రాజధానిలో భవనాల నిర్వహణను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు: మంత్రి నారాయణ

అమరావతి: తెదేపా హయాంలో నిర్మించిన భవనాలు, రోడ్ల నిర్వహణను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి పి.నారాయణ అన్నారు. రాజధాని అమరావతిలో ప్రత్యేక పూజల అనంతరం జంగిల్‌ క్లియరెన్స్‌ పనులను ఆయన ప్రారంభించారు..

అనంతరం మీడియాతో మాట్లాడారు. సుమారు 24వేల ఎకరాల్లో జంగిల్‌ క్లియరెన్స్‌ చేపడతామని.. నెలలోపు ఆ పనులు పూర్తిచేస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న భవనాల నాణ్యతను ఐఐటీ హైదరాబాద్‌, ఐఐటీ చెన్నై నిపుణులు పరిశీలించారని.. త్వరలో ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందజేస్తారన్నారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామని చెప్పారు.

250 పొక్లెయిన్ల సాయంతో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేపట్టారు. దీనికోసం రూ.36కోట్లు కేటాయించారు. ముళ్ల చెట్లు తొలగించాక అమరావతిలో కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు స్థలాలను అప్పగించనున్నారు.

నేడు ఏపీ కేబినెట్‌ కీలక సమావేశం.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న భేటీ. 

రాజధాని నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం. 

నిర్మాణాలపై ఇప్పటికే నివేదిక ఇచ్చిన ఐఐటీ నిపుణులు.

Bangladesh. ప్రధాని అధికారిక నివాసాన్ని లూటీ చేశారు!*

ప్రతి ఒక్కరి చేతుల్లో ఏదో ఒక వస్తువు ఉండటం చూసి ఇళ్లు ఖాళీ చేసి తరలిస్తున్నారని అనుకుంటున్నారా? కాదు.

ఈ దృశ్యాలు బంగ్లాదేశ్లోని ఢాకాలో ప్రధాని అధికారిక నివాసం పరిసరాల్లోనివి.

ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోవడంతో ఆమె ఇంట్లోని వస్తువులను నిరసనకారులు దోచుకెళ్లారు.

రిక్షాలు ఏర్పాటు చేసుకొని ఫర్నీచర్ను, టీవీలు ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిన వీడియోలు వైరలవుతున్నాయి.

బంగ్లా షేక్‌.. హసీనా ఔట్‌

బంగ్లాదేశ్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం

సోదరితో కలిసి విమానంలో భారత్‌కు

ఆర్మీ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం

ప్రధాని నివాసంలో ఆందోళనకారుల లూటీ

సర్కారును కూల్చిన ఉద్యోగ రిజర్వేషన్ల అంశం

బంగ్లాదేశ్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తింది. దేశంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు పతాక స్థాయికి చేరడంతో ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా చేశారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం చివరకు ఆమెనే గద్దె దింపింది. ప్రపంచంలోనే ఎక్కువ కాలం ప్రభుత్వాధినేతగా పనిచేసిన మహిళగా ఘనత వహించిన హసీనా ప్రజా ఉద్యమానికి జడిసి పదవిని వదులుకున్నారు. ఎన్నికల్లో తిరుగులేని ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అవమానకర రీతిలో దేశాన్ని వీడి పరారయ్యారు. దీంతో బంగ్లాదేశ్‌ సైనిక పాలన దిశగా అడుగులు వేస్తోంది. దేశాన్ని సైన్యం ఆధీనంలోకి తీసుకుంటున్నది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్లు ఆర్మీ చీఫ్‌ ప్రకటించారు. మరోవైపు హసీనా స్వదేశం నుంచి పరారై భారత్‌కు చేరారు.

ఎసరు తెచ్చిన 30 శాతం రిజర్వేషన్లు

1971లో బంగ్లాదేశ్‌ విముక్తి కోసం పోరాడిన వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని హసీనా ప్రభుత్వం 2018లో నిర్ణయించింది. అప్పుడు తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ ప్రతిపాదనను పక్కనపెట్టింది. అయితే, రిజర్వేషన్లు కల్పించాలని ఈ ఏడాది జూన్‌లో హైకోర్టు తీర్పు ఇవ్వడంతో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు ‘స్టూడెంట్స్‌ అగైనెస్ట్‌ డిస్క్రిమినేషన్‌’ అనే పేరుతో జూలైలో ఉద్యమాన్ని ప్రారంభించారు. విశ్వవిద్యాలయాల్లో ప్రారంభమైన ఈ ఉద్యమంలో క్రమంగా రోడ్లపైకి చేరి హింసాత్మకంగా మారింది. పోలీసుల కాల్పుల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు, నిరసనకారులు మరణించారు. దీంతో జూలై 21న 30 శాతం రిజర్వేషన్లను ఐదు శాతానికి కుదించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ నిరసనకారులు శాంతించలేదు.

