కాంగ్రెస్‌కు షాక్.. BRS గూటికి గద్వాల ఎమ్మెల్యే

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ఇవాళ తిరిగి ఆయన సొంత గూటికి చేరుకున్నారు. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే ఆయన సొంతగూటికి చేరుకున్నారు.

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. పది మంది ఎమ్మెల్యేలు వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.

అయితే అనుహ్యంగా ఆయన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు రెండో విడత రుణమాఫీ కార్యక్రమం జరగుతున్న సమయంలోనే బండ్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు.

అసెంబ్లీలోని బీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్‌కు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో తాను ఇమడలేక పోతున్నట్లు ఆయన వెల్లడించనట్లు సమాచారం. కాగా, బండ్ల చేరికను కేటీఆర్ స్వాగతించారు. కేటీఆర్‌తో సమావేశం అనంతరం బండ్ల మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. తాను తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నట్లు వెల్లడించారు. త్వరలోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎంను కలవనున్నట్లు బండ్ల వెల్లడించారు. ఓ వైపు సీఎం రేవంత్ సహా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొనగా.. అనుహ్యంగా బండ్ల యూ టర్న్ తీసుకోవటం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది.

నెల తిరక్కుండానే యూటర్న్..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల శాసనసభ నియోజకవర్గం నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు.

అయితే ఇటీవల ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి అధికార పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యకర్తలు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు వెల్లడించారు.

అయితే ఆయన పార్టీ మారి నెల రోజులు కాకముందే యూటర్న్ తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని అధికార పార్టీ నేతలు చెబుతున్న తరుణంలో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే తిరిగి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం చర్చనీయాంశమైంది.

గ్రేటర్ చుట్టుపక్కల HMDA పూలింగ్ ప్రాజెక్ట్స్ !

హైదరాబాద్ చుట్టుపక్కల హౌసింగ్ ప్రాజెక్టుల్ని పెంచేందుకు హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అధారిటీ.. కొత్త ప్రయత్నాలు చేస్తోంది. కొత్త లే-అవుట్లను డెవలప్‌ చేయాలని నిర్ణయించుకుంది. రైతుల నుంచి పూలింగ్ పద్దతిలో భూములను సేకరించి డెవలప్ చేసి.. తన వాటాగా వచ్చిన భూమిని విక్రయించి ఆదాయం పెంచుకోవాలనుకుంటోంది.

నిజానికి ఏపీ రాజధాని అమరవతికి పూలింగ్ పద్దతి సక్సెస్ అయిన తర్వాత హెచ్‌ఎండీఏ కూడా అదే చేయాలనుకుంది. కానీ ల్యాండ్ డెవలప్‌మెంట్‌లో తమ వాటా పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌కు గత సర్కార్‌ ఓకే చెప్పడంతో రైతుల వాటా 60శాతానికి పెరిగింది.

హెచ్‌ఎండీఏకు ఇవ్వడం వల్ల.. రైతులకు అనేక మేళ్లు జరుగుతాయి. భూములు ఇచ్చే వారికి ఆర్ధికపరమైన ఇబ్బందులు రాకుండా అన్ని రకాల అనుమతుల వ్యవహారాలను హెచ్‌ఎండీఏ పర్యవేక్షిస్తుంది. సాధారణంగా వ్యవసాయ భూములను లే-అవుట్లుగా మార్చాలంటే నాలా చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

కాని హెచ్‌ఎండీఏకు భూములు అప్పజెప్పితే వాటికి నాలా చార్జీలతో పాటు పాటు ల్యాండ్ యూజ్ కన్వర్షన్ చార్జీలను హెచ్‌ఎండీఏ భరిస్తుంది. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ ఖర్చులు సైతం హెచ్‌ఎండీఏ చెల్లించాలని నిర్ణయించడంతో రైతులపై భారం మరింత తగ్గనుంది.

ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ల వద్ద ఎక్కువ లే-అవుట్లు ఉండేలా హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రెడీ చేసుకుంది. హెచ్‌ఎండీఏ అమ్ముతుంది కాబట్టి లిటిగేషన్ లేని ల్యాండ్ లభిస్తుంది. అందుకే కార్పొరేట్ సంస్థలు అందులో కొనుగోలుకు ఆసక్తి చూపుతాయి. అలాగే మధ్యతరగతి ప్రజలకూ అందుబాటులో ఉంటే ఇళ్ల స్థలాలను కూడా హెచ్‌ఎండీఏ రెడీ చేయనుంది. ఇప్పటికే సిటీ చుట్టూ ఉండే ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా భూమిని డెవలప్‌మెంట్‌ కోసం అధికారులు గుర్తించారు.

