TTD: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సంక్రాంతి సెలవులు పూర్తి కావడం, పరీక్షలు దగ్గరపడుతుండటంతో భక్తుల రాక తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

సాధారణంగా శని, ఆదివారాల్లో అత్యధికంగా భక్తులు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే ఈరోజు మాత్రం రద్దీ అంతగా లేకపోవడంతో శ్రీవారి దర్శనం పెద్దగా సమయం లేకుండానే పూర్తవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు దర్శనం గంటలోనే పూర్తవుతుంది.

నిన్న తిరుమల శ్రీవారిని 76,041 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,336 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.06 కోట్లు వచ్చిందని దేవస్థానం అధికారులు వెల్లడించారు.

ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ లోని పది కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు దర్శన సమయం ఎనిమిది గంటలు పడుతుంది.

NLG: ఓటర్ నమోదు ప్రత్యేక క్యాంపెయిన్ తనిఖీ చేసిన కలెక్టర్

నల్లగొండ: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల మేరకు ఈ నెల 20, 21 తేదీలలో జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ నమోదు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన తెలిపారు. శనివారం పట్టణంలో ప్రగతి జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు మరియు కాకతీయ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన 115 పోలింగ్ కేంద్రాల నందు ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపెయిన్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆర్డీఓ రవి, తహశీల్దార్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ కేంద్రం వారిగా అర్హులైన నూతన ఓటర్లను గుర్తించాలని, 18 సం. లు నిండిన యువతి, యువకులతో పాటు దివ్యాంగులు మరియు ట్రాన్స్జెండర్ లను ఓటర్లుగా నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఓటర్లకు వారి వివరాలలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడం జరుగుతుందని, బిఎల్ఓ లు ఇంటింటి సర్వే ద్వారా ఓటర్లను చైతన్యవంతులను చేయాలని, చనిపోయిన వారి వివరాలను జాబితా నుండి తొలంగించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ అధికారులు అందుబాటు లో ఉంటారని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవి, తహశీల్దార్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

YBD: ఆసర స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్యర్యంలో గురుకుల ప్రవేశ పరీక్ష స్టడీ మెటీరియల్ పంపిణి

ఆసర స్వచ్చంద సేవ సంస్థ ఆధ్యర్యంలో గురుకుల ప్రవేశ పరీక్ష స్టడీ మెటీరియల్ పంపిణి

రామన్నపేట: మండలం కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్షకు అప్లై చేసిన 4వ తరగతి విద్యార్థులకు.. ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ శనివారం స్టడీ మెటీరియల్స్ ను పంపిణీ చేశారు. హరికృష్ణ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు గురుకుల విద్య వరమని, ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. హెచ్ఎం పెద్దిరెడ్డి శంకర్ రెడ్డి, ఉపాధ్యాయులు అండమ్మ, భార్గవి, సంస్థ సభ్యులు గిరిబాబు, ఏల్లాచారి, శివ సాయి, లింగస్వామి, సైదులు, తదితరులు పాల్గొన్నారు.

YBD: ఉమ్మడి జిల్లా ప్రైవేటు కళాశాలల యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శిగా మధిర మల్లేశం

భువనగిరి: పట్టణానికి చెందిన ప్రిన్సిపల్ మధిర మల్లేశం ను నల్లగొండ లో జరిగిన ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశంలో తెలంగాణ ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్య సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తన ఎంపికకు సహకరించిన ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ప్రైవేటు కళాశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

ప్రైవేటు కళాశాలల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తానని, సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరంతరం పోరాటం చేసి ప్రభుత్వం నుండి వచ్చే నిధులను వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు.

పలువురు ప్రవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యాలు మరియు విద్యార్థి సంఘ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

YBD: గ్రామ అభివృద్ధిపై సమీక్షా సమావేశం

యాదాద్రి జిల్లా:

వలిగొండ మండలం, కంచనపల్లి గ్రామంలో పలు సమస్యల పట్ల గ్రామాభివృద్ధి లక్ష్యంగా సమీక్ష సన్నివేశాన్ని శుక్రవారం, సర్పంచ్‌ కొమిరెల్లి రమా బాలకృష్ణారెడ్డి అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. 

ఈ సందర్భంగా సర్పంచ్ కొమిరెల్లి రమా బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలోని అంతర్గత రోడ్లు, మంచినీటి సౌకర్యం, గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని పనుల పట్ల సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను బడుగు, బలహీన వర్గ నిరుపేద కుటుంబాలకు అందేవిధంగా ప్రతి ఒక్కరు సహకరించుకోవాలని ఈ సమావేశంలో తీర్మానించారు. అనంతరం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను, గ్రామంలో ప్రజలకు అవసరమైన పనులు చేసేందుకు నిధులు మంజూరు కొరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సర్పంచ్ తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజేంద్ర కుమార్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మల్లం సరిత , వార్డు మెంబర్లు ఈరబోయిన యాదలక్ష్మి, వడ్లకొండ నరసింహ, చిట్యాల లింగస్వామి, కొలిచెల్మి పద్మ, మాజీ ఉపసర్పంచ్ ఈరబోయిన యాదగిరి, గ్రామ నాయకులు కొమిరెల్లి బాల్ రెడ్డి, రేసు బుచ్చిరెడ్డి, ఎడమ నర్సిరెడ్డి, మామిడి మల్లారెడ్డి, కారోబార్ వడ్డెబోయిన వెంకటేశం, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

TS: ఇంటర్మీడియట్ మైనారిటీ గురుకుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

హైదరాబాద్: మైనార్టీ గురుకులాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలయింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈనెల 18 నుండి ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ tmreistelangana.cgg.gov.in ను సంప్రదించగలరని ముసారంబాగ్ లోని సైదాబాద్ మైనారిటీ గురుకుల బాలుర కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రేష్మ హుస్సేన్ తెలిపారు. తమ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి 80సీట్లు ఉన్నట్లు.. అందులో 60 సీట్లు మైనార్టీ అభ్యర్థులతో, 20 సీట్లు నాన్ మైనారిటీ అభ్యర్థులతో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులు ఉన్నాయని వెల్లడించారు.

TS: రాచకొండ పరిధిలో 14 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ

HYD: రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సుధీర్‌బాబు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

సైబర్‌ క్రైం స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న నందీశ్వర్‌ రెడ్డిని నాచారం పోలీస్‌స్టేషన్‌కు,

కుషాయి గూడ ట్రాఫిక్‌ 2లో విధులు నిర్వహిస్తున్న వై.రవీందర్‌ను చర్లపల్లికి,

స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.ఎలక్షన్‌ రెడ్డిని ఉప్పల్‌కు, సైబర్‌ క్రైంలో పనిచేస్తున్న బి.రాజును పోచారం ఐటీ కారిడార్‌ స్టేషన్‌కు,

భువనగిరి రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.సత్యనా రాయణను మల్కాజిగిరికి బదిలీ చేశారు.

ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.గోవిందరెడ్డిని మేడిపల్లికి, పోచారం ఐటీ కారిడార్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.అశోక్‌ రెడ్డిని ఎస్‌ఓటీ 2కు,

మంచాల స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ ఎం.కాశీవిశ్వనాథ్‌ను మీర్‌పేటకు, మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ కె.కిరణ్‌ కుమార్‌ను సైబర్‌క్రైం ఠాణాకు బదిలీ చేశారు.

వెయిటింగ్‌లో ఉన్న పి.ఆంజనేయులును ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్‌గా,

నాచారం ఇన్‌స్పెక్టర్‌ ఎం.ప్రభాకర్‌ రెడ్డిని సైబర్‌ క్రైం స్టేషన్‌కు,

మేడిపల్లి ఇన్‌స్పెక్టర్‌ పి.సైదులును స్పెషల్‌ బ్రాంచ్‌కు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.రవికుమార్‌ను వనస్థలిపురానికి,

చర్లపల్లి ఇన్‌స్పెక్టర్‌ వై.మల్లికార్జున్‌ రెడ్డిని సైబర్‌ క్రైం ఠాణాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

TS: మైనార్టీ గురుకులాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

TS: మైనార్టీ గురుకులాల లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలయింది. నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులకు 5వ తరగతిలో ప్రవేశానికి, పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈనెల 18 నుండి ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. అర్హత గల దరఖాస్తుదారులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ tmreistelangana.cgg.gov.in ను సంప్రదించగలరు. ఈ నేపథ్యంలో ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు సూచించారు.

NLG: ఫుట్బాల్ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ

నల్గొండ: మేకల అభినవ్ స్టేడియంలో చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కోచ్ మద్ది కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుట్బాల్ క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న 25 మంది క్రీడాకారులకు, నిన్న సాయంత్రం గంటేకంపు బిక్షమయ్య సత్తెమ్మ ల స్మారకార్థం వారి కుమారులు రవీందర్, లెనిన్ లు స్పోర్ట్స్ కిట్స్ లను పంపిణీ చేశారు. 

ముఖ్యఅతిథిగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పాల్గొని స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ.. క్రీడలు మనుగడ సాధించాలంటే స్పాన్సర్స్ ముందుకు రావడం ఎంతో ముఖ్యమని, ఆ రకంగా 25 మందికి స్పోర్ట్స్ కిట్స్ అందించడానికి ముందరికి వచ్చిన రవీందర్, లెనిన్ లను అభినందిస్తూ, చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ గత దశాబ్ద కాలంగా నల్గొండ జిల్లాలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులను చేరదీసి వారిని చదువుతోపాటు, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తుందని తెలియజేశారు.అనంతరం స్పోర్ట్స్ కిట్స్ దాతలను మరియు ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్ లను శాలువాతో అబ్బగోని రమేష్ గౌడ్ ఘనంగా సన్మానించారు.

స్పాన్సర్స్ గంటేకంపు రవీందర్, లెనిన్ లు మాట్లాడుతూ.. ఎంతో నిబద్ధతతో కూడిన క్రీడా వ్యవస్థ కలిగిన ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ క్రీడాకారులకు, మా తల్లిదండ్రులు గంటేకంపు బిక్షమయ్య సత్తెమ్మల స్మారకార్థం స్పోర్ట్స్ కిట్స్ అందజేస్తున్నామని, క్రీడల్లో చదువుల్లో రాణించే బీద విద్యార్థులకు భవిష్యత్తులో కూడా తమ వంతు సహకారాలు అందిస్తామని తెలిపారు.

చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాల నుండి నల్గొండ లో పాఠశాల దశ నుండే, ఒక మంచి స్పోర్ట్స్ కల్చర్ ను తయారు చేస్తూ నల్గొండ జిల్లా నుండి కబడ్డీ ఫుట్బాల్ జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తున్నామని, ఇటీవలనే చత్రపతి శివాజీ క్రికెట్ క్లబ్ ను కూడా ఏర్పాటు చేశామని తెలియజేస్తూ, క్రీడా వ్యవస్థలో క్షేత్రస్థాయిలో పనిచేయడం ఒక భాగమైతే, స్పాన్సర్లు ముందుకు రావడం రెండవ భాగమని ఆ రకంగా నల్లగొండలో స్పోర్ట్స్ కల్చర్ ఇంకా డెవలప్మెంట్ కావాలంటే, క్వాలిటీ క్రీడాకారులను తయారు చేయాలంటే వివిధ కార్పొరేట్ సంస్థలు, వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరియు దాతలు ముందుకు రావాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న DYSO మక్బూల్ మొహమ్మద్ మాట్లాడుతూ.. మేకల అభినవ్ స్టేడియంలో అన్ని రకాల క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ, నల్గొండ జిల్లాలో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేసిన తర్వాత ఎంతోమంది గ్రామీణ క్రీడాకారులు గ్రాస్ రూట్ నుండి తయారవుతున్నారని తెలియజేశారు. 

అనంతరం డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ మరియు చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ అబ్బ గోలి రమేష్ గౌడ్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గోగుల శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, పబ్బు సందీప్ గౌడ్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, మరియు క్రీడా పోషకులు జాకటి బాలరాజు, అప్పల లింగయ్య, సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు రాచూరి వెంకట సాయి, కోక్కు యశ్వంత్, శివదాసు మరియు క్రికెట్, హాకీ, టైక్వాండో కోచ్ లు SK రహీం, యావర్, ప్రణీత్ లు, స్టేడియం ఇన్చార్జి కత్తుల హరి మరియు హాకీ, ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.

పుట్టిన తేదీ రుజువుగా ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుండి ఆధార్ కార్డు తొలగింపు: EPFO

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఒక ప్రధాన నిర్ణయంలో, పుట్టిన తేదీ (DOB) రుజువుగా ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుండి ఆధార్ కార్డును తొలగించింది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) నుండి వచ్చిన ఆదేశాల తర్వాత పుట్టిన తేదీకి ఆమోదయోగ్యమైన పత్రంగా ఆధార్ కార్డ్‌ను తీసివేసినట్లు EPFO తెలియజేసింది. జనవరి 16న జారీ చేసిన సర్క్యులర్‌లో, అనేక మంది లబ్ధిదారులచే పుట్టిన తేదీకి రుజువుగా పరిగణించబడుతున్న ఆధార్.. ప్రాథమికంగా గుర్తింపు ధృవీకరణ సాధనం మరియు పుట్టిన రుజువు కాదని EPFO పేర్కొంది.

ఈ సర్క్యులర్‌కు సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (సీపీఎఫ్‌సీ) నుంచి అనుమతి లభించింది. ఇటీవలి కొన్ని కోర్టు తీర్పులు కూడా ఆధార్‌ను పుట్టిన తేదీకి రుజువుగా పరిగణించలేమని బలపరిచాయి.