NLG: గురుకుల పాఠశాలలో బాలిక అనుమానస్పద మృతి

నల్లగొండ జిల్లా, కొండమల్లేపల్లి మండలంలో గల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల 9వ తరగతి విద్యార్థి డి. భార్గవి సోమవారం ఆకస్మికంగా మృతి చెందింది. పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ఆర్సిఓ అరుణకుమారి మాట్లాడుతూ.. సెలవుల తర్వాత నిన్న హాస్టల్ కి వచ్చిన బాలిక రాత్రిపూట ఆహారం తీసుకోలేదని, ఈరోజు ఉదయం కళ్ళు తిరిగి పడిపోయిందని, దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకురాగా చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారని అన్నారు. హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరు అవుతున్నారు. ఈ అనుమానస్పద మృతి పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

TS: అయోధ్య లైవ్ పేరుతో వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దు: సైబర్ పోలీసుల వార్నింగ్

లైవ్ స్ట్రీమింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారని హెచ్చరిక..

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అందరి దృష్టి రామ మందిరం పైనే ఉంది. రామ మందిరం విశేషాలను తెలుసుకోవాలని చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. 

ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను ప్రత్యక్షంగా చూడాలని ఆశ పడుతున్నారు. ఇప్పుడున్న ఈ ట్రెండ్ ను సైబర్ నేరస్థులు తమకు అవకాశంగా మలుచుకునే వీలుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

అయోధ్యలో వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు తాజాగా సైబర్ నేరాలపై అలర్ట్ ప్రకటించారు.

మొబైల్ ఫోన్లకు వచ్చే సందేశాలను, వాట్సాప్ లింక్ లను, మెయిల్స్ ను ఓపెన్ చేయొద్దంటూ భక్తులకు సూచిస్తున్నారు. 

ప్రాణ ప్రతిష్ఠ వేడుకల లైవ్ అంటూ, రామ మందిర విశేషాలంటూ.. ఇలా వేర్వేరు పేర్లతో లింక్ లు పంపుతూ సైబర్ నేరస్థులు దోపిడీలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. 

మొబైల్ ఫోన్లకు వచ్చే లింక్ లను తెలియక ఓపెన్ చేస్తే మీ బ్యాంకు ఖాతా లోని సొమ్మంతా దుండగులు కాజేసే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఈ నేపథ్యం లోనే అయోధ్య రామ మందిరం వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు కేవలం 84 సెకండ్ల ముహూర్తం

నేడు జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ్ లల్లా  ప్రాణ ప్రతిష్ట జీవిత పవిత్రత కేవలం 84 సెకండ్ల పాటు ఉండే అభిజిత్ లగ్న శుభ సమయంలో పూర్తవుతుంది. ఈ ముహూర్తం చాలా శుభప్రదం. ఈ ముహూర్తాన్ని కాశీలోని పండితులు, అర్చకులు కలిసి గణేశ్వర్ శాస్త్రీ ద్రవిడ్ నిర్ణయించారు.

అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్టాపనకు సంబంధించిన శుభ సమయం 2024 జనవరి 22న మధ్యాహ్నం 12 గంటల 29 నిముషాల 8 సెకండ్లకు ప్రారంభం అవుతుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాల 32 సెకన్ల వరకు కొనసాగుతుంది. ఈ మధ్య ఉన్న వ్యవధి 1 నిమిషం 24 సెకన్లు. ఈ వ్యవధిలోనే అభిజిత్ ముహూర్తం వుంటుంది. ఈ ముహూర్తం రాజ్యాల స్థాపనకు పవిత్రమైనదిగా, దేశం, ప్రజలు దీని నుంచి అనేక విధాలుగా ప్రయోజనం పొంది సుఖ, శాంతి, సంతోషాలతో వుంటారని చెబుతున్నారు.

NLG: ఇరిగేషన్ పై సమీక్ష సమావేశం నిర్వహించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

మర్రిగూడ: మునుగోడు నియోజకవర్గం లోని ఇరిగేషన్ పైన యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లా ఇరిగేషన్ అధికారులతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. 

యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ధర్మారెడ్డి కాలువ, బునాదిగాని కాలువ, పిలాయిపల్లి కాలువల సమస్యలు వాటి పరిష్కార మార్గాలపైన సుదీర్ఘంగా చర్చ జరిపారు. నల్గొండ జిల్లా పరిధిలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టులైన శివన్న గూడెం (చర్లగూడెం), కిష్ట రాంపల్లి (లక్ష్మణపురం) ప్రాజెక్టుల పనులు ఎలా ఉన్నాయి.. ఈ రెండు ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు సరైన పరిహారం అందిందా? ఇంకా ఏమైనా పెండింగ్ ఉందా? అని ఆరా తీశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించిన విషయాలపై సమగ్రంగా చర్చించారు. 

ఈ సందర్భంగా భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమీక్ష సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లా లకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

YBD: వలిగొండ: 'లోతుకుంట స్టేజి నుండి మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ స్కూల్ వరకు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం'

యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలంలో ఆదివారం భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో, లోతుకుంట స్టేజి నుండి మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ స్కూల్ వరకు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ.. స్కూల్ కి వెళ్లే విద్యార్థులు ఆటోలలో ప్రయాణం చేయడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నందున తక్షణమే సిసి రోడ్ ఏర్పాటు చేయాలని అన్నారు.

అలాగే కస్తూర్బా గాంధీ పాఠశాలలో అండర్ డ్రైనేజీ సమస్య, పాఠశాల కు సంబంధించిన స్థలాన్ని సర్వే చేయించి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వెంటనే సమస్య పరిష్కరిస్తామని అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుద్దాల సాయికుమార్, మేడి దేవేందర్, మచ్చ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

TS: గురుకుల 5వ తరగతి ప్రవేశ అప్లికేషన్ తేదీ పొడిగింపు

TS: తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ TSWREIS, TTWREIS, MJPTBCWREIS, TREIS గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశమునకై 2024-25 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల అయింది.

తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు.. అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజ సిద్ధమైన నైపుణ్యాలను వెలికితీస్తూ.. ఆ విద్యార్థులను 21వ శతాబ్దపు సవాళ్ళను ధీటుగా ఎదురుకోవడానికి సిద్ధం చేస్తుంది. ఈ లక్ష్యంతో SC, ST, BC మరియు జనరల్ గురుకుల పాఠశాలలను సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పింది. ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్నవి

  అప్లికేషన్ ప్రారంభ తేదీ

   తేదీ : 18-12-2023

 అప్లికేషన్ చివరి తేదీ

   తేదీ : 23-01-2024

   ఆన్లైన్ వెబ్సైట్

  www.tswreis.ac.in,   www.tgcet.cgg.gov.in 

   ప్రవేశ పరీక్ష తేదీ

 తేదీ : 11-02-2024

సమయం : ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సూచనలు:

1. అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని ఆన్లైన్లో రూ.100/- రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకొనవచ్చును. ఒక ఫోన్ నెంబర్ ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చును.

2. విద్యార్థుల ఎంపికకు "పాత జిల్లా" ఒక యూనిట్ గా పరిగణింపబడుతుంది.

3. 2023-2024 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు, 

4. విద్యార్థులు ఈ సంవత్సరం 4వతరగతి చదువుతున్నట్లుగా ధ్రువీకరణ పత్రాన్ని అనగా బోనఫైడ్ / స్టడీ సర్టిఫికెట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

NLG: లెంకపల్లి లో ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమం

మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామంలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా.. ఈరోజు అభ్యర్థుల నుండి బిఎల్ఓ లు ఓటు నమోదు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. బిఎల్వో లు చాపల పద్మ, ఏర్పుల పద్మ మాట్లాడుతూ.. సవరణలు ఏమైనా ఉంటే చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమే గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

NLG: చండూరు లో బీఎస్పీ పార్లమెంటు సన్నాహక సమావేశం

నల్లగొండ జిల్లా: 