మొత్తంగా హైదరాబాద్ చుట్టూ దాదాపు 11వేల ఎకరాల భూమిని హెచ్‌ఎండీఏ సేకరించి డెవలప్ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. హెచ్‌ఎండీఏ. ఇలా చేయడం ద్వారా ఇటు ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు…

ప్రజలకు క్లియర్ టైటిల్ ఉండే భూములు సరైన ధరల్లో దొరికేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టు ఎంత వేగంగా ముందుకు వెళ్తే అంతే వేగంగా హైదరాబాద్ నగరం ఔటర్ చుట్టూ విస్తరిస్తుంది.

పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కారుపై దాడి, ఖండించిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌

ఆకతాయిలు రాళ్లు రువ్వడంతో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కారు అద్దాలు పగిలిపోయాయి. సోమవారం సాయంత్రం బర్రింకల పాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వాహనం గ్రామంలో వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో కారు అద్దాలు పగిలిపోయాయి.

ఎమ్మెల్యే వాహనంపై దాడి చేశారని డ్రైవర్‌ ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ప్రతాప్ కిషోర్ స్పందించారు. పోలవరం డిఎస్పి సురేష్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో జీలుగుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ విచారణ జరిపారు.

కారు అద్దాల పగిలిన ప్రదేశంలో అంతగా అనుమానించాల్సిన పరిస్థితులు లేవని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనలో పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు పోలీసు అధికారులు సన్నద్ధం అయ్యారు.

కారు పై రాయి పడడంతో వెనకగా ఉన్న అద్దాలు బ్రేక్ అయ్యాయి. సంఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో హాస్టల్ భవనాలు ఉన్నాయి

సోమవారం రాత్రి పోలవరం ఎమ్మెల్యే కారులో డ్రైవర్, వ్యక్తిగత సహాయకులు వెళుతుండగా బర్రింకలపాడు జంక్షన్ దగ్గర ఒక రాయి కార్ వెనుక మిర్రర్ కి తగిలి కార్ అద్దం పగిలింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కలుగలేదని పోలీసులు ప్రకటన విడుదల చేవారు.

ఘటన జరిగిన ప్రదేశంలో వసతిగృహం ఉందని తెలిపారు. ఆకతాయిలు విసిరిందా, ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా విసిరారా అన్నది పోలీస్ లు విచారిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని పోలవరం డిఎస్పీ తెలిపారు.

పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వాహనంపై చోటు చేసుకున్న రాళ్ళ దాడిని డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ ఖండించారు. బర్రింకలపాడు గ్రామంలో కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని దాడి సమయంలో ఎమ్మెల్యే బాలరాజు వాహనంలో లేకపోవడం వల్ల ఎలాంటి హాని జరగలేదని తెలిపారు. ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఝార్ఖండ్‌ లో రైలు ప్రమాదం.. ఒకరి మృతి.. 60 మందికి గాయాలు

ఝార్ఖండ్‌ లో మరో రైలు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని చక్రధర్‌పూర్‌కు సమీపంలో ముంబై వెళ్తున్న హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.

ఆగ్నేయ రైల్వే పరిధిలోని రాజ్‌ఖర్సావాన్, బడాబాంబో స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 3:45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

18 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. సుమారు 60 మంది గాయపడినట్టు సమాచారం.

ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక పోలీసులు, రైల్వే ఉద్యోగులు చురుగ్గా రెస్క్యూ చర్యలను కొనసాగిస్తున్నారు.

కాగా పట్టాలు తప్పిన గూడ్స్ రైలు వ్యాగన్‌లను ఢీకొట్టడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

రైల్వే సమాచారం ప్రకారం హౌరా నుంచి ముంబై వెళ్తున్న రైలు సోమవారం రాత్రి 11:02 గంటలకు టాటానగర్‌కు చేరుకోవాల్సి ఉండగా.

