రాహుల్‌ వరంగల్‌ సభ 28న?

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు నేపథ్యంలో వరంగల్‌లోని ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన కృతజ్ఞత సభ ఈ నెల 28న జరిగే అవకాశం ఉంది. ఆగస్టు 3న సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ లోపే సభ నిర్వహించాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు.

కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా రావాలంటూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని ఆహ్వానించేందుకు రేవంత్‌రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలు శనివారమే ఢిల్లీకి చేరుకున్నారు.

సోమవారం ఈ ముగ్గురూ రాహుల్‌గాంధీని కలిసి కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా రావాలంటూ ఆహ్వానించనున్నారు. రాహుల్‌కు ఉన్న వెసులుబాటును బట్టి సభ నిర్వహించే తేదీ ఖరారు కానుంది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచిప్రారంభం కానుండగా..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభవుతున్నాయి. అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీ సమావేశాలకు ఇబ్బంది రాకుండా ఈ నెల 28న ఆదివారం వరంగల్‌ కృతజ్ఞతా సభను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్‌గాంధీతో రేవంత్‌ భేటీ తర్వాత దీనిపై స్పష్టత రానుంది.

రాహుల్‌గాంధీతో పాటుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర అగ్రనేతలనూ రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌లు కలిసి ఆహ్వానించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 23న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం సీఎం, మంత్రులు భట్టి, ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు పలువురు కేంద్ర మంత్రులనూ కలవనున్నారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై వారికి విజ్ఞాపన పత్రాలను సమర్పించనున్నారు. రేవంత్‌, నీటి పారుదల మంత్రి ఉత్తమ్‌లు సోమవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర జల వనరుల మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కలిసే అవకాశం ఉంది. పెండింగ్‌ ప్రాజెక్టుల గురించి ఆయన దగ్గర ప్రస్తావించాలని భావిస్తున్నారు.

రాహుల్‌గాంధీ.. ఆదివారం రాత్రి లేదా సోమవారం ఢిల్లీలో నేతలకు అందుబాటులోకి రానున్నట్లు ఏఐసీసీ ఇచ్చిన సమాచారం మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఉదయమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లిపోయారు. భట్టి, ఉత్తమ్‌లు కూడా అప్పటికే ఢిల్లీలో ఉండడంతో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీపైనా అధిష్ఠానం పెద్దలతో చర్చిస్తారా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్లమెంటు సమావేశాల్లో అధిష్ఠానం, అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర నాయకత్వం బిజీ అవుతున్న నేపథ్యంలో ఈ చర్చ ఉత్పన్నం కాదని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. సోమవారం దీనిపై స్పష్టత వస్తుందని అంటున్నారు.

అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ వైదొలగడంపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు -2024 రేసు నుంచి వైదొలగుతున్నట్టు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించడంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అధ్యక్ష పదవికి పోటీ పడే అర్హత బైడెన్‌కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా దేశానికి సేవలు అందించడానికి ఆయన ఫిట్ కాడని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ‘ట్రూత్ సోషల్’ వేదిక ద్వారా ఆయన స్పందించారు. 

బైడెన్ అధ్యక్ష పదవి కారణంగా మనం చాలా నష్టపోతాం. అయితే బైడెన్ కలిగించిన నష్టాన్ని మేము త్వరగా పూడ్చుతాము’’ అని అన్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన మరో అగ్రనేత, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ మైక్ జాన్సన్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ పనికిరారని, అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటే.. మరి అధ్యక్షుడిగా కొనసాగడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు

బైడెన్ తప్పుకున్న నేపథ్యంలో కమలా హ్యారీస్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపు ఖరారైంది. దీంతో ట్రంప్ సారధ్యంలోని రిపబ్లికన్ పార్టీ ఇకపై ఎలాంటి ప్రచార వ్యూహాన్ని అనుసరించనుందనేది ఆసక్తికరంగా మారింది.

దీనిపై ఇప్పటికే చర్చలు, విశ్లేషణలు కూడా ప్రారంభమయ్యాయి. కాగా కమలా హ్యారీస్‌ను ఎదుర్కొనే విషయంలో తాము ఎలాంటి ఆందోళన చెందడం లేదని రిపబ్లికన్ నేతలు చెబుతున్నారు. బైడెన్ హయాంలో ఇమ్మిగ్రేషన్, ద్రవ్యోల్బణంతో పాటు అనేక సమస్యలు తలెత్తాయని, హారిస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఇవే తమ అస్త్రాలు అని చెబుతున్నారు.

