పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కన్నుమూత
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య (80) కన్నుమూశారు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతూ కోల్‌కతాలో గురువారం తుదిశ్వాస విడిచారు. 2000 నుంచి 2011 వరకు వరుసగా 11 సంవత్సరాలు పశ్చిమబెంగాల్ సీఎంగా ఆయన సేవలందించారు.
రాజ్యసభలో 12 సీట్లకు ఉపఎన్నిక.. షెడ్యూల్ విడుదల
దిల్లీ: రాజ్యసభలోని 12 స్థానాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబరు 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది..
అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉండనుంది. సార్వత్రిక ఎన్నికల్లో పలువురు లోక్‌సభ ఎంపీలుగా ఎన్నికవడం, రాజీనామాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి..
కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా...తదితర రాజ్యసభ సభ్యులు ఇటీవల ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఎన్నికలకు సంబంధించి ఆగస్టు 14న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. నామినేషన్లకు ఆగస్టు 21 చివరి తేదీ అని ఎన్నికల సంఘం వెల్లడించింది..
BiG Breaking: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్ట్ కీలక ఆదేశం
ఢిల్లీ: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ప్రారంభించాలని సీబీఐకి కోర్టుకు సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది..
వీలైనంత త్వరగా విచారణ పూర్తి కావాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే తగిన ఆదేశాలు ఇచ్చామని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం గుర్తుచేసింది.
ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణ రాజు గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను నవంబర్ నెలకు సుప్రీంకోర్ట్ వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై రెండుసార్లు ధర్మాసనం విచారణ జరిపింది. ఉదయం, మధ్యాహ్నం భోజనం విరామ అనంతరం విచారణ జరిపింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు షాకింగ్‌గా అనిపిస్తున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లో చెప్పిన అంశాలు ఆశ్చర్యకరమని అన్నారు. కేసులు ట్రయల్ ప్రారంభం కాకుండా... ఇన్ని కేసులు ఎలా ఫైల్ చేశారని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు.
ఆరుగురు జడ్జిలు మారిపోయారు, రిటైర్ అయ్యారని రఘురామ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.. కోర్టులో వచ్చిన ఆదేశాలు తప్పు అని, ఇంకో కోర్టులో ఇచ్చిన ఉత్తర్వులు తప్పు అంటూ కాలయాపన చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కోర్టుల ఉత్తర్వులు తప్పు అంటూ చేస్తున్న వ్యవహారానికి ట్రయల్‌కి సంబంధం లేదని వ్యాఖ్యానించారు.
డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని, సాధారణ కార్యకలాపాలకు ఇది అడ్డంకిగా మారుతోందని రఘురామ కృష్ణరాజు తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టులో తాము కూడా అనేక పిటిషన్లు విచారించి డిశ్చార్జ్ చేస్తున్నామని, ఎలాంటి అడ్డంకి తమకు రావడం లేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు.
ఏపీ క్యాబినెట్ భేటీ పలు కీలక అంశాలపై చర్చ
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. క్యాబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు..
స్థానిక సంస్థలు, సహకారం సంఘాల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధనను రద్దు చేసే అవకాశముంది. దీనిపై భేటీలో చర్చిస్తున్నారు. వైకాపా హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలు, మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గతంలో తీసుకొచ్చిన 217 జీవో రద్దుపై చర్చ జరుగుతోంది. మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ క్యాబినెట్‌లో తీర్మానం చేసే అవకాశముంది..
ఏపీ సీఎం చంద్రబాబు చీరాల పర్యటన రద్దు
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు చీరాల పర్యటన రద్దయింది. చేనేత దినోత్సవంలో పాల్గొనేందుకు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు చీరాల వెళ్లాల్సి ఉంది..
ఎడతెరిపి లేని వర్షం కారణంగా పర్యటనను సీఎం రద్దు చేసుకున్నారు. విజయవాడలో నిర్వహించే చేనేత దినోత్సవంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చీరాలకు వెళ్లిన చంద్రబాబు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేనేతలను ఆదుకుంటామని, వారు తయారుచేసిన చీరలకు మార్కెటింగ్ కల్పిస్తామని హామీ ఇచ్చారు..
భద్రాచలంలో భారీ వర్షం.. రామాలయం చుట్టూ వరద నీరు
భద్రాచలం: భద్రాచలంలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో పరిసర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం వద్దకు భారీగా వరదనీరు చేరింది..
అన్నదాన సత్రం పక్కనే ఉన్న డ్రైనేజీ పొంగిపొర్లుతోంది. పడమర మెట్ల వైపు మోకాలు లోతు నీరు చేరడంతో భక్తులు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. కరకట్ట వద్ద లూయిస్‌ను మూసి ఉంచడంతో వర్షపునీరు డ్రైనేజీ గుండా గోదావరిలో కలవడం లేదు. దీంతో కాంప్లెక్స్‌లో వర్షపునీటితో పాటు మురుగు చేరింది. కరకట్ట విస్తా కాంప్లెక్స్ వద్ద ఉన్న మోటార్లను ఆన్ చేయడంతో మురుగునీటిని డంపింగ్ చేస్తున్నారు. సమీపంలోని దుకాణాల్లోకి వర్షపునీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు.
గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం
మరోవైపు భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం మళ్లీ క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లోని ఇంద్రావతి వైపు నుంచి వరద చేరుతోంది. దీంతో నీటమట్టం పెరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు..
రాజధానిలో భవనాల నిర్వహణను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు: మంత్రి నారాయణ
అమరావతి: తెదేపా హయాంలో నిర్మించిన భవనాలు, రోడ్ల నిర్వహణను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి పి.నారాయణ అన్నారు. రాజధాని అమరావతిలో ప్రత్యేక పూజల అనంతరం జంగిల్ క్లియరెన్స్ పనులను ఆయన ప్రారంభించారు..
అనంతరం మీడియాతో మాట్లాడారు. సుమారు 24వేల ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ చేపడతామని.. నెలలోపు ఆ పనులు పూర్తిచేస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న భవనాల నాణ్యతను ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ చెన్నై నిపుణులు పరిశీలించారని.. త్వరలో ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందజేస్తారన్నారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామని చెప్పారు.
250 పొక్లెయిన్ల సాయంతో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. దీనికోసం రూ.36కోట్లు కేటాయించారు. ముళ్ల చెట్లు తొలగించాక అమరావతిలో కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు స్థలాలను అప్పగించనున్నారు.
నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న భేటీ.
రాజధాని నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం.
నిర్మాణాలపై ఇప్పటికే నివేదిక ఇచ్చిన ఐఐటీ నిపుణులు.
Bangladesh. ప్రధాని అధికారిక నివాసాన్ని లూటీ చేశారు!*
ప్రతి ఒక్కరి చేతుల్లో ఏదో ఒక వస్తువు ఉండటం చూసి ఇళ్లు ఖాళీ చేసి తరలిస్తున్నారని అనుకుంటున్నారా? కాదు.
ఈ దృశ్యాలు బంగ్లాదేశ్లోని ఢాకాలో ప్రధాని అధికారిక నివాసం పరిసరాల్లోనివి.
ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోవడంతో ఆమె ఇంట్లోని వస్తువులను నిరసనకారులు దోచుకెళ్లారు.
రిక్షాలు ఏర్పాటు చేసుకొని ఫర్నీచర్ను, టీవీలు ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిన వీడియోలు వైరలవుతున్నాయి.
Aug 08 2024, 14:39