణాటక వుండడంతో కిందకు నీరు రాకుండా అనేక ఆటంకాలు కలుగుతున్నాయి. కర్ణాటకలో మరోసారి బిజెపి అధికారంలోకి రావడం కోసం భద్ర నదిపై ‘భద్ర ఆనకట్ట’ను నిర్మించాలని అప్పటి కర్ణాటక ప్రభుత్వం తీర్మానించడం, వెనువెంటనే జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించి 2022 కేంద్ర బడ్జెట్‌లో రూ.5,500 కోట్లను కేటాయించడం ఆగమేఘాల మీద జరిగిపోయాయి. తుంగభద్ర ప్రాజెక్టుకు ప్రధాన నీటి ఆధారం భద్రా నదే. ఈ ప్రాజెక్టు వల్ల తుంగభద్ర ప్రాజెక్టులోకి నీరు పూర్తిగా తగ్గిపోతుంది. దీనివల్ల నిత్య కరువు పీడిత ప్రాంతంగా వున్న రాయలసీమ ప్రాంతం ముఖ్యంగా అనంతపురం జిల్లా తీవ్రంగా నష్టపోతుంది. ఈ జిల్లాకు వుండే ఒకే ఒక నికర సాగు నీటి వనరు హెచ్.ఎల్.సి మాత్రమే. దీనికింద 1,45,236 ఎకరాల ఆయకట్టు వుంది. డ్యాం చరిత్రలో ఏనాడు పూర్తి ఆయకట్టు సాగు కాలేదు. ఇప్పుడు తుంగభద్ర గేటు కొట్టుకుపోవడానికి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని, ఆ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా వ్యవహరించాలని రెండు రాష్ట్రాల మధ్య తగాదాలు పెట్టేందకు ప్రయత్నిస్తున్నది. కొంపకు నిప్పు పెట్టి నీళ్ళతో ఆర్పమని సలహా చెప్పినట్లు వుంది బిజెపి తీరు. 131 టియంసీల సామర్థ్యంతో నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు వాలుగా వుండడంతో వరద నీటి ప్రవాహం వల్ల పూడిక పెరిగి ప్రతి సంవత్సరం 1/2 టియంసి తగ్గిపోతూ వస్తుంది. దీనివల్ల బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పుల కేటాయింపులకు, వాస్తవ నీటి వినియోగానికి చాలా వ్యత్యాసం వుంది. ఈ ప్రాంత రైతులు, మేధావుల ఒత్తిడితో గతంలో ఎన్.టి.రామారావు, ఆ తర్వాత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి నీటి సామర్థ్యం పెంచడానికి, హెచ్.ఎల్.సి కి సమాంతర కాలువ నిర్మించడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు. అయితే ఆ తర్వాతి కాలంలో అవేవీ కార్యరూపం దాల్చలేదు. హెచ్.ఎల్.సి ఆధునీకరణ పనులు చేపట్టి 15 సంవత్సరాలు కావస్తున్నా ఈ నాటికీ పూర్తి చేయకుండా పాలకులు చెలగాటమాడడం ఈ ప్రాంత ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. కేంద్రం1953 అక్టోబర్ 1న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో జాయింట్‌గా తుంగభద్ర బోర్డును ఏర్పాటు చేసింది. పేరుకు ఉమ్మడి బోర్డుగా వున్నప్పటికి మన రాష్ట్రానికి వున్న అధికారాలు చాలా పరిమితం. హెచ్.ఎల్.సి సమాంతర కాలువ నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన కర్ణాటక ప్రభుత్వంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చలు జరపాలి. ఈ దిశగా పాలకుల మీద ఒత్తిడి తెచ్చేందుకు రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత ప్రజలు ఉద్యమించాలి.
Aug 16 2024, 09:49