భద్రాచలం: చర్ల: ఏ పార్టీ గెలిచిన ఓడేది ప్రజలే: ముసలి సతీష్(PYL)
ఏ పార్టీ గెలిచినా ఓడేది ప్రజలే!
ముసలి సతీష్
ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ పోతుంది? దేనికి ఎన్ని సీట్లు? ఎన్ని? ఇన్నా? అన్నా? అన్నేనా? చర్చలు! చర్చలు! వాదాలు! కాలక్షేపపు వాదాలు! ఎన్ని చేసినా పార్టీల సమర్ధకులైతే ఫరవాలేదు! కానీ, మేధావులు! ఆలోచనాపరులు! పత్రికల్లో! టీవీల్లో! ఎన్నికల ఫలితాలకోసం రాత్రింబవళ్ళూ కబుర్లు! ఏ పార్టీ? ఏ పార్టీ? శ్రమ దోపిడీనే లక్ష్యంగా పెట్టుకున్న పార్టీల్లో ఏదో ఒక పార్టీ కోసం వెతుకులాటా, నిరీక్షణా!
ఇప్పుడున్న ఎన్నికల తంతునీ, అమలులో వున్న రాజ్యాంగాన్నీ, చలామణీలో వున్న ప్రజాస్వామ్యాన్నీ మేధావులు కూడా పసిపిల్లలకన్నా అమాయకంగా నమ్ముతూ అంచనాలు కడుతున్నారు. ఈ మేధావులు, ప్రజలకు మేలు చేసే పార్టీ ప్రభుత్వం వస్తే బాగుండునని కోరుకుంటారు. తక్షణ ఉపశమనం గురించి మాత్రమే ఆలోచించే అల్పసంతోషులైన వీరు, శ్రమ దోపిడీ విషయాలను కనీసంగా కూడా ఎత్తరు. ఉన్న పరిస్తితుల్లో, ఎప్పటికప్పుడు తక్షణ ఉపశమనాల గురించే ఆలోచిస్తే, దీర్ఘకాలిక పరిష్కారం గురించి ఎప్పుడు? ‘శరీరంలో పెద్ద జబ్బు యేదో వున్నా, తలనొప్పిని పట్టించుకోకూడదా?’ అంటారు. నిజమే. తాత్కాలిక సమస్యల్ని కూడా పట్టించుకుంటేనే ఒక అడుగు ముందుకు వెయ్యగలం. అయితే, అసలు జబ్బు సంగతి ఎప్పుడు? తల నొప్పీ, ఈ నొప్పీ, ఆ నొప్పీ రావడం అసలు జబ్బువల్లే అయితే, జబ్బుతో సంబంధం లేకుండా చిన్న నొప్పులు రాకుండా చూడడం సాధ్యమేనా? ‘శ్రమ దోపిడీ’ అనే జబ్బువేపు ఎప్పుడు చూస్తారు? అది సాధారణ ప్రజలకు తెలీదు. మేధావులకీ తెలీదా? దాని గురించి ప్రజలకు ఎప్పుడు తెలుపుతారు?
ప్రజానుకూల మేధావులకు దురుద్దేశాలను ఆపాదించలేము. కానీ, ఆ విషయాల్ని పైపైనే చూసే, రాసే రాతలూ, ఎన్నికల్లో సీట్ల సంఖ్యలూ, ప్రజల్ని భ్రమల్లోనే వుంచుతాయి. మేధావులు కూడా భ్రమల్లో ఉండడానికే అలవాటై పోతున్నారా? ఎన్నికల్లో నిలబడ్డ పార్టీల్ని, అధికారంలో వున్నా, లేకపోయినా, ప్రతీ ఒక్క పార్టీనీ వేరు వేరు స్వభావాలతో, వేరు వేరు లక్ష్యాలతో వున్నదాన్నిగా, ఈ మేధావులు భావిస్తారు. ఆ భావనలు నిజం కావని ఆ పార్టీలు అమలు చేసే విధానాల్ని బట్టి తెలిసిపోతుంది. ‘ప్రైవేటీకరణ’ విధానాన్ని ప్రతీ పార్టీ అమలు చేస్తుంది, కాకపోతే, కొన్ని హెచ్చు తగ్గులతో! ఉద్యోగ భద్రత పోయి, ప్రైవేటు యజమానుల దయాదాక్షిణ్యాల మీద బతికే జీవితాన్నే ఇస్తాయి పార్టీలు. అలాగే, ‘సరళీకరణ’ పేరుతో ఏమి చేస్తారో చూడండి: వాతావరణ కాలుష్యం జరగరాదనే దృష్టి గానీ, పని పరిస్తితుల్లో కార్మికుల భద్రతకు అవసరమైన ఏర్పాట్లు వుండాలనే దృష్టిగానీ, ఏదీ లేకుండా, పరిశ్రమలకు తేలిగ్గా (సరళంగా) అనుమతులిచ్చేసే పార్టీలే కదా ఇవి! పైగా, దోపిడీదారులకే భూముల్ని అడ్డగోలుగా నామమాత్రపు ధరలకు ఇవ్వడాలూ, కరెంటూ–నీళ్ళూ ఉచితంగానో, చవగ్గానో ఇవ్వడాలూ! ‘ప్రపంచీకరణ’ పేరుతో, విదేశీ కంపెనీలకు ఇక్కడి తలుపులూ, కిటికీలూ తెరిచి పెట్టడం! ఈ విధానాల్ని తిరస్కరించే పార్టీ ఒక్కటైనా వుంటుందా?
‘స్వతంత్రం! స్వతంత్రం వచ్చేసింది! పోరాడి సాధించాం’– అంటారు! నిరుద్యోగ సమస్యకి పరిష్కారాన్ని సాధించారా? 75 ఏళ్ళగా వుంటూనే వుందే! ఏ సమస్యకైనా, ఏ దరిద్రానికైనా కారణం, శ్రమ దోపిడీని పెద్ద స్తాయిలో నడిపించే ‘పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానమే’ అని గ్రహించలేరా మన ప్రజానుకూల మేధావులు? గ్రహించినా ప్రజలకు తెలపలేరా? ధరల పెరుగుదలకు కారణమేమిటో గ్రహించినా బైటపెట్టలేరా? తిండీ, బట్టా, నివాసమూ, విద్యా, వైద్యమూ అనే కనీస అవసరాల్ని తీర్చని విషయంలో పార్టీల మధ్య ఏమిటి తేడా? దేశంలో కలిమి అంతా ఒక వర్గం దగ్గిరా, లేమి అంతా ఇంకో వర్గం దగ్గిరా పోగుపడడానికి ఈ పార్టీలు కారణమని మేధావులకి తెలీదా? కోటి రూపాయలతో కార్లు కొనేవాళ్ళు ఒక వేపూ, పొట్టకూటికోసం ప్రాణాలకి తెగించి డ్రయినేజీ గోతుల్ని శుభ్రం చేసేవాళ్ళు ఇంకోవేపూ వుండడానికి ఈ పార్టీలు కారణం కాదా?
‘రాజ్యాంగాన్ని రక్షించాలి!’ అంటారు. అసలు రాజ్యాంగమే అనేక అసమానతలకి మూలం. ఇతరుల శ్రమని దోచి, లాభాలూ, వడ్డీలూ, కౌళ్ళూ అనే ఆదాయాలకు వీలునిచ్చే ఆస్తి హక్కుల్ని ఇస్తుంది. కొందరు పౌరులు, జీవితాంతమూ అట్టడుగు శారీరక శ్రమలే చేసే వారిగానూ, కొందరు పౌరులు ఎప్పుడూ మేధా శ్రమలే చేసే వారిగానూ వుండే అసమాన శ్రమ విభజనను నిలిపివుంచుతుంది. ఇలాంటి రాజ్యాంగాన్ని రక్షించమని శ్రామిక ప్రజలకు బోధించి ప్రయోజనం లేదు. నామమాత్రమైన హక్కుల్ని కూడా లేకుండా చేసే పార్టీని గెలిపించవద్దంటారు మేధావులు. కానీ, ఉన్న అన్ని పార్టీలూ, అధికారంలో వున్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తించేవే.
‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది’ అంటారు. అసలు ఉన్న ప్రజాస్వామ్యమే కొద్దిమంది అనుభవించే ప్రజాస్వామ్యం అని ఈ మేధావులకి తెలియదా? ఓటు హక్కు ఇచ్చి, ప్రజాస్వామ్యంలో ప్రజలే స్వాములు అని భ్రమింపజేస్తే ఎలా? జీవితావసరాలూ, వాటి తయారీకి కావలసిన ఉత్పత్తి సాధనాలూ ఒక వర్గానికి రిజర్వ్ అయివుండగా, మిగతా కోట్ల మంది మొహాన ‘రిజర్వేషన్లు’ అనే మెతుకులు విసిరితే, ఆర్థిక రంగంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా? దుర్మార్గమైన నిర్బంధ చట్టాల్ని దుర్వినియోగం చేసే ప్రభుత్వం వద్దంటారు. శతృ వర్గాలున్న సమాజంలో, ఏ పార్టీ ప్రభుత్వం అయినా ఆ నిర్బంధ చట్టాలు లేకుండా పాలించలేదు. 75 ఏళ్ళ చరిత్రలో ఈ పార్టీలు, ఎన్నో నిర్బంధ చట్టాలను కొత్తగా తయారు చేయడమో, ఉన్నవాటిని మరింత కఠినం చేయడమో చూడవచ్చును.
అన్ని రంగాలలోనూ అసమానతలున్న ఈ సమాజంలో ఎన్నికలు అనేవి, ‘‘పాలకవర్గం లోని ఒక ముఠా చేతుల్లోనించీ ఇంకో ముఠా చేతుల్లోకి బదిలీ చేసే సాధనంగా వుంటున్నది’’ అని ఈ ప్రజానుకూల మేధావులు గుర్తించి, ప్రజలకు చెప్పకపోతే ఎలాగ? ఎప్పుడో 155 ఏళ్ళ కిందటే, మార్క్సు అనే మేధావి గుర్తించిన విషయాన్ని, మనం 75 ఏళ్ళ అనుభవంలో చూడలేదా? (‘‘సార్వత్రిక ఓటింగు ఎటువంటిదిగా వుంటుందంటే, కొన్ని సంవత్సరాలకు ఒక మారు పార్లమెంటరీ వర్గ పాలన కోసం అనుమతిని మంజూరు చెయ్యడానికి మాత్రమే ఉపయోగపడుతూ వుంటుంది.’’ –మార్క్స్.) ఎన్నికలు ‘‘పాలక వర్గాల చేతిలో ఒక ఆటబొమ్మగా దుర్వినియోగం’’ అవుతున్న విషయం, ఎన్నికలు జరుగుతున్న తీరులోనే కనపడుతున్నది గదా? డబ్బూ, కులం, మతం, ఉచితాల పేరుతో పడేసే ముష్టి పధకాలూ ఉపయోగించి పార్టీలు అధికారంలోకి రావడానికే గదా ఈ ఎన్నికలు? ఎన్నికలకూ, పార్టీలకూ, వాటి విధానాలకూ సంబంధించిన నిజాల్ని ప్రజలకు వివరించే రాతలూ, చర్చలూ అవసరం. అంతేగానీ, ఈ పార్టీ గెలిస్తే ఏమి జరుగుతుందీ, ఆ పార్టీ వస్తే ఏమి జరుగుతుందీ అనే రాతలూ, చర్చలూ కాలక్షేపం కబుర్లుగా మిగిలిపోతాయి.
సరైన రాజకీయ జ్ఞానం అందకపోతే, ప్రతీ ఎన్నికలోనూ ఓడిపోయేది ప్రజలే కదా?
ముసలి సతీష్
Jun 06 2024, 10:30