కాగా అధికార డెమొక్రాటిక్ పార్టీలో అంతర్గత ఒత్తిడి తీవ్రమవుతున్న వేళ అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు.

ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హ్యారీస్‌ ఎన్నికల్లో పోటీ పడేందుకు మద్దతు ఇస్తానని ఆయన ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన చేశారు. పార్టీ సీనియర్ సభ్యులను గౌరవిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లేఖను విడుదల చేసిన విషయం తెలిసిందే.

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

 నేటి నుంచి ఏపీ అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది.

అసెంబ్లీ ఎజెండా, పని దినాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చకు ఆమోదం తెలపనున్నారు. బుధవారం నుంచి వరుసగా సభ ముందు చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ శ్వేత పత్రాలను ఉంచనుంది.

శాంతిభద్రతలు, పరిశ్రమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వరుసగా మూడు శ్వేత పత్రాలను ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. గవర్నర్ ప్రసంగం సమయంలో నిరసన తెలియజేస్తామని ఇప్పటికే వైఎస్ జగన్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించారు.

రేపటికల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ రావాలంటూ ముందుగానే హుకుం జారీ చేశారు. ఓవైపు శాసనసభ జరుగుతుండగా ఇక్కడ ఉండకుండా ఢిల్లీ వెళ్లి ప్రయోజనం ఏంటని పార్టీ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. సభ జరుగుతుండగా బయట ఆందోళన చేయడం కంటే సభలో అంశాలను ప్రస్తావిస్తే ఉపయోగమంటూ సూచిస్తున్నారు.

శ్వేత పత్రాల సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను ప్రస్తావిస్తే సమాధానం చెప్పలేక వెళ్లిపోయారంటూ విమర్శించే అవకాశం అంటూ ప్రస్తావించారు.

ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా ఇంకా తాను చెప్పిందే చేయాలంటూ నాయకులకు జగన్ హుకుం జారీ చేశారు. గవర్నర్ ప్రసంగ సమయంలో సభను అడ్డుకొని సభ నుంచి వెళ్లిపోయే ఎత్తుగడ వేస్తున్నారు.

జగన్ వ్యూహాలపై మండిపడుతున్న ఆ పార్టీ నేతలు. ఇది సెల్ఫ్ గోలేనంటూ సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు సైతం ఈసారి సభలో ప్రభుత్వం ఉంచనుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం కానుంది. దీనికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు

ఉగ్రవాదుల భరతం పట్టేందుకు రంగంలోకి 500 మంది పారా కమాండోలు

కొన్నేళ్ల కిందట ఉగ్రవాద రహితంగా ప్రకటించిన జమ్మూ ప్రాంతంలో మళ్లీ ముష్కరుల దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దాదాపు మూడేళ్లలో జమ్మూ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడుల్లో 48 మంది సైనికులు ప్రాణాలు కోల్పోతారు. జంగిల్ వార్‌ఫేర్‌లో శిక్షణ పొందిన 60 మందికిపైగా పాక్ ఉగ్రవాదులు ఒక్క జమ్మూ ప్రాంతంలోనే పనిచేస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ప్రాంతంలోని మొత్తం 10 జిల్లాల్లో ఉగవాదం వ్యాపించింది. దీంతో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు సైన్యం సామర్థ్యాలను పూర్తిస్థాయిలో మోహరించాలని ప్రధాని మోదీ ఆదేశించారు.

జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు జరుపుతోన్న దాడులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముష్కర మూకల దాడుల్లో పెద్ద సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్నేళ్ల కిందట ఉగ్రవాదరహిత జోన్‌గా ప్రకటించిన జమ్మూలోనూ ఇటీవల వారి ఉనికి అలజడి రేపుతోంది. రాజౌరి, పూంచ్, రియాసి, కథువా జిల్లాలు తీవ్రవాదుల లక్ష్యాలుగా మారుతుండడంతో భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు చేపడతున్నాయి. పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు చొరబాటు దృష్ట్యా జమ్మూ ప్రాంతంలో భారీగా సైన్యాలను మోహరించి ఆర్మీ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తోంది.

