NLG: నేడు లెంకలపల్లి గ్రామానికి రానున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా:

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నేడు సాయంత్రం 4 గంటలకు మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామానికి విచ్చేయుచున్నట్లు, లెంకలపల్లి గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ తెలిపారు. సుమారు 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణానికి మంజూరు అయినటువంటి 'ప్రైమరీ హెల్త్ సబ్ సెంటర్' ను ఎమ్మెల్యే శంకుస్థాపన చేయనున్నారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

NLG: మునుగోడు ఎమ్మేల్యే రాజ గోపాల్ రెడ్డి.. బుధవారం పర్యటన వివరాలు

నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:

ఈనెల 24న బుధవారం, మునుగోడు ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి.. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. మునుగోడు మండలంలో ఉదయం 09:00 గంటలకు కొంపల్లి గ్రామంలో, 10:30 గంటలకు ఊకొండి గ్రామంలో, మర్రిగూడెం మండలంలో మధ్యాహ్నం 12:00 లకు కొట్టాల, 2:00 గంటలకు మేటి చందాపురం (ఇందుర్తి), సాయంత్రం 4:00 గంటలకు లెంకలపల్లి గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

NLG: కేంద్రంలో బిజెపి దే అధికారం: బిజెపి నాయకులు బూర నర్సయ్య గౌడ్

నల్లగొండ: కేంద్రంలో మళ్లీ బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని, దేశవ్యాప్తంగా సుమారు 360 ఎంపీ సీట్ల నుండి 400 సీట్ల వరకు బిజెపి గెలుచుకుంటుందని బిజెపి జాతీయ నాయకులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. మంగళవారం బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో 10 నుండి 12 సీట్ల వరకు బిజెపి గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు.

అయోధ్యలో న భూతో, న భవిష్యత్తు, అన్నట్లుగా రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరిగిందని దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలను తిలకించిన ప్రజలు సంబరాలు ఘనంగా నిర్వహించారని.. భవ్య దివ్య రామాలయాన్ని దర్శించడానికి ప్రజలు ఉత్సాహ పడుతున్నారన్నారు. 

హిందూ ధర్మాన్ని ప్రధానమంత్రి మోడీ విశ్వధర్మంగా వ్యాప్తి చెందడానికి కృషి చేస్తున్నారన్నారు. శ్రీరామనవమి, దీపావళి పండుగలు రెండు ఒకేసారిగా జరుపుకున్నట్లుగా ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో జాతీయ రహదారులు. పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులు, కేంద్రీయ విద్యాలయాలు వంటి అనేక అభివృద్ధి పనులు చేసిందన్నారు.

అయోధ్యలోని రామాలయం సందర్శించడానికి భువనగిరి నల్లగొండ నుండి బిజెపి పార్టీ ప్రత్యేక రైలు ఏర్పాటు చేసిందని తెలిపారు. కేవలం 1900 రూపాయలతో రైలు చార్జీలతో పాటు అయోధ్యలో అకామిడేషన్ దర్శనము భోజన వసతి కల్పిస్తున్నామని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వర్షిత్ రెడ్డి, చింతా ముత్యాల రావు, ముని కుమార్, తదితరులు పాల్గొన్నారు.

NLG: ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి

నల్లగొండ: భారత స్వాతంత్ర్య పోరాటంలో నేతాజి సుభాష్ చంద్రబోస్ పాత్ర వెలకట్టలేనిదని జనగణమన ఉత్సవ సమితి అద్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్, ఆర్డిఓ రవి అన్నారు. మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆజాద్ హిందు ఫౌజ్ జెండాను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అని చెప్పి ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపారు అని తెలిపారు. దేశంలోనే తొలిసారి ఆజాద్ హిందు ఫౌజ్ పేరుతో సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటీష్ ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్దం ప్రకటించారని అన్నారు. 

దేశాన్ని కాపాడుకోవాలంటే అహింస ఒక్కటే మార్గం కాదు, పోరాటాలు కూడా చేయాలి అంటూ గాంధీకి వ్యతిరేకంగా పోరుబాట పట్టి ఎంతోమంది దేశ భక్తులకు దిశా నిర్దేశం చేశారని అన్నారు. చివరి వరకు దేశం కోసమే బతికిన సుభాష్ చంద్రబోస్ మరణం మాత్రం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకర్, అదనపు ఎస్పి విఠల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్, జనగణమన ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కొలనుపాక రవికుమార్, సహాయ అద్యక్షులు దోసపాటి శ్రీనివాస్, చందా శ్రీనివాస్, పోలా జనార్దన్, నాగేందర్, శ్యాంసుందర్ రెడ్డి, ప్రదీప్, మరియు మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన శ్యామ్, గంధపాలకులు డాక్టర్ రాజారాం, తదితరులు పాల్గొన్నారు.

AP: గ్రూప్‌-1 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఈనెల 28 వరకు అవకాశం

అమరావతి: గ్రూప్ -1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏపీపీఎస్సీ,ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్రూప్‌-1 దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపింది.

కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్‌ వెబ్‌సైట్‌లో తమ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని, ఓటీపీఆర్‌తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్‌- 1 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ఈనెల 21తో ముగిసింది. అయితే n గ్రూప్‌-1 ఆశావహుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు దరఖాస్తుల గడువును పొడిగించాలని APPSC నిర్ణయించింది.

ఇక.. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో మార్చి 17న ఆఫ్‌లైన్‌లో నిర్వహించ నున్నట్టు ఏపీపీఎస్సీ సర్వీస్‌ కమిషన్‌ పేర్కొంది.

ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టంచేసింది. కమిషన్‌ ప్రకటించిన గ్రూప్‌-1 విభాగంలో 9 డిప్యూటీ కలెక్టర్లు, 18 అసిస్టెంట్‌ ట్యాక్స్‌ కమిషనర్స్‌ పోస్టులు, 26 డిప్యూటీ పోలీస్‌ సూపరింటెండెంట్స్, ఆర్టీవో, గ్రేడ్‌-2 మున్సిపల్‌ కమిషనర్స్, జిల్లా బీసీ సంక్షేమ వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉన్నాయి.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు సైతం ఆఫ్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలోనే నిర్వహించనున్న విషయం తెలిసిందే. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అర్హులైన అభ్యర్థులు జనవరి 28వ తేదీ అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్‌ విధానంలో https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో పేర్కొంది.

TS: ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ మలిదశ విద్యార్థి ఉద్యమ నాయకురాలు డాక్టర్ రేష్మ హుస్సేన్

హైదరాబాద్: ఎమ్మెల్సీ గా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ ను, మంగళవారం తెలంగాణ మలిదశ విద్యార్థి ఉద్యమ నాయకురాలు డాక్టర్ రేష్మ హుస్సేన్ గాంధీభవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ కోసం పని చేసిన ఆయన ఎమ్మెల్సీ గా ఎంపికకావడం అభినందనీయమని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ రేష్మ హుస్సేన్.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో, ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిపడిన సమయంలో విద్యార్థి నాయకురాలు గా బుల్లెట్ గాయాల పాలైనా.. ఒక్క అడుగు కూడా వెనుకకు వేయకుండా ముందుకెళ్ళింది. ఆ విధంగా ఆమె బుల్లెట్ రాణిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు, పార్టీ కోసం పనిచేసిన వారందరికీ సముచిత న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

NLG: బీఎస్పీ జిల్లా సంయుక్త కార్యదర్శి గా తక్కెలపల్లి శ్రీనివాస్

నల్గొండ: బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యేకుల రాజారావు సోమవారం అనుముల గ్రామానికి చెందిన తక్కెలపల్లి శ్రీనివాస్ ను జిల్లా సంయుక్త కార్యదర్శి గా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజారావుకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. తన వంతు బాధ్యతగా పార్టీ ని సాగర్ నియోజకవర్గం లో బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. సాగర్ నియోజకవర్గ అధ్యక్షులు ముదిగొండ వేంకటేశ్వర్లు, సాగర్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు బత్తుల ప్రసాద్, పలువురు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆయనను ఈ సందర్భంగా అభినందించారు.

TS: పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోండి

నవంబర్ 1, 2020 వరకు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో ఫాం 18 నింపి మీ పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోండి.. అని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.

వెబ్ సైట్

https://ceotserms2.telangana.gov.in/mlc/form18.aspx

గమనిక: గతం లో ఓటు ఉన్నవారు కూడా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలి.

చివరి తేదీ ఫిబ్రవరి 06.*

కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు

TS: కల్తీ కల్లు తయారీ కోసం డేంజరస్ డ్రగ్ అయిన అల్ఫాజోలం వాడుతున్నట్లు యాంటీ నార్కోటిక్ బ్యూరో(ఎన్ఏబీ) గుర్తించింది. అల్ఫాజోలం కలిపిన కల్లు వల్ల వేలాది మంది క్రమంగా మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఏబీ దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. అల్ఫాజోలం రాష్ట్రానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు సరఫరా చేస్తున్నారు? అనే విషయాలపై ఫోకస్ పెట్టేందుకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సయిజ్ శాఖలతో సమన్వయాన్ని ఏర్పరచుకుంటున్నారు.

గంజాయి తర్వాత ఇదే..

రాష్ట్రంలో గంజాయి తర్వాత అల్ఫాజోలం వాడకమే అధికమని అధికారులు చెబుతున్నారు. గడచిన రెండేళ్లలో 293 కిలోల అల్ఫాజోలం ను అధికారులు స్వాధీనం చేసుకున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వేర్వేరు మార్గాల్లో రాష్ట్రానికి చేరుతున్న ఆల్ఫాజోలెంను ప్రధానంగా కల్తీ కల్లు తయారీలో ఉపయోగిస్తున్నారు. సాధారణంగా దీనిని నిద్రలేమి, యాంగ్జయిటీ సమస్యలతో బాధపడుతున్న వారికి మెడిసిన్గా ఉపయోగిస్తారు. ఒక రోగికి ఒకసారి 0.25 గ్రాముల డోసును మాత్రమే ఇస్తారు. దీనికి కారణం అల్ఫాజోలం అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ కావడమే.

ఎక్కువ మత్తు కోసం..

కల్లు ఎక్కువ కిక్ ఎక్కేందుకు విక్రయదారులు అల్ఫాజోలంను వినియోగిస్తున్నారని తెలంగాణ ఎన్ఏబీ చీఫ్ సందీప్శాండిల్య చెప్పారు. పదేళ్ల క్రితం వరకు కల్తీ కల్లు కోసం డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్‌లను వాడేవారన్నారు. ప్రస్తుతం వీటితో పోలిస్తే వెయ్యి రెట్లు మత్తు కలిగించే అల్ఫాజోలం వాడుతున్నారు. దీని ధర 10 గ్రాములకు రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిమాణంతో కనీసం 30 వేల సీసాల కల్లును తయారు చేస్తున్నారు. ఒక్కో సీసా రూ.50 ఉండగా.. సుమారు రూ.13.50 లక్షలు వ్యాపారులు సంపాదిస్తున్నారు. ఇటీవల ఎన్ఏబీ అధికారులు హైదరాబాద్లో దాడులు జరపగా 66 కాంపౌండ్‌లో కల్తీ కల్లు విక్రయిస్తున్నట్టుగా నిర్ధారణ కావడం ఈ దందా ఏ స్థాయిలో జరుగుతోందో స్పష్టం చేస్తోంది.

ముంబయి నుంచి ఎక్కువగా..

రాష్ట్రానికి ముంబయి నుంచి ఈ డ్రగ్ వస్తోందని ఎన్‌ఏబీకి చెందిన ఓ అధికారి తెలిపారు. నగర శివార్లలోనూ తయారవుతోందనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ డ్రగ్‌కు ఒకసారి అలవాటు పడితే బానిసలు అవుతారని తెలిపారు. లాక్డౌన్ సమయంలో ఈ డ్రగ్ కలిపిన కల్లు దొరక్క చాలా మంది విచిత్రంగా ప్రవర్తించటంతో పాటు కొందరు ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

సిండికేట్‌కు పొలిటికల్ అండ..

ఈ కల్తీ కల్లు సిండికేట్కు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీల నేతలను తమ వైపుకు తిప్పుకుంటారు. మహబూబ్నగర్లో కల్తీ కల్లు తాగి కొందరు చనిపోతే అప్పటి ఎక్సయిజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. అనారోగ్య మరణాలని ప్రకటించారు. అయితే, విషయం పెద్దది కావడంతో కొన్ని శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. అయితే, వాటి ఫలితాలు ఇప్పటికీ తెలియరాలేదు.

TS:నూతన జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 3న ఛలో ఢిల్లీ

నల్లగొండ జిల్లా:

మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం - 2020 ఉపసంహరించుకోవలని PDSU ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్నామని PDSU జిల్లా కార్యదర్శి పోలె పవన్ అన్నారు. అందుకు సంబంధించిన కరపత్రాలు నకిరేకల్ పట్టణంలో ఆవిష్కరించారు. పోలె పవన్, మాట్లాడుతూ.. విద్య వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ,కార్పోరేటికరణని అమలు చేయడం మోడీ ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు.

ఇందులో భాగంగా ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్లు, స్టైఫండ్లు ఆపివేశారని.. ఎయిడెడ్ కాలేజీలకు, పాఠశాలకు ప్రభుత్వ నిధులను ఆపివేశారని అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు మెజారిటీ మత ఉన్మాద విద్యాసంస్థలకు 'ప్రభుత్వ- దాతృత్వ- భాగస్వామ్యం' పేరుతో ప్రభుత్వ నిధులను కేటాయించడం జరుగుతున్నదని, విద్యా రంగంలో వ్యాపార విస్తరణ కోసం ప్రభుత్వం పని చేస్తుందని ఆరోపించారు.

కాలేజీలలో,యూనివర్సిటీలలో పరిశోధనా సంస్థలలో స్వయం ప్రతిపత్తిని తొలగించి, విద్యార్థుల, ఉపాధ్యాయుల, అధ్యాపకుల, ప్రజాస్వామిక హక్కులను కాలరాచి వేయడం కొనసాగుతున్నదని దుయ్యబట్టారు..

విశ్వవిద్యాలయాల లో బోర్డ్ ఆఫ్ గవర్నర్లు, ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్, పాఠశాల విద్యలో వాలంటీర్లు, కౌన్సిలర్ల పేరు మీద సంఘ పరివార్ తమ కార్యకర్తలని చొప్పించడానికి ప్రాతిపదికలుగా మారుతున్నాయని అన్నారు.

విద్యారంగంలో అమలు జరుగుతున్న ఫాసిస్ట్ దాడులకు అడ్డుకట్టలు వేయడానికి ఫిబ్రవరి 1నుండి 3 వ తారీకు న్యూ ఢిల్లీలో అఖిల భారత నిరసన ర్యాలీ జరగబోతున్నదని, 3న జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో మహాధర్నా ఉంటుందని, ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు,అధ్యాపకులు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో PDSU నాయకులు హర్షకేతన్, సాత్విక్, ప్రవీణ్, రాజు, మధు, లోకేష్, కుమార స్వామి, హసృత్, సురేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.