ఏపీ, తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లోకి ఐదుగురు

తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్లో ఐదుగురికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి గెలిచిన BJP MPలు కిషన్ రెడ్డి(సికింద్రాబాద్), బండి సంజయ్ (కరీంనగర్)కు అవకాశం దక్కగా..

ఏపీ నుంచి TDP MPలు రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం), పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు), BJP MP శ్రీనివాస వర్మ(నరసాపురం)లకు చోటు దక్కింది.

అటు రాజమండ్రి నుంచి గెలిచిన BJP ఎంపీ పురందీశ్వరిని స్పీకర్గా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Streetbuzz News

Breaking ; కేంద్ర మంత్రిగా బండి సంజయ్..!

- కిషన్ రెడ్డి , బండి సంజయ్ పేర్లు ఖరారు 

- నేడు ప్రమాణ స్వీకారం 

తెలంగాణలో ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు లభించనున్నాయి. తెలంగాణలో కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పాదయాత్ర కూడా నిర్వహించారు.

కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన బండి సంజయ్ ను ఈసారి కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవాలని ప్రధాని మోదీ నిర్ణయించారు.

తెలంగాణలో మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సమానంగా ఎనిమిది పార్లమెంటు స్థానాలను బీజేపీ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Flash ; నీటి పారుదల శాఖ అధికారులకు షాక్ ..!

- కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లపై ఫోకస్‌

- ఎక్స్‌టెన్షన్‌పై ఉన్న ఆఫీసర్లకు ఉద్వాసన

- ఐఎస్‌డబ్ల్యూఆర్‌కు మళ్లీ స్వతంత్రత

- ప్రభుత్వానికి ప్రతిపాదనలు

- కోడ్‌ ముగిసిన వెంటనే ఉత్తర్వులు

నీటిపారుదల శాఖలో భారీగా బదిలీలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించారు. ఈఈ నుంచి ఈఎన్సీ వరకు అందరినీ బదిలీ చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్‌ సర్కిళ్ల చీఫ్‌ ఇంజినీర్లు విరమణ పొందగా వారిస్థానంలో వేరొకరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎస్‌ఈలు, ఈఈలు విరమణ పొందగా, ఈ నెలాఖరున మరికొందరు విరమణ చేయనున్నారు. ఇరిగేషన్‌శాఖలో కొత్త నియామకాల ప్రక్రియ పూర్తయింది. కోడ్‌ ముగిశాక ఉత్తర్వులిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది.

నేడో రేపో ఉత్తర్వులు !

నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్‌)గా మురళీధర్‌ను తప్పించిన తర్వాత ఈఎన్సీ (అడ్మినిస్ట్రేషన్‌) అనిల్‌కుమార్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అనిల్‌కుమార్‌ను ఈఎన్సీ జనరల్‌గా కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. వాలంతరి (వాటర్‌ అండ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న రమేశ్‌ అకాలమృతితో డ్యామ్‌సేఫ్టీలో ఎస్‌ఈగా ఉన్న మురళీకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన ఈ నెలాఖరున విరమణ పొందనున్నారు.

ఎక్స్‌టెన్షన్లకు ఉద్వాసన !

శాఖలో విరమణ పొందిన కొందరు ఎక్సెటెన్షన్‌పై కొనసాగుతుండటంపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతుండడంతో ఆయా అధికారులకు ఉద్వాసన పలకాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సీడీవో, జనరల్‌, క్వాలిటీ కంట్రోల్‌ ఇలా అన్ని విభాగాల్లో కలిపి 10మందికిపైగా ఇంజినీర్లు ఎక్స్‌టెన్షన్‌పై ఉన్నట్లు తెలుస్తున్నది. అత్యవసరమైతే విరమణపొందిన అనుభవజ్ఞులైన ఇంజినీర్లను కన్సల్టెంట్‌గా నియమించుకొని సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

అంతర్రాష్ట్ర జల మండలి విభాగాన్ని మళ్లీ స్వతంత్రంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 2020లో నీటిపారుదల శాఖ పునర్వవస్థీకరణలో భాగంగా ఈ విభాగాన్ని కూడా ఈఎన్సీ జనరల్‌ కిందకు చేర్చి సీఈ పోస్టును రద్దు చేశారు. ఓంకార్‌సింగ్‌ పదోన్నతి రద్దు!

నీటిపారుదల శాఖ ఎస్‌ఈ ఓంకార్‌సింగ్‌ పదోన్నతిని ప్రభుత్వం రద్దు చేసినట్టు తెలిసింది. ఆయనకు ఇటీవలే ఈఈ నుంచి ఎస్‌ఈగా పూర్తి అదనపుబాధ్యతలు అప్పగించారు. మేడిగడ్డ బరాజ్‌ నిర్మాణ సమయంలో ఓంకార్‌సింగ్‌ ఈఈగా ఉన్నారు. ప్రస్తుతం బరాజ్‌పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో పదోన్నతి కల్పించడంపై విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు సమాచారం.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పక్కడ్బందీ గా నిర్వహించాలి

- వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

జిల్లాలోని ప్రభుత్వ పింగళి మహిళా డిగ్రీ కళాశాలలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాల సూపరిండెంట్లు, అబ్జర్వర్లకు జరిగిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు కలెక్టర్ సంధ్యారాణి తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 9న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను అధికారులు పక్కడ్బందీ గా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు.

జిల్లాలో 17 కేంద్రాల్లో 9168 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని, ప్రతి కేంద్రం సీసీ కెమెరా నిఘాలో ఉంటుందన్నారు. డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, రూట్‌ అధికారులు, ఇన్విజిలెటర్లను నియమించామని, ఈ సారి బయోమెట్రిక్ హాజరు విధానం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.

ఈ నెల 9న ఉదయం 9 గంటల వరకే పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలని పేర్కొన్నారు. ఉదయం 10:30 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. గతంలో జరిగిన అవకతవకల దృష్ట్యా ఏ ఒక్క చిన్న తప్పు కూడా జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 

పరీక్షకు రెండు రోజుల ముందే సెంటర్ల దగ్గర సూచనల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొబైల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రాల్లో అనుమతి లేదని తెలిపారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

పరీక్ష రాసే అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత కేంద్రాల్లోకి అనుమతించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ చంద్రమౌళి, పరీక్ష కేంద్రాల సూపరిండెంట్లు, అబ్జర్వర్లు పాల్గొన్నారు.

రెవెన్యూలోకి వీఆర్వోలు...!

- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ట్రెసా ఆ వినతి

గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో)ను తిరిగి రెవెన్యూశాఖలోకి తీసుకోవాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ట్రెసా) ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తిచేసింది. శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రిని ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కె.నిరంజన్‌రావు, వీఆర్వోల ఐకాస అధ్యక్షుడు గోల్కొండ సతీష్‌ కలిసి పలు సమస్యలను వివరించారు.

‘ప్రస్తుతం క్షేత్రస్థాయి విధులకు సిబ్బంది అవసరం ఎంతో ఉంది. ఇటీవలి ఎన్నికల్లో వీఆర్వోలు, వీఆర్‌ఏలు లేక నిర్వహణ పరంగా అనేక ఇబ్బందులు తలెత్తాయి. వీఆర్వోలను తిరిగి తీసుకోవడం ద్వారా శాఖ బలోపేతమవుతుంది.

వారికి కారుణ్య నియామకాలు, సొంత జిల్లాలకు బదిలీ, శాఖలో చేరేందుకు ఐచ్ఛికాలు కల్పించాలి. ఎన్నికల సందర్భంగా బదిలీచేసిన తహసిల్దార్లు, డిప్యూటీ తహసిల్దార్ల తిరుగు బదిలీలు చేపట్టాలి’ అని వారు కోరారు.

మంత్రి స్పందిస్తూ త్వరలోనే తిరుగు బదిలీలు పూర్తి చేస్తామని, వీఆర్‌ఏ, వీఆర్వోల సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. 

నేడే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌..!

- అరగంట ముందు వస్తేనే అనుమతి: టీజీపీఎస్సీ

- హాజరు కానున్న 4.03 లక్షల మంది

- రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాలు

- అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను ఆదివారం నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. సుమారు 4.03లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఈ మేరకు టీజీపీఎస్సీ పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్ష జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

10 గంటల తర్వాత ఆయా కేంద్రాల ప్రధాన గేట్‌ను మూసి వేస్తారని, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలకా్ట్రనిక్‌ పరికరాలు గానీ, వస్తువులను గానీ అనుమతించబోమని పేర్కొన్నారు.

