అక్రిడిటేషన్ అనేది రాయితీ కార్డు మాత్రమే* *-జర్నలిస్టులని గుర్తించే పట్టా కానే కాదు* *-నిజాలు రాసేవారంతా జర్నలిస్టులే*
అక్రిడిటేషన్ అనేది రాయితీ కార్డు మాత్రమే
-జర్నలిస్టులని గుర్తించే పట్టా కానే కాదు
-నిజాలు రాసేవారంతా జర్నలిస్టులే
-చిన్నపెద్ద అనేది సిండికేట్ల సృష్టే
-జర్నలిస్టు ఔనో కాదో తేల్చాల్సింది పత్రిక ఎడిటర్లు మాత్రమే "ఖాకీలు" కాదు.
-డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు:మనసాని కృష్ణారెడ్డి.
హైదరాబాద్:
ఫిబ్రవరి 17 ఫోర్త్ ఎస్టేట్‌గా పిలవబడే మీడియా ప్రజాస్వామ్యానికి కావలిగా ఉండటంలో తనకు మరే వ్యవస్థ సాటిరాదని పలుమార్లు నిరూపించింది. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియా బాధ్యతలు అనేక రకాలుగా రానురాను విస్తరించాయి. ప్రజలకు సమాచారాన్ని చేరవేసే క్రమం నుంచి పాత్రికేయ వృత్తి అనేక రంగాలుగా విస్తరించింది. ప్రజలకు సమాచారాన్ని చేరవేసే క్రమంలో జర్నలిస్టులకు ఉపయుక్తంగా ఉంటుందని వారి సౌకర్యార్థం ప్రజా రవాణాలో ఉచిత ప్రయాణ సౌకర్యంతోపాటు మరి కొన్ని రకాల రాయితీలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అక్రిడిటేషన్‌లు ప్రవేశపెట్టిందని డెమొక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మనసాని కృష్ణారెడ్డి అన్నారు. రానురాను పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించేవారి సంఖ్య ప్రతి యేడు పెరుగుతూపోతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చే అక్రిడిటేషన్ల జారీకి అనేక మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అదేవిధంగా జర్నలిస్టు సంఘాల కృషితోనో లేక ఓటు బ్యాంకు రాజకీయాలతోనే రానురాను మేం అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్‌లు ఇస్తామని ప్రభుత్వాలు ప్రకటించడంతో అక్రిడిటేషన్లకు బాగా గిరాకీ పెరిగింది. కొందరు నాన్ జర్నలిస్టులు కూడా డబుల్‌బెడ్‌రూంల ఆశతో అక్రిడిటేషన్లని అంగట్లో కొనుక్కుని రిపోర్టర్లుగా చెలామణీ అవుతున్నారనే ఆరోపణలున్నాయి. అంటే కేవలం బస్‌పాస్‌గా ఉన్న అక్రిడిటేషన్‌ని ఈ పాలకులే డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని ప్రకటించడంతో అక్రిడిటేషన్ యూనివర్సిటి పట్టా కన్నా ఎక్కువగా మారింది. అంటే అక్రిడిటేషన్ ఉంటేనే జర్నలిస్టు లేదంటే నకిలీ అనే ప్రచారాన్ని ముమ్మరం చేయడం వెనక కుట్ర ఉంది. తమ మాట వినేవారిని, విననివారిని కూడా తమ దారికి తెచ్చుకోవడానికి అక్రిడిటేషన్ అనేది ఓ కంచెలా పనిచేస్తోంది. గొర్రెల మందని ఓ కంచెలో తోలినట్లుగా ఈ అక్రిడిటేషన్ అనే కంచెతో జర్నలిస్టులందరినీ తమ గుప్పిట్లో పెట్టుకోవాలని అటు పాలకులు ఇటు కొందరు జర్నలిస్టు యూనియన్ల ముసుగులో ఉన్న తాబేదార్లు ఇన్నాళ్లూ చేస్తూ వచ్చారు. అయితే రానురాను డిజిటల్ మీడియా ప్రాధాన్యత పెరిగి ప్రజల్లో మంచి ఆదరణ ఉండటంతో జర్నలిజంలో పోటీ ఏర్పడిరది. ఎక్కడ తమకు ఆదరణ దక్కకుండా పోతుందనో లేక తమ మాట వినకుండా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో కారణంతో అటు పాలకులు, ఇటు కొందరు సిండికేట్ జర్నలిస్టులు ఈ క్రమంలో డిజిటల్ మీడియా మీద విషం కక్కుతూ వస్తున్నారు. అయితే డిజిటల్ మీడియా వేదికలో కొందరు జర్నలిజం ముసుగేసుకున్న వ్యక్తులు జర్నలిజం కట్టుబాట్లను, విలువలను తుంగలో తొక్కి విశృంఖలంగా ప్రవర్తిస్తున్నారు. గౌరవ స్థానంలో ఉన్న వ్యక్తులు, పార్టీల నేతలపై నిత్యం సామాజిక మాధ్యమాల వాడకూడని భాషను వాడుతూ తప్పుడు ప్రచారం చేస్తూ పాత్రికేయ వృత్తికి తీరని మచ్చను తెచ్చిపెడుతున్నారు. ఇలాంటి వ్యవహారాన్ని ఉపేక్షించరాదు. అయితే ఇలాంటి కొందరు సూడో జర్నలిస్టులు చేసే పనికి మొత్తం పాత్రికేయ వృత్తినే అగౌరపరుస్తూ పాలకులు, అధికారుల వ్యవహరించడం తగదు. అక్రిడిటేషన్ ఉంటేనే జర్నలిస్టని అక్రిడిటేషన్ లేకుండా ఫీల్డ్ వర్క్ చేసే పాత్రికేయులుపై చర్యలు తీసుకుంటామని కొందరు అధికారులు, ఖాకీలు చెప్పడం విచిత్ర పరిణామమే కాదు పూర్తిగా ఖండిరచాల్సిన వ్యవహారమే. ఓ పత్రికకు లేదా మీడియాకు ఎవరు రిపోర్టర్లుగా ఉండాలనేది నిర్ణయించేది ఆ పత్రిక ఎడిటర్ లేక యాజమాన్యమే. అంతే తప్ప మరే వ్యక్తో వ్యవస్థో, అధికారికో జర్నలిస్టులను గుర్తించే హక్కు లేదు. ఎవరు జర్నలిస్టు? ఎవరు నకిలీ? అనే ప్రశ్న వేయాల్సి వస్తే ప్రజాపక్షాన నిజాలు రాసేవారంతా పాత్రికేయులే. సామాజిక స్పృహ ఉండి ప్రజాసమస్యల మీద స్పందించి కలం పట్టి ఉన్నది ఉన్నట్లుగా సమాజానికి చూపేవారంతా ముమ్మాటికీ నిఖార్సయిన పాత్రికేయులే. ఇలాంటివారికి అక్రిడిటేషన్‌తో సంబంధం లేదు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు తీసుకుంటే ఎక్కడ తమ రాతల్లో పక్షపాతానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అక్రిడిటేషన్‌కి దరఖాస్తు చేయని ఎందరో గొప్ప పాత్రికేయులు నేటికీ ఉన్నారు. దశాబ్దాలపాటు కలాన్ని నమ్ముకున్ని ప్రజాప్రయోజనమే లక్ష్యంగా పనిచేస్తూ సొంత మీడియాలు ఏర్పాటు చేసుకున్న సీనియర్ పాత్రికేయులు ఎందరికో నేటికీ అక్రిడిటేషన్లు లేవు. అంటే వీరందరికి అక్రిడిటేషన్లు లేవు కావున వీరంతా జర్నలిస్టులు కాదని, వారంతా నకిలీ విలేకర్లని కొందరు చెప్పడం నిజంగా సిగ్గు చేటు. ఇలాంటి ప్రకటనలు ఇస్తున్న అధికారులు, పాలకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. జర్నలిస్టు కావడానికి చదువుతోపాటు ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం లేదు. కేవలం నిజాయితీ, నిబద్ధత, సామాజిక స్పృహ ఉన్నవారంతా కలం యోధులే. వేదికలు చిన్నవా పెద్దవా? అనే తేడానే లేదు. వృత్తి ధర్మంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన రాయితీనే అక్రిడిటేషన్. అక్రిడిటేషన్‌కు ఇంతకు మించి విలువ లేదు. అంతకన్నా చెల్లుబాటు లేదు. అయితే కొందరు అధికారులు అక్రిడిటేషన్ అంటే జర్నలిజం పట్టాగా పేర్కొంటూ రాజ్యాంగ స్ఫూర్తిని, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారు. ఇలాంటి పోకడ ప్రజాస్వామ్యాన్నే ప్రమాదంలో పడేసే వ్యవహారంగా ఉన్నది. జర్నలిజం ముసుగులో రాజకీయాలు నెరిపే వ్యవహారంతో నిజంగా నిఖార్సయిన జర్నలిజానికి ఇబ్బందికర పరిస్థితులే ఏర్పడ్డాయి.
.
.
.
Mar 02 2024, 16:56