కాంగ్రెస్‌కు షాక్.. BRS గూటికి గద్వాల ఎమ్మెల్యే
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ఇవాళ తిరిగి ఆయన సొంత గూటికి చేరుకున్నారు. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే ఆయన సొంతగూటికి చేరుకున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. పది మంది ఎమ్మెల్యేలు వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.
అయితే అనుహ్యంగా ఆయన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు రెండో విడత రుణమాఫీ కార్యక్రమం జరగుతున్న సమయంలోనే బండ్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు.
అసెంబ్లీలోని బీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్‌కు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో తాను ఇమడలేక పోతున్నట్లు ఆయన వెల్లడించనట్లు సమాచారం. కాగా, బండ్ల చేరికను కేటీఆర్ స్వాగతించారు. కేటీఆర్‌తో సమావేశం అనంతరం బండ్ల మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. తాను తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నట్లు వెల్లడించారు. త్వరలోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎంను కలవనున్నట్లు బండ్ల వెల్లడించారు. ఓ వైపు సీఎం రేవంత్ సహా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొనగా.. అనుహ్యంగా బండ్ల యూ టర్న్ తీసుకోవటం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది.
నెల తిరక్కుండానే యూటర్న్..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల శాసనసభ నియోజకవర్గం నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు.
అయితే ఇటీవల ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి అధికార పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యకర్తలు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు వెల్లడించారు.
అయితే ఆయన పార్టీ మారి నెల రోజులు కాకముందే యూటర్న్ తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని అధికార పార్టీ నేతలు చెబుతున్న తరుణంలో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే తిరిగి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం చర్చనీయాంశమైంది.
Jul 30 2024, 14:04