ఆర్మీ అల్టిమేటంతోనే రాజీనామా?!

హసీనా రాజీనామాకు పట్టుబడుతూ మూడు రోజులుగా ఆందోళనకారులు దేశంలో రోడ్లపై నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యమంపై హసీనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. మూడు రోజుల్లో దాదాపు 100 మంది ఆందోళనకారులు పోలీస్‌ కాల్పుల్లో మరణించారు. ఇది వారిలో మరింత ఆగ్రహానికి కారణమైంది. దీంతో సోమవారం ఆందోళనకారులు ఢాకాకు లాంగ్‌ మార్చ్‌కు పిలుపునిచ్చారు. ఢాకా ప్రధాన వీధుల్లో వందలాది మంది గుమిగూడారు. దీంతో మరోసారి పోలీసులు కాల్పులు జరపగా ఆరుగురు నిరసనకారులు మరణించారు. ఇంతలో అనూహ్యంగా సోమవారం ఉదయం షేక్‌ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆమె ఉన్నఫళంగా ఢాకాను వీడి సైనిక విమానంలో భారత్‌కు పయనమయ్యారు. అయితే 45 నిమిషాల్లో పదవికి రాజీనామా చేసి, దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆర్మీ ఇచ్చిన అల్టిమేటంతోనే ఆమె పదవిని వదులుకున్నారని తెలుస్తోంది.

ముజిబుర్‌ విగ్రహాన్ని బద్ధలు కొట్టి సంబరాలు

హసీనా రాజీనామా విషయం తెలుసుకొని నిరసనకారులు సంబరాలు చేసుకున్నారు. ప్రధాని నివాసం గణ భవన్‌లోకి ప్రవేశించి ఫర్నీచర్‌ను, ఇతర సామాగ్రిని లూటీ చేశారు. హసీనా దుస్తులనూ ఎత్తుకెళ్లారు. హసీనా తండ్రి, బంగబంధుగా పేరొందిన ముజిబుర్‌ రెహ్మాన్‌ విగ్రహాన్ని సైతం నిరసనకారులు బద్దలు కొట్టారు. హసీనా పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు. హోంమంత్రి అసదుజ్జమన్‌ ఖాన్‌ ఇంటిని ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్‌ పార్లమెంటులోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. దేశవ్యాప్తంగా నాలుగు హిందూ ఆలయాలపైనా దాడి జరిగింది. అయితే ఈ పరిస్థితిని ఉపయోగించుకొని ఎవరూ దేశాన్ని దోచుకునేందుకు అవకాశం ఇవ్వొద్దని విద్యార్థి ఉద్యమ నేతల్లో ఒకరైన నహీద్‌ ఇస్లాం.. బంగ్లా ప్రజలను కోరారు.

తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు: ఆర్మీ చీఫ్‌

హసీనా రాజీనామా, దేశాన్ని వీడిన విషయాన్ని బంగ్లాదేశ్‌ ఆర్మీ చీఫ్‌ వాకర్‌ ఉజ్‌ జమాన్‌ ప్రకటించారు. దేశానికి సంబంధించి తాను అన్ని బాధ్యతలు తీసుకుంటున్నానని, అందరూ సహకరించాలని ఆయన కోరారు. దేశం ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నదని, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, చాలామంది మరణించారని చెప్పారు. దేశంలో ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం లేదని, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్టు ప్రకటించారు.

హసీనా పయనం బ్రిటన్‌కా?

ఉన్నఫళంగా సైనిక విమానంలో తన సోదరి షేక్‌ రెహానాతో కలిసి ఢాకా నుంచి బయలుదేరిన షేక్‌ హసీనా ఢిల్లీ సమీపంలోని హిండన్‌ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్‌ అయ్యారు. అయితే, ఆమె భారత్‌ నుంచి లండన్‌కు వెళ్లనున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే, భారత్‌లో ఆశ్రయం పొందడం హసీనాకు కొత్త కాదు. 1975లో హసీనా తండ్రి హత్య జరిగినప్పుడు ఆమె భారత్‌లోనే ఆశ్రయం పొందారు.

