NLG: బీఎస్పీ జిల్లా సంయుక్త కార్యదర్శి గా తక్కెలపల్లి శ్రీనివాస్

నల్గొండ: బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యేకుల రాజారావు సోమవారం అనుముల గ్రామానికి చెందిన తక్కెలపల్లి శ్రీనివాస్ ను జిల్లా సంయుక్త కార్యదర్శి గా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజారావుకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. తన వంతు బాధ్యతగా పార్టీ ని సాగర్ నియోజకవర్గం లో బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. సాగర్ నియోజకవర్గ అధ్యక్షులు ముదిగొండ వేంకటేశ్వర్లు, సాగర్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు బత్తుల ప్రసాద్, పలువురు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆయనను ఈ సందర్భంగా అభినందించారు.

TS: పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోండి

నవంబర్ 1, 2020 వరకు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో ఫాం 18 నింపి మీ పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోండి.. అని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.

వెబ్ సైట్

https://ceotserms2.telangana.gov.in/mlc/form18.aspx

గమనిక: గతం లో ఓటు ఉన్నవారు కూడా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలి.

చివరి తేదీ ఫిబ్రవరి 06.*

కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు

TS: కల్తీ కల్లు తయారీ కోసం డేంజరస్ డ్రగ్ అయిన అల్ఫాజోలం వాడుతున్నట్లు యాంటీ నార్కోటిక్ బ్యూరో(ఎన్ఏబీ) గుర్తించింది. అల్ఫాజోలం కలిపిన కల్లు వల్ల వేలాది మంది క్రమంగా మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఏబీ దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. అల్ఫాజోలం రాష్ట్రానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు సరఫరా చేస్తున్నారు? అనే విషయాలపై ఫోకస్ పెట్టేందుకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సయిజ్ శాఖలతో సమన్వయాన్ని ఏర్పరచుకుంటున్నారు.

గంజాయి తర్వాత ఇదే..

రాష్ట్రంలో గంజాయి తర్వాత అల్ఫాజోలం వాడకమే అధికమని అధికారులు చెబుతున్నారు. గడచిన రెండేళ్లలో 293 కిలోల అల్ఫాజోలం ను అధికారులు స్వాధీనం చేసుకున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వేర్వేరు మార్గాల్లో రాష్ట్రానికి చేరుతున్న ఆల్ఫాజోలెంను ప్రధానంగా కల్తీ కల్లు తయారీలో ఉపయోగిస్తున్నారు. సాధారణంగా దీనిని నిద్రలేమి, యాంగ్జయిటీ సమస్యలతో బాధపడుతున్న వారికి మెడిసిన్గా ఉపయోగిస్తారు. ఒక రోగికి ఒకసారి 0.25 గ్రాముల డోసును మాత్రమే ఇస్తారు. దీనికి కారణం అల్ఫాజోలం అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ కావడమే.

ఎక్కువ మత్తు కోసం..

కల్లు ఎక్కువ కిక్ ఎక్కేందుకు విక్రయదారులు అల్ఫాజోలంను వినియోగిస్తున్నారని తెలంగాణ ఎన్ఏబీ చీఫ్ సందీప్శాండిల్య చెప్పారు. పదేళ్ల క్రితం వరకు కల్తీ కల్లు కోసం డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్‌లను వాడేవారన్నారు. ప్రస్తుతం వీటితో పోలిస్తే వెయ్యి రెట్లు మత్తు కలిగించే అల్ఫాజోలం వాడుతున్నారు. దీని ధర 10 గ్రాములకు రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిమాణంతో కనీసం 30 వేల సీసాల కల్లును తయారు చేస్తున్నారు. ఒక్కో సీసా రూ.50 ఉండగా.. సుమారు రూ.13.50 లక్షలు వ్యాపారులు సంపాదిస్తున్నారు. ఇటీవల ఎన్ఏబీ అధికారులు హైదరాబాద్లో దాడులు జరపగా 66 కాంపౌండ్‌లో కల్తీ కల్లు విక్రయిస్తున్నట్టుగా నిర్ధారణ కావడం ఈ దందా ఏ స్థాయిలో జరుగుతోందో స్పష్టం చేస్తోంది.

ముంబయి నుంచి ఎక్కువగా..

రాష్ట్రానికి ముంబయి నుంచి ఈ డ్రగ్ వస్తోందని ఎన్‌ఏబీకి చెందిన ఓ అధికారి తెలిపారు. నగర శివార్లలోనూ తయారవుతోందనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ డ్రగ్‌కు ఒకసారి అలవాటు పడితే బానిసలు అవుతారని తెలిపారు. లాక్డౌన్ సమయంలో ఈ డ్రగ్ కలిపిన కల్లు దొరక్క చాలా మంది విచిత్రంగా ప్రవర్తించటంతో పాటు కొందరు ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

సిండికేట్‌కు పొలిటికల్ అండ..

ఈ కల్తీ కల్లు సిండికేట్కు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీల నేతలను తమ వైపుకు తిప్పుకుంటారు. మహబూబ్నగర్లో కల్తీ కల్లు తాగి కొందరు చనిపోతే అప్పటి ఎక్సయిజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. అనారోగ్య మరణాలని ప్రకటించారు. అయితే, విషయం పెద్దది కావడంతో కొన్ని శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. అయితే, వాటి ఫలితాలు ఇప్పటికీ తెలియరాలేదు.

TS:నూతన జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 3న ఛలో ఢిల్లీ

నల్లగొండ జిల్లా:

మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం - 2020 ఉపసంహరించుకోవలని PDSU ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్నామని PDSU జిల్లా కార్యదర్శి పోలె పవన్ అన్నారు. అందుకు సంబంధించిన కరపత్రాలు నకిరేకల్ పట్టణంలో ఆవిష్కరించారు. పోలె పవన్, మాట్లాడుతూ.. విద్య వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ,కార్పోరేటికరణని అమలు చేయడం మోడీ ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు.

ఇందులో భాగంగా ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్లు, స్టైఫండ్లు ఆపివేశారని.. ఎయిడెడ్ కాలేజీలకు, పాఠశాలకు ప్రభుత్వ నిధులను ఆపివేశారని అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు మెజారిటీ మత ఉన్మాద విద్యాసంస్థలకు 'ప్రభుత్వ- దాతృత్వ- భాగస్వామ్యం' పేరుతో ప్రభుత్వ నిధులను కేటాయించడం జరుగుతున్నదని, విద్యా రంగంలో వ్యాపార విస్తరణ కోసం ప్రభుత్వం పని చేస్తుందని ఆరోపించారు.

కాలేజీలలో,యూనివర్సిటీలలో పరిశోధనా సంస్థలలో స్వయం ప్రతిపత్తిని తొలగించి, విద్యార్థుల, ఉపాధ్యాయుల, అధ్యాపకుల, ప్రజాస్వామిక హక్కులను కాలరాచి వేయడం కొనసాగుతున్నదని దుయ్యబట్టారు..

విశ్వవిద్యాలయాల లో బోర్డ్ ఆఫ్ గవర్నర్లు, ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్, పాఠశాల విద్యలో వాలంటీర్లు, కౌన్సిలర్ల పేరు మీద సంఘ పరివార్ తమ కార్యకర్తలని చొప్పించడానికి ప్రాతిపదికలుగా మారుతున్నాయని అన్నారు.

విద్యారంగంలో అమలు జరుగుతున్న ఫాసిస్ట్ దాడులకు అడ్డుకట్టలు వేయడానికి ఫిబ్రవరి 1నుండి 3 వ తారీకు న్యూ ఢిల్లీలో అఖిల భారత నిరసన ర్యాలీ జరగబోతున్నదని, 3న జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో మహాధర్నా ఉంటుందని, ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు,అధ్యాపకులు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో PDSU నాయకులు హర్షకేతన్, సాత్విక్, ప్రవీణ్, రాజు, మధు, లోకేష్, కుమార స్వామి, హసృత్, సురేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

NLG: గురుకుల పాఠశాల విద్యార్థిని దాసరి భార్గవి మృతి పై విచారణ జరిపి న్యాయం చేయాలి: ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్

దేవరకొండ: డివిజన్ పరిధిలోని కొండ మల్లేపల్లిలోని ఎస్సీ గురుకుల బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దాసరి భార్గవి మృతిపై విచారణ చేసి కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఎస్సీ గురుకుల ఆర్సిఓ అరుణ కుమార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆకారపు నరేష్ మాట్లాడుతూ.. మల్లేపల్లి‌ ఎస్సీ బాలికల ‌గురుకుల పాఠశాల విద్యార్థిని దాసరి భార్గవి మృతి పై విచారణ జరిపి న్యాయం చేయాలని, భార్గవి మృతి గల కారణాల పైన సమగ్ర విచారణ జరపాలన్నారు. ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆ కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. 

నల్గొండ జిల్లాలో వరుసగా గురుకులాల్లో విద్యార్థులు పిట్టలలా రాలిపోతున్నారు. వీటన్నిటిపై ప్రధానమైన కారణాలు తెలియజేసి కారకులైన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రామావత్ లక్ష్మణ్, బుడిగ వెంకటేష్, మహి, పాషా, శివ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

NLG: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో నల్లగొండకు అన్యాయం - ఎస్ఎల్బిసి అంతర్భాగంలో డిండి ఎత్తిపోతల డిపిఆర్ లను మార్చాలి: నెల్లికంటి సత్యం

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నల్లగొండ జిల్లా కు సాగునీరు అందిస్తామనటం అన్యాయమని ఎస్ ఎల్ బి సి అంతర్భాగం లోని డిండి ఎత్తిపోతల పథకం ద్వారా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందించాలని అందుకు అవసరమైన డిపిఆర్లను మార్చాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మండల కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరుతో 10 సంవత్సరాలు నల్లగొండ జిల్లాకు సాగు తాగునీరు అందించకుండా కాలయాపన చేసిందని అన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలు సాగు త్రాగునీరు నోచుకోక పోయాయని ఆరోపించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిని రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తిచేసి నక్కల గండి ద్వారా దిండి ప్రాజెక్టులోకి లిఫ్ట్ చేసి చర్లగూడెం రిజర్వాయర్ నింపాలని అన్నారు. బ్రాహ్మణ వెల్లం ల ప్రాజెక్టును కిష్టాపురం వరకు పొడిగించాలని కోరారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల్లో బెల్ట్ షాపుల నిషేధాన్ని సిపిఐ స్వాగతిస్తూ ఆ పోరాటంలో సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని కోరారు.

బిఆర్ఎస్ నుండి సిపిఐ లో చేరిన రేవెల్లి అంజయ్య

మునుగోడు పట్టణానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు రేవెల్లి అంజయ్య సోమవారం సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం సమక్షంలో సిపిఐ లో చేరారు. ఈ సమావేశానికి సురిగి చలపతి అధ్యక్షత వహించగా జిల్లా కార్యవర్గ సభ్యులు బోలుగూరి నరసింహ, గురుజ రామచంద్రం, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి చాపల శ్రీను, సహాయ కార్యదర్శి బండమీది యాదయ్య, మాజీ జెడ్పిటిసి గోస్కొండ లింగయ్య, ఈదులకంటి కైలాసం, దుబ్బ వెంకన్న బండారు శంకర్, దయాకర్, ముత్తయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

NLG: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించి దరఖాస్తుదారులకు రిప్లై పంపాలి: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: ప్రజా వాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం చేయనున్నట్లు రాష్ట్ర రహదారులు, భవనాలు శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ప్రజా వాణి కార్యక్రమం లో మంత్రి కోమటి రెడ్డి, జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తో కలిసి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజల నుండి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించి దరఖాస్తు దారులకు రిప్లై పంపాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ప్రజల గుండె చప్పుడు వినే కార్యక్రమం ప్రజా వాణి కార్య క్రమం అని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రజా భవన్ లో సామాన్యుల సమస్యలు వినేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు వినతులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఒక కోటి 50లక్షలు దరఖాస్తులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు.

ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారంటీ లు అమలు చేయటానికి కట్టు బడి వుందని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు, 200 యూనిట్ ల ఉచిత కరెంట్, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, 500 రూ.లకు గ్యాస్ సిలిండర్, పెన్షన్లు అమలు చేస్తామని తెలిపారు .

20 కోట్ల రూ.ల తో ITI వద్ద నిరుద్యోగ యువతకు శిక్షణనందించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు, ఈ నెల 26 న శంఖుస్థాపన వేయనున్నట్లు తెలిపారు.

జిల్లాలో సాగు నీటి పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తామని అన్నారు. జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ కి కలెక్టరేట్ వద్ద 10 ఎకరాలు స్థలం లో లే అవుట్, రోడ్లు పూర్తి చేసి జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని అన్నారు.

ఏ.యం.అర్.పి.ప్రాజెక్ట్ రూ. 510 కోట్ల లతో లైనింగ్ పనులు చేపట్టడం జరుగుతుందని, రూ. 350 కోట్ల లతో రిపేర్ లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎస్.ఎల్.బి.సి కెనాల్ పనులు వ్యయం పెరిగినందున ప్రభుత్వ ఆమోదం తో పనులు చేపడతామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హరి చందన, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, మున్సిపల్ ఛైర్మెన్ అబ్బగోని రమేష్, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

NLG: గురుకుల పాఠశాలలో బాలిక అనుమానస్పద మృతి

నల్లగొండ జిల్లా, కొండమల్లేపల్లి మండలంలో గల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల 9వ తరగతి విద్యార్థి డి. భార్గవి సోమవారం ఆకస్మికంగా మృతి చెందింది. పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ఆర్సిఓ అరుణకుమారి మాట్లాడుతూ.. సెలవుల తర్వాత నిన్న హాస్టల్ కి వచ్చిన బాలిక రాత్రిపూట ఆహారం తీసుకోలేదని, ఈరోజు ఉదయం కళ్ళు తిరిగి పడిపోయిందని, దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకురాగా చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారని అన్నారు. హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరు అవుతున్నారు. ఈ అనుమానస్పద మృతి పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

TS: అయోధ్య లైవ్ పేరుతో వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దు: సైబర్ పోలీసుల వార్నింగ్

లైవ్ స్ట్రీమింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారని హెచ్చరిక..

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అందరి దృష్టి రామ మందిరం పైనే ఉంది. రామ మందిరం విశేషాలను తెలుసుకోవాలని చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. 

ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను ప్రత్యక్షంగా చూడాలని ఆశ పడుతున్నారు. ఇప్పుడున్న ఈ ట్రెండ్ ను సైబర్ నేరస్థులు తమకు అవకాశంగా మలుచుకునే వీలుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

అయోధ్యలో వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు తాజాగా సైబర్ నేరాలపై అలర్ట్ ప్రకటించారు.

మొబైల్ ఫోన్లకు వచ్చే సందేశాలను, వాట్సాప్ లింక్ లను, మెయిల్స్ ను ఓపెన్ చేయొద్దంటూ భక్తులకు సూచిస్తున్నారు. 

ప్రాణ ప్రతిష్ఠ వేడుకల లైవ్ అంటూ, రామ మందిర విశేషాలంటూ.. ఇలా వేర్వేరు పేర్లతో లింక్ లు పంపుతూ సైబర్ నేరస్థులు దోపిడీలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. 

మొబైల్ ఫోన్లకు వచ్చే లింక్ లను తెలియక ఓపెన్ చేస్తే మీ బ్యాంకు ఖాతా లోని సొమ్మంతా దుండగులు కాజేసే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఈ నేపథ్యం లోనే అయోధ్య రామ మందిరం వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు కేవలం 84 సెకండ్ల ముహూర్తం

నేడు జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ్ లల్లా  ప్రాణ ప్రతిష్ట జీవిత పవిత్రత కేవలం 84 సెకండ్ల పాటు ఉండే అభిజిత్ లగ్న శుభ సమయంలో పూర్తవుతుంది. ఈ ముహూర్తం చాలా శుభప్రదం. ఈ ముహూర్తాన్ని కాశీలోని పండితులు, అర్చకులు కలిసి గణేశ్వర్ శాస్త్రీ ద్రవిడ్ నిర్ణయించారు.

అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్టాపనకు సంబంధించిన శుభ సమయం 2024 జనవరి 22న మధ్యాహ్నం 12 గంటల 29 నిముషాల 8 సెకండ్లకు ప్రారంభం అవుతుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాల 32 సెకన్ల వరకు కొనసాగుతుంది. ఈ మధ్య ఉన్న వ్యవధి 1 నిమిషం 24 సెకన్లు. ఈ వ్యవధిలోనే అభిజిత్ ముహూర్తం వుంటుంది. ఈ ముహూర్తం రాజ్యాల స్థాపనకు పవిత్రమైనదిగా, దేశం, ప్రజలు దీని నుంచి అనేక విధాలుగా ప్రయోజనం పొంది సుఖ, శాంతి, సంతోషాలతో వుంటారని చెబుతున్నారు.