ఉగ్రమూకల భరతం పట్టేందుకు దాదాపు 500 మంది పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలను ఆ ప్రాంతంలో మోహరించినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఆ ప్రాంతంలోకి పాకిస్థాన్ నుంచి 50 నుంచి 55 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని పేర్కొన్నాయి. జమ్మూలో ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు పాక్ ప్రయత్నిస్తోంది, నిఘా వర్గాలు కూడా తమ చర్యలను వేగవంతం చేశాయని తెలిపాయి. ఉగ్రవాదులకు సహకారం అందించేవారిపై ప్రత్యేకంగా దృష్టిసారించామని వివరించాయి. పాక్ దుర్మార్గపు చర్యలను ఎదుర్కోవడానికి ఇప్పటికే 3,500 నుంచి 4,000 మంది భద్రతా దళాలను మోహరించామని అధికారులు వెల్లడించారు.

జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల జరుగుతోన్న దాడుల్లో ఉగ్రవాదులు అనుసరిస్తోన్న గెరిల్లా యుద్ధ వ్యూహాలు, వారు ఉపయోగించిన అత్యాధునిక ఆయుధాలను బట్టి వారు సాధారణ తీవ్రవాదులు కాదని తెలుస్తోందని అధికారులు చెప్పారు. ఇందులో కచ్చితంగా పాకిస్థాన్ సైన్యానికి చెందిన మాజీ అధికారుల హస్తం ఉండొచ్చని ఇంటలిజెన్స్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి.

జమ్మూ కశ్మీర్ మాజీ డీజీపీ డాక్టర్ ఎస్పీ వైద్ మాట్లాడుతూ.. “జమ్మూ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి.. ఈ సమయంలో తక్షణం చర్యలు అవసరం.. కొంతమంది పాక్ ఆర్మీ మాజీ అధికారులు స్థానిక ఉగ్రవాద సమూహాలకు మార్గనిర్దేశం చేస్తున్నారని సమాచారం” అని పేర్కొన్నారు.

జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లా దౌసా వద్ద ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మేజర్ సహా నలుగురు ఆర్మీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. అంతకు ముందు కథువాలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. వాహనంపై గ్రనేడ్లు విసిరి.. కాల్పులకు తెగబడ్డారు.

500 మీటర్ల దూరం నుంచి సైనిక వాహనాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. పూంఛ్, రాజౌరి జిల్లాల్లో మొదలైన ఉగ్రవాదుల దాడులు.. ప్రస్తుతం జమ్మూ ప్రాంతానికి వ్యాప్తి చెందాయి. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడులు పెట్రేగిపోతున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టుపై NDSA కీలక సమావేశం..

కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ డ్యాం భద్రతా అథారిటీ (NDSA) కీలక సమావేశం నిర్వహించింది. ఈ ఏడాది మే 5వ తేదీన ఒక నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్‌ఏ.. వర్షాకాలం, వరదలు రాకముందే జులై మొదటి వారంలోపే పలు సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని నివేదికలో పేర్కొంది.

NDSA సూచనలతో.. జూన్ రెండో వారంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు CWPRS, CSMRS లతో సాంకేతిక పరీక్షలు చేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ రెండు సంస్థలు సాంకేతిక పరీక్షలకు ఉపక్రమించే సమయానికి వరద రావడంతో టెస్ట్‌లు ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది.

ఈ కమిషన్ త్వరగా నివేదిక ఇవ్వాలంటూ NDSAని కోరింది. ఆ నివేదిక ఆధారంగానే తాము తుది నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ప్రాజెక్టును కొనసాగించడమా! కొత్త నిర్మాణానికి వెళ్లాడమో సిఫార్సులు చేయాల్సి ఉందన్న కమిషన్ తెలిపింది.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సమాచారం లేకపోవడంతో తాము నివేదిక ఇవ్వలేకపోతున్నట్లు కమిషన్‌కు తెలిపింది NDSA బృందం.

ఈ నేపథ్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని NDSAని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆ మేరకు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపారు NDSA చైర్మన్.

శనివారం మధ్యాహ్నం జరిగే ఈ భేటీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.

భ‌ద్రాచలం వ‌ద్ద క్ర‌మంగా పెరుగుతున్న గోదావ‌రి నీటిమ‌ట్టం

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు పొంగిపోర్లుతున్నాయి. ప‌లు ప్రాజెక్టుల‌కు వ‌ర‌ద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టుల‌న్నీ నిండుకుండలా మారాయి. ఈ క్ర‌మంలో ఆయా ప్రాజెక్టుల ప‌రిధిలోని లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుపోతోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 31.5 గా ఉంది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అలర్ట్‌ చేశారు. మరోవైపు తాళిపేరు ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 66,900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఎగువ ప్రాంతాలైన తాళి పేరు ప్రాజెక్టు, పెరూరు వైపు నుంచి వరద నీరు రావడంతో నది నీటిమట్టం ఇంకా పెరుగుతుందని అధికారులు తెలుపుతున్నారు.

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు జాలారులు నదివైపు వెళ్లొద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హెచ్చరికలు జారీ చేశారు.

శ్రీరాంసాగ‌ర్ ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద‌..

నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టు 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1066.30 అడుగులుగా ఉంది. ఎస్సారెస్పీ నీటి నిల్వ సామర్థ్యం 80.5టీఎంసీలు అయితే వరద ప్రవహానికి ప్రస్తుతం 17.662 టీఎంసీలుగా ఉంది.

ఢిల్లీకి సీఎం రేవంత్.. ప్రధాన అజెండా అదే..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆది, సోమవారాల్లో ఆయన హస్తినలో ఉండనున్నారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రేంవత్ రెడ్డి ఢిల్లీ చేరుకుంటారు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు.. పలువురు కేంద్రమంత్రులను రేవంత్ రెడ్డి కలవనున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణతో పాటు కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై హైకమాండ్‌తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవుల పంపకం పూర్తవ్వడంతో.. మిగిలిన పదవులు ఎవరెవరికి కేటాయించాలి.. పదవులు దక్కని సీనియర్లను ఎలా గౌరవించాలనే విషయంపై కూడా అధిష్టానంతో రేవంత్ చర్చించనున్నారు.

మరోవైపు వరంగల్‌లో ఏర్పాటుచేయబోయే భారీ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ అమలు చేయడంతో రాహుల్‌తో సభ పెట్టిస్తే బాగుంటుందనే ఉద్దేశంలో రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఈ విషయాన్ని హైకమాండ్‌కు రేవంత్ తెలియజేయనున్నారు.

రెండు రోజుల పర్యటనలో పలువురు కేంద్రమంత్రులను రేవంత్ రెడ్డి కలవనున్నారు. విభజన హామీల అమలుతో పాటు.. కొత్త రుణాలు, ప్రాజెక్టుల మంజూరుపై వివిధ శాఖల మంత్రులతో సమావేశమవుతారు. రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసే అవకాశం ఉంది. మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు. పెండింగ్ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని కోరనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఎఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కలవనున్నారు. పార్టీకి సంబంధించిన అంశాలపై ఆయన చర్చించనున్నారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తుండటంతో మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌తో చర్చించి.. ఎవరిని కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకోవాలనేదానిపై రేవంత్ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను వివరించడంతో పాటు.. 

చేరికల అంశం ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ ఎంపికపై ప్రస్తుత ఢిల్లీ పర్యటనలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. గత ఢిల్లీ పర్యటనలోనే పీసీసీ చీఫ్ ఎంపికపై ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ.. పార్టీలో ఏకాభిప్రాయం రాకపోవడంతో పీసీసీ చీఫ్ ఎంపిక వాయిదాపడింది. ఈసారి మాత్రం కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో కొత్త పథకం: ఆ నేత పేరు: వారికి రూ. లక్ష ఆర్థికసాయం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఓ కొత్త పథకాన్ని తెర మీదికి తీసుకొచ్చింది. దీనికి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది. నేడు శ్రీకారం చుట్టనుంది. ఈ పథకాన్ని రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించబోతోన్నారు.

అదే- రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం. ప్రిలిమ్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఉద్దేశించిన పథకం ఇది. దీని కింద ఒక్కో అభ్యర్థికి లక్ష రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని అందజేయనుంది రేవంత్ రెడ్డి సర్కార్. నేడు ఈ పథాకన్ని రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించనున్నారు.

గతంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూప్ 1 పరీక్షలను రాయబోయే అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు వినిపించిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షలను రాయబోయే అభ్యర్థులందరికీ కూడా ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఉచిత కోచింగ్‌తో పాటు ప్రతి నెలా 5,000 రూపాయల చొప్పున మొత్తాన్ని స్టైపెండ్‌గా అందించనుంది.

హైదరాబాద్‌లో సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీ రోడ్ నంబర్ 8, ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిల్‌లల్లో ఈ ఉచిత కోచింగ్ కొనసాగుతుంది.

75 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ స్టడీ కాలంలో అభ్యర్థులకు నెలకు 5,000 రూపాయల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. దీనికి దరఖాస్తు గడువు శుక్రవారం ముగిసింది.

అదే సమయంలో ప్రిలిమ్స్ అభ్యర్థుల కోసం కొత్తగా ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని అందుబాటులోకి తీసుకుని రానుంది.

దీనికి కావాల్సిన అర్హతలు, కుటుంబ వార్షిక ఆదాయం, ఇతర మార్గదర్శకాలు, నిబంధనలను ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది.

కలెక్టర్ ఆర్డర్ కాపీ ఉంటేనే రిజిస్ట్రేషన్.. ల్యాండ్ సేల్, పర్చేస్‌లో తహశీల్దార్ల కొత్త మెలిక

నాలుగేండ్లు పరిష్కారమైందని అనుకుంటున్న వారికి మరో ముప్పు పొంచి ఉన్నది. ‘రెండు, మూడేండ్ల పాటు అధికారుల చుట్టూ తిరిగి.. అడిగినంత సమర్పించుకొని తమ సమస్యను పరిష్కరించుకున్నాం.. మేం సేఫ్!’ అని అనుకుంటున్నారు.

కానీ.. మరోసారి అధికారుల చుట్టూ తిరిగే రోజు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఎప్పుడైనా ల్యాండ్‌ను అమ్మేద్దామనుకున్నా, సక్సెక్షన్ చేద్దామనుకున్నా.. తహశీల్దార్లు ఆర్డర్ కాపీ చూపించండి అని అడుగుతుండటంతో ఖంగు తింటున్నారు.

ధరణి పోర్టల్‌లో డేటా కరెక్షన్, ల్యాండ్ మ్యాటర్స్, పీవోబీ అన్ బ్లాకింగ్ వంటి అనేక సమస్యలకు 33 మాడ్యూళ్లు ఇచ్చారు. అందరినీ ఆన్‌లైన్‌లోనే రూ.1,000 చెల్లించి అప్లయ్ చేసుకోమన్నారు. ఇప్పటికే 19 లక్షల మందికిపైగా తమ రికార్డుల్లో పొరపాట్లు ఉన్నాయని అప్లయ్ చేశారు.

కొందరి దరఖాస్తులు ఏ కారణం లేకుండా రిజెక్ట్ చేస్తే నాలుగు, ఐదుసార్లు కూడా అప్లయ్ చేసుకున్నారు. ప్రతిసారీ రూ.1,000 వంతున చెల్లించారు. తహశీల్దార్లను వేడుకుంటే.. కొందరికి ఇంత ఖర్చు పెట్టుకుంటే తప్పా పాజిటివ్ రిపోర్టులు రాయలేదు. ఆ రాసిన కాపీని చేతికి ఇవ్వాలని కోరితే తామే ఆర్డీవో, కలెక్టర్లకు పంపుతామన్నారు. ఏ అధికారి కూడా దరఖాస్తుదారుడికి వారేం రిపోర్ట్ పంపారన్న సమాచారం మాత్రం ఇవ్వలేదు. ఆఖరికి కలెక్టర్ అప్రూవ్ చేసినా, సీసీఎల్ఏ ఆమోదించినా, టీఎస్ టీఎస్ వాళ్లు ఓకే చేసినా ఎక్కడా దరఖాస్తుదారుడికి చిన్న కాగితం ముక్క కూడా ఇవ్వలేదు. రిజెక్ట్ చేసినా కారణాలు తెలపలేదు. ఇప్పుడేమో అమ్మడానికి వెళ్తే, ఏదైనా డీడ్స్ చేయడానికి వెళ్తే అదే తహశీల్దార్ కాపీ అడుగుతుండటం ఆందోళనకు గురిచేస్తున్నది.

అధికారిక లెక్కల ప్రకారం ఫిబ్రవరి నెలాఖరుకు 16,57,407 దరఖాస్తులు రాగా.. 8,78,282 పరిష్కరించారు. 5,37,984 దరఖాస్తులను తిరస్కరించారు. పెండింగులో 2,40,127 ఉండేవి. అయితే మార్చి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ పెట్టి 1,61,760 దరఖాస్తులను పరిష్కరించినట్టు అధికారులు చెప్తున్నారు. ఇంకా 1,15,308 కొత్తగా వచ్చాయి. అంటే 1,93,675 వరకు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. రిజెక్ట్ చేసిన వాళ్లు మళ్లీ అప్లయ్ చేస్తూనే ఉన్నారు. డ్యాష్ బోర్డు క్లియర్ పేరిట అకారణంగా తిరస్కరణకు గురైన అప్లికేషన్లు మళ్లీ వస్తాయి. అంటే ఇంకా లక్షల్లో ఉంటాయి. అయితే ఇప్పటి దాకా పరిష్కరించిన సుమారు 10 లక్షల దరఖాస్తులకు ఆర్డర్ కాపీలు ఎవరి దగ్గర తెచ్చుకోవాలో ఉన్నతాధికారులు చెప్పడం లేదు. లేదంటే ధరణి పోర్టల్‌లో సవరించిన రికార్డుల ప్రకారం కరెక్టుగా ఉంటే ఆర్డర్ కాపీ అడగకుండానే క్రయవిక్రయాలు చేయాలని తహశీల్దార్లు/డిప్యూటీ తహశీల్దార్లకు ఆదేశాలివ్వాలని బాధితులు కోరుతున్నారు

హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో రెండెకరాల భూమిని ధరణి పోర్టల్ రాకముందే కొనుగోలు చేశారు. అన్ని పహాణీలు చూసి, లీగల్ ఓపినియన్ తీసుకొని సేల్ డీడ్ ద్వారా కొన్నారు. ఆ తర్వాత మ్యుటేషన్ అయ్యింది. కొత్త పాస్‌బుక్కులు కూడా వచ్చాయి. ధరణి రాగానే అది ప్రభుత్వ ల్యాండ్‌గా పీవోబీలో నమోదు చేశారు. ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసి 18 నెలలపాటు తిరిగి చివరకు సమస్యను పరిష్కరించుకున్నారు. దాంతో ధరణి పోర్టల్‌లో క్లాసిఫికేషన్ పట్టాగా మారింది. ఇప్పుడు అదే భూమిని సేల్ చేయడానికి స్టాంప్ డ్యూటీ, ఇతర ఫీజులన్నీ కట్టి స్లాట్ బుక్ చేసుకున్నారు.

తీరా సమయానికి తహశీల్దార్ ఆఫీసుకు వెళ్తే ధరణి ఆపరేటర్ పాత రికార్డును తహశీల్దార్/డిప్యూటీ తహశీల్దార్ ముందు పెట్టడంతో తాను చేయనంటూ తెగేసి చెప్పారు. సమస్య పరిష్కారమైందని చెబితే తమకు ఆర్డర్ కాపీ చూపించాలని సేల్ డీడ్‌ను పక్కన పెట్టేశారు. రికార్డుల్లో తప్పుగా ఉంటే స్లాట్ బుక్ కాదు కదా అంటే కూడా వినలేదు. దాంతో ఉన్నతాధికారుల నుంచి ఫోన్ చేయిస్తే తప్ప సేల్ డీడ్ కాలేదు.

జగన్‌ ‘కారు’ కథలు!

మా నాయకుడికి కేటాయించిన కారు మాటికీ మాటికీ ఆగిపోతోంది’ అంటూ వైసీపీ రచ్చ చేసింది. చివరికి... కారు బాగానే ఉందని, వైసీపీయే ఎప్పట్లాగా తప్పుడు కోతలతో యాగీ చేసిందని రుజువైంది. అసలేం జరిగిందంటే... వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి వినుకొండ ఎమ్మెల్యే పెంచి పోషించిన ‘గ్యాంగ్‌’ వార్‌ కారణంగా రషీద్‌ అనే యువకుడు హత్యకు గురయ్యారు. దీనిని రాజకీయం చేసిన జగన్‌...