పరీక్షకు చెప్పులు మాత్రమే ధరించి రావాలని, బూట్లు వేసుకుని రావద్దని, ఉదయం 9.30గంటల నుంచే బయోమెట్రిక్‌ హాజరు తీసుకుంటామని చెప్పారు. కాగా, బయోమెట్రిక్‌ హాజరు నమోదు కోసం శిక్షణ పొందిన ఇన్విజిలేటర్లను నియమించారు. అన్ని పరీక్ష కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూంల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించేందుకు ప్రతీ 20 పరీక్ష కేంద్రాలకు ఒక రీజనల్‌ కోఆర్డినేటర్లను, పరీక్ష కేంద్రం వద్ద హాల్‌ టికెట్లు, గుర్తింపు పత్రాలు పరిశీలనకు ప్రతీ 100 మందికి ఒక అధికారిని నియమించారు.

ప్రతి పరీక్ష కేంద్రంలో సిట్టింగ్‌ స్క్వాడ్‌, 3-5 కేంద్రాలకు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. కాగా, అభ్యర్థుల సౌకర్యార్థం వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు వెళ్లే అభ్యర్థుల కోసం శనివారం నుంచే ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ పాయింట్ల నుంచి బస్సులు నడుతుపుతున్నామని తెలిపారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌ వచ్చే అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల సమాచారం అందించే ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు సీఎం రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సమయానికి కేంద్రానికి చేరుకుని, ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్ష రాయాలని సూచించారు.

చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది.

ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు..

ఇందుకోసం గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీపార్క్ వద్ద వేదిక సిద్ధమవుతోంది..

Streetbuzz News

కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంటికి చంద్రబాబు

– జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ పక్ష నేతలంతా భేటీ కావాలని నిర్ణయం 

– మంత్రివర్గ కూర్పుపై సమాలోచన చేయనున్న ఎన్డీఏ పక్ష నేతలు 

– ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు ఇవ్వాల్సిన మంత్రి పదవులపై చర్చించే అవకాశం

Streetbuzz News

ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్ ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్..19 వేల ఆధిక్యంలో మల్లన్న

నల్గొండ: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. తొలి ప్రాధాన్య ఓట్లలో అధికార కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు, ప్రతిపక్ష భారాసకు చెందిన ఏనుగుల రాకేశ్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు..

రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకూ 42 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. 42 మంది అభ్యర్థుల్లో కాంగ్రెస్, భారాస అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు షేర్ అవుతున్నాయి.

రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఇలా..

కాంగ్రెస్ (తీన్మార్ మల్లన్న): 1,23,368

భారాస (రాకేశ్‌ రెడ్డి): 1,04,630

భాజపా (గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి): 43,541

స్వతంత్ర అభ్యర్థి (అశోక్): 29,844

గెలుపు కోటాకు 31,727 ఓట్ల దూరంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉండగా..విజయానికి 50,465 ఓట్ల దూరంలో భారాస అభ్యర్ధి ఉన్నారు.

అశోక్ ఎలిమినేషన్ ప్రారంభం

స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ ఎలిమినేషన్ రౌండ్ ప్రారంభమైంది. అశోక్ కుమార్ నుంచి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను పైన మిగిలిన కాంగ్రెస్, భారాస, భాజపా అభ్యర్థులకు బదిలీ చేస్తున్నారు. అశోక్ ఎలిమినేషన్ తర్వాత ఇదే తరహాలో భాజపా అభ్యర్థి ఎలిమినేషన్ ప్రక్రియ జరగనుంది. సాయంత్రం కౌంటింగ్ ముగిసే అవకాశం ఉంది.

పవన్ అంటే వ్యక్తి కాదు.. తుఫాను జనసేన అధినేతను కొనియాడిన మోదీ

దిల్లీ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కాదు తుపాను అని ప్రత్యేకంగా అభినందించారు..

దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన సందర్భంగా ఏపీ నేతలను కొనియాడారు..

ఈ రోజు పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీయే ఎంపీల సమావేశం జరిగింది. కూటమి లోక్‌సభా పక్షనేతగా మోదీ పేరును భాజపా నేతలు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ ప్రతిపాదించారు.

భాగస్వామ్య పార్టీలు దీనికి మద్దతు పలుకుతూ మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించాయి.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఏపీలో దక్కిన విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందన్నారు. చంద్రబాబుతో కలిసి చరిత్రాత్మక విజయం సాధించామన్న ఆయన..ఆ సమావేశంలోనే ఉన్న పవన్‌ను అభినందించారు..