చాలా ఆలస్యంగా రాత్రి 2:37 గంటలకు చేరుకుంది. 2 నిమిషాలు ఆగిన తర్వాత తదుపరి స్టేషన్ చక్రధర్‌పూర్‌కి బయలుదేరింది. అయితే స్టేషన్‌కు చేరుకోక ముందే ప్రమాదానికి గురైంది.

వయనాడ్ ఘటనపై స్పందించిన రాహుల్.. తీవ్ర ఆవేదనకు గురయ్యా

కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వయనాడ్‌ను అయితే వరదలు చుట్టుముట్టాయి. దీంతో పెను ప్రమాదకరంగా మారాయి. కేరళలోని వాయనాడ్‌ ప్రాంతంలో భారీగా వరదలు వచ్చాయి.

కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వయనాడ్‌ను అయితే వరదలు చుట్టుముట్టాయి. దీంతో పెను ప్రమాదకరంగా మారాయి. కేరళలోని వాయనాడ్‌ ప్రాంతంలో భారీగా వరదలు వచ్చాయి. దీంతో కొండచరియలన్నీ విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. మృతులకు 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల పరిహారాన్ని ప్రధాని మోదీ కార్యాలయం ప్రకటించింది. వాయనాడ్ ఘటనపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. వాయనాడ్‌లోని మెప్పాడి సమీపంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర వేదనకు గురయ్యానని తెలిపారు. తమ వాళ్ళను కోల్పోయిన కుటుంబాలకు రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇంకా చిక్కుకున్న వారిని త్వరలోనే సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తారని ఆశిస్తున్నానని రాహుల్ అన్నారు

కేరళ ముఖ్యమంత్రితో పాటు వయనాడ్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడానని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. కావల్సిన సాయం అందజేస్తామని తనకు హామీ ఇచ్చారని రాహుల్ పేర్కొన్నారు. అన్ని ఏజెన్సీలతో సమన్వయం ఉండేలా చూసుకోవాలని, కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేయాలని సహాయక చర్యలకు అవసరమైన ఏదైనా సహాయం గురించి మాకు తెలియజేయాలని కోరానని తెలిపారు.

తాను కేంద్ర మంత్రులతో మాట్లాడి వాయనాడ్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కోరతానన్నారు. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో అడ్మినిస్ట్రేషన్‌‌కు సహాయం చేయాలని తాను కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కోరుతున్నానని రాహుల్ పేర్కొన్నారు

వాయనాడ్‌లోని ముండకై, మెప్పాడి, చురల్‌మల ప్రాంతాల్లో భారీగా వరదలు వచ్చాయి. రాత్రి ఒంటి గంట సమయంలో ముండకై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఉదయం 4:10 గంటలకు ముండకై ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడ్డాయి.

భారీగా వరదలు, కొండచరియలు విరిగి పడడంతో అనేక ఇళ్లు కొట్టుకు పోయాయి. భారీ వరదలతో రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. రహదారులు, వంతెనలు కొట్టుకు పోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. కొండ చరియలు విరిగి పడడం, ఇళ్లు కొట్టుకుపోవడంతో భారీ ప్రాణనష్టం వాటిల్లింది.

ఇప్పటి వరకూ 19 మంది మృతి, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇళ్లు కొట్టుకుపోవడంతో అనేక మంది గల్లంతయ్యారు. సహాయక చర్యలను అగ్నిమాపక, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రారంభించాయి.

ఒకే గ్రామం నుంచి 20 వేల మంది జవాన్లు!

35 మంది కర్నల్స్‌, 42 మంది లెఫ్టినెంట్‌ బ్రిగేడియర్‌ స్థాయి అధికారులు, 20 వేల మంది జవాన్లు.. వీరంతా ఒకే గ్రామానికి చెందినవారంటే నమ్మగలరా? అవును.

ఇది నిజమే. ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లో ఉన్న గహ్మర్‌.. భారత సైన్యంలోకి అత్యధిక మంది సైనికులను పంపిన గ్రామంగా నిలుస్తున్నది.

 35 మంది కర్నల్స్‌, 42 మంది లెఫ్టినెంట్‌ బ్రిగేడియర్‌ స్థాయి అధికారులు, 20 వేల మంది జవాన్లు.. వీరంతా ఒకే గ్రామానికి చెందినవారంటే నమ్మగలరా? అవును. ఇది నిజమే. ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లో ఉన్న గహ్మర్‌.. భారత సైన్యంలోకి అత్యధిక మంది సైనికులను పంపిన గ్రామంగా నిలుస్తున్నది. ఇక్కడి యువతకు భారత సైన్యంలో చేరటం తప్ప.. మరో లక్ష్యం లేదు.

ఆ గ్రామంలోని 15వేల మందికిపైగా రిటైర్డ్‌ జవాన్లే వారికి స్ఫూర్తి. ‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌’ సందర్భంగా, అత్యధిక సంఖ్యలో జవాన్లను పంపిన గ్రామంగా ‘గహ్మర్‌’ పేరు మీడియాలో మారుమోగుతున్నది.

ప్రస్తుతం ఈ గ్రామానికి చెందిన 5 వేల మంది సైన్యంలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నారు.. గ్రామాన్ని 22 ప్రాంతాలుగా విడగొట్టి.. ప్రతి ఒక్క ఏరియాకు ఓ జవాన్‌ పేరు పెట్టారు.

ఆర్మీలో ఎంపికయ్యేందుకు, ఊళ్లో ఉన్న యువత అంతా తెల్లవారుజామున 4 గంటలకు మేల్కొని..

కసరత్తు మొదలుపెడతారు. వీరి శిక్షణ కోసం గ్రామంలోని రిటైర్డ్‌ జవాన్లు 1,600 మీటర్ల రన్నింగ్‌ ట్రాక్‌ను నిర్మించారు. గొప్ప సైనిక వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని ఆ గ్రామస్థులపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

గుంటూరు – విజయవాడ మధ్య మళ్లీ నిర్మాణాల జోరు !

గుంటూరు , విజయవాడ నగరాలు దాదాపుగా కలిసిపోయాయి. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి లో కంటే.. గుంటూరు, విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారి పక్కన నిర్మాణాలు శరవేగంగా సాగాయి. బడా రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ తమ ప్రాజెక్టులు ప్రారంభించాయి.

కానీ వాటికి 2019లో గ్రహణం పట్టేసింది. నిర్మాణాలు కొనసాగిస్తే కొంటారా లేదా అన్న విషయం కాదు.. ఏదో ఓ రూల్ పెట్టి కూల్చేస్తారన్న భయంతో ఆపేశారు. ఫలితంగా బడా కంపెనీలు కూడా నిర్మాణాలు ఆపేసి పరారయ్యాయి.

కొన్ని వేల కోట్ల సంపద అలా.. అక్కడ జంగిల్‌గా మారిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మళ్లీ కళ ప్రారంభమయింది. తమ ప్రాజెక్టుల్లో పెద్ద పెద్ద కంపెనీలు జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించాయి. పిచ్చి మొక్కలు తొలగించి మళ్లీ ఆకర్షణీయంగా చేసుకుని నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి.

వచ్చే ఒకటి, రెండు నెలల్లో దాదాపుగా అన్ని భారీ ప్రాజెక్టులు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది. నిర్మాణాలు ప్రారంభమైతే ఇక ఆ జోరు ఆపడం కష్టమే. విజయవాడ – గుంటూరు మధ్య హైవే.. కు రెండు వైపులా అతి పెద్ద వ్యాపార కేంద్రాలకు అవకాశం ఉంది

గతంలో అనేక సంస్థలు తమ ప్రాజెక్టులను సిద్ధం చేసుకున్నాయి. కొన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలు వచ్చి పడ్డాయి.. కానీ ఐదేళ్ల పాటు వారంతా సైలెంట్ అయిపోయారు.

ఇప్పుడు అమరావతిలో ప్రభుత్వం జంగిల్ క్లియరెన్స్ నిర్వహిస్తోంది. అది పూర్తయిన వెంటనే నిర్మాణాలు పూర్తవుతాయి.

ప్రభుత్వ పరంగా నిర్మాణాలు ప్రారంభిస్తే.. ప్రైవేటు ప్రాజెక్టులు కూడా ఊపందుకునే అవకాశం ఉంది.

మరింత దిగిన బంగారం

బంగారం ధరలు మరింత దిగాయి. దేశీయంగా ఆభరణాలకు డిమాండ్‌ పడిపోవడంతో తులం ధర మరో వెయ్యి రూపాయల వరకు దిగొచ్చింది.

బంగారం ధరలు మరింత దిగాయి. దేశీయంగా ఆభరణాలకు డిమాండ్‌ పడిపోవడంతో తులం ధర మరో వెయ్యి రూపాయల వరకు దిగొచ్చింది.

ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో తులం బంగారం ధర రూ.950 తగ్గి రూ.71,050కి తగ్గింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం పుత్తడి ధర శనివారం రూ.72 వేల స్థాయిలో ఉన్నదని ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ వెల్లడించింది.

పసిడితోపాటు వెండి ఏకంగా రూ.4,500 తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి రూ.84,500కి దిగింది. ధర తగ్గకముందు ఇది రూ.89 వేల స్థాయిలో ఉన్నది.

ప్రస్తుత సంవత్సరంలో ఒకేరోజు ఇంతటి స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం.

బడ్జెట్‌లో కస్టమ్స్‌ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిన నాటినుంచి ఇప్పటి వరకు బంగారం, వెండి ధరలు దిగువముఖంగానే పయనిస్తున్నాయి.

అయినప్పటికీ అంతర్జా తీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 10.60 డాలర్లు పెరిగి 2,438.50 డాలర్లకు చేరు కోగా, వెండి 28.28 డాలర్ల వద్ద ఉన్నది.

విధేయతకే పట్టం..పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ట్విస్ట్..!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. అనేక సంప్రదింపులు.. సమాలోచనల తర్వాత తెలంగాణ పీసీసీ బాస్ ఎవరనే దానిపై అధిష్టానం తుది నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.

సామాజిక సమీకరణాలు.. విధేయత ఆధారంగా కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.

పీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు గత కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి తీవ్రస్థాయిలో లాబియింగ్ కొనసాగించారు. బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కీలు పోటీ పడగా.. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్..

ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేర్లు ప్రధానంగా వినిపించాయి. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతోన్న మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారు అయిందని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది.

మహేష్ కుమార్ గౌడ్ అభ్యర్థిత్వాన్ని రేవంత్ సైతం బలపర్చారని దాంతో కొద్ది రోజుల్లోనే అధిష్టానం అధికారిక ప్రకటన చేయనుందని వార్తలు వచ్చాయి. కానీ , అధిష్టానం మాత్రం పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చింది.

ఎంపీ బలరాం నాయక్ వైపు హైకమాండ్ మొగ్గు చూపిందని తెలుస్తోంది. గతంలో కేంద్రమంత్రిగా కూడా పని చేసిన బలరాం నాయక్ కు కాంగ్రెస్ పెద్దలతో మంచి సత్సంబంధాలు ఉండటంతోపాటు పార్టీకి విధేయుడిగా ఆయనకు పేరుంది.

ఆయన విధేయతను పరిగణనలోకి తీసుకొని దాదాపుగా బలరాం నాయక్ పేరును ఖరారు చేశారని.. రేవంత్ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాక ఈ నెల 15న అధికారిక ప్రకటన ఉంటుందని అంటున్నారు.

జులై 30 న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ రాష్ట్రస్థాయి మౌన దీక్ష

బడ్జెట్లో కార్శికుల, ఉద్యోగుల, పెన్షనర్ల సంక్షేమం మాటేది

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనివ్వాలి 

కేటాయించిన బడ్జెట్ ను ఖర్చు చేయాలి 

పెండింగ్ డీఏలు, పీఆర్సీ బకాయిల విడుదల, నగదు రహిత ఆరోగ్య పధకంలో మార్పులు తదితరాల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జులై 30 న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర పెన్షనర్ల ఐకాస ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి భారీ మౌన దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసీయేషన్‌ (టాప్రా) రాష్ట్ర కార్యదర్శి వి. కృష్ణ మోహన్ వెల్లడించారు.

 సంక్షేమ పథకాలకు అర్హులుకాని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెండింగ్ లోనున్న

నాలుగు డీఏల చెల్లింపు, 2023 జులై ఒకటో తేదీ నుంచి అమలు కావాల్సిన రెండో పీఆర్సీ రిపోర్టును వెంటనే తెప్పించుకొని అమలు పరుస్తారని, ఫిట్ మెంట్ గురించి బడ్జెట్లో ప్రకటిస్తారని ఆశించినప్పటికీ భంగపాటు ఎదురైంది. జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్మెంట్ తదితర బిల్లులు ఈ- కుబేర్ లో పెండింగ్ లో ఉన్నాయి. అధికారంలోకి వస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) ను పునరుద్ధరిస్తామంటూ మ్యానిఫెస్టోల్లో ప్రకటించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కానీ, కేంద్రంలో 01.01.2004 నుంచి నూతన పెన్షన్ స్కీమ్ (ఎన్ పీఎస్) ను అమలు పరచి వృద్ధాప్య భద్రత లేకుండా చేసిన బిజెపి ప్రభుత్వం కానీ తమ బడ్జెట్ ప్రసంగాల్లో ఓపీఎస్ ను అమలు చేస్తామనే ప్రస్తావన కూడా చేయలేదు. మొదటి తారీఖున జీతాలు, పెన్షన్లు ఇస్తున్నామనే మాట తప్ప ఇతర సమస్యలను బడ్జెట్లో ప్రస్తావించక పోవడం ఆందోళనకరం.

ప్రభుత్వాలు సీనియర్ సిటిజన్లకు కల్పించే సంక్షేమ కార్యక్రమాల్లో 107 దేశాలలో భారత దేశం 101 గా ఉన్నా సార్వత్రిక పెన్షన్ అమలు చేసేందుకు, కోవిడ్ సమయంలో రద్దు చేసిన రైలు రవాణా రాయితీని పునరుద్ధరించేందుకు కేంద్రం తిరస్కరించింది. 

పెరుగుతున్న అంతరాలు 

పెన్షన్ జీవన భృతి మాత్రమే అయినప్పటికీ ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వడానికి అంగీకరించలేదు. ఓల్డ్ టాక్స్ రిజైమ్ లో నున్న వారికి గత దశాబ్దంలో ఎటువంటి పన్ను మినహాయింపులు ఇవ్వలేదు. స్థూల పన్ను రాబడి (జీటీఆర్) లో కార్పొరేట్ పన్ను వాటా 2014-15 లో 34.5 శాతం ఉండగా 2024- 25 బడ్జెట్ అంచనాల్లో 26.6 శాతానికి తగ్గింది. అదే కాలంలో ఆదాయపు పన్ను వాటా 20.8 శాతం నుంచి 30.9 శాతానికి పెరిగింది. గత పది సంవత్సరాల కాలంలో జీడీపీలో కార్పొరేట్ పన్నుల వాటా 3.4 శాతం నుంచి 3.1 శాతానికి పడిపోగా ఆదాయపు పన్ను వాటా 2.1 శాతం నుంచి 3.5 శాతానికి పెరిగింది. ఆదాయపు పన్ను ద్వారా ప్రభుత్వానికి 19 శాతం ఆదాయం సమకూరుతుండగా కార్పొరేట్ సంస్థల నుంచి వస్తున్నది కేవలం 17 శాతం మాత్రమే. 2019 లో కార్పొరేట్ సంస్థలకు కల్పించిన రాయితీల వల్ల ఏటా రూ. 1.45 లక్షల ఆదాయాన్ని కోల్పోతుంది. ప్రస్తుత బడ్జెట్ లో కూడా కార్పొరేట్ పన్ను రేట్లను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. ఇండక్సేషన్ సౌకర్యం కూడా రద్దు చేశారు.

పది సంవత్సరాల కొకసారి కేంద్ర వేతన సంఘం (సీపీసీ) సిఫార్సులు అమలయ్యే కేంద్ర, రాష్ట్ర, అటానమస్ సంస్థల ఉద్యోగులు, పింఛన్ దారులకు 8‌వ సీపీసీ నియమించేందుకు తిరస్కరించింది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఫ్ ల విషమ షరతులకు తలొగ్గి వేతన / పెన్షన్ స్థంభనకు పాల్పడుతున్నది. కరోనా కాలంలో కోత విధించిన 18 నెలల డీఏ / డీఆర్ లను చెల్లించేందుకు అంగీకరించలేదు. కరువు భత్యం లెక్కించేందుకు ఆధారమైన వినిమయ ధర సూచీ (సిపిఐ) లెక్కల్లోనే దగా జరుగుతుంది. వడ్డీ రేట్లు అత్యధికంగా నున్నప్పుడు నిర్ణయించిన కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ కాలపరిమితిని 15 సంవత్సరాల నుండి తగ్గించేందుకు నిరాకరించింది. గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికల ముందు టీచర్లు, ఉద్యోగులు, పెన్షనర్లందరూ ఐక్యంగా తమ సమస్యల పరిష్కారానికై నిరంతరం ఆందోళనలు చేస్తూ నిరవధిక సమ్మెకు నోటీసులిచ్చినప్పుడు ప్రభుత్వం దిగివచ్చి సీఓపీ కాలపరిమితిని 13 ఏళ్ళకు తగ్గించింది. కానీ కేంద్రంలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ తగ్గించేందుకు నిరాకరిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లో ఐక్య ఉద్యమాలతో 65 ఏళ్ళకే అదనపు పెన్షన్, ఓపీఎస్ సాధించుకున్నారు. కానీ కేంద్రంలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ 65 ఏళ్ళ నుంచి అదనపు పెన్షన్ ఇచ్చేందుకు, 110వ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను అమలు జరపడానికి అంగీకరించలేదు. బెంగాల్, త్రిపుర, కేరళలలో వామపక్ష ప్రభుత్వాలున్నప్పుడు డిఫైన్డ్ బెనిఫిట్ ఓపీఎస్ నే కొనసాగించారు. కాని త్రిపురలో బిజెపి అధికారంలోకి వచ్చాక పాత పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి అతి తక్కువ పెన్షన్ వచ్చే ఎన్ పీఎస్ ను బలవంతంగా రుద్దారు. కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం ఓపీఎస్ ను రద్దు చేసి గ్యారంటీ లేని ఎన్ పీఎస్ ను అమలు పరిచారు. దేశవ్యాప్తంగా పారా మిలటరీ పెన్షనర్లతో సహా కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆఫీసర్లు, పెన్షనర్లు స్వతంత్రంగానూ, ఐక్య ఉద్యమాల ద్వారానూ చేస్తున్న పోరాటాల మూలంగా ఇండియా బ్లాక్ అధికారంలోకి వచ్చిన కొన్ని రాష్ట్రాల్లో పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించారు. కానీ కేంద్ర ప్రభుత్వం కేవలం నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్ పీ ఎస్) పరిధిలోనే ఇంప్రూవ్మెంట్స్ చేస్తామని భీష్మించుకుని ఉన్నది.

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రస్తావన కానీ, ఉపాధి కల్పన, రిక్రూట్మెంట్ పాలసీ విధానాన్ని కానీ బడ్జెట్లో ప్రస్తావించలేదు. బీడీ కార్మికులకు "చేయూత" జీవిత బీమా, ఈఎస్ఐ, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, దీనికి బడ్జెట్లో కేటాయింపులు, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, స్వీగ్గి జోమాటో వంటి గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తూ రాజస్థాన్ తరహా చట్టాన్ని మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసిన విషయం మర్చిపోయినట్లున్నారు. చిరు వ్యాపారులు, ఫుట్ పాత్ వ్యాపారులకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తామన్న హామీని గాలి కొదిలేసారు.

పెరిగిన ధరల కనుగుణంగా కనీస వేతనాల జి.వోల సవరణ ప్రస్తావనే లేదు. అభయ హస్తం పేరిట వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్స్ ఏర్పాటు, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, హెల్త్ కార్డులతో సహా ప్రతి మండలంలో "హమాలీ నగర్" ఏర్పాటు చేస్తామని చెప్పినా వాటి గురించి ప్రస్తావనే లేదు. మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనాలు, గ్రామ పంచాయతీ కార్మికుల, మధ్యాహ్న భోజన కార్మికుల బకాయి వేతనాలు చెల్లింపునకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పథకాల్లో పని చేస్తున్న స్కీం వర్కర్లకు కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులు కల్పించే చర్యలే లేవు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనివ్వాలని, కేటాయించిన బడ్జెట్ ను ఖర్చు చేయాలని, రైతు భరోసా కౌలు రైతులకు కూడా ఇవ్వాలని, వాగ్ధానాలు అమలు పరుస్తూ బడ్జెట్ సమావేశాలు ముగిసే లోపు పునర్ పరిశీలన చేయాలని ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి. కృష్ణ మోహన్ ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. వివిధ తరగతుల ప్రజలు తమ సమస్యల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పరిష్కరించుకునేందుకై పోరాటాలకు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.