రషీద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు శుక్రవారం వినుకొండ పర్యటనకు బయలుదేరారు. జగన్‌ భద్రత రీత్యా ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎ్‌సడబ్ల్యూ) బుల్లెట్‌ ప్రూఫ్‌ టాటా సఫారీ కారు ఏర్పాటు చేసింది

శుక్రవారం ఉదయం 10.05 గంటలకు తాడేపల్లి నుంచి ప్రయాణం మొదలుపెట్టిన జగన్‌ కేవలం ఐదు నిమిషాల్లోనే కిందికి దిగారు. వైసీపీ నాయకుడికి చెందిన ఫార్చూనర్‌లో కూర్చున్నారు. అంతే... వైసీపీ సోషల్‌ మీడియా రెచ్చిపోయింది. ‘‘జగన్‌కు కేటాయించిన కారు అడుగడుగునా ఆగిపోతోంది. మాజీ సీఎంకు భద్రత కల్పించేది ఇలాగేనా? ఇది పోలీసుల వైఫల్యమే’’ అంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఇక... జగన్‌ కూలి, నీలి మీడియా కూడా ఇదే పాట పాడాయి. నిజానికి... ప్రభుత్వం జగన్‌ పర్యటనకోసం కేటాయించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ సఫారీ వాహనం ఎక్కడా ఆగలేదు. ఆయన కాన్వాయ్‌లోనే వినుకొండ దాకా రయ్య్‌మని దూసుకెళ్లింది.

జగన్‌ పర్యటన కోసం కేటాయించిన సఫారీ (ఏపీ 39 పి0014) పూర్తి కండీషన్‌లో ఉంది. ఎన్నికల్లో విజయం సాధించే వరకూ ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు అందులోనే ప్రయాణించారు. చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసినప్పుడు... అక్కడి నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి వరకు ఇందులోనే ప్రయాణించారు. ‘చంద్రబాబు వాడిన కారు నేను ఎక్కడమేమిటి’ అనుకున్నారో ఏమో! ఎక్కిన ఐదు నిమిషాల్లోనే జగన్‌ అందులో నుంచి దిగిపోయారు. రచ్చ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీయగా మరిన్ని ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి.

జగన్‌ పర్యటన కోసం టయోటా ఫార్చూనర్‌ లేదా ల్యాండ్‌ క్రూజర్‌ ప్రడో పంపాలని తాడేపల్లి నుంచి ఐఎ్‌సడబ్ల్యూకు ఫోన్‌ వెళ్లింది. అయితే... ఆ వాహనాలు అందుబాటులో లేకపోవడంతో బుల్లెట్‌ ప్రూఫ్‌ సఫారీని కేటాయించారు. అది కూడా విజయవాడలో సిద్ధంగా లేకపోవడంతో విజయనగరం నుంచి తెప్పించారు. గురువారం రాత్రి 11 గంటలకు అక్కడ బయలుదేరిన సఫారీ... ఉదయానికి తాడేపల్లి చేరుకుంది. పూర్తి కండిషన్‌లో... ఎక్కడా ఆగకుండా పరుగులు తీసింది. కానీ... జగన్‌ ఎక్కిన ఐదు నిమిషాల్లోనే అది బ్రేక్‌డౌన్‌ అయ్యిందంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేసింది. 

అదే వాహనం జగన్‌ కాన్వాయ్‌లో వినుకొండ వరకు ఎక్కడా ఆగకుండా దూసుకెళ్లిందంటూ ఐఎ్‌సడబ్ల్యూ వీడియో ఆధారాలు కూడా చూపించింది. ‘‘మొన్నటిదాకా ముఖ్యమంత్రి హోదాలో ల్యాండ్‌ క్రూజర్‌ ప్రడో కారులో ప్రయాణించిన జగన్‌కు...

బహుశా ఇప్పుడు ‘సఫారీ’ ప్రయాణం నచ్చలేదేమో! మాజీ అయిన తర్వాత కూడా అదే దర్పం ప్రదర్శించాలంటే ఎలా? సెక్యూరిటీ రివ్యూ కమిటీ-2024 నిబంధనల మేరకు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్‌కు భద్రత కల్పిస్తున్నాం. సీఎంగా ఉండగా ప్రధాని తరహాలో ఆయన ఏర్పాటు చేసుకున్న స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌(ఎ్‌సఎ్‌సజీ)ను కొనసాగించేందుకు నిబంధనలు అంగీకరించవు’’ అని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి