ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభం. సూపర్‌-6 పథకాల అమలుపై చర్చించనున్న కేబినెట్‌.

పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై చర్చించనున్న మంత్రివర్గం. 

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం. 

బడ్జెట్‌ తయారీలో ప్రాధాన్య అంశాలపై దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు.

Streetbuzz News

నేడు లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా మెహతాబ్‌ ప్రమాణ స్వీకారం

నేడు లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌ గా భర్తృహరి మెహతాబ్‌ ప్రమాణ స్వీకారం చేయను న్నారు. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి తో ప్రమాణస్వీకారం చేయిస్తారు. 

అనంతరం తొలుత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా మంత్రులు, ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఎంపీల తో లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించను న్నారు. 

నేడు, రేపు లోక్‌సభ సభ్యుల ప్రమాణస్వీకారం పర్వం కొనసాగనుంది. ఈనెల 26న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్య వాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం వచ్చే నెల 3వ తేదీన పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ముగియనున్నాయి. 

వర్షాకాల సమావేశాలు జూలై 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.

రేపు సినీ నిర్మాతలతో పవన్ భేటీ ‼️

- ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తో సినీ నిర్మాతలు సోమవారం భేటీ కానున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) తో సినీ నిర్మాతలు సోమవారం భేటీ కానున్నారు. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం ఈ భేటీ జరుగనుంది.

సినీ నిర్మాతలు (Movie producers ) అశ్వినీదత్‌, చినబాబు, నవీన్‌, రవిశంకర్‌, నాగవంశీ, విశ్వప్రసాద్‌, బోగవల్లి ప్రసాద్‌, డివివి.దానయ్య, ఫిల్మ్‌ ఛాంబర్ అధ్యక్షుడు దిల్‌రాజు, దామోదరప్రసాద్‌ తదితరులు కలువనున్నారు.

చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకురానున్నారు. సినిమా టికెట్ల ధరల పెంపు వెసులుబాటు, థియేటర్ల సమస్యల వాటిపై చర్చించే అవకాశముంది. చిత్ర పరిశ్రమకు చెందిన పవన్‌కల్యాణ్‌ నటుడిగా ఎదిగి రాజకీయ రంగ ప్రవేశం చేసి , డిప్యూటీ సీఎం(Deputy CM) స్థాయికి ఎదిగినందుకు గాను అభినందనలు తెలియజేయడానికి కూడా నిర్మాతలు మొదటిసారి పవన్‌ను కలువనున్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌(YS Jagan) ను నేరుగా నటుడు చిరంజీవి ఆధ్వర్యంలో నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్‌, నిర్మాతలు దిల్‌రాజ్‌ కలిసి సమస్యలను విన్నవించారు. అప్పటి మంత్రుల వ్యవహారశైలీతో ప్రముఖ నటులు తమ చిత్రాల విడుదల సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అనుకూలమైన వ్యక్తులకు ఆంక్షల సడలింపు, వ్యతిరేకంగా కనిపించిన వారికి ఆంక్షలు విధించి విమర్శల పాలయ్యారు.

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ !

- నామినేటెడ్ పోస్టుల పై కసరత్తు 

- మంత్రి వర్గంలో చోటు దక్కేది ఎవరికో ?

- రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ల మధ్య ఉత్కంఠ 

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రేపు ఢిల్లీ (Delhi tour)వెళ్లనున్నారు. నామినేటెడ్ పోస్టులు, మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వంటి అంశాల‌పై అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉంది.

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆశించిన మేరకు ఫలితాలు సాధించకపోవడంతో నామినేటెడ్‌ పోస్టుల (Nominated posts) భర్తీని పునస్సమీక్షించాలని అధిష్ఠానం నిర్ణయించినట్టు సమాచారం. సీనియార్టీ ప్రాతిపదికన కాకుండా అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నట్టు తెలిసింది.

అలాగే తమతో చర్చించకుండానే నామినేటెడ్‌ పోస్టులు ప్రకటించారని మంత్రులు, ముఖ్యనేతలు, ఎమ్మె ల్యేలు కొందరు సీఎం రేవంత్‌ రెడ్డిపై అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల ఆధారంగా వీటిలో మార్పుచేర్పులు ఉంటాయని అధిష్ఠానం అప్పుడు వారికి హామీ ఇచ్చింది. అలాగే మంత్రి పదవులను కూడా ఆశించే వారి సంఖ్య భారీగా ఉండటంతోఈ నేపథ్యంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

కావేరీ సీడ్స్‌ లాభంలో క్షీణత ‼️

- గతంలో ముడింతల్లో లాభాలు 

- కేసిఆర్ బంధువుల సీడ్స్ అంటూ ప్రచారం 

- తగ్గుతున్న ప్రాధాన్యత

ప్రముఖ విత్తనాల సంస్థ కావేరీ సీడ్స్‌ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 69 శాతం తగ్గి రూ.11.78 కోట్లకు పరిమితమైంది.