చండూరు: బహుజన్ సమాజ్ పార్టీ మునుగోడు నియోజకవర్గం ఆధ్వర్యంలో.. చండూరు మండల కేంద్రంలో, భువనగిరి పార్లమెంటు సన్నహక సమావేశం నిర్వహించారు. చండూరు బీఎస్పీ మండల అధ్యక్షులు నేరళ్ల ప్రభుదాసు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో, బిఎస్పి పార్లమెంట్ ఇన్చార్జి కొండమడుగు రాజు హాజరై మాట్లాడుతూ.. బూత్ కమిటీలు సక్రమంగా పనిచేస్తే ఎంపీ ఎలక్షన్లలో మనం గెలవచ్చని సూచన ఇచ్చారు. అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో 307 బూతులు ఉండగా ఒక్కొక్క బూత్ కు 5 నుండి 10 కార్యకర్తలు తయారు చేసుకుని వారు ఒక్కొక్కరు మళ్లీ ఒక్కరి చొప్పున 10 మందిని తయారు చేసుకోవాలని.. అలా చేస్తేనే మనం గెలవచ్చని సూచించారు. వారానికి ఒకసారి మండల నాయకులు మరియు మండల అధ్యక్షులు బూత్ కమిటీలకు క్యాడర్ కాంప్స్ నిర్వహించాలని అన్నారు. 

రాష్ట్ర కార్యదర్శులు శంకర్ రెడ్డి, ఐత రాజు అభయందర్, ఈస్ట్ జోన్ మహిళా కన్వీనర్ పోకల ఎలిజబెత్, నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఏకుల రాజారావు,జిల్లా కోశాధికారి నాగేంద్రబాబు, మునుగోడు అసెంబ్లీ అధ్యక్షులు చిలక రాజు శివ, మునుగోడు ఇంచార్జ్ ఏర్పుల అర్జున్, సీనియర్ నాయకులు మాస్క్ నరసింహ, మునుగోడు అసెంబ్లీ కార్యదర్శి అన్నేపాక శంకర్, ఉపాధ్యక్షులు సైదులు యాదవ్, నీరుడు చంద్రం, మున్సిపల్ అధ్యక్షులు బూషిపాక మాణిక్యం, ఉపాధ్యక్షులు నల్లగంటి మల్లేశం,BVF జిల్లా కన్వీనర్ కురుపాటి సామ్రాట్ కిరణ్, శంకర్ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

TTD: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సంక్రాంతి సెలవులు పూర్తి కావడం, పరీక్షలు దగ్గరపడుతుండటంతో భక్తుల రాక తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

సాధారణంగా శని, ఆదివారాల్లో అత్యధికంగా భక్తులు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే ఈరోజు మాత్రం రద్దీ అంతగా లేకపోవడంతో శ్రీవారి దర్శనం పెద్దగా సమయం లేకుండానే పూర్తవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు దర్శనం గంటలోనే పూర్తవుతుంది.

నిన్న తిరుమల శ్రీవారిని 76,041 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,336 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.06 కోట్లు వచ్చిందని దేవస్థానం అధికారులు వెల్లడించారు.

ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ లోని పది కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు దర్శన సమయం ఎనిమిది గంటలు పడుతుంది.

NLG: ఓటర్ నమోదు ప్రత్యేక క్యాంపెయిన్ తనిఖీ చేసిన కలెక్టర్

నల్లగొండ: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల మేరకు ఈ నెల 20, 21 తేదీలలో జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ నమోదు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన తెలిపారు. శనివారం పట్టణంలో ప్రగతి జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు మరియు కాకతీయ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన 115 పోలింగ్ కేంద్రాల నందు ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపెయిన్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆర్డీఓ రవి, తహశీల్దార్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ కేంద్రం వారిగా అర్హులైన నూతన ఓటర్లను గుర్తించాలని, 18 సం. లు నిండిన యువతి, యువకులతో పాటు దివ్యాంగులు మరియు ట్రాన్స్జెండర్ లను ఓటర్లుగా నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఓటర్లకు వారి వివరాలలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడం జరుగుతుందని, బిఎల్ఓ లు ఇంటింటి సర్వే ద్వారా ఓటర్లను చైతన్యవంతులను చేయాలని, చనిపోయిన వారి వివరాలను జాబితా నుండి తొలంగించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ అధికారులు అందుబాటు లో ఉంటారని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవి, తహశీల్దార్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.