భారత్‌ అప్రమత్తం.. భద్రత కట్టుదిట్టం

షేక్‌ హసీనా రాజీనామా, బంగ్లాదేశ్‌ పరిణామాల నేపథ్యంలో భారత్‌ కూడా అప్రమత్తమైంది. భద్రత వ్యవహారాలకు సంబంధించిన క్యాబినెట్‌ కమిటీతో సోమవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో భేటీ అయ్యారు. హసీనాతో భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ సమావేశమయ్యారు. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ – బంగ్లా సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం హై అలెర్ట్‌ ప్రకటించింది. బంగ్లాదేశ్‌కు వెళ్లే అన్ని రైళ్లు, విమానాలు రద్దయ్యాయి.

ఇక రాజకీయాలకు గుడ్‌బై!

షేక్‌ హసీనా(78) ఇక రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు ఆమె కుమారుడు సాజీబ్‌ వాజేద్‌ తెలిపారు. దేశాన్ని హసీనా ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు.

ఎగసి‘పడిన’ కెరటం

బంగ్లాదేశ్‌ ప్రధానిగా ఎక్కువ కాలం పని చేసిన రికార్డు షేక్‌ హసీనాది. 1975లో హసీనా తండ్రి రెహ్మాన్‌, తల్లి, సోదరులు హత్యకు గురైనప్పుడు హసీనా, ఆమె సోదరి రెహానా జర్మనీలో ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డారు. అప్పుడు ఆరేండ్ల పాటు ప్రవాస జీవితం గడిపిన తర్వాత 1981లో ఆమె అవామీ లీగ్‌ పార్టీ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక అనేక నిర్బంధాలను ఎదుర్కొని నిలదొక్కుకున్నారు. 1991 ఎన్నికల్లో ఓడిపోయినా.. 1996 ఎన్నికల్లో గెలిచి మొదటిసారి ప్రధాని అయ్యారు. 2001 ఎన్నికల్లో మళ్లీ బీఎన్‌పీ చేతిలో ఓటమి చవిచూశారు. 2009లో మరోసారి ప్రధాని అయిన హసీనా అప్పటినుంచి 15 ఏండ్లుగా అప్రతిహతంగా నాలుగు పర్యాయాలు గెలిచి ప్రధానిగా కొనసాగారు. హసీనాపై 19 సార్లు హత్యాయత్నాలు జరిగాయి. 2004లోగ్రనేడ్‌ దాడి నుంచి ఆమె తృటితో తప్పించుకున్నారు. ఆర్థిక సంస్కరణలు చేపట్టి బంగ్లాదేశ్‌ దిశ, దశను మార్చారని ఆమె పేరు తెచ్చుకున్నారు. సైన్యం పెత్తనం, తిరుగుబాట్లతో దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కనుమరుగవుతున్న వేళ బంగ్లా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. అయితే, అదే స్థాయిలో ఆమె నియంతృత్వ శైలిని ప్రదర్శించారనే విమర్శలూ ఉన్నాయి.

70 ఏళ్లు 70 అడుగులు ..!

గతేడాది రికార్డు సృష్టించిన ఖైరతాబాద్ గణేశుడు.. ఈసారి కూడా తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సప్తముఖ గణేశుడి రూపంలో ఈసారి కొలువుదీరబోతున్నాడు.

70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. 70 అడుగుల ఎత్తులో గణనాథుడు ముస్తాబవుతున్నాడు. ఈసారి కొలువుదీరే గణేశుని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్‌లో ది ఫేమస్ ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడి లంబోదరుడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు.

అయితే ఖైరతాబాద్ గణేషుడు రికార్డ్‌లకు కేరాఫ్‌గా మారాడు. ఈసారి కూడా హైట్‌లో తన పేరు మీదున్న రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. 70 అడుగుల ఎత్తులో… ఈ ఏడాది సప్తముఖ గణేశుడిరూపంలో దర్శనమివ్వబోతున్నాడు.

పూర్తిగా మట్టితో మహాగణపతి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు కోటి రూపాయల ఖర్చుతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఖైరతాబాద్‌ గణేశుడికి ఇరువైపులా.. శివపార్వతులు, శ్రీనివాసుల కల్యాణ మండపం.. ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి విగ్రహం ఉంటాయి.

ఖైరతాబాద్ గణేషుడికి సుమారు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. 1954లో సింగరి శంకరయ్య అనే స్థానిక భక్తుడు స్థానిక ఆలయంలో ఒక అడుగు ఎత్తున్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి సామూహిక పూజలు చేశారు.

అలా.. 2014 వరకు ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తు పెంచుతూ విగ్రహాన్ని తయారు చేశారు. 2019లో 61 అడుగుల ఎత్తున్న గణపతిని తయారు చేయగా.. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డులకెక్కింది. 

దాంతోపాటు.. ప్లాస్టర్‌ ఆఫ్‌ ఫారిస్‌ విగ్రహానికి గుడ్‌ బై చెప్పి.. మట్టి గణపయ్యకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే.. గతేడాది (2023) పూర్తి మట్టితో 63 అడుగుల అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డ్‌ నెలకొల్పారు. గత సంవత్సరం కంటే 7 అడుగులు ఎక్కువ ఎత్తుతో కమిటీ నిర్వహకులు మొత్తం 70 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నారు.

Big Breaking ; పంచాయితీ ఎన్నికలకు సిద్ధం ‼️

తెలంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు మ‌రి కొద్దిరోజుల్లోనే న‌గారా మోగ‌నుంది. త్వ‌ర‌లోనే ఎన్నిక‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేసి, ఆగ‌స్టు నెల చివ‌రి వ‌ర‌కు పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

అయితే ఐదేండ్ల క్రితం ఎన్నిక‌ల్లో కేటాయించిన‌ రిజ‌ర్వేష‌న్ల ప్ర‌కారమే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలని, ఆగష్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు ప‌లువురు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి వారం రోజుల క్రితం ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన అంశాలను వెల్లడించాలని అధికారులకు సీఎం సూచించారు. గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం, రానున్న పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరును రేవంత్‌కు అధికారులు వివరించారు.

ఇప్పటికే కులగణనకు ఆమోదం తెలిపినందున, దాని ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని, అందుకు ఎంత సమయం తీసుకుంటారని అధికారులను సీఎం ప్రశ్నించారు. కర్ణాటకలో 2015లో, బీహార్‌లో 2023లో కుల గణన చేశారని, ఆంధ్రప్రదేశ్‌లో కులగణన చేసినా వివరాలు ఇంకా బయట పెట్టలేదని అధికారులు వివరించారు.

2011లో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన కులగణన ఫార్మాట్‌ 53 కాలమ్స్‌తో ఉన్నదని, దానికి మరో మూడు కాలమ్స్‌ జోడించి కులగణన చేపడితే కనీసం అయిదున్నర నెలల సమయం పడుతుందని తెలిపారు.

బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

ఈ సమావేశంలో రిజర్వేషన్ల పెంపు అంశంపై సుదీర్ఘ చర్చ సాగింది. మొత్తానికి ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో గ‌త ఎన్నిక‌ల్లో కేటాయించిన రిజ‌ర్వేష‌న్ల ప్ర‌కార‌మే పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

తెలంగాణలో ఉపఎన్నికలు తప్పవు: కేటీఆర్

దిల్లీ: తెలంగాణలో ఉపఎన్నికలు తప్పవని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయిస్తామని హెచ్చరించారు..

దిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్‌, ఎమ్మెల్యే హరీశ్‌రావు.. న్యాయకోవిదులతో చర్చలు జరిపారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులపై దిల్లీలో భారాస న్యాయపోరాటం చేస్తుందన్నారు.

రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్‌ ప్రతినిధుల బృందం సమావేశమవుతుందని, భారాస తరఫున త్వరలోనే సుప్రీం కోర్టులో కేసు వేస్తామని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు.

దళిత మహిళపై ఇంత దాష్టీకమా?

షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసుల దాడిని కేటీఆర్‌ ఖండించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళిత మహిళపై ఇంత దాష్టీకమా? అని మండిపడ్డారు. 'ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన? దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?' అని ప్రశ్నించారు.

రక్షించాల్సిన పోలీసుల దగ్గరే రక్షణలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. దాడికి పాల్పడిన పోలీసులపై వెంటనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత మహిళకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

ప్రతీ మూడు నెలలకు కలెక్టర్ల సదస్సు

ప్రతీ మూడు నెలలకు కలెక్టర్ల సదస్సు ఉంటుంది

- రోజుల తరబడి, గంటల తరబడి సమావేశాలు ఉండవు – ఎంతపెద్ద సమావేశమైనా గంటన్నరలోపు ముగిస్తా

– నాతో సహా పనితీరును అంచనా వేసుకుంటూ ముందుకెళ్తా – పనిచేసే వారిని ఎన్నేళ్లయినా ఒకే పదవిలో ఉంచుతా

– పనిచేయకపోతే మాత్రం ఉపేక్షించేది లేదు – ప్రతీ నెల ఒకటో తేదీ ‘పేదల సేవలో’ కార్యక్రమం

– పేదల సమస్యల పరిష్కారం దిశగా పాలన ఉండాలి – పేదరిక నిర్మూలన లక్ష్యంగా పాలన ఉండాలి

- నా పర్యటనల్లో అధికారులు అత్యుత్సాహం వద్దు – చెట్లు కొట్టేయడం, రెడ్ కార్పెట్లు వేయడం, స్కూల్స్ కు సెలవివ్వడం, రోడ్లపై జనాన్ని నిలిపివేయడం చేయొద్దు: సీఎం చంద్రబాబు

MLC Kavitha:కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా.. మళ్లీ టెన్షన్..

న్యూఢిల్లీ /హైదరాబాద్: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( BRS MLC Kavitha) ఇప్పట్లో తీహార్ జైలు నుంచి బయటికి వచ్చే మార్గాలు ఏ మాత్రం కనిపించట్లేదు..

కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కోరిన కవిత తరపు న్యాయవాది

ఆగస్టు-07 కు తదుపరి విచారణను వాయిదా వేసిన జడ్జ్ కావేరి భవేజా

ఎల్లుండి ఏం జరుగుతుందో అని బీఆర్ఎస్‌లో పెరిగిపోయిన టెన్షన్

District Collectors Conference: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి కలెక్టర్ల సమావేశం ఇదే..

ఈ భేటీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ హాజరయ్యారు.. 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఇవ్వడానికి సిద్ధమైంది సర్కార్‌.. ప్రభుత్వ ప్రాధాన్యతలను కలెక్టర్లకు వివరించనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లు, ఎస్పీలకు దిశా నిర్దేశం చేయనున్నారు..

ప్రజలకు సేవలందించే విషయంలో నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టొద్దని స్పష్టం చేయనున్నారు.. ఫేక్ వార్తలు, తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికక్కడే తిప్పి కొట్టాలని కలెక్టర్లకు చంద్రబాబు దిశా నిర్దేశం చేసే అవకాశం ఉందంటున్నారు.. తాను జిల్లాల పర్యటనలకు వచ్చేటప్పుడు అవసరానికి మించి జాగ్రత్తలు తీసుకోవద్దని.. ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని మరోసారి స్పష్టం చేయబోతున్నారు సీఎం..

అయితే, ఈ కలెక్టర్ల సమావేశానికి ఓ ప్రత్యేకత ఉంది.. విభజన జరిగిన పదేళ్ల కాలంలో తొలిసారి సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది.. 2014-19 మధ్య కాలం తొలి రోజుల్లో హోటళ్లల్లో, ఆ తర్వాత ప్రజా వేదికలో కలెక్టర్ల సమావేశం నిర్వహించేవారు..

ఇక, గత ప్రభుత్వంలో కేవలం ఒక్కసారి మాత్రమే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు అప్పటి సీఎం.. గత ప్రభుత్వంలో తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను ప్రజా వేదికలో నిర్వహించిన నాటి సీఎం జగన్. కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే ప్రజా వేదికను కూల్చేయాలని ఆదేశాలు జారీ చేశారు..

మరోవైపు.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణకు సచివాలయంలో సరైన వేదిక లేకున్నా ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.. ఫంక్షన్ హాళ్లు.. హోటళ్లల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి అంగీకరించని సీఎం చంద్రబాబు.. అనవసరపు ఖర్చు వద్దని స్పష్టం చేశారు.. సచివాలయంలోనే సర్దుకుని కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిద్దామని సీఎం చెప్పడంతో.. సచివాలయంలోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.