క్రితం ఏడాది ఇది రూ.38.08 కోట్లుగా ఉన్నది. సమీక్షకాలంలో కంపెనీ నిర్వహణ ఆదాయం రూ.144 కోట్ల నుంచి రూ.142.63 కోట్లకు తగ్గింది.

నిర్వహణ ఖర్చులు 3.50 శాతం పెరిగి రూ.140.86 కోట్లకు చేరుకోవడం వల్లనే లాభాల్లో గండిపడిందని కంపెనీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించారు. ముడి సరుకుల ధరలు 42 శాతం పెరగడం, ఉద్యోగుల ప్రయోజనాల 28 శాతం పెరగడం కూడా లాభాలపై ప్రభావం చూపాయి. కంపెనీ షేరు ధర 6.35 శాతం తగ్గి రూ.670 వద్ద నిలిచింది.

పార్టీకి గంగుల కమలాకర్ గుడ్ బై ?

-జోరుగా సాగుతున్న ప్రచారం

- అసెంబ్లీ లాబీల్లో కవ్వంపల్లి వాఖ్యలతో కలకలం

- ప్రతిష్ట దిగజార్చేందుకే తప్పుడు ప్రచారమంటున్న గంగుల కమలాకర్‌

మాజీ మంత్రి, కరీంనగర్‌ శాసనసభ్యుడు గంగుల కమలాకర్‌ బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం జిల్లా రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నది. బీఆర్‌ఎస్‌ పార్టీలో ఈ ప్రచారం కలవరం కలిగిస్తున్నది. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యం మాజీ మంత్రి, కరీంనగర్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు అత్యంత కీలకమైన నేత పార్టీని వీడనున్నారని వస్తున్న సమాచారం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. 

కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌లోని కీలక నేతలను అందులో ముఖ్యంగా శాసనసభ్యులను పార్టీలో చేర్చుకొని బీఆర్‌ఎస్‌ను నామమాత్రపు పార్టీగా మార్చాలనే ఆలోచనతో ఉందని ఆ దిశగా సాగిన మొదటి ప్రయత్నంగా పోచారం పార్టీ మార్పిడిని పేర్కొంటున్నారు. ప్రస్తుతం గంగులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కీలక వికెట్‌ను పడగొట్టాలని కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. కొద్దిరోజులుగా గంగుల కమలాకర్‌ బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరిగినా కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు సర్వం సిద్ధమైందని శనివారం వార్తలు వచ్చాయి.

అసెంబ్లీ లాబీల్లో కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మానకొండూర్‌ శాసనసభ్యుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ మీడియాతో చిట్‌చాట్‌ చేస్తూ కమలాకర్‌ త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారని వాఖ్యానించడంతో ఈ ప్రచారం ఊపందుకున్నది.

కరీంనగర్‌ అసెంబ్లీ స్థానాన్ని, పార్లమెంట్‌ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ పెద్దలు జిల్లా కేంద్రంలో బలమైన నేతగా ఉన్న కమలాకర్‌ను పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్‌ ఎన్నికల్లో ముఖ్యంగా కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో చేదు అనుభవం పునరావృతం కాకుండా చూసుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తున్నది.

ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తాను కాంగ్రెస్‌లో చేరుతున్నానని జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన శనివారం ‘కోకిల డిజిటల్ మీడియా ' తో మాట్లాడుతూ తనను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేసేందుకే రాజకీయంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కొంత కాలం బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం చేసి ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారని అంటున్నారని అన్నారు. తాను ఏ పార్టీకి వెళ్లేది లేదని, బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. సోమవారమే కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం అంటూ ప్రచారం చేస్తున్నారని, తాను ఆదివారమే విదేశాలకు వెళ్తున్నానని తెలిపారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ కు సవాల్ !

