కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంటికి చంద్రబాబు
– జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ పక్ష నేతలంతా భేటీ కావాలని నిర్ణయం
– మంత్రివర్గ కూర్పుపై సమాలోచన చేయనున్న ఎన్డీఏ పక్ష నేతలు
– ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు ఇవ్వాల్సిన మంత్రి పదవులపై చర్చించే అవకాశం
Streetbuzz News
ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్ ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్..19 వేల ఆధిక్యంలో మల్లన్న
నల్గొండ: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. తొలి ప్రాధాన్య ఓట్లలో అధికార కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు, ప్రతిపక్ష భారాసకు చెందిన ఏనుగుల రాకేశ్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు..
రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకూ 42 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. 42 మంది అభ్యర్థుల్లో కాంగ్రెస్, భారాస అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు షేర్ అవుతున్నాయి.
రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఇలా..
కాంగ్రెస్ (తీన్మార్ మల్లన్న): 1,23,368
భారాస (రాకేశ్ రెడ్డి): 1,04,630
భాజపా (గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి): 43,541
స్వతంత్ర అభ్యర్థి (అశోక్): 29,844
గెలుపు కోటాకు 31,727 ఓట్ల దూరంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉండగా..విజయానికి 50,465 ఓట్ల దూరంలో భారాస అభ్యర్ధి ఉన్నారు.
అశోక్ ఎలిమినేషన్ ప్రారంభం
స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ ఎలిమినేషన్ రౌండ్ ప్రారంభమైంది. అశోక్ కుమార్ నుంచి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను పైన మిగిలిన కాంగ్రెస్, భారాస, భాజపా అభ్యర్థులకు బదిలీ చేస్తున్నారు. అశోక్ ఎలిమినేషన్ తర్వాత ఇదే తరహాలో భాజపా అభ్యర్థి ఎలిమినేషన్ ప్రక్రియ జరగనుంది. సాయంత్రం కౌంటింగ్ ముగిసే అవకాశం ఉంది.
పవన్ అంటే వ్యక్తి కాదు.. తుఫాను జనసేన అధినేతను కొనియాడిన మోదీ
దిల్లీ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కాదు తుపాను అని ప్రత్యేకంగా అభినందించారు..
దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన సందర్భంగా ఏపీ నేతలను కొనియాడారు..
ఈ రోజు పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీయే ఎంపీల సమావేశం జరిగింది. కూటమి లోక్‌సభా పక్షనేతగా మోదీ పేరును భాజపా నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు.
భాగస్వామ్య పార్టీలు దీనికి మద్దతు పలుకుతూ మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించాయి.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఏపీలో దక్కిన విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందన్నారు. చంద్రబాబుతో కలిసి చరిత్రాత్మక విజయం సాధించామన్న ఆయన..ఆ సమావేశంలోనే ఉన్న పవన్‌ను అభినందించారు..
సీఎంవోలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ
అమరావతి: సీఎంవోలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు..
పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తా ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరో వైపు నూతన సీఎస్‌గా నియమితులైన నీరభ్ కుమార్ ప్రసాద్ సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో బాధ్యతలు చేపట్టారు..
Streetbuzz News
దేశమంతా ఒకటే హైప్ .. పవన్ కళ్యాణ్ !
- ఎన్నికల్లో గెలిచాక తొలిసారి చిరంజీవి ఇంటికి పవన్
- కుటుంబ సభ్యులందరి నుంచి అపూర్వ రీతిలో స్వాగతం
- భారీ పూలమాల మెడలో వేసి ముద్దాడిన మెగాస్టార్
- తల్లి, అన్నా, వదినలకు జన సేనాని పాదాభివందనం
అచ్చమైన ఆప్యాయత పూల వర్షమై కురుస్తుండగా.. స్వచ్ఛమైన ప్రేమానురాగాలు నిండిన గుండెల నడుమ.. గౌరవాభిమానాలు పాదాభివందనాలుగా మారిపోయాయి..! హర్షాతిరేకంతో ఆలింగనాలు వెల్లువెత్తగా.. భావోద్వేగాలతో కళ్లు చెమర్చాయి..! జగమంత కుటుంబం నాది అంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కదంతొక్కి ఘన విజయం అందుకున్న జన సేనాని పవన్ కల్యాణ్‌కు సొంత కుటుంబ సభ్యుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది.
ఢిల్లీలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో సాగిన ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న అనంతరం పవన్ కల్యాణ్ గురువారం తొలి సారిగా హైదరాబాద్‌లోని తన పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చారు. దీంతో యావత్ మెగా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. భార్య అన్నా లెజ్‌నోవా, కుమారుడు అకీరా నందన్‌తో కలిసి వచ్చిన పవన్‌ను కారు దిగిన వెంటనే అన్న కుమారులు, హీరోలు రాంచరణ్, వరుణ్‌తేజ్ కౌగిలించుకుని సాదరంగా ఆహ్వానించారు. వదిన సురేఖ చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకువచ్చి వీరతిలకం దిద్దారు. అమ్మ అంజనాదేవి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అక్కచెల్లెలు హారతిచ్చిన అనంతరం.. బయటకు వచ్చిన చిరంజీవికి పవన్ చెప్పులు విడిచి మరీ పాదాభివందనం చేశారు.
చిన్న తమ్ముడిని గట్టిగా హత్తుకుని చిరు ముద్దాడి.. భారీ పూలమాలను మెడలో వేశారు. ఈ దృశ్యం చూసి సోదరుడు నాగబాబు భావోద్వేగంతో కంటతడి పెట్టారు. తల్లిదండ్రుల సమక్షంలో బాబాయ్ పవన్‌కు పుష్పగుచ్ఛం అందించిన రాంచరణ్ పాదాభివందనం చేశారు. ఇంతలో ఆయన భార్య ఉపాసన రావడంతో అందరూ కలిసి గ్రూప్ ఫొటోకు పోజిచ్చారు. నాగబాబు, ఆయన భార్య, కుమారుడు వరుణ్‌తేజ్, ఆయన భార్య లావణ్య త్రిపాఠిలూ పవన్ దంపతులకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ‘‘డియర్ కల్యాణ్ బాబు హ్యాట్సాఫ్’’ అని రాసి ఉన్న కేక్‌ను అమ్మ, వదినలతో కలిసి పవన్ కట్ చేశారు.
పవన్-లెజ్‌నోవాలకు చిరంజీవి దంపతులు కొత్త దుస్తులు పెట్టారు. ఈ కార్యక్రమం అనంతరం పవన్ అమ్మ అంజనాదేవి, వదిన సురేఖకు పాదాభివందనం చేశారు. వేడుకలో నిర్మాత అల్లు అరవింద్, ఆయన కుమారుడు, హీరో అల్లు అర్జున్ మాత్రం కనిపించలేదు. మరోవైపు అకీరా నందన్ తండ్రిపై రూపొందించిన ఓ వీడియోను రేణూదేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పవన్ నటించిన చిత్రాల్లోని పవర్‌ఫుల్ డైలాగ్‌లు, యాక్షన్ స్టిల్స్‌ను వాడుతూ దివంగత మైకేల్ జాక్సన్ పాట ‘దే డోంట్ కేర్ అబౌట్ అజ్’ను బ్యాక్ గ్రౌండ్‌లో ఉపయోగించారు. ఈ వీడియోను పవన్ అభిమానులు షేర్ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందే దీనిని అకీరా ఎడిట్ చేశారని రేణూదేశాయ్ తెలిపారు.
భారీగా నమోదైన చెల్లని ఓట్లు !
నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. నాలుగు రౌండ్ల తర్వాత ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.
కాంగ్రెస్ - 1,22,813 (తీన్మార్ మల్లన్న), బీఆర్ఎస్ - 1,04,248 (ఏనుగుల రాకేష్ రెడ్డి), బీజేపీ - 43,313 (గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి), అశోక్ పాల్కూరి - 29,697 (స్వతంత్ర అభ్యర్థి) ఓట్లు పోలయ్యాయి. తీర్మాన్ మల్లన్న 18,565 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు.
మూడో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్నకు లక్షకు పైగా ఓట్లు పోలయ్యాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 87356 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 34516 ఓట్లతో మూడో స్థానంలో, స్వతంత్ర అభ్యర్థి అశోక్ 27,493 ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.
నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. రెండు రౌండ్ల తర్వాత లక్షా 92 వేల మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. మొదటి రౌండ్‌తో పోల్చుకుంటే రెండవ రౌండ్‌లో తీన్మార్ మల్లన్నకు మెజారిటీ కాస్త తగ్గింది. రెండు రౌండ్లు ముగిసే సరికి మల్లన్న 14,672 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.
నేడు సాయంత్రంలోగా ఫలితాలు విడుదలకు సిద్ధం చేశారు.
కేసిఆర్ దుకాణం బంద్ ...!
- కాంగ్రెస్ పార్టీ పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది
- వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఖాయం
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వాఖ్యలుస్క్
బీఆర్‌ఎస్ కథ ముగిసిందని, కాంగ్రె్‌సపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కిషన్ రెడ్డి తెలిపారు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయంగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. గురువారం ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఎన్నో అరాచకాలకు పాల్పడిందని, ఫలితంగా ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 14 చోట్ల మూడో స్థానానికి పరిమితమైందని, ఎనిమిది చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని తెలిపారు.
బీఆర్‌ఎస్ అధినేత, పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లోనూ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచారని చెప్పారు.గజ్వేల్, సిద్దిపేట, మెదక్‌లో బీఆర్‌ఎస్ రూ.వందల కోట్లు పంచిపెట్టినా ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని అన్నారు. పదేళ్లలో రూ.పది లక్షల కోట్లతో తెలంగాణలో అభివృద్ధి చేశామని.. అందువల్లే ప్రజలు ఎనిమిది సీట్లలో బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. మరో ఆరు చోట్ల రెండో స్థానంలో నిలిచామని, బలమైన ప్రత్యామ్నాయంగా మారామని చెప్పారు. కాంగ్రెస్ ఆరు నెలల పాలనపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, అందుకే ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు తగ్గాయని పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌తో పాటు ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారని తెలిపారు. పసుపు బోర్డు విషయంలో ఎన్నో విమర్శలు చేసినా.. ప్రజలు అర్వింద్‌ను గెలిపించారని చెప్పారు. ఏపీలో ప్రజల తీర్పు హర్షణీయమని అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కిషన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు !
వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై పోల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం రాత్రి పూర్తయ్యింది.
ఆ ఓట్లలో ఫలితం తేలలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం వరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది.
ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరగడం లేదని మండిపడింది. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఆరోపించారు. ఏజెంట్ల సంతకాలు లేకుండా ఫలితాలు ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదేంటని నిలదీస్తే బెదిరిస్తున్నారని రాకేశ్ రెడ్డి తెలిపారు.
హాల్-4లో 539 ఓట్ల మెజార్టీతో తాను ఉన్నానని రాకేశ్ రెడ్డి వివరించారు. అధికారులు మాత్రం తీన్మార్ మల్లన్నకు లీడ్ ఇచ్చారని వెల్లడించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. మూడో రౌండ్‌లో తీన్మార్ మల్లన్న 3 వేల ఓట్ల లీడ్ సాధించారు. మూడు రౌండ్లు కలిపితే 17 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
నేషనల్ రేంజర్ అంబాసిడర్ గా కొణిదెల ఉపాసన నియామకం
అపోలో హాస్పిటల్స్ ట్రస్ట్ తో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా ఒప్పందం
అటవీశాఖ సిబ్బందికి అపోలో ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం
నేషనల్ రేంజర్ అంబాసిడర్ గా ఉపాసన నియామకం
నాలుగేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్న ఉపాసన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అర్ధాంగి కొణిదెల ఉపాసనను ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణులు సంరక్షణ కోసం పాటుపడే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచుర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇండియా విభాగానికి నేషనల్ రేంజర్ అంబాసిడర్ గా నియమించారు.
ఆమె నాలుగేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ఈ మేరకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా విభాగం, అపోలో హాస్పిటల్స్ చారిటబుల్ ట్రస్ట్ (ఏహెచ్ సీటీ) మధ్య ఒప్పందం కుదిరింది.
అపోలో హాస్పిటల్స్ సామాజిక సేవా కార్యక్రమాల విభాగానికి ఉపాసన వైస్ చైర్ పర్సన్ గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, తాజా ఒప్పందం నేపథ్యంలో, దేశంలో ఎక్కడైనా పులుల సంరక్షణ కేంద్రాల్లోనూ, వన్యప్రాణి రక్షిత ప్రాంతాల్లోనూ గాయపడిన అటవీశాఖ సిబ్బందికి అపోలో ఆసుపత్రుల్లో నాణ్యమైన చికిత్స అందిస్తారు.
దీనిపై ఉపాసన మాట్లాడుతూ, అటవీ సిబ్బంది అజ్ఞాత వీరులు వంటి వారని, సహజసిద్ధ జంతు ఆవాసాలను, అటవీప్రాంతాలను కాపాడడంలో వారు అలుపన్నది లేకుండా పనిచేస్తుంటారని కొనియాడారు. వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని, అందుకోసం తాము కట్టుబడి ఉన్నామని ఉపాసన స్పష్టం చేశారు.
కాగా, అటవీశాఖ సిబ్బందికి మాత్రమే కాకుండా, జంతువుల దాడిలో గాయపడిన స్థానిక వన్యప్రాణి సంరక్షణ సంఘాల సభ్యులకు కూడా చికిత్స అందించనున్నారు.
Jun 07 2024, 20:12