అధికారుల కోసం బ్లాక్ బుక్ రెడీ చేశానని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అధికారులకు బ్లాక్ డేస్ ఉంటాయని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) వార్నింగ్ ఇచ్చారు. ‘ ఫ్లై యాష్ రవాణాలో నాకు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) లీగల్ నోటీసులు పంపించారు. మీ లీగల్ నోటీసులకు మా లీగల్ టీమ్ లీగల్‌గా సమాధానం చెప్తుంది.

ఫ్లై యాష్ రవాణాలో పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) డబ్బులు తీసుకోకపోతే బుధవారం టీటీడీ వెంకటేశ్వరస్వామి టెంపుల్‌లో ప్రమాణానికి సిద్ధమా...? బుధవారం రోజు పొన్నం ప్రభాకర్ రాకపోతే మరిన్ని నిజాలు బయటపెడతాము’’ అని సవాల్ విసిరారు. హుజురాబాద్ ఎమ్మెల్యేకు చెక్కులు ఇవ్వవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్డీవో, ఎమ్మార్వోలకు చెబుతున్నారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పింఛన్ల పెంపు గురించి మర్చిపోయారన్నారు. మూడు నెలల పింఛన్లను రేవంత్ రెడ్డి ఆపారని చెప్పారు. వంద రోజుల్లో పింఛన్లు పెంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు.

తాము ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబానికి ఇద్దరికి పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజక వర్గాల్లో ప్రోటోకాల్స్ ఎందుకు పాటించడం లేదని నిలదీశారు. కళ్యాణలక్ష్మి చెక్కులను తమకు తెలియకుండా పంపిణీ చేస్తున్నారన్నారు. చెక్కులను ఎమ్మెల్యేకు ఇవ్వవద్దని మంత్రి ఎమ్మార్వోలకు ఆదేశాలు ఇస్తున్నారన్నారు.

రాష్ట్ర రవాణా, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

#మంత్రిగా బాధ్యత చేపట్టేందుకు రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణకుంభం తోను, అధికారులు పుష్ప గుచ్చాలను అందజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు.

# వేద పండితుల మంత్రోచ్ఛారణ ల మధ్య ఆ భగవంతునికి షోడశోపచారా పూజ నిర్వహించిన తదుపరి తమ సీట్లో ఆసీనులు అయ్యారు.

#ప్రకాశం జిల్లా దర్శి లో రూ.18.51 కోట్ల అంచనా వ్యయంతో  డ్రైవింగ్ శిక్షణ మరియు రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేసే ఫైలుపై మంత్రి తొలి సంతకం చేశారు.

#ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని త్వరలోనే కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యం పథకంలో ఎదురయ్యే లోటు పాట్లు మన రాష్ట్రంలో తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది నిరుపేద క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా పలు చర్యలు చేపడతామన్నారు.

# రాష్ట్ర రవాణా శాఖ అదనపు కార్యదర్శి నరసింహారెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కేఎస్ బ్రహ్మానందరెడ్డి, జీవి రవి వర్మ, చంద్రశేఖర్, ఏపీఎస్ఆర్టీసీ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. వై శ్రీనివాస్, క్రీడా శాఖ ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎస్ వెంకటరమణ, యువజన సర్వీసెస్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణ, ఎన్సీసీ అసిస్టెంట్ డైరెక్టర్కేజియా తదితరులతో పాటు పలువురు అధికారులు, అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు.

ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి అసెంబ్లీ హౌస్ కీపింగ్ సిబ్బంది సమస్యలు

రాష్ట్ర శాసన సభలో పని చేసే హౌస్ కీపింగ్ సిబ్బందిగా ఉన్న 154 మంది మహిళలు తమ సమస్యలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళ్లారు. గత ఎనిమిదేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నామని, తాము అమరావతి ప్రాంత రైతు కూలీలమని తెలిపారు.

శాసనసభ రెండో రోజు స్పీకర్ ఎన్నిక సందర్భంగా సభకు ఉదయమే విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ ప్రాంగణమంతా కలియ తిరిగి పరిశీలించారు. అక్కడున్న సిబ్బందితో, సెక్యూరిటీతో సరదాగా మాట్లాడుతూ వారితో మమేకమయ్యారు. సిబ్బందికి ఫొటోలు ఇచ్చి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ శాసనసభను పరిశీలించారు. 

ఈ సందర్భంగా శాసనసభ హౌస్ కీపింగ్ సిబ్బంది శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తమ సమస్యలను చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా హౌస్ కీపింగ్ సిబ్బంది మొత్తం అన్ని విభాగాల్లో కలిపి 154 మంది వరకు శాసనసభలో పనిచేస్తున్నామని, రాజధాని ప్రాంత రైతు కూలీలమని ఇక్కడ పనిచేస్తున్నారని చెప్పారు. 8 సంవత్సరాల కిందట రూ.6 వేలకు ఉద్యోగంలో చేరామని ఇప్పుడు రూ.10 వేలు ఇస్తున్నారన్నారు.

అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పరిధిలో ఉన్నామని తెలిపారు. అమరావతి రైతు కూలీలుగా ఉన్నందున నెలకు రూ.2500 భత్యం వచ్చేదని.. తరవాతి రోజుల్లో కీపింగ్ ఉద్యోగం ఉందని చెప్పి ఆ భత్యం నిలిపివేశారన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రతను కల్పిస్తూ.. పురపాలక ఉద్యోగులుగా గుర్తించాలని వేడుకున్నారు. హౌస్ కీపింగ్ ఉద్యోగుల సమస్యను ఆసాంతం విన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, తగు విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రమంతటా వైఎస్సార్సీపీ రాజమహళ్లు- నామమాత్రపు లీజులతో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ

వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిలో కూర్చున్నా పర్వాలేదన్న విధంగా వైఎస్సార్సీపీ పాలనలో అక్రమాలు జరిగాయి.

అడుగడుగునా అధికారాన్ని దుర్వినియోగం చేసిన జగన్ అడ్డగోలుగా ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు లీజులకే వైఎస్సార్సీపీ కార్యాలయాలకు కట్టబెట్టారు.

అన్ని నిబంధనలనూ ఉల్లంఘిస్తూ చట్టాలన్నింటినీ కాలరాస్తూ 26 జిల్లాల్లో ప్యాలెస్‌లను తలదన్నేలా నిర్మాణాలను దాదాపు పూర్తి చేశారు.

ఐదేళ్లుగా అనుమతులు లేకుండా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యాలయాల నిర్మాణం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు సర్వే నెంబరు 44లో రూ.2 కోట్ల విలువైన ఎకరా 50 సెంట్ల ప్రభుత్వ భూమిలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటికి సమీపంలో దీన్ని నిర్మిస్తున్నారు. 2022, మే 18న 33 సంవత్సరాలు ఎకరా వెయ్యి రూపాయల చొప్పున స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు జీవో ఇచ్చారు. పట్టణ ప్రణాళిక సంస్థ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణం తుది దశకు చేరింది.

విజయనగరం నడిబొడ్డున మూడున్నర కోట్ల రూపాయల విలువైన భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. మహరాజుపేట 540 సర్వే నంబర్​లోని స్థలంపై కన్నేసిన వైఎస్సార్సీపీ నేతలు చెరువు గర్భం స్థలాన్ని రెవిన్యూ దస్త్రాల్లో డీ-పట్టాగా మార్పు చేసి తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇందులో ఎకరం విస్తీర్ణంలో వైఎస్సార్సీపీ కార్యాలయ భవనం నిర్మిస్తున్నారు. దాదాపు 85 శాతం నిర్మాణం పూర్తైంది. దీనికీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు.

పార్వతీపురం మన్యం జిల్లాలో రూ.2కోట్ల విలువైన ఎకరం 18 సెంట్ల ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా కార్యాలయం నిర్మిస్తున్నారు. ఇది చివరిదశకు చేరింది. గతంలో ఈ స్థలాన్ని రైతు శిక్షణ కేంద్రానికి కేటాయించి శంకుస్థాపన కూడా చేశారు. 

విశాఖపట్నం ఎండాడలో 175/4 సర్వే నంబర్​లో రూ.100 కోట్ల విలువైన 2ఎకరాల ప్రభుత్వ భూమిలో కార్యాలయ నిర్మాణం పూర్తి చేశారు. జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. గతంలో ఈ భూమిని రెవెన్యూ ఉద్యోగులకు కేటాయించారు. ఈ నిర్మాణానికి జీవీఎంసీ జోన్-2 అధికారులు ఇప్పుడు నోటీసులు అంటించారు.

అనకాపల్లిలో రూ.15 కోట్ల విలువైన ఎకరం 75 సెంట్ల భూమిలో అనుమతులు లేకుండా నిర్మాణం పూర్తి చేశారు. గతంలో ఈ భూమిని కాపు భవనానికి కేటాయించి శంకుస్థాపన సైతం చేసి 50లక్షల నిధుల కేటాయింపులు చేశారు. 

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.5 కోట్ల విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. ఇది సాగుభూమి అని గిరిజనులు అడ్డుకున్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉంది.

కాకినాడలో 75 కోట్ల విలువైన ఎకరం 93 సెంట్ల సర్కారు భూమిలో అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భూమి 22ఎ నిషేధిత జాబితాలో ఉంది. 

రాజమహేంద్రవరం జైలు రోడ్డులోని ఆర్‌ అండ్‌ బీ అతిథిగృహం వెనుక సర్వే నంబరు 107/7లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. భవన నిర్మాణం దాదాపు పూర్తై, రంగులు అద్దుతున్నారు. 2023లో పనులు ప్రారంభించి శరవేగంగా పూర్తి చేశారు. ఐతే నిర్మాణానికి ఎలాంంటి అనుమతులు తీసుకోలేదన్న అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో రూ.10కోట్ల విలువైన ఎకరం ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. ఇది చెరువు భూమి. ఈ వ్యవహారం కోర్టులో ఉంది.

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలో వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణ దశలో ఉంది. సర్వే నంబర్ 201/3లో సుమారు 72 సెంట్ల స్థలాన్ని వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం కోసం ఇచ్చేశారు. దాని విలువ రూ.7కోట్ల పైమాటే. గృహ నిర్మాణ శాఖకు చెందిన ఈ స్థలాన్ని గతంలో పేదలకు కేటాయించి ఆ తర్వాత రద్దు చేశారు. ఇక్కడి పార్టీ కార్యాలయ శ్లాబ్‌ పూర్తైంది.

ఏలూరు రైల్వే స్టేషన్​కు వెళ్లే దారిలో ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థకు చెందిన రూ.5 కోట్ల విలువైన రెండెకరాల స్థలంలో రాజమహల్​ను తలదన్నేలా వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మించారు. రెండేళ్ల క్రితం ఈ నిర్మాణం చేపట్టగా ఇటీవలే పూర్తైంది. దీనికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణంపై నిబంధనల మేరకు ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. 

విజయవాడ విద్యాధరపురంలోని సితార సెంటర్‌ సమీపంలో రూ.50 కోట్లకు పైగా విలువ చేసే ఎకరం స్థలంలో మూడంతస్తుల్లో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. దీనికీ ఎలాంటి అనుమతులు లేవు. నగరపాలక సంస్థకు రూపాయి కూడా రుసుముల కింద చెల్లించలేదు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా కోర్టు సెంటర్‌లో 60కోట్లకు పైగా విలువైన 2ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని దర్జాగా కడుతున్నారు. ఈ స్థలంలో ప్రజలందరికీ ఉపయోగపడేలా భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరుతో ఓ గ్రంథాలయం, ఆడిటోరియం, కన్వెన్షన్‌ సెంటర్, మ్యూజియం నిర్మించాలని ప్రతిపాదనలుండగా వాటిని కాదని కార్యాలయం కట్టుకుంటున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని దీని వెనుక ప్రధాన పాత్రధారి. అక్రమంగా నిర్మిస్తున్న భవనానికి ఇప్పుడు ప్లాన్‌ అప్రూవల్‌ కోసం మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థకు దరఖాస్తు చేశారు.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో లింగంగుంట్ల అగ్రహారంలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా ప్రధాన ఆసుపత్రి, రైల్వేస్టేషన్‌ సమీపంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మించారు. ఎకరం 50 సెంట్ల స్థలంలో అనుమతులు లేకుండానే కార్యాలయ నిర్మాణం పూర్తి చేశారు.

బాపట్లలో ఏపీఐఐసీకి చెందిన రూ.6కోట్ల విలువైన 2 ఎకరాల భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మించారు. 2022లో అప్పటి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణ కనుసన్నల్లో ఇది జరిగింది. 2022 డిసెంబర్ 19న వైఎస్సార్సీపీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే ఇది ఆర్టీసికి చెందిన స్థలమని డిపో మేనేజర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆగ్రహించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మేనేజర్​ను అక్కడి నుంచి బదిలీ చేసింది. పట్టణ ప్రణాళికా విభాగానికి భవన నిర్మాణ ప్లాన్ సమర్పించారేగానీ, ఎలాంటి అనుమతి మంజూరు చేయలేదు. ఐనా నిర్మాణం పూర్తి చేశారు. 

ప్రకాశం జిల్లా ఒంగోలు మినీ బైపాస్‌లో నీటిపారుదల శాఖ కార్యాలయం ఆనుకొని ఉన్న నాలుగున్నర కోట్ల విలువైన ఎకరం 64 సెంట్ల ప్రభుత్వ భూమిలో వైఎస్సార్సీపీ ఆఫీస్‌ కట్టారు. 2023 జులై 31న అనుమతులు తీసుకున్నారు. 2025 జనవరి 21లోగా ప్రారంభించి 2029 నాటికి పూర్తి చేయాలని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అనుమతిచ్చారు. నిర్మాణం ప్రారంభానికి గడువుండగానే వైఎస్సార్సీపీ నాయకులు ఆగమేఘాలపై నిర్మాణం పూర్తి చేశారు.

నెల్లూరులో వెంకటేశ్వరపురంలో రూ.10 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మాణం చేపట్టారు. అనుమతుల్లేకుండానే 90శాతం నిర్మాణం పూర్తి చేశారు. దీనికి ప్రస్తుతం రంగులు వేస్తున్నారు. గతంలో ఈ స్థలాన్ని టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించారు. 

కర్నూలు ఐదు రోడ్ల కూడలిలోని సర్వే నంబర్ 95-2లో ఏపీ ఆగ్రోస్‌కు చెందిన రూ.100 కోట్ల విలువైన ఎకరం 60 సెంట్ల భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మించారు. ఎలాంటి అనుమతులు లేకుండా భవనం పూర్తైంది.

నంద్యాల సమీపంలోని కుందూనది ఒడ్డున జగనన్న కాలనీలో సుమారు 7 కోట్ల విలువైన ఎకరా భూమిని వైఎస్సార్సీపీ కార్యాలయానికి కేటాయించారు. 6 నెలల క్రితం శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పునాదులు పూర్తయ్యాయి. వీటికీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. 

కడపలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సర్వేనంబర్ 424/3 లోని రెండు ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నారు. కడప పట్టణాభివృద్ధి సంస్థ నుంచి అనుమతులు తీసుకోలేదు.

అన్నమయ్య జిల్లా రాయచోటిలో 12కోట్ల విలువైన ఎకరం 61 సెంట్ల ప్రభుత్వ భూమిలో వైకాపా కార్యాలయం నిర్మిస్తున్నారు. దీనికీ ఎలాంటి అనుమతులు లేకపోయినా నిర్మాణం చివరి దశకు చేరింది. 

అనంతపురంలో రూ.45 కోట్ల విలువైన ఎకరం 50 సెంట్ల జలవనరుల శాఖ భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం తుదిదశకు చేరింది. భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవు. తక్షణమే నిర్మాణం ఆపేసి వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడికి అధికారులు నోటీసిచ్చారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శ్రీసత్యసాయి జిల్లాలో 20కోట్ల విలువైన ఎకరంన్నర భూమిలో విమానాశ్రయం ఎదురుగా కార్యాలయం నిర్మిస్తున్నారు. ఇది తుదిమెరుగుల దశలో ఉంది. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. 

తిరుపతి రేణిగుంట విమానాశ్రయ సమీపంలో పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన రూ.14 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. దీనికి రెవెన్యూశాఖతో పాటు తుడా అనుమతులూ లేవు. పరిశ్రమల శాఖ అనుమతి నిరాకరిస్తూ గత అక్టోబర్‌లో పని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినా వాటిని పట్టించుకోకుండా నిర్మాణాలు చేశారు.

చిత్తూరు జిల్లాలో రూ.17కోట్ల విలువైన 2 ఎకరాల్లో అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేశారు. ఇది ఇతరుల ఆధీనంలోని భూమి. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. 

రాష్ట్ర వ్యాప్తంగా రూ.677 కోట్ల విలువైన 42 ఎకరాల 24 సెంట్ల స్థలంలో వైఎస్సార్సీపీ కార్యాలయాలు నిర్మిస్తున్నారు. రాజ ప్రాసాదాలను తలదన్నేలా వీటిని కడుతున్నారు. 

అధికారం అండతో వైఎస్సార్సీపీ ఐదేళ్లుగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినవి ఏమన్నా ఉన్నాయంటే అవి సొంత పార్టీకి చెందిన కార్యాలయాలేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి.